వైయస్ షర్మిల: 'రెండంచుల కత్తి' పార్టీ లక్ష్యం ఏమిటి? - అభిప్రాయం
- జింకా నాగరాజు
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, YS Sharmila Reddy/FB
ఖమ్మం బహిరంగ సభలో షర్మిల
ఏడేళ్లుగా తెలంగాణ గురించి ఆమె ఒక్క మాట మాట్లాడలేదు. తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని ఒక్కసారి సందర్శించలేదు. ఉద్రిక్తతలకు కేంద్రమైన ఉస్మానియా క్యాంపస్‌లో ఒక్కసారి కాలు మోపలేదు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు వ్యతిరేకంగా రైతులు పోరాడుతున్నపుడూ ఆమె కనిపించలేదు.
సాధారణంగా తెలంగాణలో ఒక పెద్ద రాజకీయ కార్యక్రమం జరిపేటపుడు తెలంగాణ అమరవీరుల స్థూపాన్నిసందర్శించడం ఆనవాయితీ. ఆమె అలా చేయలేదు.
వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ఖమ్మం సంక్పల్ప సభకు బయలు దేరారు.
ఉన్నట్లుండి తెలంగాణలో 'రాజన్న రాజ్యం' అంటూ పార్టీ పెడుతూ ఉండటంతో తెలంగాణలో షర్మిల పెద్ద చర్చనీయాంశమయ్యారు. ఆమె వెనక ఎవరున్నారు, ఎవరు వదలిన బాణం ఆమె, ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ వదిలేసి తెలంగాణ వైపు ఎందుకు చూస్తున్నారు అనే చర్చ సాగుతూ ఉంది.
దీనికి స్పష్టమయిన సమాధానం దొరకడం కష్టమే.
మొత్తానికి జూలై 8, వైఎస్సార్ జయంతి రోజున ఆమె పార్టీ పేరు ప్రకటించబోతున్నారు. ఈ లోపు ఆమె ఏప్రిల్ 15 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తారు.
తెలంగాణలోని నిరుద్యోగుల పక్షాన నిలబడి పోరాడతానని ఆమె ఖమ్మం సభలో ప్రకటించారు.
రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయాలని ప్రభుత్వం మీద వత్తిడి పెంచేందుకు నిరాహార దీక్ష చేయబోతున్నట్లు ప్రకటించారు.
శుక్రవారం నాటి ఖమ్మం సభలో ఆమె చేసిన ప్రసంగం, అంత ఉత్తేజకరంగా లేకపోయినా, పార్టీ పెట్టాలనే పట్టుదలను వ్యక్తం చేసింది.
భారతదేశంలో సొంతంగా రాజకీయ పార్టీ పెడుతున్న మహిళ ఆమే కావచ్చు. ఎందుకంటే పార్టీలకు మహిళలు నాయకత్వం వహించినా వాళ్లంతా అప్పటికే ఉన్న పార్టీలలో నాయకులుగా ఎదిగి ఉండటమో, పార్టీతో విభేదించి బయటికి వచ్చి మరో పార్టీ ఏర్పాటు చేయడమో మాత్రమే జరిగింది.
పెద్దగా రాజకీయానుభవం లేకుండానే, సొంతంగా రాజకీయ పార్టీ పెట్టిన మహిళగా షర్మిలకు పేరు దక్కుతుంది.
షర్మిల రెండు అంశాలను తెలంగాణ ప్రజల ముందు పెట్టారు
ఒకటి: తాను తెలంగాణ బిడ్డనే.
రెండు: తెలంగాణ సమస్యలకు పరిష్కారం వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మార్గమే.
ఈ విషయాన్ని ఆమె చాలా నిర్మొహమాటంగా ప్రకటించారు.
ఫొటో సోర్స్, YS Sharmila Reddy/FB
తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని షర్మిల చెబుతున్నారు.
