రైతుల ఉద్యమం చల్లబడిందా.. వారి తదుపరి వ్యూహం ఏమిటి

  • సరబ్జీత్ సింగ్ ధాలీవాల్
  • బీబీసీ ప్రతినిధి
65 ఏళ్ల కశ్మీర్ సింగ్
ఫొటో క్యాప్షన్,

65 ఏళ్ల కశ్మీర్ సింగ్

"ఒక దేశం మరో దేశంపై దాడి చేసినప్పుడు.. ఇప్పుడు వాతావరణం అనుకూలించట్లేదు, వేసవి తరువాత యుద్ధం చేస్తాం అని ఎవరైనా చెబుతారా? వాతావరణం, సమయం చూసుకుని ఎవరూ యుద్ధం చేయరు" అన్న ఆ వృద్ధుడి మాటలు ఆసక్తి కలిగించాయి.

ఆయన పేరు కశ్మీర్ సింగ్. ఎండలు పెరుగుతున్నాయి, వేసవి కాలం వస్తోంది కదా.. మీరు పోరాటం ఎలా కొనసాగిస్తారు? అనే ప్రశ్నకు ఆయన ఇచ్చిన జవాబు అది.

కశ్మీర్ సింగ్‌లాగానే అనేకమంది రైతులు గత కొద్ది నెలలుగా దిల్లీ సరిహద్దుల్లో బైఠాయించారు.

బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమం కొనసాగుతూనే ఉంది.

ఈ ఉద్యమం ప్రారంభమై మూడు నెలలు దాటింది.

ప్రస్తుతం సింఘు, టిక్రీ సరిహద్దుల్లో పరిస్థితి ఎలా ఉంది? రైతులు, వారి నాయకులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారి తదుపరి వ్యూహం ఏమిటి?

ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి బీబీసీ బృందం సింఘు, టిక్రీ బోర్డర్లకు వెళ్లింది.

ఫొటో క్యాప్షన్,

దిల్లీ సరిహద్దుల్లో రైతుల గుడారాలు

సింఘు సరిహద్దు

దిల్లీ, అమృతసర్ హైవే మీద ఏర్పాటు చేసిన గుడారంలో ఉన్న భారతీయ కిసాన్ సంఘ్ (రాజేవాల్) కార్యాలయానికి వచ్చి రైతులు రోజూ హాజరు వేయించుకుంటారు.

అక్కడ ఉన్న రిజిస్టర్‌లో తమ ఊరు, పేరు, టెలిఫోన్ నంబర్ రాస్తారు. కాసేపు అందరూ అక్కడే కూర్చుని మాట్లాడుకున్నాక వెళ్తారు.

"ఈ రిజిస్టర్ ద్వారా ఉద్యమంలో పాల్గొంటున్న రైతుల సంఖ్యను రికార్డ్ చేస్తున్నారు. ఈ కార్యాలయంలోనే ఉద్యమం ప్రస్తుత పరిస్థితిని, తాజా వివరాలను రైతులకు అందిస్తారు. వారికేమైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తారు" అని కార్యాలయం ఇన్‌ఛార్జి హర్దీప్ సింగ్ చెప్పారు.

ఉదయం 8 నుంచి రాత్రి 8.00 వరకూ రైతులు ఎప్పుడైనా వచ్చి తమ పేరు, వివరాలను రిజిస్టర్‌లో రాసి వెళ్లొచ్చు.

ఫొటో క్యాప్షన్,

వెదురు, గడ్డితో పైకప్పు తయారుచేస్తూ వేసవిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న రైతులు

కాగా, ఉద్యమంలో జనాల సంఖ్య తగ్గినట్టు కనిపిస్తోంది.

దీనిపై హర్దీప్ సింగ్ స్పందిస్తూ.. "ప్రస్తుతం ఇక్కడ రైతులు మాత్రమే ఉన్నారు. వాళ్లు ఎక్కడికీ కదలరు. మా డిమాండ్లు నెరవేర్చేవరకూ మేం ఇక్కడినుంచీ కదిలేదే లేదు" అని అన్నారు.

గోధుమ పంట సీజన్ ప్రారంభం కానుంది. అందుకే కొందరు రైతులు గ్రామాల వైపు వెళ్తున్నారని ఆయన చెప్పారు.

అయితే, ట్రాక్టర్-ట్రాలీలతో మునుపటిలాగానే ప్రస్తుతం అక్కడున్న రైతులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు.

