విశాఖ స్టీల్ ప్లాంట్‌: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో భారీ లాభాలు ఎలా సాధించింది..

  • లక్కోజు శ్రీనివాస్
  • బీబీసీ కోసం
విశాఖ ఉక్కు

ఫొటో సోర్స్, Getty Images

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంస్థ లాభ, నష్టాలను బేరీజు వేసుకుని చేస్తున్నది కాదని, అది ప్రభుత్వ విధానంలో భాగమని కేంద్రం చెప్పింది.

ప్రైవేటీకరణ అంశం తెర మీదకు వచ్చినప్పటి నుంచి ప్లాంట్‌లో అన్ని విభాగాల ఉద్యోగులు, కొందరు అధికారులు అందోళనలు చేస్తున్నారు.

ప్రతి రోజు స్టీల్ ప్లాంట్ దగ్గర నిరసన దీక్షా శిబిరాలు నిర్వహిస్తున్నారు.

ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా అందోళనలు చేస్తున్నారు.

అదే సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ఉత్పత్తి, అమ్మకాల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ భారీ లాభాలు ఆర్జిస్తోంది.

ఓవైపు ఉక్కు అందోళనలు తీవ్రమవుతున్న సమయంలో ఉత్పత్తిలో స్టీల్ ప్లాంట్‌ ఎలా రికార్డులు సాధిస్తోంది? లాభాలు ఆర్జించడం వెనుక కారణాలేంటి? ఈ విషయాలను బీబీసీ తెలుసుకునే ప్రయత్నం చేసింది.

ఫొటో సోర్స్, L srinivas

స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇదే బెస్ట్

2020-21 ఆర్థిక సంవత్సరం పూర్తైన సందర్భంగా ప్లాంట్ సీఎండీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాలుగు నెలల్లో లాభాలు వచ్చాయని తెలిపారు.

"2020-21లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ 18వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ నమోదు చేసింది. విశాఖ ఉక్కు చరిత్రలోనే ఇది రెండో అత్యధికం. ఈ ఆర్థిక సంవత్సరంలో స్టీల్ ప్లాంట్ 13శాతం వృద్ధి నమోదు చేసింది. చివరి నాలుగు నెలల్లో 740 కోట్ల రూపాయల నికర లాభం నమోదైంది. మార్చిలో 7 లక్షల 11 వేల టన్నుల ఉక్కును 3 వేల 300 కోట్ల రూపాయలకు విక్రయించాం. ఈ మార్చిలో కర్మాగారం చరిత్రలో అత్యధిక ఆదాయం వచ్చింది. గత గరిష్టంతో పోల్చుకుంటే ఇది 42శాతం అధికం" అని స్టీల్ ప్లాంట్ సీఎండీ పీకే రథ్ అన్నారు.

2019 మార్చిలో సాధించిన రూ. 2329 కోట్లు ఇప్పటి వరకూ రికార్డు అని ఆయన చెప్పారు.

అలాగే ఈ ఏడాది ఉక్కు అమ్మకాలు 4.45 టన్నులు, ఎగుమతులు 1.3 టన్నులు జరిగాయని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఇది 261 శాతం అధికం అన్నారు. రికార్డు ఫలితాలు సాధించిన కార్మికులు, సిబ్బంది, అధికారులను ఆయన అభినందించారు.

ఫొటో సోర్స్, L Srinivas

ఫొటో క్యాప్షన్,

విశాఖ స్టీల్ ప్లాంట్ సీఎండీ పీకే రథ్

వెనక్కి చూసుకునే అవసరమే లేదు

అంతే కాకుండా ఇప్పటి వరకు కుదుర్చుకున్న 57 ఓషన్ ఎక్స్ పోర్ట్ కాంట్రాక్టులో 35 కాంట్రాక్టులు వందశాతం అడ్వాన్సు తీసుకుని కుదుర్చుకున్నామని, ఎగుమతులు భారీ స్థాయిలో పెరగడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే ఉండదని సీఎండీ రథ్ తెలిపారు.

"ఇండియన్ రైల్వేకు అవసరమయ్యే ఫోర్జ్‌డ్‌ వీల్స్‌ను దేశీయంగానే తయారు చేసే ప్లాంట్‌ను ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలిలో నిర్మించాం. ఇది మరో వారం రోజుల్లో ఉత్పత్తి ప్రారంభిస్తుంది. ఇక్కడ నుంచి ఏడాదికి లక్ష వీల్స్‌ తయారవుతాయి. అలాగే రూ.10 కోట్లు సీఎస్ఆర్ కింద ఖర్చు చేశాం. ఇందులో 5 కోట్లు పీఎం కేర్స్ నిధికి కోవిడ్ సమయంలో అందించాం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న లక్ష్యాల్లో వనరుల ఉపయోగం, లోహ వ్యర్థాల వాడకం, విస్తరణ యూనిట్లలో ప్రగతి సాధించడం, మార్కెట్ పరిధిని మరింత విస్తృత పరచడం ఉన్నాయి" అని చెప్పారు.

