తమిళనాడు ఎన్నికలు: వరుస ఓటములు ఎదురైనా పళనిస్వామి అన్నాడీఎంకేను ఎలా గుప్పిట్లోకి తీసుకోగలిగారు

ఎడప్పాడి పళనిస్వామి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి

జయలలిత చనిపోయిన కొన్ని రోజులకే అన్నాడీఏంకే పార్టీ రెండుగా చీలిపోయింది.

ఒక పెద్ద వర్గానికి మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నాయకత్వం వహిస్తే, శశికళ నేతృత్వంలో మరో వర్గం ఎడప్పాడి పళనిస్వామిని ముఖ్యమంత్రిగా చేసింది. ఈ ఘటన చిన్నదే అయినా పళనిస్వామి నాటకీయ పరిణామాల తర్వాత సీఎం అయ్యారు.

అన్నాడీఎంకే పార్టీ ఓ.పన్నీర్ సెల్వంను మూడు సార్లు ముఖ్యమంత్రి పదవిలో కూర్చోపెట్టింది. అయితే, ఆయన తాత్కాలిక సీఎంగా ఎంపికయ్యారు కానీ, ఆ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని అధికారాన్ని, పార్టీని తన అదుపులోకి తెచ్చుకోవడంలో విఫలమయ్యారు.

మరోవైపు ఈకే పళనిస్వామి సీఎం అయిన కొన్ని నెలల్లోనే ప్రభుత్వాన్ని, పార్టీని తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. జయలలిత మృతి కూడా దీనికి ఒక కారణం అని చెబుతారు. కానీ, అది ఆయన ఎంత పరిణతి చెందిన రాజకీయ నాయకుడు అనేది కూడా నిరూపించింది.

ఆయన, తన ప్రత్యర్థి పన్నీర్ సెల్వంను తన గ్రూపులో కలుపుకోవడమే కాదు, పార్టీని శశికళ కుటుంబం చేతుల్లోంచి విడిపించగలిగారు. అయితే, ఆయన రాజకీయ జీవితంలో ఎక్కువగా పరాజయాలే ఉండడం విచిత్రంగా అనిపిస్తుంది.

పళనిస్వామి 1954 మే 12న సేలం జిల్లాలో ఎడప్పాడి పట్టణం దగ్గర ఉన్న సిలువాయపాళ్యంలో కరుప్ప గౌండర్, దావుసాయమ్మాళ్ దంపతులకు జన్మించారు. కుటుంబంలో ఆయన రెండో కొడుకు.

ఫొటో సోర్స్, CMOTAMILNADU

స్కూల్ చదువు పూర్తయిన తర్వాత, ఈరోడ్ వాసవీ కాలేజ్‌లో డిగ్రీ చదివిన పళనిస్వామికి మొదటి నుంచీ రాజకీయాలపై ఆసక్తి ఉండేది. దాంతో, ఆయన అదే సమయంలో ఉనికిలోకి వచ్చిన అన్నాడీఏంకే పార్టీలో చేరారు.

జేబు ఖర్చుల కోసం ఆయన బెల్లం దళారీగా పని చేశారు. కానీ ఎక్కువగా రాజకీయాల్లో బిజీగా ఉండేవారు. పళనిస్వామి ఆసక్తిని గమనించిన పార్టీ ఆయన్ను కోనేరిపట్టి శాఖకు కార్యదర్శిగా చేసింది. పార్టీలో ఆయన మొదటి పదవి అదే.

1989లో ఎంజీఆర్ చనిపోయాక జరిగిన ఎన్నికల్లో పార్టీ రెండుగా చీలిపోయింది. ఒకటి జయలలిత వర్గం, ఇంకొకటి జానకి వర్గం. పళనిస్వామి జయలలిత వెంట నిలిచారు. ఆయనకు ఎడప్పాడి టికెట్ దక్కింది. ఆ ఎన్నికల్లో డీఎంకేకు ఆధిక్యం లభించినా, పళనిస్వామి 1364 ఓట్ల మెజారిటీతో ఆ స్థానాన్ని గెలుచుకోగలిగారు.

1991 ఎన్నికల్లో ఆయనకు మరోసారి టికెట్ వచ్చింది. ఈసారీ ఆయన 41 వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. కానీ 1996లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీయడంతో ఎడప్పాడి నుంచి మూడోసారి పోటీ చేసిన ఆయన, పార్టీలో మిగతావారితోపాటూ ఓటమి రుచిచూశారు. ఆ తర్వాత ఆయన రాజకీయ కెరియర్‌లో ఎన్నో అడ్డంకులు వచ్చాయి. వరుస ఓటమిలు కూడా రుచిచూడాల్సి వచ్చింది.

ఫొటో సోర్స్, CMOTAMILNADU

1998లో ఆయన లోక్ సభ ఎన్నికల్లో తిరుచందూర్ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ కొన్ని రోజులకే పార్లమెంట్ రద్దయ్యింది. తర్వాత 1999, 2004 లోక్‌సభ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసిన ఆయన డీఎంకే అభ్యర్థుల చేతుల్లో ఓడిపోయారు.

కానీ పార్టీ ప్రధాన కార్యదర్శి జయలలిత ఆయనపై పూర్తి నమ్మకాన్ని ఉంచారు. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు మళ్లీ ఎడప్పాడి టికెట్ ఇచ్చారు. అప్పుడు కూడా ఆయన పీఎంకే అభ్యర్థి చేతిలో 6,347 ఓట్లతో ఓడిపోయారు.

