కరోనావైరస్: ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకాల ఎగుమతిని తాత్కాలికంగా నిలిపేసిన భారత్‌

కోవిడ్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

ఇప్పటి వరకు 76 దేశాలకు 60 మిలియన్‌ డోసుల వ్యాక్సీన్‌ను భారత్‌ సరఫరా చేసింది.

దేశంలో తయారవుతున్న ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా టీకా ఎగుమతిని తాత్కాలికంగా నిలిపేసినట్లు విదేశాంగ శాఖ వర్గాలు బీబీసీకి తెలిపాయి. దేశంలో టీకా కార్యక్రమం వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని, అందుకే ఎగుమతులను తాత్కాలికంగా ఆపేశామని విదేశాంగ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

దేశవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు విపరీతంగా పెరగుతుండటం, రానున్న రోజుల్లో కేసులు మరింత పెరిగే అవకాశం ఉండటంతో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం దేశం నుంచి 190 దేశాలకు ఆస్ట్రాజెనెకా టీకా సరఫరా అవుతుండగా, ఏప్రిల్‌ చివరకు వరకు దీని ఎగుమతిపై ప్రభావం ఉంటుందని, అయితే ఇది తాత్కాలికమేనని వారు తెలిపారు.

అయితే, ఈ అంశంపై అటు ప్రభుత్వం నుంచి గానీ, ఇటు సీరం ఇనిస్టిట్యూట్‌ నుంచి గానీ అధికారిక ప్రకటన ఏదీ ఇంకా వెలువడ లేదు.

అన్ని దేశాలకు సమానంగా టీకా ఇవ్వాలన్న లక్ష్యంలో భాగంగా ఐక్యరాజ్యసమితి కోవాక్స్‌ స్కీమ్‌ను ప్రకటించింది. దీనికోసం పుణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్‌ టీకాను సరఫరా చేస్తోంది. అయితే బ్రెజిల్‌, యూకే సహా పలు దేశాలకు వ్యాక్సీన్‌ సరఫరాను సీరం ఇనిస్టిట్యూట్‌ ఇప్పటికే తగ్గించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఏప్రిల్‌ 1 నుంచి దేశంలో 45 ఏళ్లు పైబడిన వారికి టీకా

నిలిపివేత ఎందుకు?

బుధవారంనాడు ఒకే రోజులో అత్యధికంగా 47,000 కేసులు, 275 మరణాలు సంభవించడంతో కేంద్ర ప్రభుత్వం టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

60 ఏళ్లు పైబడిన వారికి, 45 ఏళ్లు దాటి, ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రమే ప్రస్తుతం టీకా ఇస్తున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ టీకా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఎగుమతుల నిలిపివేత తాత్కాలికమేనని, దేశీయ డిమాండ్‌కు అవసరమైన టీకాను సిద్ధం చేసుకునేందుకే ఈ నిర్ణయమని విదేశాంగశాఖ అధికారులు బీబీసీకి తెలిపారు.

గత గురువారం నుంచే ఎగుమతులు ఆగిపోయానని, దేశంలో పరిస్థితులు కుదుటపడే వరకు ఎలాంటి ఎగుమతులు ఉండబోవని విదేశాంగ శాఖ వర్గాలు తేల్చి చెప్పినట్లు రాయిటర్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది.

అయిదు మిలియన్‌ డోసుల వ్యాక్సీన్‌ ఎగుమతిని సీరం ఇనిస్టిట్యూట్ నిలిపేసిందని గత వారమే బీబీసీ వెల్లడించింది. "దేశీయ అవసరాల రీత్యా, ప్రభుత్వ వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు అవసరమైన టీకా సరఫరా కోసం ఎగుమతిని నిలిపేశాము." అని సీరం ఇనిస్టిట్యూట్‌ ప్రతినిధి అప్పట్లో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)