ద గ్రేట్ ఎస్కేప్: ఛత్రపతి శివాజీ ఔరంగజేబ్‌ 'ఆగ్రా జైలు' నుంచి ఎలా తప్పించుకున్నారు

  • రేహాన్ ఫజల్
  • బీబీసీ ప్రతినిధి
శివాజీ

ఫొటో సోర్స్, Ranjit Desai

ఛత్రపతి శివాజీని ఎలాగైనా ఔరంగజేబ్ దర్బారుకు పంపించాలని దక్షిణాన ఔరంగజేబ్ వైస్రాయ్ మీర్జా రాజాసింగ్ కంకణం కట్టుకున్నాడు.

కానీ ఆయన్ను అక్కడికి పంపడం అంత సులభం కాదు.

పురందర్ ఒప్పందంలో మొఘల్ మన్సబ్ కోసం పనిచేయడానికి, రాజ దర్బారుకు వెళ్లడానికి ఒప్పుకునేది లేదని శివాజీ స్పష్టంగా చెప్పారు.

దానికి కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి.

ఔరంగజేబ్ మాటలపై శివాజీకి ఏమాత్రం నమ్మకం లేదు.

తన మాట నెగ్గించుకోడానికి ఔరంగజేబ్ ఎంతకైనా తెగిస్తాడని శివాజీ అనుకునేవారు.

ప్రముఖ చరిత్రకారుడు జదునాథ్ సర్కార్ తన 'శివాజీ అండ్ హిజ్ టైమ్స్‌' పుస్తకంలో ఆ ఘటన గురించి రాశారు.

"మీరు ఔరంగజేబ్‌ను కలిస్తే ఆయన తర్వాత మిమ్మల్ని దక్కనుకు వైస్రాయ్‌గా చేస్తారేమో, బీజాపూర్, గోల్కొండను ఆక్రమించుకోడానికి తన నాయకత్వంలో ఒక దళాన్ని పంపిస్తారేమో అని శివాజీని కలిసిన జయ్ సింగ్ ఆయనలో ఆశలు రేపారు. అయితే ఔరంగజేబ్ అలాంటి హామీలు ఏవీ ఇవ్వలేదు" అని చెప్పారు.

ఆగ్రా బయల్దేరిన శివాజీ

ఔరంగజేబ్‌ను కలిస్తే బీజాపూర్ నుంచి పన్ను వసూలు చేసుకోవడానికి ఆయన తనకు అనుమతి ఇస్తారేమోనని శివాజీ మనసులో అనుకున్నారు.

మరాఠా దర్బార్‌లో అదే విషయం మీద చర్చ జరిగినపుడు ఔరంగజేబ్‌ను కలవడానికి శివాజీ ఆగ్రా వెళ్తే బాగుంటుందనే అందరూ నిర్ణయానికి వచ్చారు.

దాంతో 1666 మార్చి 5న తల్లి జిజియాబాయికి రాజ్యం బాధ్యతలు అప్పజెప్పి, ఔరంగజేబ్‌ను కలవడానికి ఆగ్రా బయల్దేరారు శివాజీ.

శివాజీ భద్రత చూసుకునే బాధ్యతను జయ్ సింగ్ ఆగ్రాలో ఉన్న తన కొడుకు కుమార్ రాం సింగ్‌కు అప్పగించారు.

ఆగ్రా రావడానికి ఖర్చుల కోసం శివాజీకి ఔరంగజేబ్‌ లక్ష రూపాయలు ముందే చెల్లించే ఏర్పాట్లు కూడా చేశారు.

ఆ దారిలో ఉండగానే శివాజీకి ఔరంగజేబు నుంచి ఒక లేఖ అందింది.

ప్రముఖ చరిత్రకారుడు ఎస్ఎం పగాడీ తన 'ఛత్రపతి శివాజీ' పుస్తకంలో ఆ లేఖలోని వివరాల గురించి రాశారు.

