తమిళనాడు ఎన్నికల వల్లే శ్రీలంక వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ గైర్హాజరయ్యిందా...

భారత-శ్రీలంక నేతలు

ఫొటో సోర్స్, MOHD ZAKIR/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి మంగళవారం శ్రీలంకపై ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనిని చాలా దేశాలతో కూడిన బృందం తరఫున బ్రిటన్ ప్రవేశపెట్టింది.

'ప్రమోషన్ ఆఫ్ రికాన్సిలియేషన్ అకౌంటబిలిటీ అండ్ హ్యూమన్ రైట్స్ ఇన్ శ్రీలంక' అనే శీర్షికతో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

చైనా, పాకిస్తాన్ ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. భారత్ ఓటింగుకు దూరంగా ఉండాలని, దీనికి హాజరు కాకూడదని నిర్ణయించింది.

ఇప్పుడు ప్రభుత్వ ఈ నిర్ణయం గురించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. భారత ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో అందరూ తెలుసుకోవాలని అనుకుంటున్నారు.

నిజానికి, శ్రీలంక తమిళుల అంశం భారత్‌కు ఎలాంటిదంటే తమిళనాడు రాజకీయాలు దానిపైనే ఆధారపడి ఉంటాయి.

ఈ ఏడాది ఏప్రిల్‌లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. బీజేపీ కూడా ఎన్నికల బరిలో ఉంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం డీఎంకే దీనిని తమిళనాడు ఎన్నికలకు జోడించి చూస్తోంది.

మరోవైపు విదేశీ అంశాల నిపుణులు మాత్రం దీనిని భారత 'నైబర్‌హుడ్ ఫస్ట్' విధానంగా చెబుతున్నారు.

చాలా మంది భారత అంతర్గత రాజకీయాలను విదేశాంగ విధానంపై ఆధిపత్యం చూపించే విషయంగా చూస్తుంటే, మరి కొందరు మాత్రం మోదీ ప్రభుత్వం యూపీఏ విదేశాంగ విధానాన్ని మార్చేసిందని అంటున్నారు.

కానీ, భారత్ మొదటిసారి ఇలా చేసిందా, యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు మన విధానం మరోలా ఉందా. కేంద్రం ఎందుకిలా చేసింది.. ఈ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఈ తీర్మానం ఎందుకుతెచ్చారు

అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన సత్యమూర్తికి భారత-శ్రీలంక సంబంధాలు, తమిళనాడు రాజకీయాలపై మంచి పట్టుంది. శ్రీలంకపై తీర్మానం గురించి చెన్నై నుంచి ఆయన బీబీసీతో మాట్లాడారు.

"శ్రీలంకకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానంపై భారత్ ఓటింగ్ చేయకపోవడం ఇది మొదటిసారి కాదు. 2014లో కూడా ఇలాంటి ఒక తీర్మానం తీసుకొచ్చారు. అప్పుడు కూడా భారత్ ఓటింగుకు దూరంగా ఉంది. 2015, 2019 మధ్య వచ్చిన తీర్మానాలను శ్రీలంక ప్రభుత్వం, మిగతా సభ్య దేశాల సమ్మతితో తీసుకొచ్చారు కాబట్టి వాటిపై ఓటింగ్ జరగలేదు" అన్నారు.

నిజానికి, 2015లో రాజపక్ష శ్రీలంకలో అధికారంలోకి వచ్చినపుడు జరిగిన యుద్ధ నేరాల్లో మానవహక్కుల ఉల్లంఘనపై ప్రభుత్వ స్థాయిలో నిష్పక్షపాతంగా, స్వతంత్ర దర్యాప్తు జరిపిస్తామని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి భరోసా ఇచ్చారు. గత కొన్నేళ్లుగా అది జరగలేదు. అందుకే ఆ తీర్మానాన్ని మళ్లీ తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారీ తెచ్చిన తీర్మానంపై ఓటింగ్ జరిగింది. దాంతో, భారత్ మరోసారి ఓటింగుకు గైర్హాజరయ్యింది.

మానవ హక్కుల మండలి

ఫొటో సోర్స్, UN PHOTO

అంతకు ముందు తీర్మానాలను భారత్ సమర్థించిందా

2014 కంటే ముందు 2012లో శ్రీలంకపై ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది. ఆ తీర్మానంలో ఎల్టీటీఈతో జరిగిన యుద్ధంలో శ్రీలంక ప్రభుత్వ దళాలు యుద్ధ నేరాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల్లో మానవ హక్కుల ఉల్లంఘనపై దర్యాప్తు చేయాలని కోరారు.

కానీ 2012 తీర్మానానికి, 2021 ఆమోదించిన తీర్మానానికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయని ఆయన అంటున్నారు.

