Raipur: ఐదున్నరేళ్లుగా ఆ విమానాన్ని అక్కడే వదిలేశారు... పార్కింగ్ ఫీజు ఎంతైందంటే
- అలోక్ ప్రకాశ్ పుతుల్
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, ALOK PRAKASH PUTUL
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్ ఎయిర్‌పోర్ట్‌లో ఐదున్నరేళ్లుగా ఓ విమానం ఉంది. అది బంగ్లాదేశ్‌కు చెందిన విమానం.
దాని బాగోగులు చూసేవారే కరవయ్యారు. అక్కడ అన్ని రోజుల నుంచి ఉన్నందుకు ఆ విమానానికి చెల్లించాల్సిన పార్కింగ్ ఫీజే రూ.1.5 కోట్లు దాటింది.
బంగ్లాదేశ్‌కు చెందిన యునైటెడ్ ఎయిర్వేస్ సంస్థ విమానం ఇది. ఈ విమానాన్ని అమ్మేసి, విమానాశ్రయానికి చెల్లించాల్సిన పార్కింగ్ ఫీజు కడతామని ఆ సంస్థ తెలిపింది. అందుకు తొమ్మిది నెలల గడువు కోరింది.
86 నెలలుగా ఈ విమానం రాయ్‌పుర్‌లోని స్వామి వివేకానంద ఎయిర్‌పోర్టులోనే ఉంది.
ఈ విమానం విషయంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంప్రదింపులు జరిగినా, పార్కింగ్ రుసుము అంశం ఎటూ తేలకుండానే ఉండిపోయింది.
‘‘విమానాన్ని అమ్మేసి కట్టాల్సిన పార్కింగ్ ఫీజును కడతామని ఆ సంస్థ మాకు హామీ ఇచ్చింది. ఈ విషయమై న్యాయపరమైన సలహా తీసుకుంటున్నాం. ఆ తర్వాత ఓ నిర్ణయానికి వస్తాం’’ అని రాయ్‌పుర్ విమానాశ్రయం డైరెక్టర్ రాకేశ్ సహాయ్ బీబీసీతో చెప్పారు.
గత ఐదేళ్లలో తాము ఆ విమానం విషయమై దాని యాజమాన్య సంస్థకు 50కుపైగా సార్లు మెయిల్ చేశామని, ఆ సంస్థ నుంచి సరైన స్పందన రాలేదని రాకేశ్ అన్నారు.
మెయిల్ చేసిన ప్రతిసారీ బంగ్లాదేశ్ పౌర విమానయాన సాధికార సంస్థ అనుమతి కోసం వేచి చూస్తున్నామని ఆ సంస్థ బదులిస్తూ వచ్చిందని ఆయన తెలిపారు.
దాదాపు రూ.1.54 కోట్ల పార్కింగ్ రుసుము బకాయిలు చెల్లించాలని చట్టపరంగా ఆ సంస్థకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఆ సంస్థ స్పందించిందని చెప్పారు.
ఫొటో సోర్స్, Alok Prakash Putul
ఎలా వచ్చిందంటే...
డగ్లస్ ఎండీ-83 రకానికి చెందిన ఈ విమానం 2015 ఆగస్టు 7న అత్యవసరంగా రాయ్‌పుర్ విమానాశ్రయంలో దిగింది.
అప్పుడు బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి మస్కట్‌కు ఈ విమానం పయనమైంది. ఆ సమయంలో 173 మంది ప్రయాణికులు అందులో ఉన్నారు.,
వారణాసి, రాయ్‌పుర్ మధ్యలో గగనతలంలో ఉండగా ఆ విమానం ఇంజిన్‌లో మంటలు రేగాయి.
దీంతో అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరి, రాయ్‌పుర్‌లో ఈ విమానం దిగిందని ఆ విమానాశ్రయ అధికారులు తెలిపారు.
