కృష్ణా జల వివాదం: నీటి పంపకాలపై తెలుగు రాష్ట్రాల మధ్య ఎందుకీ వివాదం, దీనికి మూలం ఎక్కడ?

  • బళ్ల సతీశ్
  • బీబీసీ కరస్పాండెంట్
కృష్ణా నదీ జలాల విషయంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణల మధ్య వివాదాలు తరచూ వస్తున్నాయి.
ఫొటో క్యాప్షన్,

శ్రీశైలం వద్ద కృష్ణానది పరవళ్లు

భారతదేశంలోని పెద్ద నదుల్లో కృష్ణ నాలుగోది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ప్రవహిస్తోన్న ఈ నది, పొడవులో గంగ, బ్రహ్మపుత్ర, గోదావరుల తరువాతి స్థానంలో ఉంటుంది.

దాదాపు 1300 కిలోమీటర్లు ప్రవహించే ఈ నది, మహారాష్ట్ర నుంచి కర్ణాటక, అక్కడి నుంచి తెలంగాణ, ఆ తరువాత ఆంధ్రాలోకి వస్తుంది. సుమారు 90 కిలోమీటర్ల దూరం తెలంగాణలో ప్రవహించి, ఆ తరువాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సరిహద్దుగా ఉంటుంది.

అంటే నదికి ఒకవైపు తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఉంటాయి. అలంపురం నుంచి ముక్త్యాల వరకు ఈ నది రెండు రాష్ట్రాలకు సరిహద్దు. ఆ తరువాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహించి సముద్రంలో కలుస్తుంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి పంపకాల వివాదాలు ఉండేవి. ఒకే రాష్ట్రంలో ఉన్నప్పటికీ, తెలంగాణ, ఆంధ్ర మధ్య కూడా కృష్ణా నీటి విషయంలో వివాదం ఉంది.

అంతేకాదు, ఏపీలో కూడా రాయలసీమ, కోస్తా ప్రాంతం మధ్య కూడా కృష్ణా నీటి విషయంలో వివాదం ఉంది.

కృష్ణానదిపై శ్రీశైలం, నాగార్జున సాగర్‌, పులిచింతల ప్రాజెక్టులు తెలంగాణ, ఆంధ్రాలకు ఉమ్మడిగా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు కుడివైపున ఏపీ ఉండగా, ఎడమవైపున తెలంగాణ ఉంది.

వీటికి ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టు తెలంగాణ భూభాగంలో ఉండగా, దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజీ ఏపీ భూభాగంలో ఉంది.

ఇవి కాక అనేక లిఫ్టు పథకాలు ఉన్నాయి. రెండు రాష్ట్రాల అవసరాలను ఈ ప్రాజెక్టులు తీరుస్తున్నాయి.

ఆ వివాదాల గురించి తెలుసుకునే ముందు నీటి గురించి కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి.

ఫొటో క్యాప్షన్,

నాగార్జున సాగర్

ట్రిబ్యునళ్లు ఏం చెప్పాయి?

రాష్ట్రాల మధ్య నీటి పంపకం కోసం భారత ప్రభుత్వం 1969 ఏప్రిల్‌లో ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. నది నీళ్లు రాష్ట్రాల మధ్య పంచడం ఈ ట్రిబ్యునల్ పని. దీనికి ఆర్ఎస్ బచావత్ అధ్యక్షులు కాగా, డిఎం భండారి, డిఎం సేన్ సభ్యులు. దీన్నే బచావత్ ట్రిబ్యునల్ అంటారు.

కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ పేరుతో పనిచేసిన ఈ బృందం 1976 మేలో తమ తీర్పును అందించింది. వాస్తవానికి 1973లోనే ఈ తీర్పు ఇచ్చినా, దాన్ని భారత ప్రభుత్వం 1976లో ప్రకటించింది.

