కోవిడ్: తెలంగాణలో 25 లక్షల మంది సూపర్ స్ప్రెడర్లు ఉన్నారని ఆరోగ్య శాఖ అంచనా - ప్రెస్ రివ్యూ

తెలంగాణలో సూపర్ స్ప్రెడర్లు

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో 25 లక్షల మంది కరోనా సూపర్ స్ప్రెడర్లు ఉంటారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేసినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

రాష్ట్రంలో కొవిడ్‌ వైర్‌సను వేగంగా వ్యాపింప చేస్తారని భావిస్తున్న సూపర్‌ స్ప్రెడర్లు 25 లక్షల మందికి పైగా ఉంటారని అంచనా!

కరోనా వాహకులుగా భావించే వీరందరికీ వీలైనంత త్వరగా వ్యాక్సిన్‌ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

డ్రైవర్లు, వీధి వ్యాపారులు, గ్యాస్‌ డెలివరీ బాయ్స్‌, బ్యాంకు ఉద్యోగులు, పెట్రోల్‌ బంకుల్లో పనిచేసేవారు, ఊరూరు తిరుగుతూ వ్యాపారం చేసేవారంతా ఈ సూపర్‌ స్ప్రెడర్ల విభాగంలోకి వస్తారు.

వీరిని గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టింది. అన్ని జిల్లాల్లోనూ వివరాలను సేకరిస్తున్నారు. ఈ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు.

రాష్ట్రంలో సూపర్‌ స్ప్రెడర్లు 25 లక్షల వరకు ఉంటారని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేస్తోంది. మూడు నాలుగు రోజుల్లో జిల్లాల వారీగా సేకరించిన సూపర్‌ స్ప్రెడర్ల వివరాలపై ఓ నివేదిక తయారు చేయనున్నారు.

దాన్ని సీఎం కేసీఆర్‌కు అందించనున్నారు. ఆ నివేదిక ఆధారంగా వారికి టీకా ఎలా ఇవ్వాలన్న దానిపై మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం సూపర్‌ స్ప్రెడర్లను వైద్య ఆరోగ్యశాఖ రెండు విభాగాల కింద పరిగణించనుంది. ఒకటి 45 ఏళ్లు పైబడినవారు, రెండోది 18-45 మధ్యవారు.

మొదటి కేటగిరీలోకి వచ్చేవారందరికీ కేంద్ర ప్రభుత్వ కోటాలో టీకా ఇవ్వనున్నారు. ప్రస్తుతం 45 ఏళ్లు దాటిన వారికి కేంద్రమే ఉచితంగా టీకాలు ఇస్తోంది. ఆలోపు వయసు వారికి రాష్ట్ర ప్రభుత్వ కోటాలో ఇవ్వాలని సర్కారు యోచిస్తోంది.

ఇలా రెండు విభాగాలుగా చేసి సూపర్‌ స్ప్రెడర్లందరికీ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు సమాయత్తమవుతోంది. అయితే వీరిలో 45 ఏళ్లకు పైబడిన వారు కొందరు టీకా తీసుకొని ఉంటారని వైద్య ఆరోగ్య శాఖ ఒక అంచనాకు వచ్చినట్లు ఆంధ్రజ్యోతి వివరించింది.

ఫొటో సోర్స్, UGC

కృష్ణపట్నం మందు ఆయుర్వేదం కాదు-రాష్ట్ర ఆయుష్ కమిషన్

కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే మందును నాటుమందుగా గుర్తించినట్లు రాష్ట్ర ఆయుష్‌ శాఖ తెలిపిందని ఈనాడు దిన పత్రిక కథనం ప్రచురించింది.

రెండు రోజుల పాటు కమిషనర్‌ కర్నల్‌ రాములు నేతృత్వంలో వైద్యబృందం నెల్లూరు జిల్లాలో పర్యటించి ఆనందయ్య తయారుచేస్తున్న మందులను పరిశీలించింది.

పర్యటనకు ముందే హైదరాబాద్‌ ల్యాబ్‌లో మందు నమూనాలను పరీక్ష చేయించింది. ఆ ఫలితాలు, క్షేత్రస్థాయి పరిస్థితులు, ఆనందయ్య ఇచ్చిన వివరాల ఆధారంగా దాన్ని నాటుమందుగా గుర్తించామని ఆయుష్‌ శాఖ కమిషనర్‌ కర్నల్‌ రాములు 'ఈనాడు'కు తెలిపారు.

వంశపారంపర్యంగా మందులు ఇస్తుంటారని, ఆ క్రమంలోనే ఇది కూడా ఒక నాటు మందని పేర్కొన్నారు. ఈ మందులో హానికారక పదార్థాలు ఏమీ లేవని వెల్లడించారు.

