standing instruction: ఏప్రిల్ 1 నుంచి ఆటోమేటిక్ బిల్ చెల్లింపులు కుదరవా.. మేన్యువల్‌గా కట్టాల్సిందేనా

 • బళ్ల సతీశ్
 • బీబీసీ ప్రతినిధి
డెబిట్, క్రెడిట్ కార్డులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

డెబిట్, క్రెడిట్ కార్డులు

రేపటితో(ఏప్రిల్ 1) కొత్త ఆర్థిక సంవత్సరం వస్తోంది. విధానాల్లో ఎన్నో మార్పులు రాబోతున్నాయి.

డబ్బులు సంపాదించే, డబ్బులు ఖర్చు చేసే ప్రతీ ఒక్కరిపైనా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏదో ఒక ప్రభావం పడుతుంది.

ఇంతకీ ఈ కొత్త ఏడాదిలో వచ్చే మార్పులు ఏమిటి.. మార్పుల నేపథ్యంలో హైదరాబాద్‌కు చెందిన వ్యాపార, పెట్టుబడుల నిపుణులు నాగేంద్ర సాయి ఇచ్చిన సూచనలు చూద్దాం.

ఆధార్ - పాన్ లింక్:

 • పాన్ - ఆధార్ లింకు తప్పనిసరిగా చేసుకోవాలి. లేకపోతే రూ.10 వేల వరకూ జరిమానా పడే అవకాశం ఉంది. ఆన్ లైన్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా దీన్ని చేసుకోవచ్చు.
 • మీకున్న ఆస్తికీ, డబ్బుకూ, ఆదాయానికీ, సంబంధం లేదు. లింక్ చేయాల్సిందే.
 • పాన్ ఆధార్ లింక్ చేసినంత మాత్రాన టాక్స్ కట్టాల్సి రావడం అంటూ ఉండదు. మీరు సంపాదిస్తోన్న ఆదాయం, టాక్స్ కట్టాల్సిన పరిధిలో ఉంటే అప్పుడు టాక్స్ కట్టితీరాల్సిందే. అంతేకానీ దానికీ దీనికీ సంబంధం లేదు.
 • గతంలో లింక్ అయిపోయి ఉంటుంది అన్న నిర్లక్ష్యం వద్దు. ఇన్ కమ్ టాక్స్ వెబ్ సైట్ ద్వారా పాన్ ఆధార్ లింక్ అయ్యాయో లేదో చూసుకోవచ్చు.
 • పేరు, పుట్టిన తేదీ వంటివి తేడాలు ఉంటే ఆధార్‌లో సరిచేసుకుని, దాన్ని పాన్‌లో మార్పించుకోవాలి. సాధారణంగా పదో తరగతి సర్టిఫికేట్ దీనికి ప్రామాణికంగా తీసుకుంటే మంచిది. ఇప్పుడు వీటికి సమయం లేకపోయినా వీలైనంత త్వరగా చేసుకుంటే మంచిది.
 • ఇది మూడేళ్ల నుంచి నానుతోంది. సుప్రీంలో కేసులు కూడా దాఖలు అయ్యాయి. ఇక తప్పించుకునే ప్రయత్నం చేయడం వృథా.
 • బ్యాంకులో రూ.50 వేల కంటే ఎక్కువ మొత్తం వేయాలన్నా, 2 లక్షల కంటే ఎక్కువ డబ్బు పెట్టి వస్తువులు కొనాలన్నా, బ్యాంకు డిపాజిట్లలో టీడీఎస్ కట్ అవకుండా తీసుకోవాలన్నా.. అన్నిటికీ పాన్ కావాలి.
 • లింక్ చేయకపోతే పాన్ పోతుంది. కొత్తది తీసుకోవచ్చు అనుకోవద్దు. డబుల్ పాన్ ఉండడం నేరం. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీలో ఎలాగైనా పట్టేస్తారు.

