ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విరసం, ప్రజా సంఘాల నేతల ఇళ్లలో ఎన్ఐఏ సోదాలు

పౌరహక్కుల నేత రఘునాథ్ ఇంటి వద్ద పోలీసులు
ఫొటో క్యాప్షన్,

పౌరహక్కుల నేత రఘునాథ్ ఇంటి వద్ద పోలీసులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలువురు పౌర హక్కుల, ప్రజా సంఘాల నేతలు, విరసం సభ్యుల ఇళ్లలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) సోదాలు చేసింది.

హైదరాబాద్‌లో పౌర హక్కుల సంఘం తెలంగాణ ఉపాధ్యక్షుడు వి.రఘునాథ్ ఇంటిలో.. ఏపీలోని కడప జిల్లా ప్రొద్దుటూరులో విరసం రాష్ట్ర మాజీ కార్యదర్శి వరలక్ష్మి.. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సంఘం ఏపీ ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్.. అలాగే డప్పు రమేశ్, పలువురు ఇతర నాయకుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించారు.

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సంతోష్ నగర్‌లో ప్రజా కళా మండలి రాష్ట్ర అధ్యక్షుడు జాన్ నివాసంలోనూ ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు.

విశాఖపట్నంలోని పిఠాపురం కాలనీలో న్యాయవాది కె.పద్మ, చినవాల్తేరులో న్యాయవాది కె. ఎస్.చలం ఇళ్లలోనూ అర్ధరాత్రి వరకు సోదాలు జరిగాయి.

న్యాయవాది పద్మ ఇంటి నుంచి హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు, సెల్‌ఫోన్లు ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.

శ్రీకాకుళం జిల్లా పల్లిసారథి, రాజాంలలోనూ ఎన్ఐఏ సోదాలు జరిగాయి.

విశాఖ జిల్లా మంచంగిపుట్టులో 2020 నవంబరులో పోలీసులు అరెస్ట్ చేసిన మావోయిస్ట్ కొరియర్ పంగి నాగన్న కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ సోదాలు చేస్తోందని స్థానిక పోలీసులు చెబుతున్నారు.

ఈ ఏడాది మార్చి 7న ఈ కేసును ఏపీ పోలీసులు ఎన్ఐఏకి అప్పగించారు.

కాగా పోలీసులు అక్రమంగా సోదాలు చేస్తున్నారని పౌర హక్కుల సంఘం తెలంగాణ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావులు ఖండించారు.

తెలంగాణలో శిల్ప, దేవేంద్ర, కోటి.. ఏపీలో చిట్టిబాబు, పాణి తదితర నేతల ఇళ్లలో సోదాలు చేశారని లక్ష్మణ్ చెప్పారు.

సోదాలు, దాడులు ఆపి 142 సెక్షన్ ప్రకారం నోటీసులు ఇస్తే వివరణ ఇస్తామని.. అది సంతృప్తిగా లేకపోతే అరెస్ట్ చేయాలని సూచించారు. అంతేకానీ, కుటుంబసభ్యులను, చుట్టుపక్కలవారిని భయభ్రాంతులకు గురిచేసేలా ఇలా దాడులు, సోదాలు చేయడం తగదని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)