బిహార్ అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేను పోలీసులు జుత్తు పట్టి ఈడ్చుకెళ్లారా, ఎందుకు
- నీరజ్ ప్రియదర్శి
- పట్నా నుంచి, బీబీసీ కోసం

ఫొటో సోర్స్, NEERAJ PRIYADARSHY
మార్చి 23న బిహార్ అసెంబ్లీలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది.
మంగళవారం ఏం జరిగిందో అక్కడి విపక్ష నేత తేజస్వి యాదవ్ వివరించారు.
"ఈ రోజు బిహార్ అసెంబ్లీలో ఒక నల్ల చట్టం ప్రవేశపెట్టారు. దానిని వ్యతిరేకిస్తూ మేం లేచి నిలబడ్డాం. దాంతో సభ లోపలకు పోలీసులను పిలిపించారు. ఇలా జరగడం బిహార్‌లోనే కాదు, దేశ చరిత్రలోనే మొదటిసారి. ఎస్పీ, డీఎం స్వయంగా ఎమ్మెల్యేలను కొడుతూ ఈడ్చుకుని బయటకు లాక్కెళ్లే పని చేస్తున్నారు. వెనుకబడిన వర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్యే అనితా దేవిని జుత్తు పట్టుకుని లాక్కెళ్లారు. చీర జారిపోతున్నా ఆమెను ఈడ్చుకెళ్లారు. ఈ రోజు 'బ్లాక్ డే'గా దేశ ప్రజలకు గుర్తుండిపోతుంది’’ అన్నారాయన.
సోషల్ మీడియాలో కూడా ఈ ఘటనకు సంబంధించి చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాటిలో సభలో పోలీసులు, పోలీసు అధికారులు ఎమ్మెల్యేలను తన్నడం, పిడిగుద్దులు కురిపించడం కనిపిస్తోంది.
అసెంబ్లీలో జరిగిన ఈ హింసాత్మక ఘర్షణలో ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలతోపాటూ మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు గాయపడ్డారు. కొంతమంది పోలీసులు, మీడియా సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. అందరినీ చికిత్స కోసం పీఎంసీహెచ్ తరలించారు.
ఫొటో సోర్స్, NEERAJ PRIYADARSHY
కొత్త పోలీసు బిల్లుపై వ్యతిరేకత
బిహార్ విపక్షాలు గత కొన్ని రోజులుగా సభలో అధికార పక్షంపై మాటలదాడి చేస్తున్నాయి.
కానీ, ఈ తాజా ప్రతిష్టంభనకు ప్రధాన కారణం 'బిహార్ స్పెషల్ ఆర్మ్డ్ పోలీస్ బిల్లు 2021'. భారీ గందరగోళం మధ్య ప్రభుత్వం దీనిని మంగళవారం సభలో ఆమోదించింది.
ఈ బిల్లు ఆమోదం పొందితే , కోర్ట్ వారెంట్ లేకుండానే సందేహం ఆధారంగా ఎవరినైనా అరెస్ట్ చేసి జైలుకు పంపించే అధికారాలు పోలీసులకు లభిస్తాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
అటు అధికార పక్షం మాత్రం ఈ బిల్లు స్పెషల్ ఆర్మ్డ్ పోలీసు దళాలకు సంబంధించినది అని, సివిల్ పోలీసులకు చెందింది కాదని చెబుతోంది.
ఈ బిల్లుపై బిహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ బీబీసీతో మాట్లాడారు.
"ఈ బిల్లు తీసుకొచ్చి ప్రభుత్వం పోలీసులను తమ గూండాలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. హిట్లర్‌లా నితీశ్ కుమార్ కూడా, తన సైగలతో పోలీసులు ఏ వారెంట్ లేకుండానే ఎవరి ఇంట్లో అయినా చొచ్చుకెళ్లి వారిని అరెస్ట్ చేయించాలని కోరుకుంటున్నారు.
ఈ నల్ల చట్టాన్ని సభలో వ్యతిరేకించినందుకు పోలీసులను పిలిపించి మా ఎమ్మెల్యేలను కొట్టారు. మేం ఏ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామో, వారినే మాపై ప్రయోగించారు" అన్నారు.
ఫొటో సోర్స్, PARWAZ KHAN/HINDUSTAN TIMES VIA GETTY IMAGES
ఈ కొత్త బిల్లు గురించి సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాత్రం "ఈ బిల్లు కేవలం బిహార్ సాయుధ పోలీసు బలగాలను అప్‌గ్రేడ్ చేయడానికి తీసుకొచ్చాం. దీని సాయంతో రాష్ట్ర పోలీసులు భవిష్యత్ సవాళ్లను మరింత సమర్థంగా ఎదుర్కోగలుగుతారు. దీనిపై అపోహలు ప్రచారం చేస్తున్నవారిపై ఇంతకు ముందుకూడా చర్యలు తీసుకున్నాం. ఇందులో కొత్తేం లేదు. ప్రత్యేక బలగాలకు ముందు నుంచే ఆ అధికారం ఉంది" అన్నారు.
విపక్షాలు మాత్రం కొత్త బిల్లులో ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక సాయుధ పోలీస్ అధికారి ఏ వారంట్ లేకుండానే తనిఖీలు చేయవచ్చని, వారికి అనిపిస్తే అరెస్ట్ కూడా చేయవచ్చని అందులో స్పష్టంగా ఉందని ఆరోపిస్తున్నాయి.
ఫొటో సోర్స్, NEERAJ PRIYADARSHY
అసెంబ్లీలో ఘర్షణ కంటే ముందు...
బిహార్ ఎమ్మెల్యేలపై సభలో చర్యలు తీసుకోడానికి ముందు మధ్యాహ్నం పట్నా రహదారుల్లో కూడా ఆర్జేడీ నేతలకు, పోలీసులకు మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది.
ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ నేతృత్వంలో కొత్త పోలీసు బిల్లుతోపాటూ పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, నేరాలు, అవినీతి అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా జేపీ గోలంబర్ నుంచి మార్చ్, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించాలని అనుకున్నారు.
కానీ, పట్నా జిల్లా యంత్రాంగం అనుమతి ఇవ్వలేదు. అయినా, తేజస్వి యాదవ్ జేపీ గోలంబర్ నుంచి వేలాది పార్టీ కార్యకర్తలతో మార్చ్ ప్రారంభించారు.
డాక్‌బంగ్లా చౌరస్తా చేరుకోగానే వారిని అడ్డుకోవాలని ప్రయత్నించిన పోలీసులకు, కార్యకర్తలకు మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు మొదట వాటర్ కానన్లు ప్రయోగించారు. కానీ ఆందోళనకారులు వెనక్కు తగ్గలేదు.
రెండు వైపులా రాళ్లు రువ్వుకున్నారు. ఆ తర్వాత పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. ఆందోళనకారులను తరిమి తరిమి కొట్టారు. కాసేపట్లోనే డాక్ బంగ్లా ప్రాంతం రణరంగంలా మారింది. రోడ్ల మీదంతా ఆందోళనకారుల చెప్పులు, చిరిగిన బట్టలు, జండాలు చెల్లాచెదురుగా పడి కనిపించాయి.
ఫొటో సోర్స్, NEERAJ PRIYADARSHY
ఈ ఘర్షణల్లో డజనుకు పైగా ఆర్జేడీ నేతలు, కార్యకర్తలు గాయపడ్డారు. కొంతమంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి.
రాళ్లు రువ్వుకుంటున్న సమయంలో తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ ఇద్దరూ ఘర్షణల్లో చిక్కుకుపోయారు.
అనుమతి లేకుండా మార్చ్ చేసి, హింసను రెచ్చగొట్టారనే ఆరోపణలతో పోలీసులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్‌ను కాసేపు అదుపులోకి తీసుకుని, వదిలేశారు.
ఫొటో సోర్స్, NEERAJ PRIYADARSHY
సభలో ఏం జరిగింది
బిల్లుకు వ్యతిరేకంగా బిహార్ ప్రతిపక్షం ప్రత్యేక వ్యూహం అవలంబించింది. ఒకవైపు రోడ్డు మీద తేజస్వి యాదవ్ నేతృత్వంలో నిరసనలు జరుగుతుంటే, మరోవైపు సభలో విపక్ష ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు.
హంగామా, గందరగోళం మధ్య సభ పదేపదే వాయిదా పడింది. వెల్‌లోకి చొచ్చుకెళ్లిన విపక్ష ఎమ్మెల్యేలు స్పీకర్ కుర్చీ దగ్గరకు చేరుకుని, ఆయన చేతిలోని బిల్లు కాపీలు లాక్కుని చించేశారు.
ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూన్నా అధికార పక్షం బిల్లును ఆమోదించుకునే ప్రయత్నం చేసింది. కానీ, స్పీకర్ సమావేశాల్లో పాల్గొనకుండా అడ్డుకోడానికి విపక్ష ఎమ్మెల్యేలు ఆయన చాంబర్ ముందే ధర్నా చేశారు.
కాసేపటి తర్వాత సభ లోపలకు పోలీసులను పిలిపించారు. పట్నా ఎస్ఎస్పీ, డీఎం ఇద్దరూ పోలీసు బలగాలతో లోపలికి చేరుకున్నారు.
పోలీసులు అధికారులు సభలోకి రాగానే విపక్ష ఎమ్మెల్యేలు నిరసనలు తీవ్రం చేశారు. ఎమ్మెల్యేలు, పోలీసుల తోపులాట ప్రారంభమైంది. అసెంబ్లీ మార్షల్స్ వారిని ఈడ్చుకుంటూ బయటకు లాక్కెళ్లడం మొదలెట్టారు.
ఫొటో సోర్స్, Ani
ఎమ్మెల్యే ప్రతిమా కుమారి
ఎమ్మెల్యేలతో అలా ప్రవర్తించడం చూసి మహిళా ఎమ్మెల్యే కూడా స్పీకర్ కుర్చీ దగ్గరకు చేరుకుని నిరసన తెలిపారు. తర్వాత మహిళా పోలీసులు ఆమెను బలవంతంగా ఈడ్చుకుని బయటకు తీసుకెళ్లారు.
ఈ గొడవంతా జరిగిన తర్వాత సభ మరోసారి ప్రారంభమైంది. కానీ, విపక్షాలు ఈసారి సభ నుంచి వాకౌట్ చేశాయి. విపక్షాలు లేకుండానే అధికార పక్షం కొత్త పోలీసు బిల్లును సభలో పాస్ చేయించింది.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- గోదావరి నీళ్లు స్నానానికి కూడా పనికి రాకుండా పోతున్నాయా? కాలుష్య సమస్య పరిష్కారమయ్యేదెలా
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- బంగారం మాస్క్: చైనాలో 3 వేల ఏళ్ల కిందటి మాస్క్ దొరికింది
- భారత్-పాక్ సరిహద్దు: కచ్ నిర్బంధ కేంద్రంలో అయిదుగురు పాకిస్తానీలు ఎలా చనిపోయారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- 'ఒకవేళ నేను చనిపోతే మన బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి'
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- మహాశివరాత్రి: పురుష లింగాకారానికి పూజలు చేసే అరుదైన ఆలయం.. గుడిమల్లం
- సిద్దిక్ కప్పన్: రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు... ఆరోగ్యం ఏమవుతుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)