ఫొటో సోర్స్, L Srinivas

ఫొటో క్యాప్షన్,

విశాఖ స్టీల్ ప్లాంట్

అప్పుడు లాభాలు, ఇప్పుడు నష్టాలు ఎందుకు...?

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి మొదలయ్యాక 2015 వరకు ఎప్పుడూ నష్టాలు రాలేదు. పైగా ఉత్పత్తిలో ఎన్నో రికార్డులను నెలకొల్పింది.

అయితే 2015 నుంచి 2020 మధ్య దాదాపు 5 వేల కోట్ల నష్టం వచ్చింది. ప్రధానంగా మూడేళ్లు భారీ నష్టాలు వచ్చాయి.

సంస్థ మొదటి నుంచి 2015 వరకు లాభాలు ఆర్జించిందని, అయితే 2015 నుంచి స్టీల్ ప్లాంట్..వరుస నష్టాల్లో కూరుకుపోయిందని పేరు చెప్పడానికి ఇష్టపడని స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.

"స్టీల్ ప్లాంట్ 2015-16లో 1420.64 కోట్లు, 2016-17లో 1263.16 కోట్లు, 2017-18లో 1,369.01 కోట్ల రూపాయల నష్టం చవిచూసింది. అయితే 2018-19లో 97 కోట్ల స్పల్ప లాభం రాగా...2019-20లో మళ్ళీ 3 వేల కోట్లు నష్టం వచ్చింది" అన్నారు.

స్టీల్ ప్లాంట్‌ నష్టాల్లో ఉండడానికి అనేక కారణాలున్నాయని ఆయన చెప్పారు.

"పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణాల్లో విశాఖ ఉక్కునే వాడారు. ప్రస్తుతం ఈ మార్కెట్ లేదు, మరోవైపు ఏపీ ప్రభుత్వం ఇసుక విధానంలో అవలంభించిన పాలసీల వల్ల కొన్నాళ్లు నిర్మాణ రంగం నెమ్మదించడం కూడా నష్టాలకు ఒక కారణం" అన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా స్టీల్ అమ్మకాలు తగ్గడం, ఇనుము, బొగ్గు ధరలు పెరగడం, ఆధునికీకరణ, విస్తరణ పనులకు పెద్దఎత్తున ఆర్థిక వనరులను సమీకరించాల్సి రావడం, సొంత గనులు లేకపోవడం కూడా ఈ నష్టాలకు కారణం అని ఆయన చెప్పారు.

ఇప్పుడు మళ్లీ స్టీల్ మార్కెట్ ఊపందుకుందని, ఇకపై ప్లాంట్ లాభాల్లోనే ఉంటుందన స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images

ప్రైవేటీకరణ మొదలైనట్లేనా...?

స్టీల్ ప్లాంట్‌లో కేంద్రం వాటాలను విక్రయిస్తారా అని పార్లమెంట్‌లో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు కేంద్రం 'అవును, వందశాతం వాటాలను విక్రయిస్తున్నా'మంటూ సమాధానం చెప్పింది.

దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ ఇక ఆగదని, కేంద్రం కచ్చితంగా ప్రైవేటీకరణ చేసి తీరుతుందనే విషయం స్పష్టమయ్యిందని ఏయూ ఎకనామిక్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ ప్రసాదరావు బీబీసీతో అన్నారు.

"ప్రైవేటీకరించే వ్యూహాల విషయంలో కేంద్రం దూకుడుగా ఉంది. విశాఖ ఉక్కు విక్రయంపై వివిధ మంత్రిత్వ శాఖలతో ప్రత్యేక బృందాన్ని నియమించింది. ఇది స్టీల్‌ప్లాంట్‌ విక్రయానికి విధి విధానాలను రూపొందిస్తుంది. ప్లాంట్ అమ్మకం ధరను నిర్ణయించి, లీడ్‌ బ్యాంకర్‌గా ఎవరిని నియమించాలో పరిశీలిస్తుంది. కేంద్ర ఆర్థిక, పరిశ్రమల శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, వారికి సహకరించేందుకు స్టీల్ ప్లాంట్‌కు చెందిన ఇద్దరు ముఖ్యమైన అధికారులు కూడా ఈ కమిటీలో ఉన్నారు. అలాగే కేంద్ర పెట్టుబడుల ఉపసంహరణ శాఖ (DIPAM) కూడా ఈ కమిటీతో కలిసి పని చేస్తుంది" అని వివరించారు.