‘‘కోల్‌కతా ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్ నుంచి రాయ్‌పుర్ విమానాశ్రయానికి ఈ విషయమై సూచన అందింది. వెంటనే ఆ విమానం దిగేందుకు అనుమతి ఇచ్చారు. పాడైపోయిన ఇంజిన్‌లోని ఓ భాగం విమానం గాల్లో ఉండగానే పడిపోయింది. అయితే, విమానం క్షేమంగా విమానాశ్రయంలో దిగగలిగింది’’ అని రాయ్‌పుర్ విమానాశ్రయ అధికారులు చెప్పారు.
ఆ మరుసటి రోజు, అంటే ఆగస్టు 9 రాత్రి యునైటెడ్ ఎయిర్వేస్ మరో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ప్రయాణికులను అక్కడి నుంచి తరలించింది.
ఆ విమాన సిబ్బంది కూడా బంగ్లాదేశ్ వెళ్లిపోయారు. విమానం మాత్రం రాయ్‌పుర్ విమానాశ్రయంలోనే ఉండిపోయింది.
ఫొటో సోర్స్, Alok Prakash Putul
‘గాలి మాటలుగానే మిగిలాయి’
విమానాన్ని అక్కడ అత్యవసరంగా దించిన 24 రోజుల తర్వాత బంగ్లాదేశ్ నుంచి యునైటెడ్ ఎయిర్వేస్ అధికారులు రాయ్‌పుర్ వచ్చారు. విమానం ఇంజిన్ మార్చేందుకు అనుమతి ఇవ్వాలని భారత పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్‌కు అభ్యర్థన పెట్టారు.
ఆ తర్వాత అధికారులు మళ్లీ బంగ్లాదేశ్ వెళ్లిపోయారు.
‘‘ఇంజిన్ బాగు చేసి, విమానాన్ని బంగ్లాదేశ్‌కు తీసుకువెళ్తామని బంగ్లాదేశ్‌కు చెందిన యునైటెడ్ ఎయిర్వేస్ అధికారులు చెప్పారు. అయితే వారి మాటలు గాలి మాటలుగానే మిగిలాయి’’ అని రాయపుర్ విమానాశ్రయ అధికారి ఒకరు బీబీసీతో అన్నారు.
2015 ఆగస్టు తర్వాత యునైటెడ్ ఎయిర్వేస్ను రాయ్‌పుర్ విమానాశ్రయం చాలా సార్లు ఫోన్ ద్వారా, మెయిల్ ద్వారా సంప్రదించింది. కానీ, ఆ సంస్థ అధికారులు ఏవేవో అనుమతులు రావాల్సి ఉందని చెబుతూ, ఆలస్యం చేస్తూ వచ్చారు.
2016 ఫిబ్రవరిలో యునైటెడ్ ఎయిర్వేస్కు చెందిన నలుగురు నిపుణుల బృందం రాయ్‌పుర్ వచ్చిందని... రోడ్డు మార్గంలో విమాన ఇంజిన్‌ను తీసుకువచ్చి, దాన్ని అక్కడున్న విమానానికి బిగించారని విమానాశ్రయ పత్రాల్లో ఉంది.
ఫిబ్రవరి 17న ఆ నిపుణుల బృందం రాయ్‌పుర్ నుంచి వెళ్లిపోయింది.
ఫొటో సోర్స్, Alok Putul
యునైటెడ్ ఎయిర్వేస్ సంస్థ ఆ విమానాన్ని పరీక్షించి, ప్రయాణానికి ఆ విమానం పూర్తిగా సిద్ధంగా ఉందని తేల్చింది.
కానీ, ఈ వ్యవహారంపై బంగ్లాదేశ్ విమానయాన సాధికార సంస్థలో కదలిక రాలేదు. దీంతో పైలట్లు 2016 ఫిబ్రవరి 28న రాయ్‌పుర్ నుంచి విమానాన్ని అక్కడే వదిలేసి వెనుదిరిగారు.
