లాక్డౌన్: జనతా కర్ఫ్యూకి ఏడాది.. దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే

ఫొటో సోర్స్, Ani
లాక్‌డౌన్‌తో నిర్మానుష్యంగా మారిన ఇండోర్ రోడ్లు
భారతదేశమంతా జనతా కర్ఫ్యూ ప్రకటించి సోమవారానికి(మార్చి 22) ఏడాదవుతుంది. మరోవైపు దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.
దీంతో వివిధ రాష్ట్రాలలోని కొన్ని నగరాల్లో మళ్లీ లాక్డౌన్ విధిస్తున్నారు.
ఇప్పటికే మహారాష్ట్రలోని కొన్ని నగరాల్లో లాక్డౌన్ విధించగా.. తాజాగా మధ్యప్రదేశ్‌లోని మూడు నగరాల్లో ప్రతి ఆదివారం లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం ఎక్కడెక్కడ లాక్డౌన్, కర్ఫ్యూ అమల్లో ఉంది?
జబల్పూర్, ఇండోర్, భోపాల్ : మధ్య ప్రదేశ్‌లోని ఈ మూడు నగరాల్లో మార్చి 21న లాక్డౌన్ విధించారు. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ప్రతి ఆదివారం ఈ మూడు నగరాల్లో లాక్డౌన్ ఉంటుందని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
అలాగే, మార్చి 31 వరకు ఈ మూడు నగరాల్లోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.
నాగపూర్: మహారాష్ట్రలోని మార్చి 15 నుంచి 21 వరకు లాక్డౌన్ ఉంది. అయితే, ఈ సమయంలో అత్యవసర సర్వీసులన్నీ కొనసాగేలా నిర్ణయించారు.
ప్రభుత్వ కార్యాలయాలు 25 శాతం సిబ్బందితో పనిచేయాలని ఆదేశించారు.
పుణె: మహారాష్ట్రలోని పుణెలో కేసులు పెరుగుతుండడంతో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలవుతోంది.
మార్చి 31 వరకు కాలేజీలు, స్కూళ్లు అన్నీ మూసివేయాలని ఆదేశించారు. హోటళ్లు, బార్లు, మాల్స్, థియేటర్లను కూడా రాత్రి పూట మూసివేయాలని ఆదేశాలు జారీచేశారు.
నాసిక్: మహారాష్ట్రలోని నాసిక్‌లో రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది.
వివాహాలకు 30 మంది కంటే ఎక్కువ హాజరుకారాదని ఆదేశాలిచ్చారు. మార్చి 15 తరువాత హాల్స్‌లో వివాహాలు చేయరాదనీ ఆదేశాలు జారీచేశారు. స్కూళ్లు మూసివేశారు. శని, ఆదివారాలలో ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలు మూసివేయాలని ఆదేశించారు.
హోటళ్లు ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు తెరిచే అవకాశం ఇచ్చినా సీటింగ్ కెపాసిటీలో 50 శాతం వరకే అనుమతించాలి.
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రడూన్ జిల్లా మసూరీలోని గాల్వా కాటేజ్ ప్రాంతం, బార్లా గంజ్, ఇతర ప్రాంతాలలో పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తూ ఆ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు. దుకాణాలు, ఆఫీసులు అన్నీ మూసివేయించారు. నిత్యావసరాల కోసం ఇంటికి ఒకరు మాత్రమే బయటకు రావడానికి అనుతిస్తున్నారు.
పాటియాలా, లూధియానా, మొహలీ, ఫతేఘర్: పంజాబ్‌లోని పాటియాలా, మొహలీ, లూథియానా, ఫతేఘర్లలో ఆ రాష్ట్రం నైట్ కర్ఫ్య్యూ అమలు చేస్తోంది.
ఫొటో సోర్స్, Getty Images
తాజా పరిస్థితి ఇదీ..
దేశంలో గత 24 గంటల్లో 43,846 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 1,59,755కి.. మొత్తం కేసుల సంఖ్య 1,15,99,130కి చేరింది. శనివారం 197 మంది కరోనాతో మరణించారు.
ఫొటో సోర్స్, Getty Images
జనతా కర్ఫ్యూ రోజున దిల్లీ
జనతా కర్ఫ్యూకి ఏడాది..
2020 ప్రారంభంలో దేశంలో కరోనాకేసులు వెలుగుచూడడంతో పాటు మెల్లమెల్లగా పెరుగుతుండడంతో ప్రజలకు అవగాహన కల్పించడానికి, కోవిడ్ ఫ్రంట్‌లైన్ వర్కర్స్కు సంఘీభావం తెలపడానికి ఆ ఏడాది మార్చి 22న ప్రధాని మోదీ జనతా కర్ఫ్యూ ప్రకటించారు.
దానికి కొనసాగింపుగా తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో మార్చి 23 నుంచి 31 వరకు లాక్డౌన్ విధించారు.
అక్కడికి రెండు రోజుల్లోనే మార్చి 25 నుంచి దేశమంతా లాక్డౌన్ విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
తొలి విడత లాక్ డౌన్ మార్చి 25 నుంచి 23 రోజుల పాటు ఉండగా అది ముగియగానే కొనసాగింపుగా ఏప్రిల్ 15 నుంచి మే 3 వరకు రెండో విడత లాక్డౌన్ అమలైంది.
మూడో విడత మే 4 నుంచి 17, నాలుగో విడత మే 18 నుంచి 31 వరకు లాక్డౌన్ కొనసాగించారు.
ఆ తరువాత జూన్ 1 నుంచి సడలింపులు ఇస్తూ అన్‌లాక్ ప్రారంభించారు.
ఆ తరువాత కేసులు పెరిగినా క్రమంగా తగ్గి జనజీవనం సాధారణ స్థితికి చేరింది.
అయితే, కొద్దిరోజులుగా మళ్లీ దేశంలో కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆయా రాష్ట్రాలు కట్టడి చర్యలు ప్రారంభించాయి.
అందులో భాగంగానే కొన్ని నగరాల్లో నిబంధనలు కట్టుదిట్టం చేయడంతో పాటు లాక్డౌన్లూ విధిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- పాక్‌పై నిజాం వారసుల గెలుపు.. హైదరాబాద్ నుంచి పంపిన సొమ్ము నిజాం మనవళ్లదేనన్న బ్రిటన్ కోర్టు
- ఆనందం కోసం 'సెక్స్'ను ఆశ్రయించకుండా మహిళలు నిగ్రహం పాటించాలని గాంధీ ఎందుకన్నారు?
- అమిత్ షా వ్యాఖ్యలపై నిరసనలు: అసలు భారతదేశ జాతీయ భాష ఏమిటి? అధికార భాషలు ఏవి?
- మన్మోహన్ సింగ్: ప్రొఫెసర్ నుంచి ప్రధాని పదవి వరకు..
- తమిళనాడులోని కీళడి తవ్వకాల్లో బయల్పడిన 2,600 ఏళ్ల నాటి పట్టణ నాగరికత
- గోదావరిలోంచి బోటు వెలికితీత: ముందుకు సాగని ఆపరేషన్
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏంటి?
- నల్లమలలో యురేనియం సర్వే వివాదం: "ఇక్కడ తవ్వితే మా ఊళ్లు నాశనమైపోతాయి... ఆ విషంతో మేం భంగమైపోతాం"
- 'మీ డబ్బు మాకొద్దు, ఆ డబ్బుతో యూరప్‌లో అడవులు పెంచండి' - జీ7 సహాయంపై బ్రెజిల్
- అమెజాన్ అడవుల్లో కార్చిచ్చుకు కారణం కరవా, చెట్ల నరికివేతా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)