వైయస్ షర్మిల కొత్త పార్టీ ప్రకటనతో పాటు, ఖమ్మం సభలో ఇంకా ఏం ప్రకటించారంటే..

Sharmila Reddy

ఫొటో సోర్స్, fb/IMSharmilaReddy

వైయస్ షర్మిల కొత్త పార్టీ పెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

అంతే కాదు, పార్టీ అధికారిక ప్రారంభానికి ముందే తెలగాణ రాష్ట్రంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగబోతున్నారు షర్మిల.

ఖమ్మం పట్టణంలో మొదటిసారి బహిరంగ సభ నిర్వహించి జూలై 8న పార్టీ పెడుతున్నట్టు తెలిపారు.

తనపై వస్తున్న పలు ప్రశ్నలు, విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు.

తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేలా వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 15 నుంచి నిరాహార దీక్ష చేయబోతున్నట్టు వైయస్ షర్మిల ప్రకటించారు.

తాను నిరాహార దీక్ష ప్రారంభించిన మూడవ రోజు నుంచి జిల్లా కేంద్రాల్లో తమ కార్యకర్తలు రిలే దీక్షలు చేస్తారని ఆమె తెలిపారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదనీ, తనదీ తెలంగాణనే అనీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

తన ప్రసంగంలో ఎక్కడా సోదరుడు జగన్ ప్రస్తావన తీసుకురాలేదు.

వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో వాటిని నిర్లక్ష్యం చేస్తున్నారని ఆక్షేపించారు.

కేసీఆర్‌ది కుటుంబ పాలన అనీ, అహంకార పూరిత పాలన, అవినీతి పాలన అనీ షర్మిల విమర్శించారు.

ఫొటో సోర్స్, IMSharmilaReddy

షర్మిల వ్యాఖ్యల్లో కొన్ని:

 • తెలంగాణ ఆత్మగౌరవం దొర ఎడమ కాలి చెప్పుకింద పడి నలుగుతోంది.
 • బరాబర్ తెలంగాణలో నిలబడతా, ప్రజల కోసం కొట్లాడతా.
 • సింహం సింగిల్‌గానే వస్తుంది.
 • దొర చెప్పిందే వేదం. దొర నంది అంటే నంది, పంది అంటే పంది. దొరా.. బాంచెన్.. అంటూ సాగిలపడిన వాళ్లకే రాజకీయ భవిష్యత్‍ ఉంటోంది.
 • మూడు (టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ) పార్టీలకు గురిపెట్టిన ప్రజాబాణం నేను. టీఆర్‍ఎస్ ​చెప్తే రాలేదు. బీజేపీ అడిగిందని రాలేదు. కాంగ్రెస్ ​పంపితే రాలేదు. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే వస్తున్నాం.
 • తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా వదలుకోం.
 • ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరికి ఇష్టమున్నా లేకున్నా నేను తెలంగాణ బిడ్డనే.
 • ఇక్కడి గాలి పీల్చా, నీళ్లు తాగా, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదివా. ఇక్కడే కొడుకును, కూతుర్ని కన్నాను. అలాంటి నాకు తెలంగాణపై ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది?
 • కేసీఆర్ పాలన అంతా దొరగారి బంధువులకే అప్పగించారు. అన్ని పదవుల్లో వాళ్ల కుటుంబ సభ్యులే ఉన్నారు. కేసీఆర్ చుట్టూ భజన బ్యాచే ఉంది.
 • నేను అడుగు పెట్టని సచివాలయం ఎందుకంటూ దానిని కూడా కూల్చేశారు.
 • ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్ తల, తోక తీసేసి రీ- డిజైనింగ్​ పేరుతో రూ.30 వేల కోట్ల ప్రాజెక్టును రూ.1.30 లక్షల కోట్లకు పెంచేశారు. ఇది అవినీతి కాదా?
 • ఇంట్లో ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుంటేనే ఉద్యోగం వస్తుందని జనం అనుకుంటున్నారు. రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేటందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది?

ప్రజలు ఆశీర్వదిస్తే రాజన్న రాజ్యం అందిస్తామని, లేదంటే ప్రజల తరపునే ఉండి కొట్లాడతామని అన్నారు.

తెలంగాణలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే పార్టీయే లేదని, కాంగ్రెస్ అమ్ముడుపోయిందని, బీజేపీకి మతం తప్ప ఇంకేం లేదని ఆరోపిస్తూ ఆ ఖాళీని పూడ్చడానికే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు షర్మిల తెలిపారు.

ఫొటో సోర్స్, IMSharmilaReddy

దీక్ష వివరాలు:

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య గురించి విస్తృతంగా మాట్లాడిన షర్మిల తన మొదటి ప్రత్యక్ష కార్యాచరణగా ఇదే సమస్యను ఎంచుకున్నారు.

తక్షణం ఒక లక్షా 91వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వేయాలని, లేదంటే ఏప్రిల్ 15 నుంచి నిరాహార దీక్ష చేపడతానని షర్మిల ప్రకటించారు.

వ్యవసాయ సమస్యలు రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడారు. కౌలు రైతులను అసలు గుర్తించడం లేదన్నారు.

వివిధ వృత్తులు, కులాలు, ప్రాంతాల వారీగా పలు సమస్యలను ప్రస్తావించారు.

రాయలసీమ, తెలంగాణల మధ్య నీటి సమస్యలపై పలువురు షర్మిల వైఖరిని ప్రశ్నిస్తోన్న నేపథ్యంలో.. తెలంగాణకు రావాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా వదలనని ఆమె చెప్పారు.

జగన్ పేరు వినగానే హర్షధ్వానాలు

ఈ సభలో షర్మిల కంటే ముందు వైయస్ విజయలక్ష్మి మాట్లాడారు. భావోద్వేగ పూరిత ప్రసంగం చేశారామె.