అప్పటికి నది నీటిలో 75శాతం నీటిని లెక్కేసి పంచారు. అంటే కృష్ణా నదిలో మొత్తం 2060 టీఎంసీల నీరు నికరంగా ఉంటుందని లెక్కేసి, అప్పటి మూడు రాష్ట్రాలకు ఆ నీటిని పంచారు. అందులో 560 టీఎంసీలు మహారాష్ట్రకు, 700 టీఎంసీలు కర్ణాటకకు, 800 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌కి కేటాయించారు. ఈ నీళ్లను నదిలో ఎక్కడి నుంచైనా, ఏ ప్రాజెక్టు ద్వారానైనా వాడుకోవచ్చని చెప్పారు.

ఇక నదిలో మిగులు జలాలు 330 టీఎంసీలుగా అంచనా వేశారు. మిగులు జలాల్లో మహారాష్ట్రకు 25 శాతం, కర్ణాటకకు 50 శాతం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌కు 25 శాతం ఇస్తారు.

ఒకవేళ ఈ మిగులు జలాల పంపిణీ విషయంలో రాష్ట్రాల మధ్య ఏకాభ్రిపాయం లేకపోతే అప్పుడు పార్లమెంటు జోక్యం చేసుకుని నిర్ణయం తీసుకోవాలని రాశారు.

అయితే 1976 నాటికి ఈ మిగులు జలాల గురించిన తీర్పును కేంద్రం ఆమోదించక పోవడంతో తాత్కాలికంగా మిగులు జలాలపై ఆంధ్రప్రదేశ్‌‌కి అవకాశం ఇచ్చారు. కానీ అది హక్కు కాదు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కింద ఉంది కాబట్టి మిగులు జలాలపై సహజ వెసులుబాటును గుర్తించారు.

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్,

ప్రకాశం బ్యారేజ్

ఇక జస్టిస్ బ్రిజేశ్ కుమార్ అధ్యక్షులుగా, జస్టిస్ ఎస్‌పి శ్రీవాస్తవ, జస్టిస్ డికె సేఠ్ సభ్యులుగా 2004 ఏప్రిల్‌లో కొత్త ట్రిబ్యునల్ వేశారు. అందులో శ్రీవాస్తవ మధ్యలో మరణించగా, ఆయన స్థానంలో బిపి దాస్‌ను నియమించారు. దీని పేరు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2.

దీన్ని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ అని పిలుస్తుంటారు. వీరు 2007 జూలైలో పని ప్రారంభించారు. 2010 డిసెంబరులో ఒక ముసాయిదా తీర్పు ఇచ్చింది ఈ ట్రిబ్యునల్.

ఈ తాజా ముసాయిదా తీర్పు కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి 1001 టీఎంసీలు, కర్ణాటకకు 911 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీల నీరు ఇచ్చారు.

మొత్తం నది నీటిలో 65శాతం అందుబాటు లెక్కేసి ఈ కేటాయింపులు చేశారు. 2013 నవంబరులో బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పు ఇచ్చింది. అందులో కర్ణాటకకు నాలుగు టీఎంసీలు తగ్గించి ఆంధ్రకు పెంచారు.

అయితే ఈ తీర్పులను పాటించలేదని పలు రాష్ట్రాలు పక్క రాష్ట్రాలపై పలు సందర్భాల్లో కేసులు వేశాయి.

ఫొటో క్యాప్షన్,

ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత కృష్ణా జలాల వ్యవహారం రెండు రాష్ట్రాలు, మూడు ప్రాంతాల మధ్య వివాదంగా మారింది.

సమస్యలు ఎక్కడ మొదలవుతున్నాయి?

అసలు 2014 విభజన తరువాత రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాల సమస్య అర్థం కావాలంటే, రాష్ట్రం కలిసున్నప్పుడే కోస్తా, సీమ, తెలంగాణల మధ్య నీటి విభజన గురించి ఉన్న గొడవలు తెలియాలి.

1. నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఇప్పుడున్న స్థలం కంటే 17 కిలోమీటర్లు ఎగువన నిర్మించాలనేది మొదటి ప్రతిపాదన. అప్పటి మద్రాస్ రాష్ట్రం, హైదరాబాద్ రాజ్యాల మధ్య ఆ అంగీకారం ఉండేది.

కానీ హైదరాబాద్ స్టేట్ నుంచి తెలంగాణ, మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్ర విడిపోయి, తిరిగి ఆ రెండూ కలసి ఆంధ్రప్రదేశ్‌గా ఆవిర్భవించాయి. దీంతో కోస్తా ప్రాంతం వారు తమకు లాభం జరిగేలా నాగార్జున సాగర్ ప్రాజెక్టు స్థలాన్ని కాస్త ముందుకు జరిపించారు అనేది తెలంగాణ చేస్తున్న ఆరోపణ.

2. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తయిన తరువాత కూడా కుడి కాలువ ఆంధ్రకు, ఎడమ కాలువ తెలంగాణకు అనుకున్నారు. కానీ ఎడమ కాలువ కంటే కుడి కాలువ తక్కువ ఎత్తులో నిర్మించి ఆంధ్రకు అనుకూలం చేశారన్నది తెలంగాణ ఆరోపణ.

కానీ అక్కడి పరిస్థితులు, సాంకేతిక కారణాల వల్లే అలా జరిగిందన్నది ఆంధ్రప్రదేశ్ సమాధానం.

3. ఇక సాగర్‌లో నీరు తక్కువ ఉన్నప్పుడు నల్లగొండ ప్రాంతానికి నీరు ఆపుతూ కృష్ణా డెల్టాకు నీటి ఇబ్బంది రాకుండా వివక్ష చూపారనేది తెలంగాణ చేసే మరో ఆరోపణ.

తెలంగాణ ఉద్యమ సమయంలో తరచూ ఈ ప్రస్తావన ఉండేది. సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల తరచూ వార్తల్లో ఉండేది.

ఫొటో క్యాప్షన్,

కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ రిపోర్ట్

4. అదే సందర్భంలో ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు సాగర్ కుడి కాలువ నీరు వెళ్లాలి. నీటి ఎద్దడి ఉన్నప్పుడు వారికీ సరిగా ఆ నీరు అందదు. దాంతో ప్రకాశం జిల్లా వారు కూడా సాగర్ నీటి కోసం ఆందోళన చేసేవారు.

5. అయితే, అంతర్జాతీయ నది నియమాల్లోని ఒక సూత్రం - ముందు నుంచి వాడుకుంటున్న వారికి మొదటి హక్కు ఇవ్వాలని అంటుంటారు. దాన్నే ఫస్ట్ ఇన్ యూజ్, ఫస్ట్ ఇన్ రైట్ (ముందు వాడుకున్న వాడికి ముందు హక్కు వస్తుంది అని).

ఆ ప్రకారం కృష్ణా నది నీటిని అందరికంటే ముందు నుంచి వాడుకుంటున్న కృష్ణా డెల్టాకు ముందు హక్కు వచ్చింది. దానికి కారణం కృష్ణా నదిపై అందరికంటే చాలా ముందు బ్రిటిష్ వారి సమయంలోనే ఇప్పుడున్న ప్రకాశం బ్యారేజ్ కట్టారు.

ఆ నదిపై మిగిలిన పెద్ద ప్రాజెక్టులన్నీ స్వతంత్రం తరువాత వచ్చాయి. కాబట్టి ముందు నుంచి వాడుకుంటున్న తమకు మొదటి హక్కు ఉంటుందని కృష్ణా డెల్టా రైతుల అంటే ప్రస్తుత కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని రైతుల వాదన.

ఆ ప్రకారమే ప్రతి సందర్భంలో తన నీటి వాటా విషయంలో కచ్చితంగా ఉంటూ వస్తోంది కృష్ణా డెల్టా.

6. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి కృష్ణా నీళ్లు కర్ణాటక కంటే ఎక్కువ వచ్చాయి. సహజ నదీ సూత్రాల ప్రకారం, కృష్ణా నది, దాని ఉప నదులు ఎక్కువగా ప్రవహించే కర్ణాటకకే సహజంగా ఎక్కువ నీటి కేటాయింపులు జరగాలి. ఆ నది బేసిన్ సింహ భాగం కర్ణాటకలోనే ఉంది.

కానీ ఇంతకు ముందు చెప్పిన ఫస్ట్ ఇన్ యూజ్ సూత్రం ప్రకారం తమకు పూర్తి కేటాయింపులు ఉండాలని వాదించి తమకు నష్టం రాకుండా ఏర్పాటు చేసుకున్నారు కృష్ణా డెల్టా వారు. ఇది 1970లలో జరిగింది.

కృష్ణా నదిలో ఎన్ని ప్రాజెక్టులు కట్టినా, నీరు ఎంత తగ్గినా ముందుగా తమకు అందాల్సిందే అన్న విషయంలో చాలా పట్టుదలగా ఉండి, ఆ నీటిని తీసుకెళ్లగలిగారు కృష్ణా డెల్టా వారు.

ఫొటో క్యాప్షన్,

కృష్ణా బేసిన్ మ్యాప్

7. అయితే 3-4 దశాబ్దాల క్రితం మిగతా ప్రాంతాలతో పోలిస్తే, వరి సాగు కృష్ణా డెల్టాలో ఎక్కువ. దీంతో ఆ డెల్టాకు లోటు లేకుండా నీరు అందించడం వల్ల, వ్యవసాయ ఉత్పత్తి స్థిరంగా ఉండి దేశానికి ఆహార కొరత రాకుండా చూడడం ఒక లక్ష్యంగా చెబుతారు.

అందుకే కోస్తాకు బేసిన్‌తో సంబంధం లేకుండా ఎక్కువ నీరు వచ్చిందని చెబుతారు కొందరు నిపుణులు.

8. ఇక కరెంటు కోసం కట్టిన శ్రీశైలం ప్రాజెక్టును ముందుగా తాగు నీటి కోసం, తరువాత సాగు నీటి కోసం వాడుకోవడం క్రమంగా మొదలైంది. ఆ క్రమంలో చెన్నైకి తాగునీరు ఇచ్చేందుకు తెలుగు గంగ పథకం చేపట్టారు. ఆ తెలుగు గంగ కాలువలోకి నీటిని తీసుకోవడం కోసం కర్నూలు జిల్లాలోని పోతిరెడ్డిపాడు అనే చోట ఒక హెడ్ రెగ్యులేటర్ వ్యవస్థ నిర్మించారు.

శ్రీశైలం డ్యామ్ నుంచి నీటిని కాలువల్లోకి ఎత్తిపోసే వ్యవస్థే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్.

ఫొటో క్యాప్షన్,

ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో తమకు సరైన వాటా రాకుండా కుట్ర జరిగిందనేది తెలంగాణ ఆరోపణ

9. మొదట్లో దీన్ని 11,500 క్యూసెక్కుల నీటిని కాలువల్లోకి పారించే సామర్థ్యంతో నిర్మించారు. దీని ద్వారా చెన్నైకి తాగునీరే కాకుండా, కృష్ణాలో వరద వచ్చినప్పుడు అదనంగా వచ్చే నీటిని రాయలసీమకు ఇవ్వవచ్చు. వాస్తవానికి రాయలసీమలో చాలా భాగం పెన్నా నది బేసిన్‌లో ఉంటుంది.