"శ్రీలంకలో ఎల్‌టిటిఈ యుద్ధ నేరాల్లో మానవ హక్కుల ఉల్లంఘనలపై స్వతంత్ర అంతర్జాతీయ దర్యాప్తు జరగాలని 2012 తీర్మానంలో చెప్పారు. అందులో జడ్జిలు, లాయర్లు ఉంటారు. కానీ, ఈసారి తీర్మానంలో యుద్ధ నేరాల్లో హక్కుల ఉల్లంఘనపై దర్యాప్తు చేయమని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి కార్యాలయానికి చెప్పారు. అంటే, ఇది యుఎన్ హెచ్ఆర్సీకి పోలీసుల పని చేసే అధికారం ఇవ్వడం లాంటిది" అన్నారు సత్యమూర్తి.

ఈ సారీ తీర్మానం 2012ల తీర్మానం కంటే భిన్నంగా ఉన్న దర్యాప్తు గురించి చెబుతుంది. ఓటింగ్‌కు దూరంగా ఉండడమే మంచిదని భారత్ భావించడానికి మొదటి, ముఖ్యమైన కారణం అదేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ఆ దర్యాప్తు విధానాన్ని భారత ప్రభుత్వం అంగీకరించదు, ఇది ఒక దేశానికి వ్యతిరేకంగా చేసిన తీర్మానంగా భావిస్తుంది.

సోనియా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

భారత విదేశాంగ అంశాలను నిశితంగా గమనించే సీనియర్ జర్నలిస్ట్, టైమ్స్ ఆఫ్ ఇండియా డిప్లమాటిక్ ఎడిటర్ ఇంద్రాణీ బాగ్చీ కూడా ఈ అంశం గురించి వివరించారు.

2012లో భారత ప్రభుత్వం నిర్ణయం దేశ అంతర్గత రాజకీయాల కోసం తీసుకున్నది. భారత విదేశాంగ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం తీసుకోలేదు. అప్పుడు, తమిళనాడులో కాంగ్రెస్-డీఎంకేతో కలిసి అధికారంలో ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఉంది. శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయాలని, అప్పుడు కాంగ్రెస్ మీద డీఎంకే ఒత్తిడి తీసుకొచ్చింది" అన్నారు.

2014లో భారత్ ఇలాంటి తీర్మానానికి దూరంగా ఉన్నప్పుడు కూడా కేంద్రంలో యూపీఏ ప్రభుత్వమే ఉంది. అది కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం రావడానికి ముందే వచ్చింది.

శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయడం వల్ల భారత్‌కు నష్టమే జరుగుతుందని యూపీఏకు రెండేళ్లలోనే బాగా అర్థమైందని ఇంద్రాణీ చెప్పారు.

అందుకే, 2021లో కూడా కేంద్ర ప్రభుత్వం యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే అమలు చేసింది.

మోదీ, రాజపక్ష

ఫొటో సోర్స్, Getty Images

భారత ప్రభుత్వ నిర్ణయం వెనుక కారణం ఏంటి

కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ముఖ్యమైన కారణాలను కూడా ఇంద్రాణి చెప్పారు.

మొదటి కారణం - ఇలా, గైర్హాజరు కావడం ద్వారా భారత అంతర్గత రాజకీయాల ప్రభావం విదేశాంగ విధానంపై పడకుండా చూడాలని తాము భావిస్తున్నట్లు కేంద్రం ఒక సందేశం ఇవ్వాలనుకుంటోంది.

రెండో కారణం - 'నైబర్‌హుడ్ ఫస్ట్' భారత విదేశాంగ విధానంగా ఉంది. భారత్‌-శ్రీలంకకు పరస్పరం చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చారిత్రక రాజకీయ సంబంధాలు, రెండు దేశాల ప్రజల మధ్య సాంస్కృతిక బంధం కూడా ఉంది. శ్రీలంకకు వ్యతిరేకంగా ఓటు వేయడం వల్ల భారత్‌కు ఒరిగేదేమీ ఉండదు. శ్రీలంక చైనా జట్టులో ఉండాలని భారత్ ఎప్పటికీ కోరుకోదు. అలా జరిగితే భారత భద్రతకే ముప్పు ముంచుకు రావచ్చు.

మూడో కారణం- శ్రీలంకలోని తమిళుల అంశాన్ని వారి అంతర్గత సమస్యగా భారత్ చూస్తోంది. దానిపై భారత శ్రీలంకకు సలహా కూడా ఇవ్వచ్చు. అంతర్జాతీయ ఒత్తిడి ద్వారా ఆ అంశాన్ని పరిష్కరించలేం.

