వైఎస్ జగన్: జిల్లా కేంద్రాల్లో ప్లాట్లు వేసి, అమ్ముతామంటున్న ఏపీ సీఎం.. ఈ లేఅవుట్లు ఎలా ఉండబోతున్నాయంటే - ప్రెస్ రివ్యూ

జగన్

ఫొటో సోర్స్, FACEBOOK/YSJAGAN

ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కేంద్రాల్లో ఉంటున్న మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారని ‘సాక్షి’ దినపత్రిక ఒక వార్త రాసింది.

మధ్యతరగతి ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం జిల్లా కేంద్రాల్లో కనీసం 100 నుంచి 150 ఎకరాలు సేకరించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు.

న్యాయపరంగా చిక్కుల్లేని విధంగా క్లీయర్ టైటిల్‌తో ఇళ్ల స్థలాలు ఇస్తామని, లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం సరసమైన ధరలకు ప్లాట్లను అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

వివిధ పథకాలు, కార్యక్రమాల అమలుపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కేంద్రాల్లో మధ్య తరగతి ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాల్లోని లే అవుట్లలో సీసీ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, పార్కులు, ఓపెన్‌ ఎయిర్‌ జిమ్, వాకింగ్‌ ట్రాక్స్, ఎలక్ట్రిసిటీ లైన్స్, పచ్చదనం, స్మార్ట్‌ బస్‌స్టాప్‌లు.. తదితర సౌకర్యాలన్నీ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్లాట్లకు ఉన్న డిమాండ్‌పై సర్వే చేయాలని, ఆ డిమాండ్‌ను అనుసరించి భూమిని సేకరించాలని సూచించారు. ఎంఐజీ –1లో 150 చదరపు గజాలు, ఎంఐజీ–2లో 200 గజాలు, ఎంఐజీ– 3లో 240 గజాల కింద ప్లాట్లు ఇవ్వనున్నామని, ఒక కుటుంబానికి ఒక ప్లాటు ఇస్తామని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images

‘తెలంగాణలో పెరుగుతున్న పాల కొరత’

ఎండల తీవ్రత కారణంగా తెలంగాణలో పాల కొరత రోజురోజుకూ పెరుగుతోందంటూ ‘ఈనాడు’ దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

రాష్ట్రంలో పాల కొరత అంతకంతకూ పెరుగుతోంది. ప్రభుత్వ పర్యవేక్షణలో నడుస్తున్న విజయ డెయిరీ కర్ణాటక నుంచి నిత్యం 50 వేల లీటర్ల పాలు కొంటోంది. ఈ డెయిరీకి రోజూ 3.80 లక్షల లీటర్ల పాలు అవసరం. అవి కూడా దొరక్కపోవడం, రాష్ట్రంలో ప్రైవేటు డెయిరీలు రేట్లు పెంచి స్థానికంగా పాలు కొంటుండటంతో వాటితో పోటీపడలేక విజయ డెయిరీ కర్ణాటక పాలపైనే ఆధారపడుతోంది.

మరోవైపు ఎండల తీవ్రత పెరుగుతున్నందున పలు డెయిరీలు పాలపొడిని పాలుగా మార్చి ప్యాకెట్లలో విక్రయిస్తున్నాయి. ఇప్పటికే 200 టన్నుల పాలపొడిని రాష్ట్రంలోని పలు డెయిరీలు కొన్నాయి. ఇంకా కొంటున్నాయి.

సాధారణంగా ఏప్రిల్‌, మే నెలల్లో ఎండల తీవ్రత కారణంగా పశువుల నుంచి పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. కానీ ఈ ఏడాది మార్చిలోనే ఉష్ణోగ్రతలు పెరగడంతో పాల దిగుబడి బాగా తగ్గుతోందని విజయ డెయిరీ పరిశీలనలో తేలింది. కొరత నేపథ్యంలో విజయ డెయిరీ పాల సేకరణ ధరను ఇటీవల లీటరుకు రూపాయి చొప్పున పెంచింది.

