ఛత్తీస్‌గఢ్: లాక్‌డౌన్‌లో యువకుడిని చెంపదెబ్బ కొట్టిన సూరజ్‌పూర్ కలెక్టర్‌‌ను సస్పెండ్ చేసిన సీఎం

ఛత్తీస్‌గఢ్ కలెక్టర్

ఫొటో సోర్స్, ANI

లాక్‌డౌన్ మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ ఒక యువకుడిని చెంప దెబ్బ కొట్టి, ఆయన ఫోన్ విసిరేసిన సూరజ్‌పూర్ కలెక్టర్ రణ్‌బీర్ శర్మను వెంటనే విధుల నుంచి తొలగించాలని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘెల్ ఆదేశించారు.

"సోషల్ మీడియా ద్వారా ఈ సంఘటన మా దృష్టికి వచ్చింది. ఇది చాలా విచారకరం. ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి ప్రవర్తన సహించం. కలక్టర్ రణ్‌బీర్ శర్మను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడమైంది" అని ముఖ్యమంత్రి ట్విటర్‌లో తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లో లాక్‌డౌన్ అమలులో ఉండగా శనివారం సాయంత్రం బైక్‌పై రోడ్డు మీదకు వచ్చిన ఒక యువకునితో కలక్టర్ రణ్‌బీర్ శర్మ దురుసుగా ప్రవర్తించారు. ఆ యువకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయమని పోలీసులను ఆదేశించారు.

ఆ యువకుని కొట్టి, ఫోన్ లాక్కుని కింద పడేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ నేపథ్యంలో కలక్టర్ రణ్‌బీర్‌ శర్మపై విమర్శలు వెల్లువెత్తాయి.

"సూరజ్‌పూర్ కలెక్టర్ ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు. ఈ మహమ్మారి కాలంలో ప్రజలకు మన చేయూత అవసరం. కొట్టడం, ఫోన్లు బద్దలుగొట్టడం కాదు. కలెక్టర్‌ను వెంటనే విధుల నుంచి తొలగించి, అధికారులకు బలమైన సందేశాన్ని పంపినందుకు ఛత్తీస్‌ఘఢ్ ముఖ్యమంత్రికి నా అభినందనలు" అని మాజీ జమ్మూ కశ్మీర్ డీజీపీ డాక్టర్ ఎస్‌పీ వైద్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)