కృష్ణపట్నం: కరోనా ఆయుర్వేద మందు కోసం తోపులాట, పోలీసుల లాఠీఛార్జి - ప్రెస్ రివ్యూ

బొనిగె ఆనందయ్య కరోనా మందు కోసం వచ్చిన జనం

ఫొటో సోర్స్, UGC

కోవిడ్‌కు ఉచితంగా మందు ఇస్తున్న సమాచారంతో నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నానికి శుక్రవారం జనం పోటెత్తారని ‘ఈనాడు’ ఓ కథనం ప్రచురించింది.

‘‘ఆనందయ్య పంపిణీ చేస్తున్న ఆయుర్వేద మందు కరోనాను అంతమొందిస్తోందన్న ప్రచారంతో ఏపీతోపాటు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఒడిశాల నుంచి ప్రజలు వేలాదిగా తరలివచ్చారు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని సైతం అంబులెన్సుల్లో తీసుకురాగా... మందు పంపిణీ ప్రారంభించిన కొద్దిసేపటికే అయిపోయిందని తెలపడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది.

ఎలాగైనా మందు దక్కించుకోవాలని వచ్చినవారు ఎగబడటంతో తోపులాట జరిగింది. వారిని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది.

ఇటీవల లోకాయుక్త ఆదేశాలతో అధికారులు మందు పంపిణీని నిలిపివేశారు. దాని తయారీలో వాడే సామగ్రిని పరీక్షల నిమిత్తం ఆయుష్‌ పరిశోధనశాలకు పంపడంతోపాటు సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా యంత్రాంగం లోకాయుక్తకు పంపింది.

ల్యాబ్‌ నివేదిక ఇంకా రాకపోవడంతో.. అధికారులు మందు పంపిణీకి మొదట అనుమతివ్వలేదు. కానీ... దాన్ని వాడిన వారి నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేకపోవడం, వాడిన వారంతా కొవిడ్‌ నుంచి బయట పడినట్లు అధికారులు నివేదికలో పేర్కొనడంతో... సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి శుక్రవారం నుంచి ఆయుర్వేద మందు పంపిణీ ప్రారంభిస్తారని ప్రకటించారు. దాంతో బాధితులు, వారి బంధువులు కృష్ణపట్నం వైపు పరుగులు తీశారు.

శుక్రవారం ఉదయం 6గంటలకే వేలాది మందితో గ్రామం కిక్కిరిసింది. తొమ్మిది గంటల సమయంలో ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ప్రారంభించగా... ప్రజలు ఎగబడ్డారు’’అని ఈనాడు కథనంలో పేర్కొంది.

ఫొటో సోర్స్, ugc

డాక్టర్ సుధాకర్‌ మృతి

కోవిడ్ మొదటి వేవ్ సమయంలో మాస్కుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించి వివాదాల్లో చిక్కుకున్న అనస్థీషియా వైద్యుడు కె.సుధాకర్‌ శుక్రవారం గుండెపోటుతో విశాఖలో మరణించినట్లు ‘సాక్షి’ పత్రిక తెలిపింది. ''గురువారం అర్ధరాత్రి ఆయనకు గుండెపోటు రావడంతో కింగ్‌ జార్జి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.

గతేడాది నర్సీపట్నం ప్రభుత్వ వైద్యశాలలో మాస్కులు పంపిణీ చేయడం లేదంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసి ఆయన సస్పెండయ్యారు.

కొంతకాలానికి తాను తప్పు చేశానని.. సీఎం వైఎస్‌ జగన్‌ తనని క్షమించాలని వేడుకున్నారు''అని సాక్షి తెలిపింది.

ఫొటో క్యాప్షన్,

పెళ్లికి ఒప్పుకోలేదని చంపేశాడు

పెళ్లికి ఒప్పుకొలేదని బీరు బాటిల్‌తో గొంతులో పొడిచి చంపేశాడు

పెళ్లికి నిరాకరించిందనే కోపంతో బీర్‌ బాటిల్‌తో గొంతులో పొడిచి.. బండరాయితో తలపై కొట్టి ఓ యువతిని ప్రియుడే హత్యచేసినట్లు ఆంధ్రజ్యోతి తెలిపింది,

‘‘మద్యంమత్తులో మృతదేహం పక్కనే హాయిగా నిద్రపోయి లేచి.. తానే చంపానంటూ దారిన వెళుతున్న పోలీసులకు తాపీగా చెప్పాడు. శుక్రవారం నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్‌ హిల్‌కాలనీ సమీపంలో ఈ ఘటన జరిగింది.

గుర్రంపోడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన వెలుగు అంజయ్య, రాములమ్మ దంపతుల చిన్న కుమార్తె చందన (20) ఇంటర్‌ దాకా చదివి కూలి పనులకు వెళుతోంది. అనుముల మండలం కొరివేనిగూడేనికి చెందిన బొడ్డు శంకర్‌ ఇంటర్‌ చదివి వరికోత మిషన్‌ నడుపుతున్నాడు.

45 రోజుల క్రితం గుర్రంపోడు మండలంలో వరికోతలకు శంకర్‌ బొల్లారం వెళ్లాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. రోజూ కలుసుకునేవారు.