వైఎస్సార్ నామస్మరణ
2014లో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి వైఎస్సార్ పేరు ఈ ప్రాంతంలో మరుగున పడుతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో కొంత వినిపించినా, వైసీపీ తరఫున గెల్చిన ఒకే ఒక్క ఎంపి, ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు.
అప్పటి నుంచి వైఎస్సార్ పేరు వినిపించడం ఆగిపోయింది.
అనేక కూడళ్లలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాలను పట్టించుకోవడం మానేశారు. అవన్నీ దుమ్ము కొట్టుకు పోయాయి. గతంలో తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి ప్రతిపాదించిన అనేక ప్రాజెక్టులు రద్దయ్యాయి. వాటి స్థానంలో కొత్తవి వచ్చాయి.
రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి గాంధీ భవన్‌కే పరిమితమయింది. ఇలాంటి చోట షర్మిల మళ్లీ వైఎస్సార్ ప్రస్తావన తీసుకు వస్తున్నారు. తెలంగాణలో 'రాజన్న రాజ్యం' అంటున్నారు.
వ్యూహాత్మకంగా కూడా వైఎస్ పేరును దాచే ప్రయత్నం చేయలేదు షర్మిల. తన లక్ష్యం వైఎస్సార్ రాజకీయాల ద్వారా లబ్ది పొందినవారు కాబట్టి, దాపరికమెందుకు అనుకున్నట్లున్నారేమో. అంటే ఇక నుంచి తెలంగాణలో వైఎస్ పేరు రోజూ వినబడుతుంది.
2014 తర్వాతి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం, రాజన్న రాజ్యం అనేవి విచిత్రమయిన కలయిక. వీటికి సఖ్యత కుదరదు. అయినా సరే, ఆమె జోహార్ వైఎస్సార్, జై తెలంగాణ అంటున్నారు. దీనిని ప్రజలెలా స్వీకరిస్తారో, దీనికి తెలంగాణ రాజకీయ పార్టీలెలాస్పందిస్తాయో చూడాలి.
ఆమె ఈ రెండింటిని ప్రయోగించి తన లక్ష్యం ఏ సామాజిక వర్గమో పరోక్షంగా బయట పెట్టారు.
ఫొటో సోర్స్, YS Sharmila Reddy/FB
తెలంగాణలో బలమైన రెడ్డి సామాజిక వర్గం ఆమె రాకను శ్రద్ధగా గమనిస్తోంది
షర్మిల రాజకీయ పార్టీ ప్రకటన నేపథ్యం
షర్మిల ఆకట్టుకోవాలనుకుంటున్న ప్రజల్లో ప్రధాన వర్గం రెడ్లు అనే విషయంలో పెద్దగా ఎవరికీ పేచీ ఉండకపోవచ్చు. తెలంగాణలో రాజకీయ వర్గంగా రెడ్ల బలం ఎక్కువ. అంతేకాదు, ఆర్థికంగా బాగా బలపడిన వర్గం కూడా.
2014లో తెలంగాణ వచ్చాక ఈ వర్గంలో చిన్న అలజడి మొదలయింది. 2009లో వైఎస్సార్ మరణంతోనే ఈ వర్గం కొండంత అండను కోల్పోయింది. 2014లో తెలంగాణ ఏర్పాటు వారికి శరాఘాతంగా మారింది.
అటు ఆంధ్రలో చంద్రబాబు నాయుడు, ఇటు తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయినపుడు ఈ వర్గం బాగా దిగ్భ్రాంతికి గురయింది. ఎందుకంటే, 1956 నుంచి రాష్ట్రంలో రాజకీయాలను శాసించింది ఈ వర్గమే.
ముఖ్యమంత్రులను నియమించడం, దించడంలో ఈ వర్గం పాత్ర వుండేది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలకు ఆజ్యం పోసింది కూడా వర్గమే.
