తమిళనాడు ఎన్నికలు: జయలలిత, కరుణానిధి లేని ఈ ఎన్నికలు ఏ అంశాల చుట్టూ తిరుగుతున్నాయి?

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ముఖ్యమంత్రి పళనిసామి

ఫొటో సోర్స్, ARUN SANKAR/AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ముఖ్యమంత్రి పళనిసామి

దేశంలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో తమిళనాడు కూడా ఉంది. ఎన్నికల తేదీ ప్రకటించిన తర్వాత ఆ రాష్ట్రంలో పార్టీల ప్రచారం జోరు అందుకుంది.

తమిళనాడు అసెంబ్లీ గడువు ఈ ఏడాది మే 24తో తీరిపోనుంది.

రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో ఏప్రిల్ 6న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 234 సీట్లకు ఈ ఎన్నికలు జరుగుతాయి. అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 118 సీట్లు గెలవాల్సి ఉంటుంది.

ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమాచారం ప్రకారం తమిళనాడులో మొత్తం సుమారు 6.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో మహిళా ఓటర్లు 3,18,28,727 మంది కాగా, 3,08,38,473 మంది పురుష ఓటర్లు. 7,246 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు.

మిగతా రాష్ట్రాల ఫలితాలతో పాటే తమిళనాడు ఎన్నికల ఫలితాలను కూడా మే 2న ప్రకటిస్తారు.

ఫొటో సోర్స్, ARUN SANKAR/AFP VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

డీఎంకె నేత ఎంకె స్టాలిన్

స్థానిక పార్టీల మధ్యే పోటీ...

అధికార పార్టీ ఏఐఏడీఎంకే... ఈ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తోంది. బీజేపీకి ఆ పార్టీ 20 సీట్లు కేటాయించింది.

ప్రధాన ప్రతిపక్షం డీఎంకే... కాంగ్రెస్‌తో కలిసి బరిలోకి దిగుతోంది. వైకో నేతృత్వంలోని మారుమలార్చీ ద్రవిడ మున్నేట్ర కళగంతోపాటు మరో ఎనిమిది చిన్న పార్టీలు కూడా డీఎంకే గుర్తుతోనే ఎన్నికల్లో పోటీ చేయనున్నాయి. సీపీఎం, సీపీఐ కూడా డీఎంకేతో జత కట్టాయి.

డీఎంకే ఈసారి కాంగ్రెస్‌కు తక్కువ స్థానాలు కేటాయించింది. 25 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీలకు డీఎంకే తలో ఆరో సీట్లు ఇచ్చింది. ఐయూఎంఎల్, కొంగునాడు మున్నేట్ర కళగం పార్టీలకు మూడు చొప్పున కేటాయించింది.

తమిళనాడు అసెంబ్లీ సీట్లలో మొత్తంగా బీజేపీ పోటీ చేస్తున్న స్థానాలు 20 కాగా, కాంగ్రెస్ 25 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా స్థానిక పార్టీల మధ్యే పోటీ కనిపిస్తోంది.

సినీ నటుడు కమల్ హాసన్ మూడేళ్ల క్రితం ప్రారంభించిన మక్కల్ నీతిమయ్యమ్ పార్టీ ఈ ఎన్నికలతోనే మొదటిసారి బరిలోకి దిగుతోంది.

ఫొటో సోర్స్, ARUN SANKAR/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్,

కమల్ హాసన్

ప్రధాన అభ్యర్థులు వీళ్లే...

ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, కమల్ హాసన్, బీజేపీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఎల్ మురుగన్ ధారాపురం లాంటి వారు ప్రముఖ అభ్యర్థులుగా ఉన్నారు.

పళనిస్వామి పోటీ చేస్తున్న నియోజకవర్గం ఎడప్పాడీపై అందరి దృష్టీ ఉంది. ఆయన ఈ సీటుకు పోటీ చేయడం ఇది ఏడోసారి. అందులో నాలుగుసార్లు (1989, 1991, 2011, 2016ల్లో) ఆయన గెలిచారు.

స్టాలిన్ కోలాథూర్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కూడా మొదటిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. చెపాక్ నియోజకవర్గం నుంచి ఆయన పోటీలో ఉన్నారు.

ఇక కమల్ హాసన్ కోయంబత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

బీజేపీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు మురుగన్... ధారాపురం సీటు నుంచి పోటీలో ఉన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు హెచ్ రాజా కారాయికుడీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, TWITTER@EPSTAMILNADU

ఈ అంశాల చుట్టూనే...

అధికార పార్టీ ఏఐఏడీఎంకేపై ప్రతిపక్ష పార్టీలు అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి. ఏఐఏడీఎంకే నాయకుల్లో చాలా మందిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.

ఏఐఏడీఎంకే బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారిందని కూడా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. మళ్లీ ఏఐడీఎంకే అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో బీజేపీ తన ఇష్టానుసారం విధానాలను అమలు చేస్తుందని ఓటర్లను హెచ్చరిస్తున్నాయి.

తమిళనాడు ఎన్నికల్లో నీట్ ప్రవేశ పరీక్ష కూడా కీలక అంశాల్లో ఒకటిగా ఉంది. వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించడానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆందోళనలు కూడా జరిగాయి.

ఇక మాజీ సీఎం జయలలిత మరణం అంశం కూడా ఈ ఎన్నికల్లో చర్చకు వస్తోంది. తాము అధికారంలోకి వస్తే జయలలిత మరణం వెనుకున్న అసలు కారణాలను వెలికితీస్తామని డీఎంకే అంటోంది.

ఫొటో సోర్స్, ARUN SANKAR/AFP VIA GETTY IMAGES

‘పెట్రోల్ ధర తగ్గిస్తాం’

తమను గెలిపిస్తే, పెట్రోల్ ధరను తగ్గిస్తామని కూడా డీఎంకే హామీ ఇచ్చింది.

చెన్నై నుంచి సేలం వరకు 277 కి.మీ. పొడవున ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాజెక్టు కూడా ఎన్నికల అంశంగా మారింది. ఈ ప్రాజెక్టును కోర్టు నిలుపుదల చేసింది. అయితే, ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్తామని కేంద్ర బడ్జెట్‌ ద్వారా బీజేపీ సంకేతాలు ఇచ్చిందని చెబుతున్నారు.

తమిళనాడు ఎన్నికల్లో మొదటి సారి మతం చుట్టూ కూడా రాజకీయాలు తిరుగుతున్నాయి. డీఎంకే-కాంగ్రెస్-వామపక్షాల కూటమిని ‘హిందూ వ్యతిరేక’ కూటమిగా వర్ణిస్తూ బీజేపీ ప్రచారం చేస్తోంది.

మరోవైపు బీజేపీ మిత్ర పక్షం ఏఐఏడీఎంకే వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం విషయంలో తమ వైఖరిని మార్చుకుంది. రెండేళ్ల క్రితం రాజ్యసభలో ఈ చట్టాన్ని సమర్థించిన ఆ పార్టీ... ఇప్పుడు మాత్రం దాన్ని వెనక్కి తీసుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని తమ మేనిఫెస్టోలో చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images

ఇదివరకటి ఎన్నికల్లో ఏమైంది?

2016 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలో ఏఐఏడీఎంకే 136 సీట్లు గెలిచి, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు డీఎంకేకు 89... దాని మిత్రపక్షాలైన కాంగ్రెస్‌కు 8, ఐయూఎంఎల్‌కు ఒక సీటు వచ్చాయి.

ఏఐఏడీఎంకేతో అప్పుడు బీజేపీ పొత్తు పెట్టుకోలేదు. ఆ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)