జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ - ప్రెస్ రివ్యూ

రఘరామకృష్ణంరాజు

ఫొటో సోర్స్, raghuramakrishnamraju

అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, ఆయన సహ నిందితుడు విజయసాయిరెడ్డిలకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైదరాబాద్‌ సీబీఐ ప్రత్యేక కోర్టులో పిటిషన్‌ వేసినట్లు ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఒక వార్తను ప్రచురించింది.

జగన్, విజయసాయిరెడ్డి చిన్న చిన్న సాకులతో కోర్టుకు రాకుండా తప్పించుకుంటున్నారని, బెయిల్‌ ద్వారా సంక్రమించిన స్వేచ్ఛను జగన్‌ దుర్వినియోగం చేస్తున్నారని రఘురామకృష్ణంరాజు తన పిటిషన్‌లో ఆరోపించారు.

బెయిల్‌ ఎందుకు రద్దుచేయాలో వివరిస్తూ 26 అంశాలను, ఉప అంశాలను పిటిషన్‌లో ప్రస్తావించారు. సీఎంగా జగన్‌ బాధ్యతలు స్వీకరించాక సాక్షులను ప్రభావితులను చేస్తున్నారని కోర్టుకు తెలిపారు.

అక్రమాస్తుల కేసుల్లో ఉన్న వ్యక్తి రాజ్యాంగ పదవిలో ఉంటూ అరాచక పాలన సాగించడాన్ని.. నిష్కళంకమైన పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన వ్యక్తిగా, నరసాపురం లోక్‌సభ సభ్యుడిగా రాజ్యాంగంపై ఉన్న గౌరవంతో.. సహించలేకపోతున్నానన్నారు.

సుప్రీంకోర్టుతీర్పు ప్రకారం.. పోలీసు దర్యాప్తులో భాగంగా ఎవరు పిటిషన్‌ వేసినా.. సాక్షులను ప్రలోభాలకు గురిచేస్తున్నారని లేదా ప్రభావితం చేస్తున్నారని భావిస్తే.. కోర్టులు సుమోటో గా బెయిల్‌ను రద్దు చేయవచ్చని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు.

కేసుకు సంబంధించిన వాస్తవాలు తెలిసినవాడిగా.. నిజాలు బయటకు వచ్చి..విచారణ త్వరితగతిన ముగియాలంటే ఆయన బెయిల్‌ రద్దు చేయాలని కోరారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ: ఐదు లక్షల రూపాయలను స్టవ్ మీద పెట్టి కాల్చేశాడు

తెలంగాణలో లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రావడంతో ఆ నోట్ల కట్టలను గ్యాస్‌స్టవ్‌పై పెట్టి ఓ వ్యక్తి తగలబెట్టేశాడంటూ ‘సాక్షి’ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం కోరంతకుంట తండా సర్పంచ్‌ రమావత్‌ రాములునాయక్‌ వెల్దండ మండలంలోని బొల్లంపల్లి గ్రామ శివారులో ఉన్న 15 హెక్టార్ల భూమిలో క్రషర్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి జనవరి 12న ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు.

అనంతరం ఫిబ్రవరి 16న భూమి సర్వేకు హాజరు కావాలని రాములునాయక్‌కు వెల్దండ తహసీల్దార్‌ కార్యాలయం నుంచి నోటీసులు పంపించారు. సర్వే కోసం రూ.6 లక్షలు ఇవ్వాలని తహసీల్దార్‌ సైదులు డిమాండ్‌ చేశారు.

దాదాపు నెల పాటు చర్చలు జరిగిన తర్వాత రూ.5లక్షలు ఇచ్చేందుకు రాములునాయక్‌ ఒప్పుకున్నారు. ఈ డబ్బులను మధ్యవర్తి, వెల్దండ మాజీ వైస్‌ ఎంపీపీ వెంకటయ్యగౌడ్‌కు ఇవ్వాలని తహసీల్దార్‌ సూచించారు.

దీంతో రాములు నాయక్‌ ఈనెల ఒకటో తేదీన మహబూబ్‌నగర్‌లోని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. వారి సూచన మేరకు మంగళవారం సాయంత్రం డబ్బులు ఇచ్చేందుకు కల్వకుర్తిలోని విద్యానగర్‌ కాలనీలో నివాసం ఉంటున్న వెంకటయ్యగౌడ్‌ ఇంటికి వెళ్లారు. అదే సమయంలో ఏసీబీ అధికారులు ఆ ఇంటిని చుట్టుముట్టారు.