పవర్‌లోనైనా ఉండేది లేదా, పవర్‌ఫుల్‌గానైనా ఉండేది. అందుకే ఆంధ్రలో కొనసాగుతున్నది 'రెడ్డి రాజ్' అని ప్రఖ్యాత రాజకీయ శాస్త్రవేత్త డాగ్మర్ బెర్నస్టాఫ్ 40 ఏళ్ల కిందటే అన్నారు.
ఇలాంటి వర్గం రెండు రాష్ట్రాలలో అధికారం కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి రూపంలో ఈ వర్గానికి కొంత ఉపశమనం దొరికినా, తెలంగాణలో పరిస్థితి దారుణంగా తయారయింది.
ఈ వర్గాన్ని తనదిగా చేసుకున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ల అభీష్టాలను నెరవేర్చే శక్తిని కోల్పోయింది.
1960లలో ఆంధప్రదేశ్‌లో రెడ్ల ప్రాబల్యం ఎక్కువయిందని భావించిన ఇందిరా గాంధీ, ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నం చేసి చేతులు కాల్చుకున్నారు.
అంతటి బలమైన వర్గం ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఎటుకాకుండా పోయింది.
ఈ దశలో రాజకీయ భవితవ్యం చర్చించుకునేందుకు రెడ్లు కొన్ని సమావేశాలు కూడా జరుపుకున్నారు. మొదటి సమావేశం హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగింది. రెండు రాష్ట్రాల రెడ్డి ప్రముఖలు హాజరయ్యారు.
సోషల్ మీడియాలో కూడా వాళ్లు బాగా యాక్టివ్‌గా మారారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రా రెడ్లకంటే తెలంగాణ రెడ్లు బాగా నిరాశకు లోనయ్యాయి. వారు కాంగ్రెస్‌లో ఉండలేరు. తెలుగుదేశం పార్టీలో చేరదామంటే దానికే అస్తిత్వం కనిపించడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ స్వచ్ఛందంగా రాష్ట్రం విడిచి వెళ్లిపోయింది. ఇపుడెలా? ఈ ప్రశ్న చాలా కాలం వారిని పీడించింది.
ఏ దారి లేకపోవడంతో ఈ వర్గానికి చెందిన ప్రముఖులు చాలామంది టీఆర్‌ఎస్ లోకి వెళ్లిపోయారు. ఈ వర్గంలోని కుల చైతన్యాన్ని గమనించిన టీఆర్‌ఎస్ కూడా వాళ్లందరికి పెద్ద పీట వేసింది.
అయితే, తమదంటూ ఒక పార్టీ లేకుండా పోయిందనే వ్యథ మాత్రం ఈ వర్గానికి చెందిన యువతలో బలంగా ఉంది.
ప్రొఫెసర్ కోదండరామ్ కొత్త పార్టీ 'తెలంగాణ జన సమితి' విజయవంతమయి ఉంటే ఈ వర్గం అటు పోయి ఉండేదేమో ? అది జరగలేదు.
తర్వాత తెలంగాణలో మరొక కొత్త పార్టీ రాలేదు. కాంగ్రెసూ బలపడలేదు. ఇక మిగిలింది బీజేపీయే. ఆ పార్టీని కులం పేరుతో ఆక్రమించుకోవడం కష్టం. అయితే, అది ఒక ప్రత్యమ్నాయ పార్టీగా మాత్రం కనిపిస్తూ ఉంది.
టీఆర్‌ఎస్‌లో చోటున్నా నాయకత్వం రాదు. కాంగ్రెస్‌లో నాయకత్వం వచ్చినా పార్టీగా బలంగా లేదు. బీజేపీలో చోటు ఉన్నా పగ్గాలు దిల్లీలో ఉన్నాయి.
ఇపుడు రెడ్డి సామాజిక వర్గానికి ఒక 'విశ్వసనీయ వేదిక' అవసరం చాలా ఉంది.