"మాకు ఉద్యమం, వ్యవసాయం రెండూ ముఖ్యమే. అందుకే మేము రొటేషన్ పద్ధతి పాటిస్తున్నాం. ఒక బృందం ఒక వారం పాటు గ్రామాలకు వెళ్లి పొలం పనులు చూసుకుని దిల్లీ తిరిగి వస్తారు. అదే రోజు మరో బృందం గ్రామాలకు బయలుదేరుతారు. వారు తిరిగొచ్చాక మరొక బృందం వెళుతుంది. కాబట్టి రైతులు ఉత్సాహంగానే ఉన్నారు. ఉద్యమ స్ఫూర్తి ఏ మాత్రం తగ్గలేదు" అని హర్దీప్ సింగ్ తెలిపారు.

భద్రతా దళాలు మోహరించే ఉన్నాయి

జనవరి 26న రైతుల ట్రాక్టర్ ర్యాలీ, ఘర్షణల తరువాత సింఘు, టిక్రీ సరిహద్దుల దగ్గర భారీగా భద్రతా దళాలను మోహరించారు.

ఇప్పుడు ఈ రెండు బోర్డర్లకూ వెళ్లడం అంత సులభం కాదు. ఎక్కడికక్కడ పోలీసులు, పారా మిలటరీ దళాలు కాపలా కాస్తున్నారు. భద్రతా దళాలకు, రైతులకు మధ్య పెద్ద పెద్ద రాళ్లు, ముళ్లకంపలు పెట్టారు.

సింఘు సరిహద్దుకు వెళ్లే వాహనాలను గురు తేజ్ బహదూర్ స్మారక స్థలానికి రెండు కిలోమీటర్ల ముందే పోలీసులు ఆపేస్తారు. అక్కడినుంచీ నడుచుకుంటూ రైతులు ఉన్న చోటికి వెళ్లాలి.

వేసవి సన్నాహాలు

దిల్లీలో ఎండలు పెరుగుతున్నాయి. ఉదయం 11 గంటలు దాటాక ఎండ తీవ్రమవుతోంది. వేసవిలో ఉద్యమం ఎలా కొనసాగిస్తారని వారిని అడిగాం.

"వెదురు గడ్డితో పైకప్పు వేసుకుంటాం. అది కొంత చల్లగా ఉంటుంది. ఫ్లాన్లు, కూలర్లు అవసరమైతే ఏసీలు కూడా ఏర్పాటు చేస్తాం" అని రైతులు చెప్పారు.

ఇప్పటికే కొన్ని గుడారాల్లో ఏసీలు, కూలర్లు అమర్చారు.

"వేసవిలోనే రైతులు పంటలు పండిస్తారు. ఎండల్లోనే పోలాల్లో పని చేస్తాం. ఈ వేడి మమ్మల్నేం చేస్తుంది?" అని హర్దీప్ అన్నారు.

ఆ పక్కనే మంజీత్ సింగ్ అనే రైతు కొందరు కార్మికుల సహాయంతో వెదురు, గడ్డి, తాటాకులతో పైకప్పులు సిద్ధం చేయిస్తున్నారు.

"శీతాకాలాన్ని ఎదుర్కొన్నాం. ఇప్పుడు వేసవికి సిద్ధపడుతున్నాం. ఈ పైకప్పులపై టర్పాలిన్ వేస్తాం. వర్షాలొచ్చినా నీరు కారకుండా ఉంటుంది. వీటిని తయారు చేయడానికి సుమారు రూ.25 వేలు ఖర్చవుతుంది. అందుకే మేము మూడు గ్రామాలకు కలిపి ఒక టెంట్ వెయ్యాలని నిర్ణయించుకున్నాం. అందరూ తలా ఒక చెయ్యి వేస్తున్నారు. ఈ టెంట్‌లో కూలర్లూ, ఏసీలు కూడా పెడతాం" అని మంజీత్ సింగ్ తెలిపారు.

"ఉద్యమం ఇప్పుడప్పుడే ముగిసేలా లేదు. ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తోంది. మా ఏర్పాట్లు మేము చేసుకోవలసిందే. దీన్ని ఎంత కాలమైనా కొనసాగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం" అని ఆయన అన్నారు.

ఇప్పుడు ఉద్యమ ప్రాంతం ఎలా కనిపిస్తోంది?

సింఘు, టిక్రీ సరిహద్దుల దగ్గర ఉద్యమం జరుగుతున్న ప్రదేశంలో ఒక నగరం రూపు దిద్దుకుంటున్నట్లు తోస్తోంది.