ప్రస్తుతం లాభాల బాట పట్టిన ఉక్కు పరిశ్రమపై ఈ కమిటీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏమైనా సూచనలు ఇస్తుందేమో చూడాలనిన ప్రొఫెసర్ ప్రసాదరావు అన్నారు. అయితే, అలా ఇస్తుందని తనకు అనిపించడం లేదన్నారు.

ఫొటో సోర్స్, FB/ Mekapati Goutham Reddy

ఫొటో క్యాప్షన్,

సీఎం జగన్‌తో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

అమ్మితే...రాష్ట్రమే కొంటుంది: మేకపాటి

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా, దానిని కొనసాగించేలా ఇతర మార్గాలు చూడాలంటూ ఏపీ సీఎం జగన్ గతంలో ప్రధాని మోదీకి లేఖ రాశారు.

ప్రైవేటీకరణ చేయకుండా, విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలను తగ్గించేందుకు ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. అయితే, దానిపై కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు.

తాము ఇప్పటీకీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖలు రాస్తున్నామని, అఖిల పక్షంతో ప్రధానిని కలిసి దానిపై చర్చించడానికి సీఎం జగన్ కూడా సిద్ధంగా ఉన్నారని ఏపీ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి బీబీసీతో అన్నారు.

"ప్రైవేటీకరణ ఆపేందుకు చివరి అస్త్రంగా వైజాగ్ స్టీల్‌ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు రానుంది. దీనికి సీఎం కూడా అనుకూలంగా ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, ప్రజల సెంటిమెంటును గౌరవించి స్టీల్ ప్లాంట్ కొనేందుకు ఆలోచిస్తున్నాం. అయితే, కేంద్రం వాటాలను అమ్మితే టెండర్లు పిలుస్తుందా...? లేదా మరో విధంగా చేస్తుందా...? అనేది తెలీడం లేదు. టెండర్లు పిలిస్తే మాత్రం రాష్ట్రం కచ్చితంగా ఆ ప్రక్రియలో పాల్గొంటుంది" అని మంత్రి చెప్పారు.

ఫొటో సోర్స్, L Srinivas

ఫొటో క్యాప్షన్,

విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు వీహెచ్ సంఘీభావం

పబ్లిక్ సెక్టార్ ఉంటేనే రిజర్వేషన్లు: వీహెచ్

బీజేపీ ప్రభుత్వం అన్ని సంస్థలనూ ప్రైవేటీకరించాలని చూస్తోందని, త్వరలో ఈసీఎల్, బీహెచ్ఈఎల్, ఇండియన్ ఎయిర్ లైన్స్ ఇలా ఒక్కొక్కటి అమ్మేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అందోళనలు చేస్తున్న ఉద్యోగులకు ఆయన సంఘీభావం తెలిపారు.

"భారతదేశానికి పబ్లిక్ సెక్టార్ కంపెనీలు చాలా అవసరం. అవి ఉంటేనే రిజర్వేషన్లు ఉంటాయి. లేదంటే పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. అన్నీ అమ్మేందుకే మోదీ ప్రధాని అయ్యారు. ఆయన కార్పోరేట్ల చేతిలో కీలుబొమ్మగా వ్యవహరిస్తున్నారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెడితే, మాకేంటని మిగతా వాళ్లు అనుకోవద్దు. అందరూ కలిసి రావాలి. లేదంటే రేపు మీ ప్రాంతాల్లో ఉన్న కంపెనీల పరిస్థితి ఇలాగే అవుతుంది. ఈ విషయంలో రాజకీయ పార్టీలన్నీ కలిసి పోరాడాలి" అని అన్నారు వీహెచ్.

ఫొటో సోర్స్, L Srinivas

ప్రైవేటీకరణ ఆగేవరకు పోరాటం: యూనియన్లు

కేంద్రం తీసుకున్న ప్రైవేటీకరణ ప్రక్రియను కచ్చితంగా అడ్డుకుని తీరుతామని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు అంటున్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో ఉన్నా ప్రైవేటీకరణ ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.

ఉత్పత్తిపరంగా ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లాభాల బాటలోనే ఉందని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటి కన్వీనర్ అయోధ్య రామ్ బీబీసీతో అన్నారు.

"స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేస్తామంటే ప్లాంట్ ఉద్యోగులే కాదు, ప్రజలు కూడా ఊరుకోరు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రోజూ అందోళనలు చేస్తూనే ఉంటాం. ఈ నెల 4న ఆర్కే బీచ్ లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీచ్ వాక్, 18న కార్మిక సంఘాలతో మహాసభ నిర్వహిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయంపై పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నాం" అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)