అయితే దీన్ని ఆయుర్వేద మందుగా మాత్రం తాము పరిగణించట్లేదని స్పష్టంచేశారు. ఈ మందు వినియోగం విషయంలో ఎవరికి వారు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారని ఈనాడు రాసింది.

దిల్లీలోని సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్స్‌కు ఇక్కడి పరిస్థితులపై ఓ నివేదికను పంపనున్నట్లు తెలిపారు.

తిరుపతి, విజయవాడల్లోని ఆయుర్వేద వైద్యులు ఈ నివేదికను తయారు చేస్తారని పేర్కొన్నారు. కర్నల్‌ బృందం రెండురోజుల పర్యటనలో తొలిరోజు మందు కోసం వచ్చిన వారిని కలుసుకుని వారి అభిప్రాయాలు సేకరించింది.

ఈ మందును వాడిన వారి నుంచి కూడా వివరాలు తెలుసుకుంది. వారంతా మందు వినియోగంపై సానుకూలత వ్యక్తం చేశారు.

రెండోరోజు ఏయే ముడిసరకులు, పదార్థాలను ఉపయోగించి ఈ మందులు తయారుచేస్తున్నారో ప్రత్యక్షంగా పరిశీలించి తెలుసుకున్నారు.

పచ్చకర్పూరం, పసుపు, నల్ల జీలకర్ర, వేప ఇగురు, మారేడు ఇగురు, ఫిరంగి చెక్క, దేవరబంగి వంటివి ముడి పదార్ధాల్లో ఉన్నాయి.

ఆనందయ్య తనకున్న అనుభవం ఆధారంగా పిడికిలి కొలతతోనే వాటిని వాటిని మిక్సీలో వేసి పౌడరు (పొడి) రూపంలో తయారుచేస్తున్నారు.

అలాగే ముళ్ల వంకాయ, తోకమిరియాలు, తేనె కలిపిన మిశ్రమాన్ని చుక్కల మందు రూపంలో కంట్లో వేస్తుండటాన్ని కూడా పరిశీలించారు.

తమ బృంద పరిశీలనలో ఎక్కడా అభ్యంతరాలు వ్యక్తం కాలేదని కర్నల్‌ రాములు వెల్లడించారు. ఐసీఎంఆర్‌ బృందం నెల్లూరు జిల్లాకు వస్తుందనడంలో వాస్తవం లేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయని ఈనాడు వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images

ప్రైవేటుకు వ్యాక్సిన్‌పై పునరాలోచించండి-ప్రధానికి ఏపీ సీఎం లేఖ

ప్రైవేటు ఆస్పత్రులు నేరుగా వ్యాక్సీన్ కొనుగోలు చేయచ్చంటూ తీసుకున్న నిర్ణయంపై ఏపీ సీఎం జగన్ ప్రధానికి లేఖ రాసినట్లు సాక్షి దినపత్రిక వార్తా కథనం ప్రచురించింది.

కోవిడ్‌ నియంత్రణకు ప్రస్తుతం వ్యాక్సినేషనే శరణ్యమని, ఇలాంటి పరిస్థితిలో ప్రైవేట్‌ ఆస్పత్రుల వారు నేరుగా వ్యాక్సిన్‌ కోనుగోలు చేసుకోవడానికి కేంద్రం అనుమతిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు.

దేశంలో వ్యాక్సిన్‌ సరఫరా తగినంత లేని ఈ సమయంలో ఈ నిర్ణయం ప్రజల్లో తప్పుడు సంకేతాలకు దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు.

ప్రజల భయాలను ఆసరాగా చేసుకొని ప్రైవేటు ఆస్పత్రులు అడ్డగోలుగా దోపిడీ చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

కోవిడ్‌ నియంత్రణకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలుపుతూ.. వ్యాక్సిన్‌ సరఫరా విషయమై వాస్తవ పరిస్థితి వివరిస్తూ పలు సూచనలు చేశారు.

ప్రధానంగా వ్యాక్సిన్‌ సరఫరాను కేవలం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకే పరిమితం చేయాలని కోరారు. ఈ లేఖలోని వివరాలు ఇంకా ఇలా ఉన్నాయి.

రాష్ట్రంలో 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉన్న వారందరికీ ఉచితంగా టీకాలు వేయాలని నిర్ణయించాం.

అయితే తగిన సంఖ్యలో టీకాలు అందుబాటులో లేకపోవడం వల్ల తొలుత 45 ఏళ్లు దాటిన వారందరికీ రెండు డోస్‌ల టీకాలు పూర్తి చేసే ప్రక్రియలో ముందుకు వెళ్తున్నాం.

