ఇండియన్ ప్రీమియర్ లీగ్: కరోనా సెకండ్ వేవ్‌లో ఐపీఎల్ సాఫీగా సాగుతుందా.. ఈ లీగ్ ముందున్న సవాళ్లు ఏమిటి

ఐపీఎల్‌లో ధోనీ

ఫొటో సోర్స్, Getty Images

ప్రపంచ క్రికెట్‌లో అత్యధికంగా కాసులు కురిపించే, అభిమానులను ఆకర్షించే లీగ్ ఐపీఎల్ అనడానికి పెద్దగా సందేహించక్కర్లేదు. ఆ ఐపీఎల్ 14వ సీజన్ శుక్రవారం మొదలనుకానుంది.

ఎనిమిది జట్లు మొత్తంగా 60 మ్యాచ్‌లు ఆడనున్నాయి. దేశ వ్యాప్తంగా ఆరు వేదికలు... చెన్నై, బెంగళూరు, దిల్లీ, ముంబయి, కోల్‌కతా, అహ్మదాబాద్‌ల్లో ఈ మ్యాచ్‌లు నిర్వహించబోతున్నారు. మే 30న జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ఈ సీజన్ ముగుస్తుంది.

అయితే, దేశంలో కరోనావైరస్ సెంకడ్ వేవ్ చెలరేగుతున్న సమయంలో ఈ లీగ్ ఎలా ముందుకు సాగుతుందోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

భారత్‌లో ఇప్పటివరకూ 1.65 లక్షల మందికిపైగా కోవిడ్‌తో మరణించారు. దాదాపు 12.5 కోట్ల మంది కరోనావైరస్ బారిన పడ్డారు.

ఇక ఇప్పుడు సెకండ్ వేవ్ మొదలయ్యాక ఈ ఏప్రిల్‌ ఆరంభం నుంచి రోజూ 90 వేలకుపైగా కేసులు వస్తున్నాయి. కరోనా నుంచి రక్షణ కోసం పాటించాల్సిన నిబంధనలను ప్రజలు విస్మరించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడినట్లు భావిస్తున్నారు.

అయితే, కోవిడ్ సంక్షోభం ఎలా ఉన్నా... ఐపీఎల్ 14వ సీజన్ ఏ సమస్యా లేకుండా సాగుతుందని భారత క్రికెట్ బోర్డు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా విశ్వాసం వ్యక్తం చేశారు.

ఆటగాళ్లకు, టోర్నీ నిర్వహణలో భాగమయ్యేవారి అందరి రక్షణ కోసం ‘బయో బబుల్స్’ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. వారికి క్రమం తప్పకుండా పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని అన్నారు.

అన్ని జాగ్రత్తలూ పాటిస్తూ, టోర్నీని ముందుకు నడిపిస్తామని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్,

కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న ముంబయిలో 10 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి

ఇప్పటికే నలుగురు ఆటగాళ్లు, ఓ జట్టు సలహాదారుడు కరోనావైరస్ పాజిటివ్‌గా తేలారు. టోర్నీ మొదలవ్వకముందే వారిని ఐసోలోషేన్‌లో ఉంచారు.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఓపెనర్ దేవ్‌దత్త్ పడిక్కల్ కోవిడ్ పాజిటివ్‌గా తేలి ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటునారు. ఆ తర్వాత దిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అక్షర్ పటేల్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆటగాడు నితీష్ రానా కూడా పాజిటివ్‌గా తేలారు. ఇక బయో బబుల్‌లో ఉన్న సమయంలోనే ముంబయి ఇండియన్స్ సలహాదారుడు కిరణ్ మూరెకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణైంది.

ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సభ్యుడు, ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ డేనియల్ శామ్స్‌ను చెన్నై వచ్చాక కరోనా పాజిటివ్‌గా గుర్తించారు.

ఈ సీజన్‌లో పది మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్న ముంబయిలోని వాంఖడే స్టేడియం సిబ్బందిలో పది మంది కూడా కరోనా పాజిటివ్‌గా తేలారు. ఇక కరోనావైరస్ సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగా ఉన్న ముంబయిలోనే వివిధ మైదనాల్లో ఇప్పుడు ఐదు జట్లు ప్రాక్టీస్ చేస్తున్నాయి.

మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించడం లేదు. అలాంటప్పుడు అసలు ఆరు వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించాల్సిన అవసరం ఏముందని సందేహం వ్యక్తం చేస్తూ... ‘ద టైమ్స్ ఆఫ్ ఇండియా’ దినపత్రిక ఓ కథనం రాసింది.