ఇద్దరూ పెళ్లి గురించి మాట్లాడుకునేందుకు శుక్రవారం మధ్యాహ్నం బైక్‌పై సాగర్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో హిల్‌కాలనీ రెండో డౌన్‌ వద్ద శివం హోటల్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. వెంట తెచ్చుకున్న మద్యాన్ని శంకర్‌ తాగాడు. అనంతరం ఇద్దరూ కలిసి భోజనం చేశారు.

శంకర్‌ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా చందన నిరాకరించింది. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో అక్కడే ఉన్న ఖాళీ బీరు బాటిల్‌ను పగలగొట్టి చందన గొంతులో పొడిచి, బండరాయితో తలపై మోదడంతో ఆమె మృతి చెందింది.

మద్యం మత్తులో ఉన్న శంకర్‌ అక్కడే చెట్టుకింద నిద్రించి, సాయంత్రం నిద్రలేచి ప్రధాన రహదారిపైకి చేరుకున్నాడు. అటుగా వెళుతున్న పోలీసులు గమనించి ప్రశ్నించడంతో హత్య చేసిన విషయం వారికి చెప్పాడు’’అని ఆంధ్రజ్యోతి కథనంలో పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

ఎయిర్ ఇండియా

‘ఎయిరిండియా’పై సైబర్‌ ఎటాక్‌

దేశీయ ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ‘ఎయిరిండియా’కు చెందిన సిటా పీఎస్‌ఎస్‌ ప్యాసింజర్‌ సర్వీస్‌ సిస్టమ్‌పై సైబర్‌ దాడి జరిగిందని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.

‘‘దాదాపు 45 లక్షల మంది ప్రయాణికుల వ్యక్తిగత సమాచారాన్ని సైబర్‌ దుండగులు దొంగిలించారు. లీకైన సమాచారంలో ప్రయాణికుల పాస్‌పోర్ట్‌ వివరాలు, అడ్రస్‌, టికెట్‌ సమాచారం, క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు వంటివి ఉన్నట్టు ప్రయాణికులకు పంపిన ఓ లేఖలో ఎయిరిండియా స్వయంగా వెల్లడించింది.

ప్రయాణికుల సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లు దొంగిలించినట్టు ఫిబ్రవరి 25వ తేదీన గుర్తించామని, అయితే, దానికి సంబంధించిన వివరాలు మార్చి 25, ఏప్రిల్‌ 5 తర్వాతనే తెలిసినట్టు సంస్థ వివరించింది.

‘ఎస్‌ఐటీఏ పీఎస్‌ఎస్‌ ప్యాసింజర్‌ సర్వీస్‌ సిస్టమ్‌ (సర్వర్‌)’పై దాడి జరిగిందని తెలియగానే నిపుణుల సాయంతో ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు వెల్లడించింది. సర్వర్‌ పాస్‌వర్డ్‌లను కూడా మార్చినట్టు తెలిపింది.

ప్రయాణికులు కూడా తమ లాగిన్‌ క్రెడెన్షియల్స్‌, మనీ పేమెంట్‌ కార్డుల పాస్‌వర్డులను మార్చుకోవాలని సూచించింది. అయితే, సైబర్‌ దాడికి ఎవరు పాల్పడ్డారన్న విషయాన్ని వెల్లడించలేదు’’అని నమస్తే తెలంగాణ వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

బ్లాక్ ​ఫంగస్

బ్లాక్ ​ఫంగస్​ మందుకు ఒక్కరోజే 700 అప్లికేషన్లు

తెలంగాణలో బ్లాక్​ ఫంగస్​ మెడిసిన్​ కోసం హెల్త్​ డిపార్ట్​మెంట్​కు భారీగా అప్లికేషన్లు వస్తున్నాయని వెలుగు దినపత్రిక ఓ కథనం ప్రచురించింది.

‘‘లైపోజోమల్ యాంఫోటెరిసిన్ బి, పోసకోనజోల్, ఐసవుకోనజోల్ డ్రగ్స్‌ కోసం సర్కారు ​ఈ మెయిల్‌కు గురువారం ఒక్క రోజే 7 వందల వినతులు వచ్చాయి. కానీ సర్కారు దగ్గర 3 వందల ఇంజక్షన్లే ఉన్నట్టు తెలిసింది. దీంతో ఏంచేయాలో తెలియక ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు.

మెయిల్ ద్వారా దరఖాస్తు చేసినా ఎవరూ స్పందించట్లేదని, బాధితులు నేరుగా కోఠిలోని డీఎంఈ ఆఫీసుకు వస్తున్నారు. ఆదుకోవాలని ఆఫీసర్లను వేడుకుంటున్నారు.

మరోవైపు రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్లలో కలిపి ఇప్పటికే వెయ్యి మంది పేషెంట్లు ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. కోఠిలోని ఈఎన్టీ హాస్పిటల్‌కు గురువారం ఒక్కరోజే 284 మంది అనుమానితులు వచ్చారు. కార్పొరేట్, ప్రైవేట్ హాస్పిటళ్లకూ బాధితులు క్యూ కడుతున్నారు’’అని వెలుగు వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)