అయితే కృష్ణా నది దగ్గరగా ఉంటుంది. కాబట్టి కృష్ణా మిగులు, వరద జలాలు సీమకు ఇవ్వాలనేది రాయలసీమ ప్రజల ఆకాంక్ష. కృష్ణా నదికి వరద వచ్చే రోజులు తగ్గిపోయాయి. దీంతో తక్కువ రోజుల్లో ఎక్కువ నీరు తీసుకెళ్తే తప్ప రాయలసీమ నీటి అవసరం తీరదు.

కాబట్టి తక్కువ వ్యవధిలో ఎక్కువ నీరు తీసుకెళ్లడానికి పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచాలనేది మొదటి ప్రతిపాదన.

10. అయితే, కృష్ణా నది బేసిన్ పరిధిలోకే వచ్చే మహబూబ్‌నగర్ వంటి ప్రాంతాలు తీవ్ర కరవుతో ఉన్నప్పుడు, ముందు మహబూబ్‌నగర్‌కి ఇవ్వకుండా అసలు కృష్ణా బేసిన్‌లో లేని రాయలసీమకు నీరు ఇవ్వడం సరికాదని తెలంగాణ వాదన. అందుకే తరచూ పోతిరెడ్డిపాడు విషయంలో రాయలసీమ తెలంగాణ మధ్య గొడవ వస్తుంది.

11. శ్రీశైలం డ్యాములో నీటి మట్టం 841 అడుగులు దాటితే పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి నీరు విడుదల చేయవచ్చు. అయితే 854 దాటితే తప్ప నీరు రాదని ఆంధ్ర ప్రభుత్వం చెబుతోంది. 2005లో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల రాయలసీమ ప్రాంతానికి మేలు జరుగుతుంది.

అప్పటికి అక్కడ ఉన్న నాలుగు తూములకు అదనంగా మరో ఏడు తూములు ఏర్పాటు చేయాలని, దాని ద్వారా సామర్థ్యాన్ని 11,500 నుంచి 44 వేల క్యూసెక్కులు పెంచాలనేది ప్రతిపాదన.

సామర్థ్యం పెంచేది ఎక్కువ నీటిని తీసుకోవడానికి కాదనీ, కానీ తక్కువ సమయంలో ఎక్కువ వేగంగా నీటిని తీసుకోవడానికి అని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది. దీనిని తెలంగాణ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

దీనివల్ల తెలంగాణకు నీరు అందదనీ, పైగా కృష్ణా బేసిన్‌లో ఉండే తెలంగాణ ప్రాంతాలు ఎండుతుండగా, కృష్ణా బేసిన్‌లో లేని రాయలసీమకు నీరు ఇవ్వడం కోసం ఇలా పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు సరికాదని వారి వాదన.

కానీ మొత్తానికి పోతిరెడ్డిపాడు సామర్థ్యం పాత, కొత్త కలిపి 55 వేల క్యూసెక్కులు దాటింది.

12. ఎన్నో సందర్భాల్లో నీటి అవసరాల కోసం కర్ణాటక ఆంధ్రా సరిహద్దుల్లోని రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ దగ్గర, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గరా గొడవలు, కొట్లాటలు జరిగాయి.

13. పోతిరెడ్డిపాడు వల్ల రాయలసీమకు లాభమే కానీ తెలంగాణకు నష్టం లేదని ఆంధ్రప్రదేశ్ వాదన. కానీ దీనికి అప్పట్లో కోస్తా రైతుల నుంచి కూడా అభ్యంతరం వచ్చింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి శ్రీశైలం నీటిని రాయలసీమకు ఇస్తే, తమకు నీరు లోటు రావచ్చని భయపడి ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేసారు కోస్తా రైతులు.

ఇది ఒక దశలో రాయలసీమ వర్సెస్ కోస్తా అండ్ తెలంగాణలా అయింది. మొత్తానికి పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచారు.