"మీరు ఇక్కడకు ఎలాంటి సంకోచం లేకుండా రండి. మీ మనసులో ఎలాంటి ఆందోళన ఉంచుకోకండి. నన్ను కలిశాక మీకు రాచ మర్యాదలు జరుగుతాయి. మిమ్మల్ని తిరిగి గౌరవంగా ఇంటికి వెళ్లనిస్తాం. మీరు వేసుకోడానికి నేను ఖిలాత్ అంటే ఖరీదైన దుస్తులను కూడా పంపుతున్నాను" అని ఆ లేఖలో ఉంది.

ఫొటో సోర్స్, Penguin books

ఫొటో క్యాప్షన్,

ఔరంగజేబ్

శివాజీకి అవమానం

1666 మే 9న శివాజీ ఆగ్రా శివారు ప్రాంతానికి చేరుకున్నారు.

అప్పట్లో ఔరంగజేబ్ దర్బార్ అక్కడే ఉండేది.

మే 12న ఆయన ఔరంగజేబ్‌ను కలవాలని చెప్పారు.

దర్బారులో 'శివాజీ రాజా' అని గట్టిగా పేరు పిలవగానే, శివాజీ, ఆయన కొడుకు శంభాజీ, పది మంది అనుచరులను ఔరంగజేబ్ సభలోకి తీసుకెళ్లారు కుమార్ రాం సింగ్.

మరాఠా రాజ్యం తరఫున ఔరంగజేబ్‌కు 2 వేల బంగారు నాణాలు 'నజర్'గా, 6 వేల రూపాయల 'నిసార్‌'గా అందించారు.

శివాజీ.. ఔరంగజేబ్ సింహాసనం దగ్గరికి వెళ్లి ఆయనకు మూడుసార్లు సలాం చేశారు.

ఒక క్షణంపాటు సభ అంతా నిశ్శబ్దం అలుముకుంది.

ఔరంగజేబ్ తల ఊపి శివాజీ బహుమతులు స్వీకరించారు.

తర్వాత తన సహాయకుడి చెవిలో చక్రవర్తి ఏదో చెప్పారు.

దాంతో శివాజీని మూడో హోదాలో ఉండే మన్సబుదారుల కోసం అప్పటికే ఏర్పాటు చేసిన వరుసలోకి తీసుకెళ్లారు.

సభ ఎప్పటిలాగే నడుస్తోంది. కానీ, తనకు అలాంటి స్వాగతం లభిస్తుందని శివాజీ ఊహించలేదు.

ఫొటో సోర్స్, Ranjit Desa

బుసలుకొట్టిన శివాజీ కోపం

ఆ సమయంలో శివాజీ ఎలా స్పందించారో జదునాథ్ సర్కార్ తన పుస్తకంలో రాశారు.

ఆగ్రా బయట తనకు స్వాగతం పలకడానికి రామ్‌ సింగ్, ముఖ్లిస్ ఖాన్ లాంటి మామూలు అధికారులను ఔరంగజేబ్ పంపించడం శివాజీకి నచ్చలేదు.

సభలో తల వంచిన తన గురించి ఒక మంచి మాట చెప్పడం గానీ, ఆయనకు ఏదైనా బహుమతులు ఇవ్వడం గానీ చేయలేదు.

దానికి తోడు ఆయన్ను సాధారణ మన్సబుదారుల మధ్యలో ఎన్నో వరుసల వెనక నిలబెట్టారు.

అక్కడ నుంచి ఔరంగజేబ్ కూడా సరిగా కనిపించడం లేదు. అప్పటికే శివాజీ కోపం కట్టలుతెంచుకుంది.

ఆయన రామ్ సింగ్‌తో "నన్ను ఎవరి మధ్య తీసుకొచ్చి నిలబెట్టావ్" అని అడిగారు.

రాం సింగ్ ఆయనతో "మీరు పాంచ్ హజారీ(5 వేల మంది సైనికులకు అధిపతి) మన్సబ్‌దారుల మధ్య ఉన్నారు" అని చెప్పారు.

దాంతో శివాజీ బిగ్గరగా "నా ఏడేళ్ల కొడుకు, నా నౌకర్ నేతాజీ కూడా పాంచ్ హజారీలే. చక్రవర్తి అని గౌరవించి, అంత దూరం నుంచి ఆగ్రా వచ్చిన నన్ను వీళ్లతో పోల్చుతారా" అన్నారు.