కానీ ప్రైవేటు డెయిరీలు రూ.4 నుంచి 5 వరకూ పెంచి కొంటున్నాయి. ప్రభుత్వ డెయిరీకి ఈ అవకాశం లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కొంటోంది.

అసలు తెలంగాణలో పాల ఉత్పత్తి ఎంత, అమ్మకాలు ఎంత అనే లెక్కలు ఎక్కడా పక్కాగా లేవు. పాల ఉత్పత్తి, అమ్మకాలపై వివరాల సేకరణకు గతంలో రాష్ట్ర ‘పాల కమిషనర్‌’గా విజయ డెయిరీ ఎండీ వ్యవహరించేవారు. అన్ని ప్రైవేటు డెయిరీలు ఈ కమిషనర్‌కే నెలకోమారు పాల సేకరణ, అమ్మకాల వివరాలు ఇచ్చేవి. దీనివల్ల రాష్ట్ర అవసరాలకు ఎన్ని పాలు అవసరం? కొరత ఎంత ఉందనేది పరిశీలించి ఎప్పటికప్పుడు ప్రణాళికల తయారీకి అవకాశం ఉండేది.

కానీ, కమిషనర్‌ పోస్టును రద్దు చేసినందున ఇప్పుడు ప్రైవేటు డెయిరీలు తనకు వివరాలు ఏమీ ఇవ్వడం లేదని ఎండీ శ్రీనివాసరావు తెలిపారు.

‘ఏపీలో క్వార్టర్ ధర రెండింతలైంది’

ఆంధ్రప్రదేశ్‌లో మునపటి ప్రభుత్వం ఉన్నప్పటితో పోల్చితే మద్యం క్వార్టర్ ధర దాదాపు రెండింతలైందంటూ ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ వార్త రాసింది.

గత ప్రభుత్వ హయాంలో క్వార్టర్ ధర సుమారు రూ.100గా ఉండేది. ప్రస్తుతం దీని ధర రూ.200 నుంచి రూ.250 దాకా ఉంది.

మద్యం అలవాటు ఉన్న పేదలపై ఈ పెరుగుదల ప్రభావం తీవ్రంగా ఉంటోంది.

గత ప్రభుత్వంలో 2019 ఫిబ్రవరిలోని ఒక రోజున ప్రభుత్వం సరిగ్గా రూ.60 కోట్ల విలువైన మందు అమ్మింది. అందులో 1,06,205 కేసుల లిక్కర్‌, 80,416 కేసుల బీరు ఉంది. లిక్కర్‌ ఒక కేసుకు 48 క్వార్టర్‌ సీసాలు ఉంటాయి. బీర్లు కేసుకు 12 ఉంటాయి.

ఆ లెక్కన చూస్తే ఆ రోజున 50, 97,840 క్వార్టర్ల లిక్కర్‌, 9,64,992 సీసాల బీరు అమ్మారు. రాష్ట్రంలో సగటున మద్యం తాగే అంచనా ప్రకారం ఒక్కొక్కరు ఒక్కో సీసా తాగితే మొత్తం రూ.60 కోట్ల విలువైన మద్యాన్ని 60,62,832 మంది తాగారు. అంటే ఒక్కొక్కరు మందుకు ఖర్చు చేసింది 98.9 రూపాయలు.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక పరిశీలిస్తే.. 2021 మార్చిలోని ఒక రోజున ఎక్సైజ్‌ శాఖ రూ.62 కోట్ల విలువైన మద్యం విక్రయించింది. అందులో 59,526 కేసుల లిక్కర్‌, 20,738 కేసుల బీరు ఉంది. కేసుకు 48 చొప్పున 28,57,248 క్వార్టర్ల లిక్కర్‌ ఉంటే... కేసుకు 12 సీసాల చొప్పున 2,48,856 బీర్లు అందులో ఉన్నాయి.

