నాన్న హత్య కేసులో న్యాయం ఇంకెప్పుడు?- ప్రశ్నించిన వివేకా కుమార్తె-ప్రెస్‌ రివ్యూ

వై.ఎస్‌.వివేకానందరెడ్డి
ఫొటో క్యాప్షన్,

వై.ఎస్‌.వివేకానందరెడ్డి కుమార్తె సునితా రెడ్డి (ఫైల్‌ ఫొటో)

నాన్న హత్య కేసులో న్యాయం ఇంకెప్పుడు?- ప్రశ్నించిన వివేకా కుమార్తె

తన తండ్రిని దారుణంగా హత్య చేసి రెండేళ్లు దాటిపోయిందని, కానీ ఇప్పటిదాకా న్యాయం జరగలేదని, ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి ఉందని వై.ఎస్‌.వివేకా కుమార్తె డాక్టర్‌ సునీత అన్నట్లు ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం ఇచ్చింది.

శుక్రవారం దిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆమె రాజకీయ కారణాల వల్లే తన తండ్రి హత్య జరిగిందని, ఆంధ్రప్రదేశ్‌లో వై.ఎస్‌.జగన్‌ ప్రభుత్వం ఉన్నప్పటికీ దోషులను పట్టుకోలేకపోయారని ఆమె అన్నారు.

''మా నాన్న ఒక మాజీ ముఖ్యమంత్రికి సోదరుడు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌కు చిన్నాన్న. ఆయన సమితి ప్రెసిడెంట్‌ నుంచి మంత్రి వరకు అనేక పదవులు నిర్వహించారు. మా నాన్న కేసులోనే పరిస్థితి ఇలా ఉంటే , ఇక సామాన్యులకు న్యాయం ఎలా జరుగుతుంది?'' అని ఆమె ప్రశ్నించినట్లు ఈ కథనం పేర్కొంది.

తండ్రి హత్య విషయంలో ఏం జరిగిందో తెలుసుకుందామని ఒక సీనియర్‌ అధికారితో మాట్లాడితే 'కర్నూలు, కడపలో ఇలాంటి హత్యలు మామూలే కదా' అని తేలిగ్గా మాట్లాడారని డాక్టర్‌ సునీత అన్నారు.

తన తండ్రి హత్య కేసు విషయంలో పోరాటం మొదలుపెట్టిన తనకు బెదిరింపులు కూడా వచ్చాయని, నువ్వు డాక్టర్‌వు, ఇద్దరు పిల్లలున్నారు, వారి బాగోగులు చూసుకో. పోయిన వాళ్లు ఎలాగూ పోయారు, ఇంతటితో వదిలేయాలని, అలా కాకుండా పోరాడుతుంటే దాని ప్రభావం మీ పిల్లలపై పడుతుందని సున్నితంగా హెచ్చరించారని ఆమె వెల్లడించారు.

ఫొటో క్యాప్షన్,

పుచ్చకాయ విషతుల్యం కావడం వల్లే చిన్నారులు మరణించారని అనుమానిస్తున్నారు.

పుచ్చకాయ తిని చిన్నారులు మృతి

నిలువ ఉంచిన పుచ్చకాయ ముక్కలు తిని ఇద్దరు పిల్లలు చనిపోగా.. వారి తల్లిదండ్రులతోపాటు నానమ్మ అస్వస్థతకు గురయ్యారంటూ నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది.

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం విస్సంపేటకు చెందిన శ్రీశైలం,గుణవతి దంపతులు, వారి కొడుకులు పన్నెండేళ్ల శివానంద్‌, పదేళ్ల వయసున్న చరణ్‌తోపాటు శ్రీశైలం తల్లి ఒక రోజంతా నిల్వ ఉన్న పుచ్చకాయ ముక్కను తిన్నారు.

పుచ్చకాయ ముక్క తిన్న కాసేపటికే వారందరికీ విరోచనాలు మొదలయ్యాయి. అందరూ పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లారు.

పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. పెద్దలు ముగ్గురు మరో ఆసుపత్రిలో చేరారు.

శుక్రవారం తెల్లవారు జామున పరిస్థితి విషమించి చరణ్‌ మృతిచెందగా, తర్వాత కాసేపటికే శివానంద్‌ కూడా ప్రాణాలు కోల్పోయాడు.

శ్రీశైలం, గుణవతి, సారమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు.

కాగా, పుచ్చకాయ విషతుల్యం కావడం వల్లే మృతి చెంది ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నమస్తే తెలంగాణ పత్రిక వెల్లడించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

బెంగళూరు డ్రగ్స్‌ కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలకు సంబంధాలున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కర్ణాటకలో సంచలనం సృష్టిస్తున్న మత్తుమందుల కేసులో తెలంగాణ ప్రజాప్రతినిధుల ప్రమేయంపై బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారని ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది.