తర్వాత శివాజీ "నా ముందు ఉన్నది ఎవరు" అన్నారు.

"రాజా రాయ్ సింగ్ సిసోడియా" అన్నాడు రాం సింగ్.

దాంతో శివాజీ గట్టిగా "రాయ్ సింగ్… రాజా జయ్ సింగ్‌ చేతి కింద వాడు. మీరు నన్ను వాళ్ల వరుసలో నిలబెడతారా" అని గద్దించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఔరంగజేబ్‌కు రాం సింగ్ వివరణ

ఔరంగజేబ్ పదేళ్ల పాలనపై 'ఆలంగీర్‌నామా' పుస్తకం రాసిన మొహమ్మద్ కాజిమ్ అందులో ఆ తర్వాత ఏం జరిగిందో రాశారు.

తనకు ఘోర అవమానం జరగడంతో రగిలిపోయిన శివాజీ రాం సింగ్‌తో గట్టిగట్టిగా మాట్లాడుతున్నారు.

ఆయన దర్బార్‌లో అలా మాట్లాడుతుండడంతో రాం సింగ్ కంగారు పడిపోయి శివాజీ కోపం చల్లార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ శివాజీ శాంతించలేదు.

కాసేపు అక్కడ నిలుచున్న శివాజీ తర్వాత ఆ వరుస నుంచి బయటికొచ్చి ఒక మూల కూర్చున్నారు.

శివాజీ గట్టిగా అరవడం విన్న ఔరంగజేబ్.. ఆ అరుపులేంటి అన్నారు. దాంతో రాం సింగ్ చాకచక్యంగా జవాబు చెప్పారు.

"సింహం అడవి జంతువు, అది ఇక్కడ ఉక్కపోతను భరించలేక, జబ్బు పడింది" అన్నారు.

క్షమించమని ఔరంగజేబ్‌ను కోరిన రాం సింగ్.. దక్కన్ నుంచి వచ్చిన మహానుభావ్‌కు చక్రవర్తి దర్బార్ నియమాల గురించి తెలీదని చెప్పారు.

దాంతో శివాజీని పక్కనున్న గదిలోకి తీసుకెళ్లి ఆయనపై పన్నీరు చల్లాలని ఔరంగజేబ్ చెప్పారు.

ఆయన కుదుటపడిన తర్వాత, దర్బారు ముగిసేవరకూ వేచిచూడకుండా శివాజీని నేరుగా ఆయన కోసం ఏర్పాటు చేసిన విడిది ప్రాంతానికి తీసుకెళ్లాలని సూచించారు.

ఫొటో సోర్స్, Penguin books

ఫొటో క్యాప్షన్,

ఔరంగజేబ్

శివాజీ ఉన్న భవనాన్ని చుట్టుముట్టారు

ఆగ్రా నగరం నాలుగు గోడల బయట జయ్‌పూర్ సరాయ్‌లో శివాజీకి విడిది ఏర్పాటు చేయాలని రాం సింగ్‌కు ఆదేశాలు అందాయి.

శివాజీ జయ్‌పూర్ నివాసంలోకి వెళ్లగానే, ఒక అశ్విక దళం ఆ ఇంటిని నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టింది.

కాసేపటికే మరికొందరు సైనికులు అక్కడికి చేరుకున్నారు. వాళ్లు తమ ఫిరంగులను భవనానికి ఉన్న ప్రతి తలుపు వైపూ గురిపెట్టారు.

కానీ సైనికులతో రహస్యంగా నిఘా పెట్టిన కొన్ని రోజులకు ఔరంగజేబ్‌కు శివాజీని చంపాలనే ఉద్దేశం లేదనే విషయం అర్థమైంది.

డెనిస్ కింకెడ్ తన 'శివాజీ ద గ్రేట్ రెబల్' పుస్తకంలో ఆ సమయంలో జరిగిన వాటి గురించి వివరించారు.

అయితే శివాజీకి తను ఉన్న ఆ భవనం నుంచి బయటకు వెళ్లడానికి అనుమతి లేదు.

