టార్గెట్‌ రూ. 216 కోట్లు... అయిదు ట్రస్టుల సొమ్మును కొల్లగొట్టేందుకు భారీ స్కెచ్‌ : ప్రెస్ రివ్యూ

క్రిమినల్ గ్యాంగ్

ఫొటో సోర్స్, Getty Images

హైదరాబాద్‌తో పాటు గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లకు చెందిన వారితో కూడిన ఓ గ్యాంగ్‌ ఐదు ట్రస్ట్‌లకు సంబంధించిన ఖాతాల్లో ఉన్న రూ. 216 కోట్లకు పైగా మొత్తాన్ని కొట్టేయడానికి భారీ స్కెచ్‌ వేసిందని సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది.

స్టాక్‌ బ్రోకర్ల ఖాతాల్లోకి మళ్లిస్తే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో వారి ద్వారా స్వాహా చేయడానికి ఈ ముఠా రంగంలోకి దిగింది. దీనిపై సమాచారం అందుకున్న మహారాష్ట్రలోని పుణే సైబర్‌ క్రైమ్‌ పోలీసులు డెకాయ్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. తామే స్టాక్‌ బ్రోకర్లుగా నటించి 14 మందిని అరెస్టు చేశారు.

పట్టుబడ్డ వారిలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులు కూడా ఉన్నారని పుణే సైబర్‌ క్రైమ్‌ విభాగం అధికారులు వెల్లడించినట్లు ఈ కథనం వెల్లడించింది.

ఐదు ట్రస్టులకు రెండు ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నాయని, అయితే, ఏళ్లుగా లావాదేవీలు జరగట్లేదని, వాటిలో పెద్దమొత్తంలో ఉన్న డబ్బులు ఎవ్వరూ డ్రా చేసుకోవట్లేదని నిందితులు గుర్తించారు.

ఈ ఖాతాల సమాచారం లీక్‌ చేసింది ఆయా బ్యాంకులకు చెందిన ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఐదు ఖాతాలలో 216,29,54,240 రూపాయల సొమ్ము ఉందంటూ వివరాలు పక్కాగా చెప్పడంతో పాటు ఆయా బ్యాంక్‌ ఖాతాల పిన్‌ నంబర్లు సైతం ముఠాకు తెలిశాయి.

దీంతో ఈ సమాచారం ఇచ్చింది బ్యాంకు ఉద్యోగులే అయ్యుండొచ్చన్న అనుమానం కలుగుతోందని, ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపినట్లు సాక్షి కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

ఎయిర్‌ బ్యాగ్‌లో రూ.11.25 కోట్ల విలువైన బంగారం-హైదరాబాద్‌లో పట్టుబడ్డ కారు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద కారు ఎయిర్‌బ్యాగులో ఉంచి రవాణా చేస్తున్న 25 కిలోల బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారని, దీని విలువ సుమారు రూ.11.63 కోట్లు ఉంటుందని నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది.

అసోం రాజధాని గువాహటి నుంచి హైదరాబాద్‌కు పెద్దఎత్తున బంగారాన్ని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు డీఆర్‌ఐ అధికారులు విజయవాడ- హైదరాబాద్‌ హైవేపై పంతంగి టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు నిర్వహించారు.

అసోం రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారును తనిఖీ చేయగా 25 కిలోల బంగారం దొరికింది. కారు ముందు సీటులో ప్యాసింజర్‌ కోసం ఉండే లైఫ్‌ సేవింగ్‌ ఎయిర్‌బ్యాగ్‌ను తొలగించి దాని స్థానంలో బంగారం దాచేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లుచేశారు.

ఒక్కో కిలో చొప్పున ఉన్న 25 బంగారం బిస్కెట్లను అందులో దాచి, పైనుంచి సీల్‌ చేశారు. పట్టుబడిన బంగారం బిస్కెట్లు అన్నీ విదేశాలకు చెందినవేనని, వీటిలో హీరెస్‌, సుస్సీ, మెల్టర్‌ అస్సాయెర్‌, వాల్కంబీ అనే నాలుగు విదేశీ కంపెనీల మార్క్‌తో ఉన్నట్టు అధికారులు తెలిపారు.

గుహవాటి నుంచి హైదరాబాద్‌కు బంగారాన్ని రవాణా చేసేందుకు నిందితులు కారులో ఏకంగా 2,500 కిలోమీటర్లు ప్రయాణించారు. మరో 55 కిలోమీటర్లు వెళితే హైదరాబాద్‌ వస్తుందనగా డీఆర్‌ఐ అధికారులకు చిక్కారు.

రూ.11.63 కోట్ల విలువచేసే 25 కిలోల బంగారంతోపాటు రూ.25 లక్షల విలువైన ఇసుజు కారును స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్‌ యాక్ట్‌1962 కింద నిందితులను అరెస్టు చేసి జ్యుడిషియల్‌ కస్టడీకి తరలించామని డీఆర్‌ఐ అడిషనల్‌ డీజీ డీపీ నాయుడు తెలిపినట్లు నమస్తే తెలంగాణ కథనం పేర్కొంది.

