‘చైనాలో జర్నలిస్టులు నిజాలు రాస్తే ఏమవుతుందో నాకూ అదే జరిగింది' - బీబీసీ జర్నలిస్ట్ ఆవేదన

  • జాన్ సడ్వర్త్
  • బీబీసీ ప్రతినిధి
జాన్ సడ్వర్త్
ఫొటో క్యాప్షన్,

జాన్ సడ్వర్త్

చైనాలో జర్నలిస్టు అసలైన వార్తలు రాస్తే, ఏం జరుగుతుందో చివరికి నాకూ అదే జరిగింది. నేను, నా కుటుంబం ఆఖరి నిమిషంలో విమానాశ్రయానికి పరుగులు తీశాం. మేం ఇంట్లో ఆదరాబాదరాగా సామాన్లు సర్దుకుంటుంటే, సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులు మా ఇంటి బయట కాపు కాశారు.

వారు మమ్మల్ని విమానాశ్రయం దాకా వెంబడించారు. మేం చెక్-ఇన్ పూర్తి చేసుకునేవరకూ మమ్మల్ని అనుసరించారు.

చైనా ప్రచార సాధనాలు నేను అసలు చైనాలో ఎలాంటి ముప్పూ ఎదుర్కోలేదంటూ వీలైనంత బిగ్గరగా ప్రచారం సాగిస్తున్నాయి. మరోవైపు నేను ఎదుర్కొన్న ముప్పులు ఏంటో అవే బయటపెట్టాయి.

‘‘సడ్వర్త్ ఏ ముప్పూ ఎదుర్కొంటున్నట్లు తమకు తెలియదని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. అయితే, షింజియాంగ్‌ గురించి అపకీర్తి తెచ్చే కథనాలు రాసినందుకు ఎవరైనా వ్యక్తులు ఆయనపై కోర్టుకు వెళ్లవచ్చు’’ అని చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలో పనిచేసే, చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ వ్యాఖ్యానించింది.

ఈ వ్యాఖ్యలు చాలు భయపెట్టడానికి. ఎందుకంటే, చైనాలో మీడియా లాగే కోర్టులు కూడా కమ్యూనిస్టు పార్టీ చేతుల్లోని తోలుబొమ్మలే.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్,

పదేళ్ల కిందట ఆధికారం చేపట్టినప్పటి నుంచి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ నియంత్రణలను కఠినతరం చేస్తూ వచ్చారు.

బీబీసీ కథనాలను ‘అసత్య వార్తలు’గా వర్ణిస్తూ చైనా విదేశాంగశాఖ దాడులను కొనసాగించింది. గురువారం ప్రెస్ బ్రీఫింగ్ సమావేశంలోనూ ఇదే పనిచేసింది.

చైనాలోని షింజియాంగ్‌లో కార్ల ప్లాంటు నిర్వహణను కొనసాగించాలన్న నిర్ణయంపై ఫోక్స్‌వ్యాగన్ సంస్థతో ఇటీవల బీబీసీ చేసిన ఇంటర్వ్యూ వీడియో క్లిప్‌ను ఈ బ్రీఫింగ్‌లో ప్రదర్శించింది. ‘‘చైనా ప్రజలకు ఇలాంటి వార్తలే కోపాన్ని తెప్పిస్తాయి’’ అన్నట్లుగా మాట్లాడింది.

ఆ వాదనలోనే లోపం ఉంది. చైనాలో మా వార్తా ప్రసారాలపై నిషేధం విధించారు. మెజార్టీ ప్రజలు మా వార్తలే చూడలేరు. ఇక వారికి కోపం ఎలా వస్తుంది?

ఈ వ్యవహారం నన్ను ఇబ్బందుల మధ్య ఇక్కడ పనిని వదిలేలా చేసి ఉండొచ్చు. కానీ, ఇలా విదేశీ జర్నలిస్టులు ఇబ్బందుల మధ్య చైనాను వదిలి వెళ్లాల్సి రావడం ఇదే మొదటిసారి కాదని అందరూ గుర్తించాలి. గత కొన్నేళ్లలో ఇలాంటివి ఎన్నో జరిగాయి.