ఫొటో సోర్స్, Getty Images
చంద్రబాబు, కేసీఆర్‌ల రాకతో తమ వర్గం వెనకబడిందని రెడ్డి సామాజిక వర్గం భావిస్తోంది.
ఆమె వెనక ఎవరున్నారు? అనుకూలించే అంశాలేమిటి?
ఈ నేపథ్యంలోనే షర్మిల తెలంగాణ రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. ఆమెను ఎవరో చాలా తెలివిగా రంగంలోకి దించుతున్నారు. అనువైన సమయంలో ఆమె రాజకీయ ప్రవేశం చేస్తున్నారు.
ఆమె విజయవంతమవుతారో లేదో గాని, రాజకీయాలను ప్రభావితం చేసే అనుకూల పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి.
షర్మిల తన పార్టీని ఒక విశ్వసనీయం రాజకీయ వేదికగా మార్చ గలిగితే, రెండు అంశాలు షర్మిలకు అనుకూలంగా పనిచేస్తాయి.
అవి. 1. కొత్త తరం రాజకీయ ఆశావహులు, 2. సామాజిక వర్గ సమీకరణ.
కొత్త తరం రాజకీయ ఆశావహులు : తెలంగాణలో ఏకపార్టీ వ్యవస్థ కొనసాగుతూ ఉంది. రూలింగ్ పార్టీ తప్ప మరేదీ ఇక్కడ బలంగా లేదు.
మరోవైపు తెలంగాణ సమాజం ఆర్థికంగా సంపన్నమవుతూ ఉంది. వేగంగా సాగుతున్న నగరీకరణ, దానితో పాటు వృద్ధి అవుతున్న వ్యాపారాలతో మధ్య తరగతిలో ఒక సంపన్న వర్గం తయారయింది.
వీరందిరికీ గమ్యస్థానం రాజకీయాలే.
వీరి దగ్గిర బాగా డబ్బుంది. కానీ వీళ్లని ఇముడ్చుకునే పార్టీయే లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో పెట్టుబడేందుకు అనువైన పార్టీ ఒక్క తెలంగాణ రాష్ట్ర సమితియే. కానీ ఈ పార్టీలో జాగా లేదు. కొత్త వారికీ చోటు కష్టమే.
అందుకే ఔత్సాహికులంతా ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. కాని పెట్టుబడి పెట్టేందుకు తెలంగాణలో ఏ పార్టీ కూడా ఆకర్షణీయంగా కనిపించడం లేదు. బీజేపీ కొంత ఆకర్షణీయంగా కనబడుతున్నా, ఆ పార్టీ మీద సంపూర్ణ విశ్వాసం కలగడం లేదు.
కాబట్టి, బాగా డబ్బు దస్కం ఉన్న ఈ వర్గం షర్మిల వైపు వెళ్లే అవకాశం ఉంది.
కులాలకు మతాలకు అతీతమయిన ఈ మధ్య తరగతి సంపన్న వర్గానికి పార్టీ ఏ వర్గం చేతిలో ఉందన్నది ముఖ్యం కాదు, తాము రాజకీయాల్లోకి వచ్చేందుకు అవకాశం కావాలి.
కొత్త పార్టీ కాబట్టి, షర్మిల కొత్త వారికి ఎక్కువగా అవకాశం కల్పించవచ్చు. కులాలకు అతీతంగా ఈ వర్గాన్ని షర్మిల ఆకట్టుకుంటే విజయవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
తెలంగాణలో 'సామాజిక న్యాయ ఉద్యమం' నామమాత్రంగా కూడా లేదిపుడు. అందువల్ల రాజకీయ ఆసక్తి ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ యువకులు కూడా షర్మిల వైపు ఆకర్షితులు కావచ్చు.
ఫొటో సోర్స్, YS Sharmila Reddy/FB
ఖమ్మం సభలో షర్మిల తల్లి కూడా పాల్గొన్నారు.
