పంజాబ్‌లో బీజేపీ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్‌ను కొట్టిన రైతు నిరసనకారులు

పంజాబ్‌లో బీజేపీ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్‌ను కొట్టిన రైతు నిరసనకారులు

శనివారం పంజాబ్‌, ముక్త్సర్ జిల్లాలోని మలోట్‌లో రైతులు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్‌పై రైతు నిరసనకారులు చేయి చేసుకున్నారు. నారంగ్‌ను చుట్టుముట్టి దాడి చేశారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.

అరుణ్ నారంగ్‌ను కాపాడే ప్రయత్నంలో ఎస్పీ గుర్మయిల్ సింగ్‌కు కూడా గాయాలయ్యాయి. ఈ దాడిలో అరుణ్ నారంగ్‌ దుస్తులు పూర్తిగా చినిగిపోయాయి.

"పంజాబ్‌లోని అబోహార్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అరుణ్ నారంగ్ తమ పార్టీ ప్రెస్ కాన్ఫరెన్సులో పాల్గొనడానికి శనివారం మలోట్‌కు వచ్చారు. అక్కడ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు ఆయనను అడ్డుకున్నారు. ఆయనను అక్కడి నుంచి తీసుకువెళ్లడానికి పోలీసులు ప్రయత్నించినప్పుడు వాళ్లు దాడి చేయడం ప్రారంభించారు. ఈ ఘర్షణలో ఎస్పీ గుర్మయిల్ సింగ్ తలకు, కాళ్లకు గాయాలయ్యాయి" అని పోలీసు శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

విలేఖరుల సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన నారంగ్, కారు దిగడంతోనే నిరసనకారులు చుట్టుముట్టారు దాంతో, ప్రెస్ కాన్ఫరెన్సు కూడా రద్దయింది.

కొత్త వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతులు గత ఏడాది నవంబర్ నుంచి ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం నాడు రైతు సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ విజయవంతమైందని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)