IPL: హెచ్‌సీఏ రాజకీయాల వల్లే హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగడం లేదా

  • బళ్ల సతీశ్
  • బీబీసీ ప్రతినిధి
హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్

ఫొటో సోర్స్, Twitter/Mohammed Azharuddin

ఫొటో క్యాప్షన్,

హెచ్‌సీఏ అధ్యక్షుడు మొహమ్మద్ అజారుద్దీన్

హైదరాబాద్‌లో ఇప్పుడు క్రికెట్ రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో విభేదాలు రచ్చరచ్చగా మారాయి. ఈసారి హైదరాబాద్ నగరానికి ఐపీఎల్ లేకుండా పోవడం ఈ గొడవలకు ఆజ్యం పోసింది.

సాధారణంగా క్రీడా సంఘాల్లో రాజకీయాలు ఉంటాయి. కానీ కొంత కాలంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ రాజకీయాలు సాధారణ రాజకీయాలను తలపిస్తున్నాయి.

ప్రస్తుత అధ్యక్షులు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఒక వర్గంగా.. మాజీ క్రికెటర్లు అర్షద్ ఆయూబ్, శివలాల్ యాదవ్ మరో వర్గంగా ఉన్నారు.

ఇది మార్చి 28న జరిగిన హెచ్‌సీఏ వార్షిక సమావేశంలో అజర్‌కు వ్యతిరేకంగా సభ్యులు బహిరంగంగా నినాదాలు చేసే వరకూ వెళ్లింది.

ఫొటో సోర్స్, HCA website

హెచ్‌సీఏలో ఏం జరుగుతోంది?

గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌పై ఎన్నో ఆరోపణలు వచ్చాయి.

ఆ క్రమంలో 2019 సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో మహ్మద్ అజారుద్దీన్ సంస్థ అధ్యక్షులుగా, విజయానంద్ కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

అప్పట్లో దాదాపు అన్ని వర్గాలూ అజారుద్దీన్‌కు మద్దతు ఇచ్చాయి. దీంతో హెచ్‌సీఏ ఎన్నికల్లో అజర్‌కు మంచి మెజార్టీ వచ్చింది.

కానీ ఆ తర్వాత పరిస్థితి తారుమారైంది. అజర్ వచ్చాక కూడా అసోసియేషన్ పరిస్థితిఏమీ మారలేదని, ఇంకా దిగజారిందనీ పలువురు బహిరంగంగా మాట్లాడడం మొదలుపెట్టారు.

అప్పట్లో మద్దతిచ్చిన వాళ్లలో కొందరు అజర్‌కు ఎదురు తిరిగారు.

అదే క్రమంలో ఈసారీ ఐపీఎల్ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా హైదరాబాద్‌కి దక్కలేదు. కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న ముంబయిలో కూడా ఐపీఎల్ జరుగుతుంటే, హైదరాబాద్‌లో మాత్రం మ్యాచ్‌లు జరగడం లేదు.

ఐపీఎల్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరగకపోవడంపై ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, FB/Hyderabad Cricket Association

లోక్‌సభలోనూ చర్చ

దానం నాగేందర్ బహిరంగంగా ఆ విషయం గురించి మీడియాతో మాట్లాడారు. ఇక టిఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు.

దీనికి కారణం అజర్ నిర్లక్ష్యమేనని ప్రత్యర్థులు ఆరోపించారు. ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు.

''ఐపీఎల్ నిర్వహణలో గత నాలుగు సీజన్లలో హైదరాబాద్‌కి ఉత్తమ మైదానం అవార్డులు వచ్చాయి. కానీ ఈసారి మ్యాచ్‌లు జరగకపోవడానికి కారణం హెచ్‌సీఏ నిర్లక్ష్యమే. ఇది సిగ్గుచేటు. బాధాకరం. టైం లేని వాళ్లు బాధ్యతలు తీసుకోకూడదు. సంఘానికి మళ్లీ ఎన్నికలు పెట్టాలి'' అని శివలాల్ యాదవ్ మీడియాతో అన్నారు.

అయితే, తన శక్తిమేరకు ప్రయత్నిస్తున్నానని అజర్ చెబుతున్నారు.

''నేను బీసీసీఐతో మాట్లాడాను. షెడ్యూల్ ఖరారు చేయక ముందు కూడా చర్చించాను. వాళ్లు చాలా అంశాలు పరిగణనలోకి తీసుకుంటారు. హైదరాబాద్‌కి మ్యాచ్‌లు ఎందుకు ఇవ్వలేదో నాకు తెలియదు. అది బోర్డుకే తెలియాలి. నేను శక్తిమేరకు ప్రయత్నం చేశాను'' అని అజారుద్దీన్ మీడియాతో అన్నారు.

