మియన్మార్ సైనిక తిరుగుబాటు వ్యతిరేక నిరసనలు: ప్రముఖ మోడల్‌ను అరెస్ట్ చేసిన సైన్యం

మియన్మార్

ఫొటో సోర్స్, INSTAGRAM/@PAING_TAKHON

సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారిపై మియన్మార్ ఆర్మీ కఠిన చర్యలు తీసుకుంటోంది.

తాజాగా ప్రముఖ మోడల్, నటుడు పేయింగ్ తాఖోన్‌ను మిలటరీ అరెస్ట్ చేసింది.

మియన్మార్, థాయ్‌ల్యాండ్‌లలో తాఖోన్‌కు లక్షల సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఆన్‌లైన్ నిరసనల్లోనూ, ప్రత్యక్ష ర్యాలీల్లోనూ తాఖోన్ పాల్గొన్నారు.

తాఖోన్‌ను అరెస్ట్ చేయడమే కాకుండా లక్షలమంది ఫాలోవర్స్ ఉన్న ఆయన ఇస్టాగ్రాం, ఫేస్‌బుక్‌ అకౌంట్లను కూడా నిలిపేశారు.

ఈ ఏడాది ఫిబ్రవరి 1న మియన్మార్ ప్రభుత్వంపై సైన్యం తిరుగుబాటు చేసింది.

అప్పటినుంచి ఆ దేశంలో సైనిక తిరుగుబాటును నిరసిస్తూ అనేకమంది ఉద్యమాలు చేస్తున్నారు.

నిరసనలు చేస్తున్న వారిని సైన్యం అణిచివేసే ప్రయత్నాలు చేస్తోంది.

ఈ నిరసన ప్రదర్శనల్లో ఇప్పటివరకూ 600 మంది మియన్మార్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

ఫొటో సోర్స్, AFP

గురువారం ఏం జరిగింది?

గురువారం మియన్మార్ కాలమానం ప్రకారం 5.00 గంటల ప్రాంతంలో సుమారు 50మంది సైనికులు, ఎనిమిది మిలటరీ ట్రక్కులలో వచ్చి తాఖోన్‌ను అరెస్ట్ చేశారని ఆయన సోదరి థీ థీ ల్విన్ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో వెల్లడించారు.

తాఖోన్ గత కొద్దికాలంగా తీవ్ర డిప్రెషన్‌తో బాధపడుతున్నారని, శారీరకంగా కూడా బలహీనంగా ఉన్నారని.. "సరిగ్గా నిల్చోలేని, నడవలేని పరిస్థితుల్లో ఉన్నారని" ఆయన సన్నిహితులు చెప్పారు.

అయితే, తాను చేస్తున్న నిరసనల పర్యవసానం ఎలా ఉంటుందో తాఖోన్‌కు తెలుసునని, దానికి ఆయన ఏమాత్రం భయపడడం లేదని వారు తెలిపారు.

సైనిక తిరుగుబాటును వ్యతిరేకించిన సుమారు 100 మంది చిత్రనిర్మాతలు, దర్శకులు, నటులు, సెలిబ్రిటీలు, జర్నలిస్టులకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

ఈ వారం మొదట్లో ఆ దేశంలోని ప్రసిద్ధ హాస్యనటుడు జార్గనర్‌ను అరెస్ట్ చేశారు.

'అనిల్‌ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలు చాలా తీవ్రమైనవి.. సీబీఐ విచారణ అవసరం' -సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, FACEBOOK / ANIL DESHMUKH

మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు.

ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై బాంబే హైకోర్టు ఇటీవల సీబీఐ విచారణకు ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాలను నిలిపేయాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం, అనిల్ దేశ్‌ముఖ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

అయితే, ఆ అప్పీల్‌ను గురువారం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.

'ఆరోపణలు చాలా తీవ్రమైనవి.. సీబీఐ విచారణ అవసరం' అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ఫొటో సోర్స్, PRATIK CHORGE / HINDUSTAN TIMES VIA GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

అనిల్ దేశ్‌ముఖ్, పరమ్‌బీర్ సింగ్

ఇదివరకేం జరిగింది

ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ గతంలో అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు చేశారు.

అనిల్ హోంమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెల 100 కోట్ల రూపాయల రికవరీ లక్ష్యాన్ని పోలీసు ఉన్నతాధికారులకు విధించారని ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

మొదట పరమ్‌బీర్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణ జరపించాలని కోరారు.

అయితే, సుప్రీంకోర్టు ఆయన్ను బాంబే హైకోర్టులో అప్పీల్ చేసుకోమని చెప్పింది.

బాంబే హైకోర్టు అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ విచారణ జరపాలని ఆదేశించింది.

హైకోర్టు ఆదేశాల తరువాత అనిల్ దేశ్‌ముఖ్ తన హోంమంత్రి పదవికి రాజీనామా చేశారు.

అయితే, తాను నిర్దోషినని చెప్తూ సుప్రీంకోర్టులో ఆయన అప్పీల్ చేసుకున్నారు.

అనిల్ దేశ్‌ముఖ్‌కు మద్దతిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఆయనపై సీబీఐ విచారణ నిలిపివేయాలని సుప్రీంకోర్టును కోరింది.

మహారాష్ట్ర తరుపున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి, అనిల్ దేశ్‌ముఖ్ తరుపున మరొక సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ కోర్టులో వాదించారు.

గురువారం జరిగిన విచారణలో.. హోంమంత్రి కుడిభుజం అయిన పోలీస్ కమిషనర్ అనిల్ దేశ్‌ముఖ్‌పై అవినీతి ఆరోపణలు చేశారని, వాటిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)