ఈ కేసులో ఇప్పటికే ఒక ఎమ్మెల్యే పేరు నిర్ధారణ కాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలకూ సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారని ఈ కథనం పేర్కొంది.

హైదరాబాద్‌లో జరిగిన మత్తుమందు పార్టీల్లో కూడా వీరు పాల్గొన్నారని, తానొక ఉద్యమకారుడినంటూ బెంగళూరు పోలీసులకు చెప్పుకున్న ఓ వ్యక్తి వీటిని సరఫరా చేసేవాడని పోలీసులు గుర్తించారు.

ఓ కన్నడ నటుడికి చెందిన బెంగళూరు హోటల్లో జరిగే మత్తు పార్టీలకు కూడా వీరు తరచూ హాజరయ్యేవారని తెలుస్తోంది. ఇదే కేసుకు సంబంధించి ఇప్పటికే ఒక చిన్నపాటి తెలుగు సినీ హీరోను రెండు రోజులపాటు విచారించి కీలక సమాచారం రాబట్టారు.

ఫిబ్రవరి 26న బెంగళూరు తూర్పు డివిజన్‌ పోలీసులు నవగరా సర్వీసు రోడ్డులో సినీ ప్రముఖులకు డ్రగ్స్‌ సరఫరా చేసేందుకు వచ్చిన నైజీరియాకు చెందిన హారిసన్‌, జాన్‌నాన్సోలను పట్టుకున్నారు.

వీరి నుంచి రూ. 4 కోట్ల విలువైన 350 గ్రాముల ఎండీఎంఏ గుళికలు, 4 గ్రాముల కొకైన్‌, 82 ఎక్స్‌టసీ మాత్రలు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దర్నీ ప్రశ్నించినప్పుడు మస్తాన్‌ చంద్ర అనే వ్యక్తిపేరు బైటికి వచ్చింది.

కన్నడ సినీ పరిశ్రమకు చెంది, అక్కడ బిగ్‌బాస్‌-4లో పాల్గొన్న మస్తాన్‌చంద్రను విచారించినప్పుడు తాను కేశవ్‌ అనే మరో వ్యక్తితో కలిసి పబ్బులు, హోటళ్లు, రిసార్టులు, అపార్ట్‌మెంట్లలో మత్తుమందు పార్టీలు నిర్వహిస్తామని వెల్లడించాడు.

ఇదే మస్తాన్‌చంద్ర బెంగళూరులో రియల్‌ ఎస్టేట్ వ్యాపారి శంకరగౌడకు డ్రగ్స్‌ సరఫరా చేశాడు.

శంకరగౌడ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు అక్కడ జరిగే పార్టీలలో తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేతో పాటు ఇంకొందరు పాల్గొన్నట్లు తెలిసింది. ఆ పరిచయంతోనే హైదరాబాద్‌లో పార్టీలకు కూడా శంకరగౌడ ద్వారా డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు తేలింది.

ప్రాథమిక ఆధారాలు సేకరించిన అనంతరం అనుమానిత ఎమ్మెల్యేలను విచారించనున్నారు. వీరిలో ఓ ఎమ్మెల్యేకు సంబంధించి ఇప్పటికే ఆధారాలు దొరికినట్లు, ఒకట్రెండు ఆయనకు నోటీసులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోందని ఈనాడు కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

బెజవాడలో బ్లేడ్‌ బ్యాచ్‌ల ఆగడాలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

బ్లేడ్‌ బ్యాచ్‌ వీరంగం- రూ.100 కోసం హత్య

బెజవాడలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు మళ్లీ పెచ్చుమీరుతున్నాయని, బుధవారం చిట్టినగర్ ప్రాంతంలో బ్లేడ్‌లతో దాడులు చేసుకున్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడని సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది.

నగరంలోని అజిత్‌సింగ్‌ నగర్‌ సమీపంలోని పైపులరోడ్డులో బ్లేడ్‌ బ్యాచ్‌ వీరంగం సృష్టించింది. దుర్గాబార్‌ వద్ద నలుగురు యువకులు బ్లేడ్‌లతో హల్‌చల్‌ చేశారు. యువకులు ఒకరిపై ఒకరు బ్లేడ్‌లతో దాడి చేసుకున్నారు.

ఈ ఘటనలో పండు అనే యువకుడు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

తొలుత వీరిని బ్లేడ్ బ్యాచ్‌గా భావించగా, తర్వాత పోలీసులు మద్యం మత్తులో ఇదంతా జరిగిందని చెప్పారు. మద్యం మత్తులో 100 రూపాయిల కోసం జరిగిన గొడవ కాస్తా పీకలు కోసుకునే వరకు వెళ్లిందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)