నిజానికి, తాను హెచ్‌సీఏలో గత పాలకులు చేసిన లోపాలను చక్కదిద్దుతూ, బకాయిలు చెల్లిస్తూ సంఘాన్ని నిలబెడుతున్నానని అజర్ అంటున్నారు.

కేవలం ఐపీఎల్ మాత్రమే కాదు. తెలంగాణలో కొత్తగా ఏర్పడ్డ జిల్లాల్లో ఏర్పాటైన క్రికెట్ క్లబ్బులను కూడా గుర్తించకపోవడం వివాదంగా మారింది.

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్,

సభ్యులను వారిస్తున్న సంఘం అధ్యక్షుడు అజారుద్దీన్

సమావేశంలో గందరగోళం

ఈ క్రమంలో ఆదివారం హెచ్‌సీఏ 85వ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సభలో సభ్యులు అధ్యక్షుడు అజారుద్దీన్‌పై బహిరంగంగా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు.

అజర్ ఎంత సర్ది చెప్పినా ఎవరూ వినిపించుకోలేదు. వేదిక ముందు నిలుచుకుని నినాదాలు చేశారు.

మైకులో ఎవరు ఏం చెప్పినా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఏదీ స్పష్టంగా తేలకుండానే సభ ముగిసింది.

తిరిగి ఏప్రిల్ 11న సమావేశం కావాలని హెచ్‌సీఏ సభ్యులు నిర్ణయించారు.

ఫొటో సోర్స్, FB/Hyderabad Cricket Association

ఫొటో క్యాప్షన్,

మాజీ క్రికెటర్ అర్షద్ అయూబ్

ప్రక్షాళనకు దారేది

హెచ్‌సీఏలో ఈ వివాదాలు చాలా కాలం నుంచి ఉన్నాయి. వీటిని పరిష్కరించి, సంస్థను ప్రక్షాళన చేయడం కోసం కోసం గతంలో ఎన్నో కమిటీలు వేశారు. వాటిలో జస్టిస్ లోథా కమిటీ ఒకటి. ఇది సంస్థ పరిస్థితి మెరుగుపర్చడానికి కొన్ని సూచనలు కూడా చేసింది. కానీ వాటిని ఇప్పటికీ అమలు చేయలేదు.

లోథా కమిటీ నివేదిక ప్రకారం సంస్థలో ఒక అంబుడ్స్‌మెన్‌ను నియమించాల్సి ఉంది. కానీ మొన్న జరిగిన సమావేశంలో అది కూడా సాధ్యపడలేదు.

దీని వెనుక కూడా రాజకీయాలు ఉన్నాయి. అజర్ వర్గం దీనికి ఒక రిటైర్డ్ జడ్జి పేరు సూచిస్తే అర్షద్, శివలాల్ వర్గం మరో రిటైర్డ్ జడ్జి పేరు చెబుతున్నాయి. దీంతో అది ఎటూ తేలలేదు. ఇక మిగిలిన చాలా పోస్టుల విషయంలో కూడా సందిగ్ధత ఏర్పడింది.

ఇప్పుడు, ఏప్రిల్ 11న జరిగే సర్వసభ్య సమావేశంపైనే అందరి దృష్టి ఉంది.

ఫొటో సోర్స్, Twitter/Mohammed Azharuddin

''ఆరోజు సమావేశంతో సమస్యలన్నీ తొలగిపోతాయి అనుకుంటే పొరబాటే. ఇది ఒక్క రోజులో మారిపోయేది కాదు. ఇక్కడ క్రికెట్, రాజకీయాలు పెనవేసుకుపోయాయి. ఎవరేం చేసినా, టాలెంట్‌ను గుర్తించి హైదరాబాద్ క్రికెట్ పేరు నిలబెడితే చాలు'' అని హెచ్‌సీఏ సభ్యుల్లో ఒకరు బీబీసీతో అన్నారు.

''కమిటీల విషయంలో ఏం జరుగుతుందో అప్పుడే చెప్పలేం. తెలంగాణకు చెందిన ఒక మహిళా నాయకురాలికి కూడా ఈ అసోసియేషన్ రాజకీయాలపై ఆసక్తి ఉందని, త్వరలో ఆమె రావచ్చని అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో?'' అన్నారాయన.

తెలంగాణ రాష్ట్రంలో క్రికెట్ నిర్వహణను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) చూసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఈ వ్యవహారాలు చూస్తుంది.

ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా క్రికెట్ విషయంలో మాత్రం ఆంధ్ర, తెలంగాణకు వేర్వేరు సంఘాలు ఉండేవి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)