సొంత సామాజిక వర్గ సమీకరణ: సొంత సామాజిక వర్గ సమీకరణ షర్మిలకు సులువు అవుతుంది. రెడ్డి వర్గానికి చెందిన నేతలెవరూ కాంగ్రెసేతర పార్టీలలో సొంత ఇంట్లో ఉన్న అనుభవం పొందలేకపోతున్నారు. అక్కడ ఊపిరాడటం లేదని చెబుతున్నారు.
అందువల్ల తన పార్టీ 'విశ్వసనీయ రాజకీయ వేదిక' అనే భరోసా ఇవ్వగలిగితే, షర్మిల వైపు ఈ బలమయిన సామాజిక వర్గం పోలో మని వలస వస్తుంది.
ఈ సామాజిక వర్గం షర్మిల పార్టీని సొంతం చేసుకుంటే కొత్త పార్టీ విజయవంతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నిజానికి ఆమె చేస్తున్న వైఎస్సార్ నామస్మరణ దీని కోసమేనని చాలా మంది విశ్లేషకులు చెబుతున్నారు.
సొంత సామాజిక వర్గ సమీకరణలో విజయవంతమైనా చాలు, ఆమె పార్టీ తెలంగాణలో నిలబడిపోతుంది.
ఫొటో సోర్స్, YS Sharmila Reddy/FB
ఖమ్మం సభకు వచ్చిన ప్రజలు
తెలంగాణ 'పీఎంకే' అవుతుందా ?
ఇలాంటి ప్రయోగాలు కొన్ని రాష్ట్రాలలో జరిగాయి. పక్కనున్న తమిళనాడులో వచ్చిన పాట్టాళి మక్కల్ కట్చి (పీఎంకే) చక్కటి ఉదాహరణ.
ఇది వన్నియార్ కులానికి చెందిన పార్టీ. బీసీ కేటగిరీ చెందిన ఈ సామాజిక వర్గం చెంగల్‌పట్టు, నార్త్ ఆర్కాట్, సౌత్ ఆర్కాట్, సేలం వంటి జిల్లాల్లో మాత్రమే బలంగా ఉంది.
ఈ వర్గాన్ని రాజకీయంగా వినియోగించుకునేందుకు వచ్చిన పార్టీయే పీఎంకే. ఆ విషయంలో ఇది సక్సెస్ కూడా అయ్యింది. కేంద్రంలో యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలలో భాగస్వామి కాగలిగింది.
తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతాలలో పది మంది ఎమ్మెల్యేలు, ఒకరిద్దరు ఎంపిలు గెలిచినా రాష్ట్ర ప్రభుత్వంలో చేరవచ్చు, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కావచ్చు. రామదాస్ అథవాలే, రాం విలాస్ పాసవాన్ లాగా ఎపుడూ అధికారంలో ఉండవచ్చు.
కాబట్టి పూర్తిగా రెడ్డి సామాజిక వర్గం ముద్ర పడినా షర్మిల పార్టీ కొంత వరకు విజయవంతమయ్యే అవకాశాలు తెలంగాణలో ఉన్నాయి.
దీనికి వైఎస్సార్ పేరు సహకరిస్తుంది. అందువల్ల ఆమె పార్టీ రెండంచుల కత్తి అవుతుంది.
ఫొటో సోర్స్, YS Sharmila Reddy/FB
తెలంగాణ కోసం త్యాగం చేసిన వారికి న్యాయం జరగలేదని షర్మిల అన్నారు.
ఈ భరోసాతోనే కావచ్చు, నిర్మోహమాటంగా రాజశేఖర్ రెడ్డి పేరు మీద షర్మిల పార్టీ పెడుతున్నారు. ఆయన ఐడియాలజీతోనే పార్టీని నడపాలనుకుంటున్నారు.
చాలా స్పష్టంగా తాను రాజశేఖర్ రెడ్డి బిడ్డనని, ఆయన అడుగు జాడల్లోనే నడిచి, రాజన్న రాజ్యం స్థాపిస్తానని చెబుతున్నారు.