నిపుణుల బృందం, పైలట్ల రాక తర్వాత విమానాన్ని త్వరగానే బంగ్లాదేశ్‌కు తీసుకువెళ్తారని అంతా భావించారు.
అయితే, ఆ తర్వాత వారానికే, అంటే 2016 మార్చి 6న యునైటెడ్ ఎయిర్వేస్ సంస్థ తమ కార్యకలాపాలను నిలిపివేసింది.
రాయ్‌పుర్ విమానాశ్రయ అధికారులు తమ ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. పార్కింగ్ ఫీజు వసూలు చేయలేకపోయినా, ఆ విమానాన్ని అక్కడి నుంచి తరలించాలన్న నిర్ణయానికి వచ్చారు.
పార్కింగ్ సమస్య
రాయ్‌పుర్ విమానాశ్రయానికి ప్రస్తుతం ఎనిమిది విమానాల పార్కింగ్ సామర్థ్యం ఉంది. యునైటెడ్ ఎయిర్వేస్ విమానం అక్కడ చాలా స్థలం ఆక్రమిస్తూ వచ్చింది.
రాయ్‌పుర్ విమానాశ్రయ అధికారుల వరుస ఈమెయిళ్ల తర్వాత 2018 జులైలో యునైటెడ్ బంగ్లాదేశ్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ ఇనాయత్ హుస్సేన్ రాయ్‌పుర్ వచ్చారు. ఆయన సమక్షంలో ఆ విమానాన్ని రనవేకు 300 మీటర్ల దూరం వరకూ తీసుకువెళ్లి పెట్టారు.
‘‘ఆ విమానం మొదటగా అక్కడ దిగినప్పుడు గంటకు రూ.320 చొప్పున పార్కింగ్ రుసుము లెక్కగట్టాం. గంటల నుంచి... ఆ లెక్కలు నెలలు, సంవత్సరాలకు చేరాయి. విమానాశ్రయానికి పార్కింగ్ ఫీజు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 48 మిలియన్ డాలర్ల విలువైన ఈ విమానం కూడా పనికిరాకుండా పోయేలా ఉంది’’ అని రాయ్‌పుర్ విమానాశ్రయ అధికారి ఒకరు అన్నారు.
అయితే, మరమ్మతులు చేసి ఆ విమానాన్ని తిరిగి వినియోగంలోకి తేవొచ్చని విమానయాన వ్యవహారాల నిపుణుడు రాజేశ్ హాండా చెప్పారు. కానీ, ఇన్ని ఏళ్లు నిలిపి ఉంచిన కారణంగా, మరమ్మతులకు చాలా ఖర్చవుతుందని... ఒకవేళ విమానాన్ని అమ్మినా ఎక్కువ ధర పలకదని ఆయన అన్నారు.
‘‘ఇలాంటి విమానాలను ఇతర విమాన సంస్థలు కొనుక్కుంటాయి. మరమ్మతులు చేసి వాడకంలోకి తెస్తాయి. ఒకవేళ నడిపే పరిస్థితి లేకపోతే, దాని భాగాలను వాడుకుంటాయి’’ అని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి:
- రూ. 2000 నోట్ల ముద్రణను రిజర్వు బ్యాంక్ ఆపేసింది... పెద్ద నోటు మళ్లీ రద్దవుతుందా?
- బ్యాంకుల సమ్మె ఎందుకు? మోదీ ప్రభుత్వం.. ప్రభుత్వ బ్యాంకులను ఎందుకు ప్రైవేటీకరిస్తోంది?
- IPO అంటే ఏమిటి... దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?
- మ్యూచువల్ ఫండ్స్: మహిళలు పెట్టుబడి పెట్టేందుకు అద్భుతమైన మార్గం ఇదేనా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- చంద్రబాబు నాయుడుకు ఏపీ సీఐడీ నోటీసులు... అమరావతి భూముల సేకరణపై విచారణకు రావాలని ఆదేశం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)