కానీ, పార్టీ ఆయనకు ప్రతిసారీ అవకాశం ఇస్తూనే వచ్చింది. అలా, 1991 నుంచి 2011 మధ్య ఆయన ఒక్కసారి జరిగిన ఎన్నికల్లో మినహా, ప్రతి సారీ పోటీ చేసి ఓడిపోయారు. కానీ పళనిస్వామి తన ప్రయత్నాలు వదల్లేదు. రాజకీయ కార్యకలాపాలు ఆపలేదు.

ఫొటో సోర్స్, CMOTAMILNADU

2011లో ఆయనకు మరోసారి ఎడప్పాడి నుంచి పోటీ చేసే అవకశం వచ్చింది. ఈసారీ గెలిచిన ఆయన 20 ఏళ్ల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టారు. అప్పుడు ఆయన మంత్రి కూడా అయ్యారు. అదే సమయంలో అన్నాడీఎంకేలోని నలుగురు అగ్ర నేతల్లో ఒకరుగా స్థానం సంపాదించారు.

2016 ఎన్నికల్లో ఆయనకు మళ్లీ తన సీటు నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది. పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో మళ్లీ మంత్రి కూడా అయ్యారు. వరుస అపజయాలు ఎదురైనా ఆయనకు అలా పార్టీ టికెట్ దక్కుతూనే వచ్చింది. అగ్ర నాయకత్వం అండ లభించింది.

శశికళ పళనిస్వామిని తన నమ్మిన బంటుగా భావించడం కూడా దానికి ఒక కారణం.

జయలలిత కేఏ సెంగొట్టయన్‌ను నిర్లక్ష్యం చేసినప్పుడు కూడా, పళనిస్వామిని తనకు నమ్మకస్తుడుగా భావించారు.

జయలలిత చనిపోయాక ఆయనే ముఖ్యమంత్రి అవుతారని అందరూ అనుకున్నారు. కానీ, ఆ సమయంలో సీఎం కుర్చీలో ఉన్న ఓ.పన్నీర్ సెల్వంకే ఆ బాధ్యతలు అప్పగించారు.

పార్టీ అంతర్గత రాజకీయాల వల్ల, పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవి వీడినప్పుడు, శశికళను అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తమను ఆహ్వానించాలని ఆమె గవర్నర్‌ను కోరారు.

ఫొటో సోర్స్, CMOTAMILNADU

కానీ, గవర్నర్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించడం ఆలస్యమైంది. ఆ లోపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు కూడా వచ్చింది.

దీంతో, శశికళ చిక్కుల్లో పడ్డారు. గవర్నర్ నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానం వస్తుందని ఎదురుచూసిన శశికళ, సుప్రీంకోర్టు తీర్పుతో జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

అలాంటి సమయంలో శశికళ ముఖ్యమంత్రి పదవికి ఎడప్పాడి పళనిస్వామిని ఎంచుకున్నారు. తెర వెనుక నుంచి ఆయన్ను తమ అదుపులో ఉంచుకోవచ్చని అప్పుడు శశికళ కుటుంబం అనుకుంది. పళనిస్వామి 2017 ఫిబ్రవరి 14న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.

కానీ, ఆయన పార్టీని తన నియంత్రణలోకి తెచ్చుకుంటారని శశికళ సహా ఎవరూ ఊహించలేదు. శశికళ, టీటీవీ దినకరన్ ప్రభావం నుంచి బయటపడిన పార్టీని తన చేతుల్లో ఉంచుకోగలిగారు.

ఫొటో సోర్స్, Alamy

మొదట్లో నెమ్మదిగా ఉన్న ఆయన తర్వాత వేగం పెంచారు. ప్రభుత్వంలో, పార్టీలో ప్రతి ఒక్కరూ తన కోసమే పనిచేసేలా చూసుకున్నారు.

చివరికి ఓ పన్నీర్ సెల్వంను కూడా తనవైపు తిప్పుకోగలిగారు. టీటీవీ దినకరన్ మద్దతుదారుల నుంచి రాజీనామాలు తీసుకున్నారు.

పళనిస్వామి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని కూడా కూడగట్టారు. తర్వాత వచ్చే ఎన్నికల కోసం తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకోడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసుకున్నారు.

కామరాజ్, భక్తవత్సలం, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత తర్వాత పళనిస్వామి తమిళనాడులో ఎక్కువకాలం ముఖ్యమంత్రిగా ఉన్న నేత కూడా అయ్యారు.

అయితే తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుని ఆయన, ఎలాంటి విజయం సాధించలేకపోయారు అనేది కూడా వాస్తవమే. పళనిస్వామి సీఎం పదవిలో కొనసాగడం, రాజకీయాల్లో నిలదొక్కుకోవడం అనేది అంత సులభంగా జరగలేదు.

ఇప్పుడు 2021 అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడులోని చాలా మంది నేతల, పార్టీల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. వారిలో ఎడప్పాడి పళనిస్వామి ఒకరు. కానీ, ఆయన కొంతకాలం పాటు సీఎం ఖాళీని భర్తీ చేసి, ఆ తర్వాత కనిపించకుండా పోయే రకం వ్యక్తి కాదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)