14. అదే సమయంలో పోతిరెడ్డిపాడు వల్ల కృష్ణా డెల్టా వారికి నష్టం కలగకుండా పులిచింతల దగ్గర మరో ప్రాజెక్టు చేపట్టారు. ఇందులో కోస్తాకు నీటి వాటా, తెలంగాణకు కరెంటు వాటా దక్కింది. దీని వల్ల పోతిరెడ్డిపాడు ఎత్తు పెరిగినా, కృష్ణా డెల్టాకు నష్టం లేదనే భరోసా ఇచ్చింది ప్రభుత్వం.

15. ఇక పేరుకు తెలుగు గంగ చెన్నైకి నీరు ఇచ్చేదే అయినప్పటికీ ఆ కాలువ ఆధారంగా వెలిగోడు, కండలేరు, సోమశిల వంటి రిజర్వాయర్లు నిర్మించి వాటిని అక్రమంగా నింపి రాయలసీమకు శ్రీశైలం నీటిని మళ్లిస్తున్నారని తెలంగాణ ఆరోపిస్తోంది.

అసలు చెన్నైకి ఇస్తామన్న నీరు కూడా ఇవ్వకుండా ఆ వంకతో రాయలసీమ ప్రాజెక్టులు నింపుకుంటూ తమకు అన్యాయం చేస్తున్నారని తెలంగాణ వాదన.

16. కానీ, ఈ మళ్లింపు వల్ల కృష్ణా డెల్టా వారికి మాత్రం ఇబ్బంది లేకుండా ఉండేలా పట్టిసీమ వచ్చింది. పోలవరం పూర్తయ్యాక గోదావరి నీరు కృష్ణాలోకి రావాలి. కానీ అప్పటి వరకూ ఆలస్యం చేయకుండా, పట్టిసీమ దగ్గర నుంచే గోదావరి నీటిని లిఫ్టు చేసి ప్రకాశం బ్యారేజ్‌లోకి నీటిని వదులుతున్నారు.

దీంతో అటు పులించింతల, ఇటు పట్టిసీమ వల్ల కృష్ణా డెల్టా రైతులకు సాగునీటికి భరోసా దక్కింది. దీంతో వారు రాయలసీమకు నీటిని తీసుకెళ్లే పథకాలపై పెద్ద అభ్యంతరం పెట్టడం మానేశారు. కానీ రాయలసీమ, తెలంగాణ మధ్య వివాదం అలానే ఉండిపోయింది.

17. శ్రీశైలం నుంచి నీటిని ముందే సీమకు తోడేస్తే కింద నాగార్జున సాగర్‌లోకి నీరు రాక, సాగర్ కుడి కాలువ చివర్లో ఉన్న తమకు నీరు అందడంలో ఇబ్బంది ఉంటుందని ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల వారు కూడా అభ్యంతరం చెబుతున్నారు. ఇది మరో వివాదం.

18. రాయలసీమలో చాలా భాగం పెన్నా బేసిన్‌లో ఉంటుంది కాబట్టి, ముందు తెలంగాణ వాడుకున్న తరువాతే రాయలసీమలోని కృష్ణా బేసిన్ కాని భాగాలకు నీరు ఇవ్వాలని తెలంగాణ వాదన. అయితే, తాము అలానే చేస్తున్నామని, కేవలం మిగులు, వరద జలాలు తప్ప నికర జలాల్లోంచి రాయలసీమలోని పెన్నా బేసిన్‌కి నీరు ఇవ్వడం లేదని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది.

కానీ, ఏపీ చెప్పేది నిజం కాదని, తెలంగాణకు నికరంగా రావాల్సిన నీటిని కూడా రాయలసీమకు తరలించుకుపోతోందని తెలంగాణ ఆరోపణ. ఇది ఇలా సాగుతూనే ఉంది.