సగటున ఒక్కరు ఒక సీసా తాగితే మొత్తం రూ.62 కోట్ల విలువైన మందును 31,06,104 మంది తాగారు. అంటే సగటున ఒక్కొక్కరు మందుకు ఖర్చు చేసింది 199.6 రూపాయలు.

ఫొటో సోర్స్, Getty Images

‘హఫీజ్‌పేట భూములు ప్రైవేటువే’

హైదరాబాద్‌లోని హఫీజ్‌పేటలోని సర్వే నెంబర్ 80లోని భూములు ప్రైవేటు వ్యక్తులవేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసిందంటూ ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేటలోని సర్వేనంబర్‌ 80లోని భూమి ప్రైవేటు వ్యక్తులదేనని హైకోర్టు తేల్చింది. అవి ప్రభుత్వానికి, రాష్ట్ర వక్ఫ్‌బోర్డుకు చెందినది కాదని తేల్చిచెప్పింది.

ఈ మేరకు మంగళవారం న్యాయమూర్తులు జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు, జస్టిస్‌ టీ వినోద్‌కుమార్‌తోకూడిన డివిజన్‌ బెంచ్‌ తీర్పు వెలువరించింది. అవి తమ భూములేనని ప్రైవేట్‌ వ్యక్తులు దాఖలుచేసిన రిట్‌ పిటిషన్లను హైకోర్టు అనుమతించింది. కాగా, ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు‌ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

సర్వేనంబర్‌ 80లోని 140 ఎకరాలు వక్ఫ్‌బోర్డుకు చెందినవని పేర్కొంటూ దర్గా హజ్రత్‌ సలార్‌-ఇ-అయులియాకు అప్పగించడం రాజ్యాంగ వ్యతిరేకమని హైకోర్టు వ్యాఖ్యానించింది.

వక్ఫ్‌ భూములుగా పరిగణిస్తూ 2014 నవంబర్‌ 1న జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను సాయిపవన్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహా ముగ్గురు హైకోర్టులో సవాల్‌ చేశారు. ముంతకాబ్‌లో ఆస్తిని చేర్చడం, రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా పేర్కొనడాన్ని రద్దుచేయాలని కే ప్రవీణ్‌కుమార్‌ మరో రిట్‌ దాఖలు చేశారు.

‘‘అది ప్రభుత్వ, వక్ఫ్‌బోర్డు భూమి కాదు. సర్వేనంబర్‌ 80, 80 ఏ నుంచి డీ వరకు భూములపై ఏవిధమైన లావాదేవీలకు అనుమతించరాదని రిజిస్ట్రేషన్‌ అధికారులకు వక్ఫ్‌బోర్డు 2020 జూన్‌ 16న రాసిన లేఖ చెల్లుబాటు కాదు. రెవెన్యూరికార్డుల్లో ప్రభుత్వ భూమి అని రాసిన దానిని తొలగించాలి. సర్వేనంబర్‌ 80లోని ఆస్తిని ఏ, బీ, సీలుగా వర్గీకరించి 50 ఎకరాలు ప్రవీణ్‌కుమార్‌, ఇతరుల పేర్లపై రెవెన్యూ రికార్డుల్లో నమోదుచేయాలి. ఆ సర్వేనంబర్లలోని ఆస్తిహక్కుల విషయంలో ప్రభుత్వం, వక్ఫ్‌బోర్డులు జోక్యం చేసుకోరాదు. ప్రవీణ్‌కుమార్‌, సాయిపవన్‌ ఎస్టేట్స్‌, మరో ఇద్దరికి రాష్ట్ర ప్రభుత్వం,వక్ఫ్‌బోర్డులు రూ.50వేల చొప్పున కోర్టు ఖర్చుల కోసం చెల్లించాలి’ అని 78 పేజీల తీర్పులో హైకోర్టు పేర్కొంది.

కొంతకాలం క్రితం ఈ భూముల వివాదంలోనే ప్రవీణ్‌కుమార్‌తోపాటు మరికొంత మందిని కిడ్నాప్‌ చేసిన కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, ఆమె భర్తపై బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)