అసలు తెలంగాకు కావలసింది రాజన్న రాజ్యమేనని ఆమె ప్రకటించారు. ఇది సాహసోపేత ప్రకటనే.
ఆమె కల నెరవేరాలంటే కేసీఆర్‌ను శత్రువులా చూపాలి. ఆయన చెప్పిన బంగారు తెలంగాణను తిరస్కరించాలి. ఆ పని కూడా ఆమె ఖమ్మంలో ప్రారంభించారు.
కేసీఆర్ మీద స్వరం పెంచడం ప్రారంభించారు. " తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడానికి, ఆత్మగౌరవ తెలంగాణ కోసం పార్టీ పెడుతున్నాను. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు నెరవేరలేదు. ఇది అక్షర సత్యం.
తెలంగాణ ఉద్యమంలో వందలమంది అమరులయ్యారు. వారందరికీ నా జోహార్లు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే దానికి కారణం ఎవరు" అని షర్మిల ప్రశ్నించారు.
ఆమె తెలివిగా తెలంగాణ కోసమే ప్రత్యేకంగా స్క్రిప్ట్ తయారు చేశారని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఆమె రాజశేఖర్ రెడ్డి మార్క్ తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు.
ఖమ్మం పెవిలియన్ మైదానంలో ఆమె వేసిన ఈ ప్రశ్నలన్నీ పాతవే. చాలా మంది రోజూ చెబుతున్నవే.
అయితే, ఈ సారి గొంతు కొత్తది. బలమయిన సామాజిక వర్గం నుంచి వచ్చింది కూడాను. అందువల్ల ప్రజలు ఆసక్తిగా విన్నారు.
ఈ ప్రజలు ఆమె వైపు వెళ్లాలంటే గత ఏడేళ్లుగా జరిగిందంతా శూన్యం అని షర్మిల ప్రజలకు నిరూపించి చూపాలి. ప్రజలు దాన్ని తిరస్కరించేలా చేయాలి.
అయితే ఈ కొత్త గొంతు వైపు ప్రజలు ఆకర్షితులవుతారో లేదో ఇపుడే చెప్పలేం.
(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- రైతుల ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్ట్ మన్దీప్ పునియా అరెస్ట్
- మట్టితో ఈ రైతు చేసిన ప్రయోగాలు సేంద్రియ వ్యవసాయాన్ని కొత్త పుంతలు తొక్కిస్తాయా?
- పాకిస్తాన్ నిర్మిస్తున్న ఆనకట్టపై భారత్ ఎందుకు అభ్యంతరం చెబుతోంది?
- ఎడారి ఇసుక నేలలో పచ్చని పొలం... ఈ అద్భుతం ఎలా సాధ్యం?
- గోదావరి నీళ్లు స్నానానికి కూడా పనికి రాకుండా పోతున్నాయా? కాలుష్య సమస్య పరిష్కారమయ్యేదెలా
- రైతుల నిరసనలు: ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గొద్దు.. రైతులకు సూచించిన రాహుల్ గాంధీ
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- సింధు నదీజలాల ఒప్పందం వల్ల భారత్ నష్టపోతోందా.. అసలు ఎందుకీ ఒప్పందం చేసుకున్నారు?
- మహిళల మోకాళ్లు, చిరిగిన జీన్స్‌పై ఎందుకింత చర్చ జరుగుతోంది
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
- 15 వందల మంది భారత సైనికుల భీకర పోరాటం రెండో ప్రపంచ యుద్ధ గతిని ఎలా మార్చిందంటే..
- వరల్డ్ హ్యాపీనెస్ డే: అత్యంత సంతోషకర దేశంగా ఫిన్లాండ్, 139వ స్థానంలో భారత్
- పంటలకు ఈ రైతు హోమియో మందులు వేస్తున్నారు... ఎందుకో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)