ఫొటో సోర్స్, Nsdl

బ్యాంకింగ్ వ్యవస్థ:

 • స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ పనిచేయవు. అంటే మనం నెలవారీ కట్టాల్సిన బిల్లులు, ఇతర చెల్లింపులు మన ఏటీఎం కార్డులు లేదా క్రెడిట్ కార్డుల నుంచి ఆటోమేటిగ్గా కట్ అయ్యేలా చేసే ఏర్పాటును స్టాండింగ్ ఇనస్ట్రక్షన్స్ అంటారు. ఉదాహరణకు పోస్ట్ పెయిడ్ సెల్ బిల్లు, వీడియోలు చూసే ఓటీటీ బిల్లు వంటివి మన కార్డు నుంచి ఆటోమేటిగ్గా కట్ అయి, ఆటో రెన్యువల్ అవుతుంటాయి. ఇకపై అలా జరగవు. వాటిని మనమే మాన్యువల్‌గా చేసుకోవాలి.
 • అయితే ఈ నిబంధన ఈఎంఐలు, మ్యూచువల్ ఫండ్లు, ఎస్ఐపీలకు వర్తించదు.
 • ఈ నిబంధనపై పలు కంపెనీలు కేంద్రంతో, ఆర్బీఐతో మాట్లాడుతున్నాయి కానీ. అది తేలకపోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images

పన్నులు:

వ్యక్తిగత పన్నులకు కొత్త స్లాబ్‌లు వచ్చాయి. మీ ఆదాయాన్ని బట్టి వీటిలో మంచిదో ఎంచుకోవాలి. ''ఎవరో చెప్పారని డిపాజిట్లు చేయడం, ఎవరో చెప్పారని పెట్టుబడులు పెట్టడం కాదు. ఈ కొత్త ఏడాది నుంచి ఆర్థిక ప్రణాళిక సరికొత్తగా చేసుకోండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఇన్ కమ్ టాక్స్‌ను ఒక భాగంగా చేసుకోవాలి. అది మార్చి నెలాఖరులో హడావుడిగా చేసేది కాకూడదు. ప్లాన్ చేసుకోవాలి. ఏఏ సెక్షన్ల కింద మినహాయింపులు వస్తాయో గోల్స్ సెట్ చేసుకోవాలి'' అన్నారు నాగేంద్ర సాయి.

''ఒకటి వాస్తవం. ఈ దశాబ్దం గత దశాబ్దంలా ఉండదు. మన ఆర్థిక వ్యవస్థలో చాలా మార్పులు రాబోతున్నాయి. భారత్ మెచ్యూర్డ్ ఎకానమీ కాబోతోంది. దానికి సిద్ధమవ్వాలి. చట్టపరంగా వ్యవహరించాలి. ఎవరూ పన్ను తప్పించుకోకుండా ప్రభుత్వం దిగ్బంధం చేస్తోంది''.

ఫొటో సోర్స్, Getty Images

పెట్టుబడుల గురించి:

 • అందరూ తప్పనిసరిగా ముందుగా టెర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.
 • ఆ తరువాత హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.
 • అప్పుడు మిగిలన డబ్బు పెట్టుబడుల గురించి ఆలోచించాలి.
 • నేరుగా స్టాక్ మార్కెట్లే అక్కర్లేదు. 500 లేదా వెయ్యి రూపాయలతో మూచువల్ ఫండ్లో కూడా పెట్టొచ్చు.
 • భారతదేశంలో పీపీఎఫ్, సేవింగ్ స్కీమ్స్, ఎన్పీఎస్ వంటివెన్నో అవకాశాలున్నాయి. మీరు దానికి తగ్గట్టు ప్రణాళిక వేసుకోవచ్చు.

షేర్లు బాగా పెర్ఫార్మ్ చేయవచ్చు. వడ్డీ రేట్లు తగ్గుతాయి. ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుంది. ఇల్లు వడ్డీలు తక్కువ ఉన్నాయి. ఇల్లు కొనడానికి ఇది మంచి ఏడాది. అమెరికన్ మార్కెట్లు బావున్నాయి. డాలర్ బలపడుతోంది. బంగారంలో పెట్టుబడి పెట్టొచ్చ కానీ మొత్తం పెట్టుబడిలో 5-10 శాతం కంటే ఎక్కువ పెట్టకూడదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)