కానీ అప్పుడు కూడా ఔరంగజేబ్ నుంచి ఆయనకు అప్పుడప్పుడూ గౌరవ సందేశాలు వస్తూనే ఉన్నాయి.

చక్రవర్తి ఆయనకు పండ్ల బుట్టల కూడా పంపించేవారు.

శివాజీ ఆ తర్వాత ఔరంగజేబ్ ప్రధాన వజీర్ ఉమ్‌దావుల్ ముల్క్‌కు ఒక సందేశం పంపించారు.

చక్రవర్తి నన్ను సురక్షితంగా తిరిగి పంపిస్తానని హామీ ఇచ్చారు. కానీ అది జరిగేలా ఏమాత్రం కనిపించడం లేదు అన్నారు.

తనను చంపించడానికి తగిన సాకు కోసం ఔరంగజేబ్ వేచిచూస్తున్నాడని, కోపంలో ఏదైనా చేసేలా తనను మెల్లమెల్లగా రెచ్చగొట్టాలనుకుంటున్నాడని శివాజీకి అర్థమైంది.

ఫొటో సోర్స్, Ranjit Desa

హఠాత్తుగా మారిన శివాజీ ప్రవర్తన

భవనంలో బందీలా ఉన్న శివాజీపై నిఘా పెట్టిన సైనికులకు ఆయన ప్రవర్తనలో హఠాత్తుగా మార్పు అనిపించింది.

ఆయన చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తోంది. తనకు కాపలాగా ఉన్న సైనికులతో ఆయన నవ్వుతూ సరదాగా మాట్లాడుతున్నారు.

సైనికాధికారులకు ఎన్నో బహుమతులు పంపిస్తున్నారు. ఆగ్రా వాతావరణం తనకు బాగా నచ్చిందని చెబుతున్నారు.

తన కోసం ఎన్నో తీపి వంటకాలు, పండ్లు పంపిస్తున్న చక్రవర్తికి చాలా రుణపడి ఉంటానని శివాజీ అనడం కూడా విన్నారు.

పాలన కార్యకలాపాలకు దూరంగా ఆగ్రా లాంటి సాంస్కృతిక నగరంలో ఉండడం చాలా హాయిగా ఉందని శివాజీ వాళ్లతో అన్నారు.

ఈలోపు ఔరంగజేబ్ గూఢచారులు ఆయనపై రాత్రింబవళ్లు నిఘా పెడుతూనే ఉన్నారు.

శివాజీ ప్రస్తుతం చాలా సంతృప్తిగా కనిపిస్తున్నారని వాళ్లు తమ చక్రవర్తికి ఒక సందేశం కూడా పంపించారు.

ఔరంగజేబ్‌కు మరింత నమ్మకం కలిగేలా, తన తల్లి, భార్య కూడా తన దగ్గరకు వచ్చి ఉండడానికి అనుమతిస్తారా అని శివాజీ చక్రవర్తికి ఒక సందేశం కూడా పంపించారు.

ఔరంగజేబ్ దానికి సరే అన్నారు.

తమ ఇంటి ఆడవాళ్లను బందీలుగా చేసే వ్యక్తి, ఎప్పటికీ పారిపోయే సాహసం చేయడని ఔరంగజేబ్‌కు మనసులో అనిపించింది.

కానీ, చక్రవర్తి అనుమతి లభించినా శివాజీ కుటుంబంలోని మహిళలు ఆగ్రాకు రాలేదన్నది వాస్తవం.

బహుశా, ఆ ప్రాంతంలో భారీ వర్షాల వల్ల వాళ్లు అంత సుదీర్ఘ ప్రయాణం చేయలేకపోయారని ఒక కారణంగా చెబుతారు.

కొన్ని రోజుల తర్వాత తనతోపాటూ వచ్చిన మరాఠా అశ్వికులను తిరిగి తమ రాజ్యానికి పంపించాలని శివాజీ.. చక్రవర్తికి సందేశం పంపించారు.

చక్రవర్తి స్వయంగా మరాఠా సైనికులను వదిలించుకోవాలని అనుకుంటున్నారు. శివాజీ స్వయంగా అలా అడిగేసరికి ఆయన సంతోషపడిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

శివాజీ

అనారోగ్యం సాకుతో...