19. బచావత్ తీర్పులో తమకు అన్యాయం జరిగిందని భావిస్తున్న కర్ణాటక, కృష్ణా నదిపై విస్తృతంగా ప్రాజెక్టులు నిర్మించడం మొదలుపెట్టి, వారికి వాస్తవం కేటాయింపుల కంటే ఎక్కువే వాడుకోవడం ప్రారంభించింది.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్,

కృష్ణా నది జలాల వివాదంలో కృష్ణా డెల్టా ప్రాంతం కేంద్ర బిందువుగా మారుతోంది.

విభజన తరువాత:

ఈ పరిస్థితుల్లో 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయాయి. బేసిన్ల లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణా బేసిన్ 68శాతం ఉండగా, నీటి వాటా 37 శాతం వచ్చింది. ఇక ఆంధ్రలో కృష్ణా బేసిన్ 32శాతం ఉండగా, నీటి వాటా 64 శాతం వచ్చింది.

ఉమ్మడి రాష్ట్రానికి ముందు నుంచి ఉన్న 811 టీఎంసీల నీటిని రెండు రాష్ట్రాలు పంచుకున్నాయి. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అనుకున్నారు. ఇది తాత్కాలిక సర్దుబాటు మాత్రమే.

ఆంధ్రాకు వచ్చిన దాంట్లో తిరిగి కోస్తాకు 367 టీఎంసీలు, సీమకు 145 టీఎంసీలు అనుకున్నారు. ఇది కేవలం ఒప్పందం మాత్రమే. తీర్పు కాదు. నిజానికి కృష్ణా బేసిన్ తక్కువ ఉన్నప్పటికీ, ఆంధ్రాకు ఎక్కువ నీటి కేటాయింపు రావడానికి ముందు చెప్పుకున్నట్టు కృష్ణా డెల్టా తన హక్కు ఉపయోగించడం, దిగువన ఉండడం వంటివి కారణాలు.

సహజ జల సూత్రాల్లో బేసిన్ నిబంధన ప్రామాణికంగా తీసుకుంటే తెలంగాణకు, మొదటి వినియోగదారు నిబంధన ప్రామాణికంగా తీసుకుంటే ప్రత్యక్షంగా కోస్తా, పరోక్షంగా రాయలసీమకు మేలు. కాబట్టి బేసిన్ రూల్ కోసం తెలంగాణ, ఫస్ట్ యూజర్ రూల్ కోసం ఆంధ్రప్రదేశ్ పట్టుబడుతుంటాయి.

విభజన చట్టం కింద కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు. విడిపోయిన తరువాత నీటి పంపకాలు కూడా కొత్తగా చేపట్టాలని తెలంగాణ కోరింది.

అంతకుముందు తీర్పుల సమయంలో తెలంగాణలేదు కాబట్టి, తెలంగాణ వాదన వినేలా కొత్త ట్రిబ్యునల్ కావాలని తెలంగాణ వాదించింది.

అందుకోసం కొత్తగా ట్రిబ్యునల్ వేయాలని 2014లో కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. లేదంటే ఉన్న ట్రిబ్యునలే కొత్తగా నీటి పంపకాలు చేయాలని డిమాండ్ చేసింది.

కేంద్రం మాత్రం పాత ట్రిబ్యునల్‌ని మరో రెండేళ్లు పొడిగించింది. అసలు మొత్తం కేటాయింపులు కొత్తగా చేయాలని తెలంగాణ పట్టుపడుతోంది.

దీనికి కర్ణాటక, మహారాష్ట్ర ఒప్పుకోలేదు. విడిపోయిన రెండు రాష్ట్రాలూ వాటి మధ్య పంపకాల సంగతి చూసుకోవాలి తప్ప, మొత్తం నది నీళ్లు తిరిగి పంపకాలు చేయడం కుదరదన్న మహారాష్ట్ర, కర్ణాటక, ఇదే విషయాన్ని బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ముందు చెప్పాయి.