జట్లన్నీ తమకు కేటాయించిన సురక్షితమైన బబుల్స్ పరిమితిలోనే ఉంటున్నాయి. బయటివారిని ఎవరినీ కలవడం లేదు. నిబంధనల ఉల్లంఘనలు జరగకుండా ప్రతి జట్టుకూ ‘బబుల్ ఇంటెగ్రిటీ మేనేజర్స్’ను భారత క్రికెట్ బోర్డు నియమించిందని, ముంబయిలోని మైదాన సిబ్బందికి రెండు రోజులకోసారి పరీక్షలు చేస్తున్నారని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో వెబ్‌సైట్ పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

అక్షర్ పటేల్

అయితే, ఇలాంటి బబుల్స్‌ను నిర్వహించడం అంత సులభం కాదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఎనిమిది జట్లకు చెందిన దాదాపు 200 మంది ఈ బబుల్స్‌ పరిమితులు పాటించాల్సి వస్తోంది. సహాయ సిబ్బంది, జట్టు నిర్వహణ సిబ్బంది, వ్యాఖ్యాతలు, ప్రసార సిబ్బంది, మైదాన సిబ్బంది, ఇతర సిబ్బంది... ఇలా వీళ్లందరూ కూడా వేర్వేరు బబుల్స్ పరిధిలో ఉంటున్నారు.

ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసే స్టార్‌స్పోర్ట్స్ సంస్థకు చెందిన సుమారు 700 మంది సిబ్బంది, వందకుపైగా వ్యాఖ్యాతల కోసం ఎనిమిది ప్రత్యేకమైన బబుల్స్ ఏర్పాటు చేశారని హిందుస్థాన్ టైమ్స్ దినపత్రిక ఓ కథనంలో పేర్కొంది.

‘‘బోర్డు అధికారులు పెద్ద రిస్క్ తీసుకుంటున్నారు. ఒక్క బబుల్ దెబ్బతిన్నా, టోర్నీ అగమ్యగోచరంగా మారుతుంది’’ అని ఐపీఎల్ జట్టు మాజీ అధికారి ఒకరు బీబీసీతో అన్నారు.

అన్నీ సవ్యంగా ఉండేలా చూసుకుని, నియంత్రిత పరిస్థితుల్లో ఉంటే సీజన్‌ను విజయవంతంగా నిర్వహించవచ్చని గత ఏడాది యూఏఈలో జరిగిన సీజన్‌తోనే రుజువైందని భారత క్రికెట్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు.

గత ఏడాది ఐపీఎల్ యూఏఈలో జరిగినప్పటి కన్నా, భారత్‌లో ఇప్పుడు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. యూఏఈలోని మూడు నగరాల్లో ఈ మ్యాచ్‌లు జరిగాయి. ఆటగాళ్లు విమానంలో ప్రయాణించాల్సిన అవసరం రాలేదు.

ఫొటో సోర్స్, Getty Images

టోర్నీని రద్దు చేస్తే భారత క్రికెట్ బోర్డు ఆర్థికంగా చాలా నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది. గత ఏడాది సీజన్ రద్దైతే, మీడియా హక్కుల రూపంలోనే సుమారు రూ.3,700 కోట్లు బోర్డు కోల్పోవాల్సి వచ్చేదని ఓ సంస్థ అంచనా వేసింది.

‘‘ఇది భారీ మొత్తంలో డబ్బుతో ముడిపడి ఉన్న అంశం. దేశీయ క్రికెట్‌కు కూడా ఐపీఎల్ వల్ల చాలా డబ్బు వస్తుంది. కానీ, వ్యక్తిగతంగా టోర్నీ జరగకూడదన్నదే నా అభిప్రాయం’’ అని విజ్డెన్ ఇండియా అల్మనాక్ ఎడిటర్ సురేశ్ మేనన్ బీబీసీతో అన్నారు.

బబుల్స్‌లో అంతర్గతంగా పెద్ద స్థాయిలో కేసులు వస్తే, టోర్నీ రద్దు చేయాల్సి రావొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇప్పటి నుంచి 2022లో జరగాల్సి ఉన్న ఐపీఎల్ వరకూ భారత క్రికెట్ షెడ్యూలు తీరిక లేకుండా ఉంది. 14 టెస్టులు, 12 వన్డేలు, 22 టీ20లతో పాటు అక్టోబర్‌లో జరిగే వరల్డ్ టీ20 టోర్నీలోనూ భారత్ ఆడాల్సి ఉంది.

‘‘బబుల్స్‌ని సమర్థంగా నిర్వహించి, ఆటగాళ్లు క్రమశిక్షణగా నడుచుకుని, కాస్త అదృష్టం కూడా మనకు తోడైతే గండం గట్టెక్కుతామేమో. కానీ, మానసికంగా ఈ పరిస్థితులు ఆటగాళ్లను ఒత్తిడికి గురిచేయొచ్చు’’ అని అన్నారు సురేశ్ మేనన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)