తర్వాత తనకు అనారోగ్యంగా ఉందని శివాజీ సాకు చెప్పారు.

బయట కాపలా ఉన్న మొఘల్ సైనికులకు ఆయన మూలుగులు కూడా వినిపిస్తున్నాయి.

తన ఆరోగ్యం కుదుటపడాలని ఆయన ఇంటి బయట బ్రాహ్మణులకు, సన్యాసులకు ప్రతి సాయంత్రం బుట్టల్లో మిఠాయిలు, పళ్లు కూడా పంపించేవారు.

బయట కాపలా కాస్తున్న సైనికులు కొన్ని రోజులు బయటకు వెళ్తున్న బుట్టలను తనిఖీ చేశారు. తర్వాత వాళ్లు వాటిని పట్టించుకోవడం మానేశారు.

జదునాథ్ సర్కార్ తన పుస్తకం 'శివాజీ అండ్ హిజ్ టైమ్స్‌'లో ఆయన ఎలా తప్పించుకున్నారో వివరించారు.

1666 ఆగస్టు 19న శివాజీ బయట ఉన్న సైనికులకు తనకు చాలా అనారోగ్యంగా ఉన్నట్టు, పడుకున్నట్టు తెలిసేలా చేశారు.

తన విశ్రాంతికి భంగం కలిగించవద్దని, ఎవరినీ లోపలికి పంపించవద్దని చెప్పించారు.

అచ్చం తనలాగే కనిపించే తన సవతి సోదరుడు హీరాజీ ఫర్జాంద్‌కు తన బట్టలు, ముత్యాల హారం వేసి మంచంపై పడుకోబెట్టారు. శివాజీ కడియం ఉన్న ఆయన చెయ్యి మాత్రమే కనిపించేలా మిగతా శరీరం అంతా ఒక దుప్పటి కప్పేశారు.

శివాజీ, ఆయన కొడుకు శంబాజీ వెదుర్ల సాయంతో భుజాలపై మోసే ఒక పళ్ల బుట్టలో కూర్చున్నారు. దానిని కూలీలు భవనం నుంచి బయటకు తీసుకొచ్చారు.

కాపలా కాస్తున్న సైనికులు ఆ బుట్టలను తనిఖీ చేయాలనుకోలేదు. కూలీలు ఆ బుట్టలను నగరంలో నిర్మానుష్యంగా ఉన్న వీధుల్లోంచి తీసుకెళ్లారు. బయటకు చేరుకున్న తర్వాత కూలీలను తిరిగి పంపించేశారు.

శివాజీ, ఆయన కొడుకు బుట్టల్లోంచి బయటకొచ్చి ఆగ్రా నుంచి ఆరు మైళ్ల దూరంలోని ఒక గ్రామం చేరుకున్నారు.

అక్కడ ఆయన ప్రధాన న్యాయమూర్తి నీర్జీ రావ్‌జీ వాళ్ల కోసం ఎదురుచూస్తున్నారు.

ఔరంగజేబ్కు చెమటలు పట్టాయి

మరో చరిత్రకారుడు ఎస్ఎమ్ పగాడీ తన 'ఛత్రపతి శివాజీ'లో ఇదే ఘటన గురించి మరో విధంగా చెప్పారు.

"శివాజీ బుట్టలో దాక్కుని బయటికి వచ్చాడని అనుకోలేం. ఆయన పూర్తిగా నిస్సహాయ స్థితిలో బుట్టలో కూర్చునే లాంటి వ్యక్తి కాదు. ఆయన తొమ్మిదేళ్ల కొడుకు శంభాజీ కచ్చితంగా బుట్టలో కూర్చుని ఉంటాడు. కానీ శివాజీ కూలీ వేషంలో స్వయంగా ఆ బుట్ట మోసుకెళ్లి ఉంటారు" అన్నారు.

ఈలోపు హీరాజీ ఫర్జాంద్‌ రాత్రంతా, తర్వాత రోజు మధ్యాహ్నం వరకూ అలా పడుకునే ఉన్నారు.

గదిలోకి తొంగి చూసిన సైనికులకు ఆయన చేతికున్న శివాజీ బంగారు కడియం కనిపించేది.