అందుకే ఓటింగుకు ముందు భారత్ ఒక ప్రకటన జారీ చేసింది. అందులో "శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘన విషయంలో భారత్ ప్రధానంగా రెండు విషయాలపై దృష్టిపెడుతుంది. మొదటిది తమిళ సమాజానికి మా మద్దతు, రెండోది వారి సమానత్వం, గౌరవం, శాంతి, న్యాయం, ప్రాంతీయ సమగ్రత. ఈ రెండూ పరస్పరం కలిసి సాగుతాయని, రెండు అంశాలను జాగ్రత్తగా చూసుకుంటే, శ్రీలంక పురోగతి సాధిస్తుందని మేం భావిస్తున్నాం" అని పేర్కొంది.

నాలుగో కారణం - భారత ప్రభుత్వ విదేశాంగ విధానం. అంతర్జాతీయ ఏజెన్సీలో ఏదైనా ఒక దేశం ఏదైనా తీర్మానం ప్రవేశపెడితే, భారత్ ఓటింగులో పాల్గొనదు. అయితే, 2012లో తీసుకొచ్చిన తీర్మానం దానికి ఒక మినహాయింపు.

పళని స్వామి

ఫొటో సోర్స్, Getty Images

తమిళ రాజకీయాలు

అయితే, చాలా మంది నిపుణులు భారత్ ఈ నిర్ణయాన్ని తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు జోడించి చూస్తున్నారు.

డీఎంకే నేత స్వయంగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని ఆరోపించారు.

తమిళనాట బీజేపీ, అన్నాడీఏంకేతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. భారత్ ఈ ఓటింగులో పాల్గొంటే బీజేపీకి రాష్ట్రంలో నష్టం కలగవచ్చని చాలా మంది నిపుణులకు అనిపిస్తోంది.

కానీ, ఓటింగ్‌కు మూడు రోజుల ముందు శనివారం కాంగ్రెస్ నేత పి.చిదంబరం భారత్ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని అన్నారు.

"తమ దేశంలో ఇంతకు ముందు గానీ, ఇప్పుడు గానీ మానవ హక్కుల ఉల్లంఘన, ముఖ్యంగా తమిళ సమాజాలపై అలాంటివి ఏవీ జరగలేదని శ్రీలంక చెబుతోంది" అని ఆయన ట్వీట్ చేశారు.

తీర్మానానికి కేంద్రం అనుకూలంగా ఓటు వేసుండాలని డీఎంకే నేత ఎంకే స్టాలిన్ కూడా అన్నారు. ఓటింగ్‌కు భారత్ గైర్హాజరు కావడంపై డీఎంకే తీవ్రంగా స్పందించింది.

అయితే అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన సత్యమూర్తి ఇలా చేయడం వల్ల బీజేపీకి ఎలాంటి నష్టం జరగదని అంటున్నారు.

"తమిళనాడు ఎన్నికల్లో శ్రీలంక తమిళుల అంశానికి అంత ప్రాధాన్యం ఉండదు. 2009లో శ్రీలంకలో యుద్ధం జరుగుతున్నప్పుడు, రాష్ట్రంలో డీఎంకే-కాంగ్రెస్ చాలా సీట్లు గెలుచుకున్నాయి. కేంద్రంలో అప్పడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న అరాచకాలను ప్రచారం చేస్తూ ఎన్నికల్లో పోటీ చేసిన వైకో ఓడిపోయారు" అని చెప్పారు.

సీనియర్ జర్నలిస్ట్ టీఆర్ రామచంద్రన్ మాత్రం కేంద్రం నిర్ణయం వల్ల డీఎంకేకు కాస్త లబ్ధి కలగవచ్చని, ఆ పార్టీ ఈ అంశంపై గట్టిగా ప్రచారం చేస్తోందని అన్నారు.

ప్రస్తుతం తమిళనాట అధికారంలో ఉన్న అన్నాడీఎంకే వైపు నుంచి భారత ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటివరకూ ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

"తమిళనాడు ఎన్నికల్లో గత 35-40 ఏళ్లుగా ఒకే పాటర్న్ ఉంది. అధికారంలో ఒకసారి డీఎంకే వస్తే, ఇంకోసారి అన్నాడీఎంకే వస్తుంది. గత ఏడాది ఆ పరంపరకు బ్రేక్ పడింది. పదేళ్ల నుంచీ అన్నాడీఎంకే అధికారంలో ఉంది. ఇప్పుడు అది మూడోసారి అధికారంలోకి వస్తామనే ఆశతో ఉంది. కానీ, డీఎంకే కూడా అధికారం అందుకోడానికి తమ వైపు నుంచి ఏ ప్రయత్నాన్నీ వదులుకోవడం లేదు" అని రామచంద్రన్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)