ఫొటో సోర్స్, @AKYOnline/twitter, CMO Telangana/twitter

ఫొటో క్యాప్షన్,

ట్రిబ్యునళ్ల తీర్పులున్నా తెలంగాణ, ఏపీల మధ్య జలవివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

అంతేకాదు, ఇక్కడీ పంచాయితీ నడుస్తుండగానే, ఆ పాత తీర్పునే వెంటనే ప్రచురించాలని కోరుతూ ఆ రెండు రాష్ట్రాలు కోర్టుకు వెళ్లాయి.

రాష్ట్రం విడిపోయిన తరువాత కొత్త ప్రభుత్వాలు రెండు పోలవరం, కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టులపై శ్రద్ధ పెట్టాయి. ఆ క్రమంలోనే రాయలసీమకు నీరు అందించేందుకు, గోదావరి కృష్ణా నదులను అనుసంధానం చేసేలా రెండు రాష్ట్రాలూ ప్రణాళిక వేసుకున్నాయి.

వాటిలో పట్టిసీమ ఒక్కటే పూర్తయి డెల్టా రైతులకు మేలు చేసింది. రాయలసీమ, ప్రకాశం, తెలంగాణలోని పలు జిల్లాల కోసం తలపెట్టిన పలు ఎత్తిపోతల పథకాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి అనుమతుల విషయంలోనూ గొడవలున్నాయి. పరస్పరం కేసులు వేసుకున్నాయి.

ఆ క్రమంలో 2020వ సంవత్సరంలో పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావించింది. అది కాకుండా రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్ పేరుతో మరో ఎత్తిపోతలకు ప్రతిపాదించింది ఆంధ్ర.

అటు తెలంగాణ కూడా పాలమూరు రంగారెడ్డి వంటి కొన్ని లిఫ్టులకు ప్రతిపాదించింది. మరికొన్ని లిఫ్టుల సామర్థ్యం పెంచే పని ప్రారంభించింది. ఇద్దరి ఉద్దేశమూ శ్రీశైలం నీటిని తమ ప్రాంతాలకు తీసుకెళ్లడం. కానీ ఎవరు ఎంత ఎప్పుడు తీసుకెళ్తారు అన్న ప్రశ్న, తమకు మిగలకుండా తీసుకుపోతారన్న అనుమానం ఇద్దరిదీ.

ఇక్కడ మరో అంశం కూడా ఉంది. గోదావరిలో మిగులు నీటిని కృష్ణాకు తరలించాలని రెండు రాష్ట్రాలూ అనుకుంటున్నాయి. దీనికి కేసీఆర్ ఒక ప్రతిపాదన తెచ్చారు.

''రెండు రాష్ట్రాలూ ఒక ఒప్పందానికి వచ్చి, పోలవరం ద్వారా గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు ఇవ్వాలని. అప్పుడు కృష్ణా నది నుంచి కృష్ణా డెల్టాకు ఇవ్వాల్సిన నీరు మిగులుతుంది కదా. దాన్ని శ్రీశైలం, నాగార్జునసాగర్ల దగ్గరే ఆపేసి అటు దక్షిణ తెలంగాణ, ఇటు రాయలసీమ వాడుకోవాలి''- ఇదీ ఆ ప్రతిపాదన.

కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దీనికి అంగీకరించలేదు. దీనిపై నిపుణుల్లో, నాయకుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం. దీనివల్ల ఇద్దరికీ లాభమే కానీ, అది పూర్తయ్యే సరికి చాలా సమయం పట్టడం ఒక సమస్య అయితే, భవిష్యత్తులో ముఖ్యమంత్రుల మధ్యగానీ, రాష్ట్రాల మధ్య గానీ సమస్యలు వస్తే అప్పుడు ఈ ఒప్పందం ప్రమాదంలో పడవచ్చనే అనుమానం కొందరిలో ఉంది.

కారణాలేమైనా ఈ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ అంగీకరించలేదన్న అసంతృప్తి తెలంగాణకు ఉంది.

ఈ పరిస్థితుల్లో తాజా గొడవ ప్రారంభం అయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)