తెలంగాణలో మళ్లీ సినిమా హాళ్ళ బంద్? :ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
థియేటర్ల వల్ల కరోనా వ్యాప్తి పెరుగుతోందని తెలంగాణ ఆరోగ్య శాఖ భావిస్తోంది.
తెలంగాణలో మరోసారి కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో సినిమా హాళ్లను తిరిగి మూసివేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించిందని సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది. ఒకవేళ అది సాధ్యం కాకుంటే కనీసం సగం సీట్లు (50%) మాత్రమే నింపుకొనేందుకు మాత్రమే అనుమతి ఇవ్వాలని కోరింది.
తెలంగాణలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయని, పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ ఆందోళన వ్యక్తం చేసినట్లు ఈ కథనం పేర్కొంది.
కొత్త సినిమా విడుదలైతే థియేటర్లు 90 శాతంపైగా నిండిపోతున్నాయని, పైగా ప్రేక్షకులు మాస్కులు పెట్టుకోకుండా పక్కపక్క సీట్లలో కూర్చుంటున్నారని, తలుపులు మూసేసి ఏసీలు వేస్తుండటంతో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
సినిమా హాళ్లు, జిమ్‌లు, ప్రజలు గుమిగూడే అవకాశం ఉన్న సముదాయాల్లో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు. అయితే దీనిపై ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు.
ఇప్పటికే వైద్య, ఆరోగ్యశాఖ ప్రతిపాదన మేరకు ప్రభుత్వం విద్యా సంస్థలను తాత్కాలికంగా మూసివేసింది. పది రోజుల క్రితమే విద్యాసంస్థల మూసివేతకు తాము ప్రతిపాదించామని, ఇప్పటికే ఆలస్యమైందని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు.
సినిమా హాళ్ల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరామని వైద్య ఆరోగ్య శాఖ తెలిపినట్లు కూడా ఈ కథనం పేర్కొంది.
మరోవైపు మాస్కులు పెట్టుకోకుంటే జరిమానా విధించాలని, పోలీసులు రోడ్లపైనా, మాల్స్ వద్ద, గుమిగూడే అన్ని ప్రాంతాల్లో దాడులు చేసి జరిమానాలు విధిస్తే నిర్లక్ష్యం వహించే వారిలో కదలిక వస్తుందని, భయంతోనైనా మాస్కులు పెట్టుకుంటారని వైద్య ఆరోగ్య శాఖ అధికారురి ఒకరు వ్యాఖ్యానించినట్లు ఈ కథనం పేర్కొంది.
ఈ మేరకు పోలీసు శాఖకు ప్రతిపాదన చేయాలనుకుంటున్నట్లు ఆ అధికారి చెప్పారని సాక్షి పత్రిక కథనం వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images
సిగరెట్ కారణంగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయని రైల్వే శాఖ భావిస్తోంది.
రైలులో సిగరెట్‌తో పట్టుబడితే మూడేళ్ల జైలు
అగ్నిప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన రైల్వే శాఖ, ఇకపై రైళ్ళలో సిగరెట్‌తో పట్టుబడ్డవారికి మూడేళ్ల జైలు శిక్ష విధించేలా నిబంధనలు రూపొందించిందని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ఇచ్చింది.
ఇటీవల న్యూఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదానికి ఓ ప్రయాణికుడు రైలులో సిగరెట్ తాగి టాయిలెట్‌లో వేయడమే కారణమని గుర్తించిన రైల్వేశాఖ ఈ మేరకు కఠిన చర్యలకు దిగిందని ఈ కథనం పేర్కొంది.
రైలులో సిగరెట్‌తో దొరికితే మూడేళ్ల జైలు లేదా వెయ్యి రూపాయల జరిమానా, లేదా రెండింటిని శిక్షగా విధిస్తారని, ఈ నిబంధనలు మార్చి 22 నుంచే అమలులోకి వచ్చేశాయని ఈ కథనం వెల్లడించింది.
రైలులో సిగరెట్లు(ఒకటైనా సరే) తీసుకెళ్తూ పట్టుబడితే రైళ్లలో పేలుడు పదార్థాల రవాణా నిషేధ చట్టం కింద కేసు నమోదు చేస్తారు. రైల్వే చట్టంలోని సెక్షన్ 164 ప్రకారం శిక్షలు విధిస్తారు.
సెక్షన్ 165 కింద మరో రూ.500 జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. ఒకరకంగా రైలులో ప్యాంట్రీకారుతో సహా ఎక్కడా సిగరెట్, బీడీ, చుట్ట వంటివి ఉండడానికి వీల్లేదు. ఈ కొత్త ఆదేశాలపై వారం రోజులపాటు విస్తృతంగా ప్రచారం చేయాలని బోర్డు ఉత్తర్వులిచ్చిందని ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.

గవర్నర్‌కు తాను రాసిన లేఖలు ఎలా లీకవుతున్నాయో సీబీఐతో విచారణ జరిపించాలని రమేశ్ కుమార్ కోరారు.