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్,

చైనాలోని గ్లోబల్ టైమ్స్ పత్రిక బీబీసీ గురించి ట్వీట్ చేసింది

ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో చైనా సభ్యత్వాన్ని ఆహ్వానిస్తూ... ‘‘ఆర్థిక స్వాతంత్యం స్వేచ్ఛకు సంబంధించిన అలవాట్లను సృష్టిస్తుంది. ఆ అలవాట్లు ప్రజాస్వామ్య ఆశలను చిగురింపజేస్తాయి’’ అని అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ అన్నారు.

ధనిక దేశంగా మారిన కొద్దీ, చైనాలో మరింత స్వేచ్ఛ వస్తుందన్న అంచనా ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. చైనాలో నేను పనిచేయడం మొదలుపెట్టినప్పటి (2012) నుంచి ఆ మాటలు వింటూనే ఉన్నా.

ఆ అంచనా ఎంత అమాయకమైందో ఆ ఏడాది జరిగిన పరిణామం మున్ముందు తెలిసొచ్చేలా చేసింది. అప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీకి షి జిన్‌పింగ్ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారు. ఆ దేశంలోనే అత్యంత శక్తిమంతమైన పదవి అది.

అంతర్జాతీయ వాణిజ్య ధోరణుల్లో కొన్నేళ్లుగా వచ్చిన మార్పులు నిస్సందేహంగా చైనాను మార్చాయి. అక్కడ ఆర్థిక, సామాజిక మార్పులకు బాటలు వేశాయి. కానీ, ప్రజాస్వామ్యపు ఆశలు మాత్రం అంతకంతకూ దూరమవుతూ పోయాయి.

అప్పటికే మొండిగా ఉన్న చైనా రాజకీయ వ్యవస్థను ఉపయోగించుకుని చైనా అధ్యక్షుడిగా ఈ పదేళ్ల కాలంలో షి జిన్‌పింగ్ దాదాపుగా సమాజంలోని ప్రతి అంశాన్నీ తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు.

ఈ క్రమంలోనే మీడియా రంగం ఓ యుద్ధ క్షేత్రంలా మారింది.

లీకైన చైనా కమ్యూనిస్టు పార్టీ అంతర్గత రహస్య పత్రం ‘డాక్యుమెంటర్ నెంబర్ 9’లో పత్రికా స్వేచ్ఛ సహా ‘పశ్చిమ దేశాల విలువల’ను లక్ష్యంగా చేసుకుని పోరాడాల్సి ఉందని పేర్కొనడం కూడా చూశాం.

షింజియాంగ్‌లో వాస్తవాలను బయటకు తీసే, కరోనావైరస్ సంక్షోభ సమయంలో చైనా వ్యవహరించిన తీరు గురించి ప్రశ్నించే, హాంకాంగ్‌లో చైనా నియంతృత్వ ధోరణులను వ్యతిరేకించేవారికి గొంతునిచ్చే విదేశీ మీడియా సంస్థల్లో దేనికైనా ఎదురయ్యే అనుభవమే బీబీసీకి కూడా ఎదురైంది.

ఫొటో సోర్స్, Twitter

ఫొటో క్యాప్షన్,

గ్లోబల్ టైమ్స్‌కు చెందిన ఒక రిపోర్టర్ ట్వీట్

నేను ఆ దేశం విడిచివెళ్తున్న నేపథ్యంలో చైనా దుష్ప్రచార దాడులు కొనసాగుతున్నాయి. ఈ ప్రచారానికి ప్రముఖ విదేశీ సోషల్ నెట్‌వర్క్ వేదికలను చైనా ఎక్కువగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయడం గమనార్హం.

ఓ వైపు చైనా విదేశీ సోషల్ మీడియాలను విపరీత ప్రచారానికి ఉపయోగించుకుంటున్న ఇదే సమయంలో... ఆ దేశంలో విదేశీ మీడియాకు చోటు కుంచించుకుపోతుండటం గమనార్హం.

ఆ దేశ దౌత్యవేత్తలు ట్విటర్ లాంటి వేదికలపై విదేశీ మీడియాపై విరుచుకుపడుతూ పోస్టులు పెడుతుంటారు. కానీ, ఆ దేశ పౌరులకు మాత్రం ఆ వేదికపై మాట్లాడే హక్కు ఉండదు.