దాంతో ఆయన అక్కడే పడుకుని ఉన్నారనుకునేవారు. నేల మీద కూర్చున్న మరో వ్యక్తి ఆయనకు మాలిష్ చేయడం కనిపించేది.

సుమారు 3 గంటల సమయంలో హీరాజీ ఒక నౌకరుతో కలిసి ఆ ఇంటి నుంచి బయటపడ్డారు.

వెళ్తూ వెళ్తూ "గట్టిగా అరవకండి, శివాజీకి ఆరోగ్యం సరిగా లేదు, ఆయనకు వైద్యం జరుగుతోంది" అని చెప్పారు.

కాసేపటికి శివాజీ గది నుంచి ఎలాంటి శబ్దాలూ రాకపోవడంతో సైనికులకు సందేహం వచ్చింది.

లోపలికెళ్లి చూస్తే అక్కడ ఎవరూ లేరు.

వారు, ఆ విషయం మొదట తమ నాయకుడు ఫలాద్ ఖాన్‌కు చెప్పారు.

షాకైన ఫలాద్ ఖాన్ ఔరంగజేబ్‌ దగ్గరకు వెళ్లి, ఆయన కాళ్లపై పడిపోయాడు.

ఆయన నోట "అంతా మాయ..మాయ.. శివాజీ అదృశ్యం అయిపోయాడు. ఆయన గాల్లో ఎగిరెళ్లారో లేక ఆయన్ను భూమి మింగేసిందో నాకు తెలీడం లేదు" అన్నాడు.

అది వినగానే ఔరంగజేబ్‌కు కూడా చెమటలు పట్టాయి. తన రెండు చేతులతో తల పట్టుకున్న ఆయన చాలాసేపటి వరకూ అలాగే కూర్చుండిపోయారు.

వెంటనే నలువైపులా తన సైనికులను పంపించి శివాజీ కోసం వెతికించారు.

అధికారులను పరుగులు పెట్టించారు. కానీ, వారందరూ వట్టి చేతుల్తో వెనక్కు వచ్చారు.

మరోదారిలో రాజ్‌గఢ్ చేరిన శివాజీ

శివాజీ తెలివిగా, మహారాష్ట్ర చేరుకోవడానికి పూర్తిగా భిన్నంగా ఉండే మార్గాన్ని ఎంచుకున్నారు.

నైరుతి దిశగా మాల్వా, ఖాన్‌దేశ్ మీదుగా వెళ్లడానికి బదులు, ఆయన తూర్పు దిశగా వెళ్లాలని అనుకున్నారు.

మధుర, అలహాబాద్, వారణాసి, పూరీ మీదుగా గోండ్వానా(ఒడిషా), గోల్కొండ దాటి తిరిగి రాజ్‌గఢ్ చేరుకున్నారు.

ఔరంగజేబ్ పట్టు నుంచి బయటకు వచ్చిన ఆరు గంటల్లోనే ఆయన మధుర చేరుకున్నారు.

అక్కడ శివాజీ తన జుట్టు, గడ్డం, మీసాలు తీయించుకున్నారు. ఒక సామాన్యుడి వేషంలో కాషాయ బట్టలు ధరించారు.

డిసెంబర్‌లో ఒక ఉదయం శివాజీ తల్లి జిజియాబాయి తన గదిలో ఒంటరిగా కూర్చుని ఉన్నప్పుడు.. ఆమె సేవకుడు లోపలికొచ్చాడు.

అమ్మా, ఒక సన్యాసి మిమ్మల్ని కలవాలని అంటున్నాడని చెప్పారు. ఆమె ఆయన్ను లోపలికి పంపించమని చెప్పారు.

ఆ సన్యాసి లోపలికి రాగానే, జిజియాబాయి కాళ్లకు నమస్కరించాడు.

ఆమె ఆయనతో "సాధువులు వేరే వారి కాళ్లపై ఎప్పటి నుంచి పడుతున్నారు" అన్నారు.

జిజియాబాయి తన చేతులతో పైకి లేపి, ఆ సాధువు ముఖం చూడగానే గట్టిగా 'శివాబా' అని అరిచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)