అమెరికా క్యాపిటల్ భవనం వద్ద దాడి: పోలీసులపైకి కారు పోనిచ్చాడు.. కత్తితో దాడి చేయబోయాడు..

అమెరికా

ఫొటో సోర్స్, EPA

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలోని క్యాపిటల్‌ బిల్డింగ్‌ కాంప్లెక్స్‌ సమీపంలో ఓ వ్యక్తి జరిపిన దాడిలో ఒక పోలీస్ అధికారి మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

వేగంగా వచ్చిన ఒక కారు అక్కడున్న భద్రతా సిబ్బంది మీదికి దూసుకుపోయింది.

ఆ కారు నుంచి దిగిన వ్యక్తి పోలీసు అధికారుల మీద కత్తితో దాడికి ప్రయత్నించాడు.

పోలీసులు వెంటనే కాల్పులు జరపడంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు.

అయితే ఇది తీవ్రవాద దాడి కాకపోవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, US CAPITOL POLICE

ఫొటో క్యాప్షన్,

దాడిలో మరణించిన పోలీస్‌ అధికారి

అసలు ఎలా జరిగింది?

మధ్యాహ్నం సరిగ్గా ఒంటి గంటకు క్యాపిటల్‌ బిల్డింగ్‌లో ఉన్న కాంగ్రెస్‌ ప్రతినిధులకు ఒక మెయిల్‌ వచ్చింది.

దాడి జరిగే ప్రమాదం ఉందని, కిటికీలు, తలుపులకు దూరంగా వెళ్లాలని, ఒకవేళ ఎవరైనా బయట ఉంటే తమ మీద దాడి జరగకుండా జాగ్రత్తపడాలన్నది అందులోని సారాంశం.

సరిగ్గా అదే సమయంలో బ్లూ సెడాన్‌ కారులో వచ్చిన ఓ వ్యక్తి బారీకేడ్ల దగ్గర నిలబడి ఉన్న ఇద్దరు పోలీసు సిబ్బంది మీదికి కారును పోనిచ్చాడు.

కారు దిగి కత్తితో పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు.

"ఈ దాడికి కారణాలు ఏంటో విచారణ జరుపుతాం" అని వాషింగ్టన్ డీసీ మెట్రోపాలిటన్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ చీఫ్‌ రాబర్ట్ కాంటీ అన్నారు.

"మా సహచరుడొకరు ఈ కాల్పుల్లో మరణించారని చెప్పడానికి చింతిస్తున్నాను" అని యాక్టింగ్‌ క్యాపిటల్‌ పోలీస్‌ చీఫ్‌ యోగానంద పిట్‌మన్‌ అన్నారు.

ఫొటో క్యాప్షన్,

నిందితుడు వాడిన కారు

నిందితుడు ఎవరు ?

ఈ కాల్పులకు దిగిన వ్యక్తి నోవాగ్రీన్‌ అని గుర్తించామని, అతను ఇండియానా స్టేట్‌కు చెందిన వ్యక్తి అని, అంతకు మించి అతని గురించి ఎక్కువ సమాచారం లేదని ఈ కేసు విచారణలో పాల్గొంటున్న ఇద్దరు అధికారులు బీబీసీ న్యూస్‌ పార్ట్‌నర్‌ సీబీఎస్‌కు తెలిపారు.

ఇటీవలే తన ఉద్యోగం పోయిందని నోవాగ్రీన్‌ తన ఫేస్‌బుక్‌ పేజ్‌లో రాసుకున్నట్లు విచారణాధికారులు గుర్తించారు.

తాను డ్రగ్‌కు బానిసనని, దాని వల్ల కలిగిన సైడ్‌ ఎఫెక్ట్స్‌తో బాధపడుతున్నానని, చాలా ఇబ్బందుల్లో ఉన్నానని, ఆధ్యాత్మికతవైపు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నానని రాసుకొచ్చాడు.

'నేషన్‌ ఆఫ్‌ ఇస్లామ్‌' అనే జాతీయవాద మత సంస్థ పట్ల ఆకర్షితుడినయ్యానని కూడా నోవాగ్రీన్‌ ఫేస్‌బుక్‌ పేజ్‌లో పేర్కొన్నాడు.

ఈ ఫేస్‌బుక్‌ పేజి నోవాగ్రీన్‌దేనని పోలీసు అధికారులు బీబీసీకి చెప్పారు.

భద్రతా నిబంధనల ప్రకారం అతని ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఉన్న సమాచారాన్ని తొలగిస్తున్నామని వారు అన్నారు.

ఈ ఘటన తర్వాత క్యాపిటల్‌ బిల్డింగ్‌ వద్ద భద్రతను పెంచారు. దాడి జరిగిన సమయంలో భవనంలో కాంగ్రెస్‌ ప్రతిధినిధులు ఎక్కువమంది లేరు.

ఫొటో క్యాప్షన్,

దాడి ఘటన తర్వాత క్యాపిటల్‌ బిల్డింగ్‌ వద్ద భద్రత పెంచారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)