అక్కడ చిన్నచిన్న వ్యాపారాలు మొదలయ్యాయి. టీ షర్టులు, షూస్, చెప్పులు, దుప్పట్లు, చెరకు రసం, తినుబండారాలు అన్నీ అమ్ముతున్నారు.

ఏసీలు కూలర్లతో పాటూ గుడారాల్లో టీవీలు కూడా వచ్చాయి.

ఉదయంపూట అక్కడంతా హడావుడిగా కనిపిస్తుంది. మధ్యాహ్నానికి జనం తగ్గుతారు. మళ్లీ సాయంత్రం కాస్త చల్లబడ్డాక గుంపులు గుంపులుగా జనం కనిపిస్తున్నారు.

ఎండవేళల్లో అందరూ తమ తమ గుడారాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సాయంత్రం సభలు, చర్చల్లో పాల్గొంటున్నారు.

వేసవిలో నీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రెండు బోర్డర్ల దగ్గరా బోర్‌వెల్స్ తవ్వారు.

మూడు నెలల్లో రైతుల జీవితం ఎంత మారింది?

రైతులు ఎక్కడ ఉన్నా ఏదో ఒకటి పండిస్తూ ఉంటారనడానికి ఉదాహరణగా సింఘు, టిక్రీ సరిహద్దుల దగ్గర తమ గుడారాల ముందు పూల మొక్కలు వేశారు. ఖాళీ స్థలాల్లో కూరగాయలు పండించడం ప్రారంభించారు.

"ఇప్పుడు మేము ఉత్తి చేతులతో మా ఊర్లకు తిరిగి వెళ్లలేం. ఇది మా గౌరవానికి సంబంధించిన విషయంగా మారిపోయింది. ఖాళీ చేతులతో వెనక్కి వెళితే మమ్మల్ని ఎగతాళి చేస్తారు. అది చిన్న విషయమేం కాదు" అని సేవా సింగ్ తెలిపారు.

30 ఏళ్ల సేవా సింగ్ గత మూడు నెలలుగా సింఘు బోర్డర్ దగ్గరే ఉంటున్నారు.

"ఇప్పుడు మా గ్రామంలో నన్ను అందరూ దిల్లీవాసి అంటున్నారు" అని సేవా సింగ్ చెప్పారు.

ఫ్రిజ్, వాషింగ్ మిషన్, కూలర్ల‌తో పాటు భద్రత కోసం సీసీటీవీ కెమేరాలను కూడా గుడారాల్లో అమర్చినట్లు సేవా సింగ్ తెలిపారు.

పంజాబ్ నుంచి వచ్చిన గుర్‌సేవక్ సింగ్ టిక్రీ బోర్డర్లో ఉన్న ఒక ఖాళీ స్థలాన్ని కిసాన్-హవేలీగా మార్చేశారు. అక్కడ పార్క్, ఆట స్థలం, రాత్రుళ్లు పడుకునేందుకు గుడారాలు ఏర్పాటు చేశారు.

"ఏ ఉద్యమంలో అయితే మూడు తరాల వారు (పిల్లలు, మధ్య వయస్కులు, వృద్ధులు) పాల్గొంటారో ఆ ఉద్యమం కచ్చితంగా విజయం సాధించి తీరుతుంది. ఇవాళ కాకపోతే రేపైనా ప్రభుత్వం మా డిమాండ్లకు తల ఒగ్గాల్సిందే" అని గుర్‌సేవక్ సింగ్ అన్నారు.

రైతుల తదుపరి వ్యూహం ఏమిటి?

రైతుల ఉద్యమానికి సంయుక్త్ కిసాన్ మోర్చా నాయకత్వం వహిస్తోంది. ఇందులో వివిధ రైతు సంఘాలు భాగంగా ఉన్నాయి.

ప్రస్తుతం, పశ్చిమ బెంగాల్‌లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొందరు రైతు నాయకులు బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.

"బీజేపీకి ఓటు వేయకండి" అని భారతీయ కిసాన్ సంఘ్ (రాజేవాల్) అధ్యక్షుడు బల్వీర్ సింగ్ రాజేవాల్ అన్నారు.

ఈ పార్టీ కార్పొరేట్ల పక్షం వహిస్తుంది. ఈ దేశాన్ని కాపాడాలంటే బీజేపీని అధికారం నుంచి కిందకు దించాలి అని వారు అంటున్నారు.

రైతుల ఉద్యమం చూసి ప్రభుత్వం భయపడుతోందని, మూడు చట్టాలను ఉపసంహరించుకోక తప్పదని రాజేవాల్ అన్నారు.

"పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఉద్యమంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. కానీ, మేము దాన్ని పట్టించుకోం" అని రైతు నాయకుడు డాక్టర్ దర్శన్ పాల్ చెప్పారు.

భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహాన్) అధ్యక్షుడు జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ మాట్లాడుతూ.. "100 రోజుల రైతుల ఉద్యమంలో మేం చాలానే సాధించాం. చట్టాలను వాయిదా వేయడం గురించి ప్రభుత్వం మాట్లాడుతోందంటే అది రైతు ఉద్యమం సాధించిన విజయమే" అని అన్నారు.

ప్రభుత్వంతో అధికారిక చర్చలు ముగిసినప్పటికీ, అనధికారిక చర్చలు జరుగుతూనే ఉన్నాయని, మూడు చట్టాలను రద్దు చేసిన తరువాత మాత్రమే రైతులు ఇంటికి తిరిగి వెళతారని ఉగ్రహాన్ స్పష్టం చేశారు.

అయితే, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఉగ్రహాన్ సుముఖత చూపలేదు.

"ఎవరు, ఎవరికి ఓటు వెయ్యాలి అనేది మా సంస్థలు చెప్పకూడదు. మేము ఓటు రాజకీయాలకు దూరంగా ఉంటాం. ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించి మమ్మల్ని ఇక్కడినుంచీ బలవంతంగా వెళ్లగొట్టొచ్చు. కానీ, అదే జరిగితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఈ ఉద్యమం 2024 వరకూ కొనసాగవచ్చు" అని ఉగ్రహాన్ తెలిపారు.

మరొక రైతు నాయకుడు గుర్నాం సింగ్ చఢూనీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

అంతవరకు ఈ ఉద్యమం కొనసాగితే 2024 ఎన్నికల్లో రైతుల ఉద్యమం ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.

"మాకు భూమి పోతే ఆకలితో చనిపోతాం. చనిపోవాల్సి వస్తే ఆందోళనల్లోనే చనిపోతాం" అని గుర్నాం సింగ్ అన్నారు.

ఫొటో సోర్స్, EPA

టికైత్ వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంయుక్త్ మోర్చా

పార్లమెంట్ వరకూ మార్చ్ చెయ్యాలని రైతు సంఘాల నాయకుడు రాకేశ్ టికైత్ అన్నారు.

దీనిపై కిసాన్ మోర్చా అసంతృప్తి వ్యక్తం చేసింది.

టికైత్ తన అభిప్రాయాన్నివెల్లడించవచ్చు కానీ, తుది నిర్ణయం సంయుక్త్ కిసాన్ మోర్చా తీసుకుంటుందని డాక్టర్ దర్శన్ పాల్, బల్వీర్ సింగ్ రాజేవాల్ అన్నారు.

ప్రస్తుతం రైతు నాయకులు మార్చి 26న జరగనున్న భారత బంద్‌ను విజయవంతం చేయడంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

విశ్లేషకులు ఏమంటున్నారు?

"రైతులు ఖాళీ చేతులతో వెనక్కి వెళ్లాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. కానీ, సమాజంలోని వివిధ వర్గాల నుంచీ వారి ఉద్యమానికి లభిస్తున్న మద్దతు చూస్తే ప్రభుత్వం కోరిక నెరవేరేలా లేదు" అని పంజాబ్ విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్రం ప్రొఫెసర్ ఖలీద్ మొహమ్మద్ అభిప్రాయపడ్డారు.

"ఈ విషయమై అంతర్జాతీయంగా కూడా ప్రభుత్వంపై విమర్శలు వస్తున్నాయి. బ్రిటిష్ పార్లమెంట్, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ వరకూ ఉద్యమం గొంతు చేరుకుంది. ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది అనడానికి ఇది ఒక సూచన" అని ఆయన అన్నారు.

బీజేపీలో కూడా అంతర్గతంగా ఈ ఉద్యమం గురించి గొంతులు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం రైతుల ఉద్యమంపై త్వరలోనే ఒక నిర్ణయానికి రావలసి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు రైతుల ఉద్యమ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉందని పంజాబ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ హర్జేశ్వర్ సింగ్ అభిప్రాయపడ్డారు.

అయితే, రైతులు ఉత్తి చేతులతో వెనక్కి వెళ్లే అవకాశమే లేదని, మూడు చట్టాలు, ఎంఎస్‌పీకి చట్టపరమైన హామీ ఎలా ఇవ్వాలన్నది నిర్ణయించుకోవాల్సినది ప్రభుత్వమేనని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)