రాజ్‌భవన్ లేఖల లీక్ ఫిర్యాదుపై బొత్స, పెద్దిరెడ్డి సహా పలువురికి నోటీసులు
గవర్నరుకు రాసిన లేఖలు లీకు వ్యవహారంపై రాష్ట్ర ఎన్నికల కమిషనరు (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేశ్ కుమార్ దాఖలు చేసిన వ్యాజ్యంపై స్పందించిన ఏపీ హైకోర్టు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నరు ముఖ్య కార్యదర్శి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ సహా పలువురికి నోటీసులు జారీ చేసిందని ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది.
గవర్నరుకు, తనకు మధ్య జరిగిన ప్రత్యేక ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలు బయటకు వెల్లడి కావడంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ రమేశ్ కుమార్ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యూ.దుర్గాప్రసాదరావు మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈ కథనం వెల్లడించింది.
'గోప్యంగా ఉండాల్సిన వివరాలు బయటకు వస్తే రాజ్యాంగ వ్యవస్థల్లో ఉన్న వ్యక్తులు విధుల్ని స్వతంత్రంగా నిర్వహించలేరు. గవర్నరుకు రాసిన లేఖల లీక్‌వల్ల ఇద్దరు మంత్రులు స్పీకర్‌కు నాపై ఫిర్యాదు చేశారు. దానిపై వివరణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని నోటీసు పంపారు.
ఓ లేఖను జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహించేలా ఆదేశించాలంటూ దాఖలైన వ్యాజ్యంలో దాఖలు చేశారు. సెలవుపై వెళ్తున్న విషయం సైతం లీక్ చేశారు. వీటిని లీక్ చేయలేదని గవర్నరు ముఖ్య కార్యదర్శి చెబుతున్నందున సీబీఐతో దర్యాప్తు చేయాలని కోరుతున్నాం' అని నిమ్మగడ్డ తరఫు న్యాయవాది హైకోర్టులోవాదించారు.
ఈ వ్యవహారంపై గవర్నరుకు ఫిర్యాదు చేశారా? అని న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు 'లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. గవర్నరు ముఖ్య కార్యదర్శిని మౌఖికంగా కోరగా.. లీక్ చేయలేదని చెబుతున్నారు' అని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తరఫు న్యాయవాది చెప్పారని ఈ కథనం వెల్లడించింది.
మరోవైపు ఈ ఫిర్యాదుపై జరిగిన విచారణ మీద స్పందిస్తూ హైకోర్టు మాకు నోటీసు ఇస్తే సమాధానం చెబుతాం, ఏం జరిగిందనేదీ తెలియజేస్తాం అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నట్లు ఈ కథనం తెలిపింది.
ఇప్పటికైతే నోటీసుల విషయం తన దృష్టికి రాలేదని, కోర్టుకు ఎస్‌ఈసీ సమర్పించిన అఫిడవిట్‌పై వచ్చిన వార్తలను చూసినపుడు నాకైతే ఏ రహస్యమూ బయటకు వచ్చినట్లు అనిపించలేదని మంత్రి బొత్స వ్యాఖ్యానించినట్లు ఈనాడు కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, hyderabadsisters.com
హైదరాబాద్ సిస్టర్స్ లో ఒకరైన లలిత( కుడి) కన్నుమూశారు
'హైదరాబాద్ సిస్టర్స్'లో ఒకరైన గాయని లలిత కన్నుమూత
ప్రఖ్యాత గాయని, హైదరాబాద్ సిస్టర్స్‌లో ఒకరైన లలిత (71) మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది. లలిత, ఆమె సోదరి హరిప్రియ హైదరాబాద్ సిస్టర్స్‌గా శాస్త్రీయ సంగీత ప్రియులకు సుపరిచితులు.
ఎనిమిదేండ్ల వయసులోనే లలిత శాస్త్రీయ గీతాలను ఆలపించడం ప్రారంభించారు. ఆలిండియా రేడియోలో సంగీత విభావరి లో పాల్గొన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు, అమెరికా, కెనడా, సింగపూర్, బ్రిటన్, దుబాయ్ తదితర దేశాల్లో సంగీత కచేరీలు నిర్వహించారని నమస్తే తెలంగాన కథనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- విశాఖపట్నం: సాగర తీరంలో టీయూ-142 యుద్ధ విమానం... దీని చూస్తే ఎందుకు ఉద్వేగం ఉరకలేస్తుంది?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- మియన్మార్‌లో 'సరోంగ్ విప్లవం': మహిళలు నడుముకు కట్టుకునే 'సరోంగ్' వస్త్రం.. నిరసనకారుల ఆయుధంగా మారిన వైనం
- దేశంలో మళ్లీ లాక్డౌన్.. ఎక్కడెక్కడంటే
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- గుజరాత్: టీ షర్ట్ ధరించి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను సభ నుంచి పంపించేసిన స్పీకర్
- బిర్యానీ పక్కాగా వండాలంటే కచ్చితమైన లెక్కలు ఉంటాయా? దీనికో ఆల్గారిథమ్ ఉందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)