అంతుకు ముందు వేదిక పక్కన వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించినప్పుడు షర్మిలను వేదికపై ముద్దాడి ఆశీర్వదించారామె.

తన బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాని, ప్రజలకు తమ కుటుంబం ఎప్పటికీ రుణ పడి ఉంటుందని అన్నారు.

మాట తప్పని అందర్నీ ఆదరించే రాజశేఖర రెడ్డి లక్షణాలు షర్మిలలో ఉన్నాయన్నారు.

‘‘బహుశా షర్మిల ఇలా రాజకీయాల్లోకి రావాలన్నది దేవుడి కోరికేమో! అందుకే అప్పుడు షర్మిళ చేత పాదయాత్ర చేయించాడు దేవుడు’’ అన్నారు విజయలక్ష్మి.

ప్రస్తుతం షర్మిల తెలంగాణ సమస్యలను అధ్యయనం చేస్తోందని, తెలంగాణ ప్రముఖుల గురించి చదువుతోందని ఆమె చెప్పారు.

ఆమె ప్రసంగంలో భాగంగా జగన్ పేరు ఎత్తగానే సభలో పెద్ద ఎత్తున హర్షధ్వానాలు వినిపించాయి.

జగన్ పేరెత్తని షర్మిల

షర్మిల తన ప్రసంగంలో ఎక్కడా వైయస్ జగన్మోహన రెడ్డి పేరు ప్రస్తావించలేదు.

ఆద్యంతం రాజశేఖర రెడ్డి చుట్టూనే ఆమె ప్రసంగం సాగింది. సభకు ఆమె తల్లి విజయలక్ష్మితో పాటూ, మరో బంధువు కూడా హాజరయ్యారు.

సభకు వచ్చే ముందు హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకూ వందల కార్లతో ఊరేగింపుగా వచ్చారు. దారిలో పలుచోట్ల ఆగి స్వాగతం అందుకున్నారు.

ఈ సభ కోసం ఆమె పసుపు రంగు నేత చీర ధరించారు. తండ్రి రాజశేఖర రెడ్డి పెట్టుకునే వాచీ పెట్టుకున్నారు.

మెరిసే లేత నీలి రంగు (స్కై బ్లూ) జెండాలపై వెండి రంగులో ఉన్న తెలంగాణ మ్యాపులో రాజశేఖర రెడ్డి, షర్మిళ ఒకే రకంగా చేయి ఊపుతున్న ఫోటోలు వేదిక ప్రాంగణం అంతా కనిపించాయి.

జెండాలన్నీ ఇలానే ముద్రించారు. వాటిపై వైయస్ షర్మిల రెడ్డి అని తెలిసేలా ఇంగ్లిష్‌లో 'వైయస్ యస్ ఆర్' అని రాశారు. ఆమెపై తెలుపు, నీలం కాగిత పూల వర్షం కురిపించారు.

సభలో గాయకుడు ఈపూరి సోమన్న పాటలు అలరించాయి.

సభకు కొందరు వైయస్సార్సీపీ జెండాలు తీసుకువచ్చారు. జై జగన్ నినాదాలు చేశారు.

షర్మిల సీఎం అంటూ నినాదాలు చేశారు. షర్మిల కేసీఆర్‌పై చేసిన విమర్శలకు గట్టిగా చప్పట్లు కొట్టారు.

సభకు తెలంగాణలో వేర్వేరు ప్రాంతాల వారు హాజరయినప్పటికీ, ప్రధానంగా ఖమ్మం నుంచే ఎక్కువ మంది వచ్చారు.

ఫొటో సోర్స్, IMSharmilaReddy

ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకూ పాత జిల్లాల వారీగా తెలంగాణ నాయకులను కలసి రివ్యూలా నిర్వహించారు షర్మిల. అలా 9 జిల్లాలు పూర్తయ్యాయి.

ఖమ్మంలో మాత్రం రివ్యూలా కాకుండా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. దీనికి 'సంకల్ప సభ' అని పేరు పెట్టారు.

షర్మిల వేదికపై నుంచి కాకుండా, కాస్త కిందకు.. జనం మధ్యకు వచ్చి మాట్లాడేలా పొడవాటి దారి ఏర్పాటు చేశారు.

కానీ, జనం మూగడం వల్ల సాధ్యపడలేదు. తిరిగి వేదిక పైకి ఎక్కి మాట్లాడారు.

వేదిక మీదకు రాగానే ఆ చివర నుంచీ ఈ చివర వరకూ, ప్రత్యేకంగా జనం మధ్యలో ఏర్పాటు చేసిన వేదిక వరకూ నడుస్తూ అభివాదం చేశారు విజయలక్ష్మి, షర్మిల.

నిన్నటి సభతో షర్మిల జిల్లాల వారీగా ఏర్పాటు చేసిన సమావేశాలు పూర్తయినట్టే.

2014లో రాష్ట్రం విడిపోయే సమయంలో జరిగిన ఎన్నికల్లో సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం ఖమ్మం జిల్లాలోనే 3 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీటు వచ్చాయి.

పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆ పార్టీకి ఎంపీగా గెలిచారు. ఇక తాటి వేంకటేశ్వర్లు, పాయం వేంకటేశ్వర్లు, బానోత్ మదన్ లాల్ లు ఎమ్మెల్యేలుగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి గెలిచారు.

ఆ తరువాత వారంతా టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

పాత ఖమ్మం జిల్లా ప్రాంతంలో వైయస్సార్సీపీకి ఉన్న ఆదరణకూ, అప్పటి ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఉన్న పట్టుకూ ఈ గెలుపులను ఒక ఉదాహరణగా చెబుతారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)