ఫొటో క్యాప్షన్,

షర్మిల ఖమ్మం సభకు షరతులతో కూడిన అనుమతులు లభించాయి.

షర్మిల ఖమ్మం సభకు అనుమతి - పాలేరు నుంచే ఆమె పోటీ చేస్తారా?

తెలంగాణలో కొత్తగా పార్టీ ఏర్పాటు చేయనున్న షర్మిల పాలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారా అన్న చర్చ లోటస్‌ పాండ్‌ వర్గాల్లో జోరుగా నడుస్తోందని ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ఇచ్చింది.

పార్టీ పెట్టే ప్రయత్నాల్లో ఉన్న షర్మిల మొదటినుంచీ ఖమ్మం జిల్లాపైనే దృష్టి పెట్టారని, భారీ బహిరంగ సభ ద్వారా జనం ముందుకు రావడానికీ ఆమె ఖమ్మం నగరాన్నే ఎంచుకున్నారనీ ఈ కథనం పేర్కొంది.

తొలి ఆత్మీయ సమావేశం తర్వాత షర్మిల తరచుగా ఖమ్మం జిల్లా నేతలను కలుస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తమ జిల్లా నుంచి ముఖ్యంగా పాలేరు నుంచే పోటీ చేయాలని సదరు నేతలు విజ్ఞప్తి చేయగా షర్మిల మౌనం వహిస్తున్నారు.

బుధవారం పాలేరుకు చెందిన పలువురు నేతలు లోటస్‌ పాండ్‌లో ఆమెను కలిసి వచ్చే ఎన్నికల్లో తమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే నెత్తిన పెట్టుకుని గెలిపించుకుంటామని, నాన్నకు పులివెందుల ఎలాగో మీకు పాలేరును అలా తయారు చేస్తామని ఆమెతో అన్నారని, దానికి ఆమె నవ్వి ఊరుకున్నారని ఓ సీనియర్‌ నేత చెప్పినట్లు ఈ కథనం వెల్లడించింది.

పాలేరు నుంచి పోటీ చేయాలన్న ప్రతిపాదనపై షర్మిల మౌనం వహించడం అర్ధాంగీకారమేనని లోటస్‌ పాండ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

మరోవైపు ఖమ్మంలో వచ్చే నెల 9న లక్ష మందితో ఖమ్మంలో తలపెట్టిన షర్మిల సభకు కొవిడ్‌ చిక్కులు ఏర్పడ్డాయి. లక్ష మందితో సభ నిర్వహణకు షర్మిల బృందం ఒకవైపు కసరత్తు చేస్తుంటే కరోనా నేపథ్యంలో స్థానిక పెవిలియన్‌ గ్రౌండ్‌లో కేవలం ఆరు వేల మందితో సభకు మాత్రమే ఖమ్మం జిల్లా పోలీసులు అనుమతినిచ్చారు.

గురువారం లోటస్‌ పాండ్‌లో ఖమ్మం నేతలతో జరిగే సమావేశంలో సభపై స్పష్టత వస్తుందని ఆంధ్రజ్యోతి పత్రిక కథనం పేర్కొంది.

ఫొటో క్యాప్షన్,

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను తన హయాంలో నిర్వహించలేనని రమేశ్‌ కుమార్‌ చెప్పారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పుడు సాధ్యం కాదు- ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలను తన హయాంలో నిర్వహించడం సాధ్యం కాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ స్పష్టం చేసినట్లు ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది.

తాను ఈ నెలాఖరున పదవీ విరమణ చేస్తున్నానని, ఆ లోపు ప్రక్రియ మొత్తం పూర్తి చేయలేమని ఆయన అన్నారని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారని ఈ కథనం పేర్కొంది.

పంచాయతీ, మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల తరహాలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నాలుగు వారాల ముందు కోడ్‌ అమలు చేయాల్సి ఉంటుందని, దాంతోపాటు ఎన్నికల సిబ్బందికి టీకాలు కూడా వేయాల్సి ఉన్నందున తన పదవీకాలం లోపు ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి, ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఎస్‌ఈసీ వెల్లడించారు.

తన తర్వాత బాధ్యతలు తీసుకునే ఎన్నికల కమిషనర్‌ ఆ ప్రక్రియ పూర్తి చేస్తారని ప్రకటించారు. ఏపీ హైకోర్టు రిట్‌ పిటిషన్‌ నంబరు 4154/2021లో ఇచ్చిన తీర్పు మేరకు ఎన్నికల సంఘం కొన్ని చర్యలు తీసుకుంటోందంటూ ఆయన ఉత్తర్వులు ఇచ్చారని ఈనాడు కథనం వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)