కొన్ని ఆస్పత్రులు ఒక్కో డోస్‌కు రూ.2 వేల నుంచి రూ.25 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇది ప్రజలపై భారం వేయడమే కాకుండా, విమర్శలకు దారి తీస్తోంది.

దేశంలో ఉత్పత్తి అవుతున్న కోవిడ్‌ వాక్సిన్‌ డోస్‌లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉండాలి. అప్పుడే ప్రజలందరికీ ఏ ఇబ్బంది లేకుండా వాక్సిన్‌ డోస్‌లు వేసే వీలుంటుంది. ఈ విషయంలో సానుకూల నిర్ణయం తీసుకుని, వాక్సిన్‌ బ్లాక్‌ మార్కెట్‌కు తరలిపోకుండా నిరోధిస్తారని ఆశిస్తున్నాను అని తెలిపారని సాక్షి వివరించింది.

ఫొటో సోర్స్, Getty Images

తెలంగాణలో లాక్ డౌన్ మరింత కఠినం

తెలంగాణలో లాక్ డౌన్‌ను ప్రభుత్వం మరింత కఠినతరం చేసినట్లు నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు పోలీసులు రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలుచేస్తున్నారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా తనిఖీల జోరు పెంచారు.

అనవసరంగా రోడ్లపైకి వస్తున్నవారికి తమదైన శైలిలో బుద్ధి చెప్పడంతోపాటు చలాన్ల కొరడా ఝుళిపించారు. ఏకంగా పోలీస్‌ బాస్‌ డీజీపీ నుంచి కానిస్టేబుల్‌వరకు అంతా రోడ్లపై గస్తీకాస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.

డీజీపీ మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ.. పోలీస్‌ అధికారులకు సూచనలు ఇచ్చారు.

మిగిలిన అన్ని పోలీస్‌ కమిషనరేట్ల ఉన్నతాధికారులు సైతం డీజీపీని అనుసరిస్తూ రోజంతా తనిఖీల్లో ముమ్మరంగా పాల్గొన్నారు.

అడిషనల్‌ ఎస్పీ, డీఎస్పీ, సీఐ, ఎస్సైలు సహా అన్ని ర్యాంకుల పోలీసులకు తోడు ట్రాఫిక్‌ విభాగం సిబ్బంది సైతం ప్రధాన కూడళ్లు, చౌరస్తాల్లో పికెట్లు ఏర్పాటుచేసి తనిఖీలు నిర్వహించారు. అత్యవసర పాస్‌లేకుండా రోడ్లపైకి వచ్చేవారిపై కేసులు నమోదుచేశారు.

లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమించవద్దని పదేపదే చెప్తున్నా కొందరు ఆకతాయిలు, అనవసర పనులపై బయటికి వచ్చేవారు వినకపోవడంతో పోలీసులు వారి వాహనాలను సీజ్‌చేశారు.

వారం రోజుల్లో దాదాపు 20 వేల పైచిలుకు వాహనాలు సీజ్‌ చేసినట్టు ఓ పోలీస్‌ ఉన్నతాధికారి తెలిపారు. పాస్‌లు ఉండి చిల్లర కారణాలు చూపుతూ పదేపదే రోడ్లపైకి వచ్చేవారికి సైతం పోలీసులు శనివారం కొంత కఠినంగానే సమాధానమిచ్చారు.

హైదరాబాద్‌లో చాలాచోట్ల వాహనదారులకు పోలీసులకు స్వల్ప వాగ్వాదాలు సైతం చోటుచేసుకున్నాయి.

బేగంపేట సమీపంలో బారికేడ్లు ఏర్పాటుచేసి చేపట్టిన తనిఖీలో వందలాది ద్విచక్రవాహనదారులు, కార్లను హైదరాబాద్‌ పబ్లిక్‌స్కూల్‌ గ్రౌండ్‌లో కాసేపు ఉంచిన పోలీసులు సరైన పత్రాలు చూపనివారిపై కేసులు నమోదుచేశారు.

ఓవైపు తనఖీలతోపాటు దవాఖానలకు వెళ్లేవారు, డాక్టర్ల కోసం ప్రత్యేకంగా లైన్‌ ఏర్పాటు చేసి వారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

పోలీసుల ముమ్మర తనిఖీలు ఇలాగే కొనసాగుతాయని, అనవసరంగా బయటికి వస్తే వాహనాలు సీజ్‌చేస్తామని, అలా బయటికి వచ్చి ఇబ్బందులపాలు కావొద్దని ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు.

ఆదివారం నుంచి ప్రతి యూనిట్‌ పరిధిలో చెక్‌పోస్టుల సంఖ్య పెంచి తనిఖీలు మరింత పక్కాగా అమలుచేయనున్నట్టు ఉన్నతాధికారులు పేర్కొన్నారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)