యాంఫోటెరిసిన్-బీ: బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే మందుకు తీవ్ర కొరత

ఇండియాలో రోజు రోజుకూ బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

ఇండియాలో రోజు రోజుకూ బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి

బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకర్‌మైకోసిస్ అని పిలిచే అరుదైన ఇన్‌ఫెక్షన్‌ చికిత్సలో 'యాంఫోటెరిసిన్-బీ' మందును వాడుతున్నారు. ప్రస్తుతం భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ మందు కొరత తీవ్రంగా ఉంది.

బ్లాక్ మార్కెట్‌లో దీన్ని రూ. లక్షల్లో అమ్ముతున్నారు.

బ్లాక్ ఫంగస్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండడంతో యాంఫోటెరిసిన్-బీ కావాలంటూ సోషల్ మీడియాలో అనేక అభ్యర్థనలు కనిపిస్తున్నాయి.

తీవ్ర లక్షణాలతో కోవిడ్ బారిన పడినవారికి చికిత్సలో భాగంగా ఇచ్చిన స్టెరాయిడ్ల కారణంగా ఈ ఇన్‌ఫెక్షన్ సోకుతోందని డాక్టర్లు అంటున్నారు.

మట్టి, మొక్కలు, ఎరువు, కుళ్లిన పండ్లు, కూరగాయల్లో జనించే మ్యూకర్ అనే శిలీంధ్రాల వల్ల మ్యూకర్‌మైకోసిస్ వ్యాపిస్తుంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

మూకోర్ అనే శిలీంధ్రాల వలన మ్యూకోర్మైకోసిస్ వ్యాపిస్తుంది

ఇది సైనస్, మెదడు, ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారికి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి, ముఖ్యంగా కేన్సర్, హెచ్ఐవీ/ఎయిడ్స్‌లాంటి రోగులకు ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి.

బ్లాక్ ఫంగస్‌ను గుర్తించడంలో ఆలస్యం కారణంగా, కంటి చూపు కోల్పోతున్న దశలో రోగులు వైద్యులను సంప్రదిస్తున్నారు. ఇది మెదడుకు చేరకుండా ఉండేందుకు డాక్టర్లు ఆపరేషన్ చేసి కన్ను తీసేయాల్సి వస్తోంది.

మహరాష్ట్రలో 1,500 బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే గత వారం తెలిపారు.

కిందటి ఏడాది కరోనావైరస్ వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి మహరాష్ట్రలో 52 మంది మ్యూకర్‌మైకోసిస్ కారణంగా మరణించారని ఆరోగ్య శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు.

గత నెల రోజుల్లో గుజరాత్‌లో 900 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యానని ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు.

అంతకుముందు యాంఫోటెరిసిన్-బీ దొరికేదని, గత మూడు వారాల్లో డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడంతో ఇప్పుడు ఆ ఇంజెక్షన్ దొరకడం గగనమైపోతోందని ఉత్తర్ ప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన ఒక పెద్ద ఫార్మా సంస్థ యజమాని తెలిపారు.

దేశంలోని అనేక నగరాల్లో ఈ ఇంజెక్షన్ కొరత తీవ్రంగా ఉండడంతో దీనికోసం ట్విట్టర్‌లో అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి.

బ్లాక్ ఫంగస్ సోకినవారికి యాంఫోటెరిసిన్-బీ లేదా 'యాంఫో-బీ' యాంటీఫంగల్ ఇంజెక్షన్‌ను నేరుగా నరాల్లోకి ఎక్కిస్తారు.

రోగులు ఈ ఇంజెక్షన్‌ను ఎనిమిది వారాలపాటూ రోజూ తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ప్రస్తుతం ఈ మందు రెండు రూపాల్లో అందుబాటులో ఉంది.. ప్రామాణిక యాంఫోటెరిసిన్-బీ డియోక్సికోలేట్, లిపోసోమల్ యాంఫోటెరిసిన్.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్,

ఇది సైనస్, మెదడు, ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది

"లిపోసోమల్ రూపంలో ఉన్న మందు వాడడం మేలు. ఎందుకంటే ఇది ప్రభావవంతంగా పని చేయడమే కాక సురక్షితం కూడా. సైడ్ ఎఫెక్టులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. కానీ, ఒకే ఒక్క సమస్య ఏంటంటే దీని ధర చాలా ఎక్కువ" అని ముంబయికి చెందిన కళ్ల డాక్టర్ అక్షయ్ నాయర్ చెప్పారు.

అనేక కుటుంబాలకు మ్యూకర్‌మైకోసిస్ చాలా ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిపోయింది. ఈ చికిత్సకు లక్షల్లో ఖర్చు అవుతోంది. ఈ ఇంజెక్షన్ బ్లాక్ మార్కెట్‌లో కొనడం భారమవుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)