ఛత్తీస్‌గఢ్‌ ఎదురుకాల్పులు: ‘చనిపోయిన మావోయిస్టుల శవాలను, గాయపడిన వారిని నాలుగు ట్రాక్టర్లలో తీసుకెళ్లారు’ – సీఎం భూపేశ్ బఘేల్

మావోయిస్టులు

ఫొటో సోర్స్, Ani

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు అమిత్ షా.

మావోయిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు ప్రధానమంత్రి, కేంద్ర ప్రభుత్వం, దేశం తరఫున తాను నివాళులు అర్పిస్తున్నానని అమిత్ షా అన్నారు.

పోలీసుల త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందని ఆయన జగ్దల్‌పూర్‌లో చెప్పారు.

"మావోయిస్టులపై పోరాటం మరింత తీవ్రం అవుతుందని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నా. ఇందులో విజయం చివరికి మాదే అవుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా మారుమూల ప్రాంతాల్లో కూడా క్యాంపులను ఏర్పాటు చేశాం. దాంతో అసహనానికి గురైన మావోయిస్టులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు" అని అమిత్ షా చెప్పారు.

అమిత్ షాతో పాటు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కూడా సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

ఈ ఎన్‌కౌంటర్‌ నాలుగు గంటల పాటు కొనసాగిందని, మావోయిస్టులకు కూడా భారీ నష్టం జరిగిందని ఆయన చెప్పారు.

"ఎదురుకాల్పుల్లో చనిపోయిన వారిని, గాయపడిన వారిని మావోయిస్టులు నాలుగు ట్రాక్టర్లలో తీసుకెళ్లారని తమకు సమాచారం ఉంది" అని ఆయన చెప్పినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ తెలిపింది.

మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

అంతకుముందు, మావోయిస్టుల దాడిలో చనిపోయిన పోలీసులకు నివాళి అర్పించారు.

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా-బీజాపూర్‌ పరిధిలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన భారీ ఎదురుకాల్పుల్లో 22 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ నిన్న వెల్లడించింది.

బీజాపూర్ ఎస్పీ కమలోచన్‌ కశ్యప్‌ కూడా దీన్ని ధృవీకరించినట్లు ఏఎన్‌ఐ పేర్కొంది.

ఈ ఎదురుకాల్పుల్లో 25 నుంచి 30 మంది మావోయిస్టులు కూడా చనిపోయారని సీఆర్‌పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్ చెప్పారు.

నిఘా వైఫల్యం కానీ, బలగాల వైఫల్యం కానీ ఏమీ లేదని ఆయన చెప్పారు.

(ఈ కథనం అప్‌డేట్ అవుతోంది)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)