ఏసీబీ అధికారులు వచ్చినా వెంకటయ్యగౌడ్‌ తలుపు తీయలేదు. ఇంటికి ఎవరో వచ్చారని స్థానిక పోలీసులకు ఫోన్‌ చేసి చెప్పారు. దీంతో అక్కడకు వచ్చిన పోలీసులు.. వారు ఏసీబీ అధికారులు అని తెలుసుకుని వెనుదిరిగారు.

అదే సమయంలో తాను దొరికిపోతాననే భయంతో వెంకటయ్యగౌడ్‌ వంటగదిలోకి వెళ్లి గ్యాస్‌స్టవ్‌పై డబ్బులు పెట్టి నిప్పంటించారు. వెంటనే మరో తలుపు నుంచి బయటకు పారిపోయేందుకు ప్రయత్నించారు.

ఇది గమనించిన ఏసీబీ అధికారులు తలుపులు బద్దలుకొట్టి లోపలకు వెళ్లి అతడిని పట్టుకున్నారు. కాలుతున్న నోట్లపై నీళ్లు చల్లి మంటలు ఆర్పారు. అయితే, అప్పటికే నోట్లన్నీ దాదాపు 70శాతం మేరకు కాలిపోయాయి.

ఫొటో సోర్స్, YS JAGAN/FB

‘ఏపీ నికర రుణ పరిమితి రూ. 42 వేల కోట్లు’

పదిహేనో ఆర్థిక సంఘం నిర్దేశించిన ఫార్ములా ప్రకారం ఆంధ్రప్రదేశ్ స్థూల జాతీయోత్పత్తిని 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.10,61,802 కోట్లుగా కేంద్రం అంచనా వేసిందని... ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్‌ నికర రుణ పరిమితి రూ. 42,472 కోట్లు దాటకూటదని స్పష్టం చేసిందని పేర్కొంటూ ‘ఈనాడు’ దినపత్రిక ఓ వార్త రాసింది.

బహిరంగ మార్కెట్‌, ఆర్థిక సంస్థల నుంచి బేరమాడి తీసుకునేవి, చిన్న తరహా పొదుపు మొత్తాలు, విదేశీ ఆర్థిక సాయం కింద కేంద్రం ఇచ్చే రుణం, ప్రావిడెంట్‌ ఫండ్‌, చిన్న మొత్తాల పొదుపు, రిజర్వు నిధులు, డిపాజిట్ల రూపంలో వినియోగించుకునే రుణం... ఇవన్నీ నికర రుణ పరిమితి పరిధిలోకే వస్తాయని కేంద్రం పేర్కొంది.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శికి కేంద్ర ఆర్థికశాఖ నాలుగు పేజీల సమగ్ర లేఖను పంపింది.

దీంతో పాటు రెండు రకాల ఫార్మాట్లను జత చేసింది. రాష్ట్ర ఆర్థిక, రుణ పరిస్థితి, డిస్కంల వివరాలను దానిలో నింపి తమకు పంపాలని, ఆ తర్వాత రిజర్వుబ్యాంకు నుంచి రుణం పొందేందుకు వీలు కల్పిస్తామని తెలియజేసింది.

పైగా స్థూల జాతీయోత్పత్తిలో నిర్దిష్టంగా కొంత మొత్తం మూలధన వ్యయంగా ఖర్చు చేయాల్సిందేనని పేర్కొంది. అలా ఖర్చు చేయని పక్షంలో నికర రుణ పరిమితిలో 0.50శాతం మేర కోత విధిస్తామని తెలియజేసింది.

ఫొటో సోర్స్, Getty Images

‘బార్లు, పబ్‌లపై ఆంక్షలు ఎందుకు విధించడం లేదు’

ప్రజారోగ్యం విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందంటూ ‘వెలుగు’ దినపత్రిక ఓ వార్త ప్రచురించింది.

కరోనా సెకండ్ వేవ్ వేగంగా ఉంటే పరీక్షల సంఖ్య నెమ్మదిగా పెంచుతామనడం ఏమిటని కోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. మీనమేషాలు లెక్కిస్తే ప్రజల ఆరోగ్య పరిస్థితులు చేజారే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

కరోనా పరీక్షలు, చికిత్స, కట్టడిపై ప్రభుత్వం ఇచ్చిన నివేదికను పరిశీలించిన హైకోర్టు.. పరీక్షల సంఖ్య ఎందుకు పెంచడం లేదని అడిగింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచకుండా ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్లు(ఆర్ఏటీ) మాత్రమే చేయడం ఏమిటని ప్రశ్నించింది.

మద్యం దుకాణాలు, బార్లు, పబ్లు, సినిమా టాకీస్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదని కూడా ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

వివాహాలు, అంత్యక్రియల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని... మాస్క్లు ధరించని వాళ్లకు జరిమానా విధించాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)