ఆస్ట్రేలియా స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌లోని ఇంటర్నేషనల్ సైబర్ సెంటర్ పేర్కొన్నట్లుగా... వివిధ సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకుని సమన్వయంతో ఈ దాడులు జరుగుతుంటాయి.

చైనా ప్రభుత్వ మీడియా సంస్థలు విదేశీ సోషల్ మీడియా వేదికల్లో ఏ ఆంక్షలు లేకుండా పనిగట్టుకుని ప్రచారం చేసే తమ కథనాలను ప్రచురిస్తుంటాయి. కానీ, చైనా మాత్రం తమ దేశంలో ఏ స్వతంత్ర జర్నలిస్టునూ మాట్లాడనివ్వదు. విదేశీ ప్రసారాలను, వార్తా వెబ్‌సైట్లను సెన్సార్ చేస్తుంది. విదేశీ జర్నలిస్టులను చైనా సోషల్ మీడియా వేదికల్లోకి అనుమతించదు.

అసలు సమతుల్యమే లేని పోరాటం ఇది. కచ్చితమైన సమాచారం స్వేచ్ఛగా వెల్లడయ్యే అవకాశాలను దెబ్బతీసేది.

చైనాలో ఏం జరుగుతుందో అర్థం చేసుకునే అవకాశం కూడా ఇతరులకు ఇవ్వకుండా... మిగతా చోట్ల ప్రజాస్వామ్య గొంతుకను నొక్కేందుకు అదే పత్రికా స్వేచ్ఛను ఆయుధంగా ఉపయోగించుకుంటోంది చైనా.

ఫొటో క్యాప్షన్,

జాన్ సడ్వర్త్ బృందం 2020 చివరలో షింజియాంగ్ వెళ్లినప్పుడు వారిని వెంబడించారు, ఆ వీడియోలు తొలగించారు

షింజియాంగ్‌లో ఏం జరుగుతుందనేదానిపై కొన్నేళ్లుగా బయటకు వస్తున్న సమాచారానికి చైనా అంతర్గత పత్రాలు, ప్రచారం కోసం వారు రూపొందించుకున్న నివేదికలే ఆధారం.

ఓ డిజిటల్ సూపర్ పవర్‌గా చైనా మొత్తం సమాజంపైనే నిఘా పెట్టి నడిపిస్తోంది. ఈ క్రమంలోనే డిజిటల్ ప్రపంచంలో దాని అడుగుల ముద్రలు పడతాయి. వాటిని బయటకు తీయడమే జర్నలిస్టుల ముఖ్య ప్రయత్నంగా మారింది.

చైనాకు సంబంధించిన కథనాలను ఇప్పుడు తైపీ నుంచో, ఆసియాలోని ఇతర నగరాల నుంచో, మరో ప్రాంతం నుంచో రాయాల్సిన విదేశీ జర్నలిస్టుల్లో నేను కూడా ఇప్పుడు చేరిపోయాను.

సంఖ్య తగ్గిపోయినా... చైనాలోని వాస్తవాలను వెలికితీసేందుకు అక్కడ ధైర్యంగా, పట్టుదలతో కృషి చేస్తున్న విదేశీ జర్నలిస్టులు ఇంకా ఉన్నారు.

పెరుగుతున్న రాజకీయ బంధనాల మధ్య, ఆంక్షలను దాటుకుని తమ కథలను బయటకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్న చైనా పౌరులు కూడా ఉన్నారు.

వుహాన్‌లో ఏం జరిగిందనేది చాలా వరకూ బయటకు తెలిసింది ఇలాంటి పౌర పాత్రికేయుల వల్లే. కానీ, అలాంటి చర్యలకు వాళ్లు అక్కడ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది.

సాధారణ దుస్తులు ధరించిన ఈ పోలీసులు నన్ను వెంటాడటం బీజింగ్ విమానాశ్రయం హాల్‌తోనే ఆగిపోతుందన్న ఆశతోనే నేను ఉన్నా.

కానీ, ఈ పోరాటంలో అందరికన్నా ముప్పు ఎదుర్కొంటున్నది వాస్తవాలను బయటకు చెప్పేందుకు తపనపడుతున్న చైనా పౌరులేనన్న విషయం మనం మరిచిపోకూడదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)