టోక్యో ఒలింపిక్స్: భారత్ నుంచి పతకం సాధించగలిగే అగ్రశ్రేణి క్రీడాకారులు వీరే...

  • ఆండ్రూ క్లారన్స్
  • బీబీసీ కరస్పాండెంట్
రియో ఒలింపిక్స్‌లో సింధు సిల్వర్ గెలిచారు. ఈసారి గోల్డ్ మీద గురి పెట్టారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

రియో ఒలింపిక్స్‌లో సింధు సిల్వర్ గెలిచారు.

ఎన్నో ఆశలతో, అంచనాలతో ఒలింపిక్స్ కోసం భారత్ భారీ బృందాన్ని టోక్యోకు పంపుతోంది. గత ఒలింపిక్స్ లో గెలిచిన పతకాల సంఖ్యను ఈసారి మరింత మెరుగు పరుచుకోవాలని భావిస్తోంది.

భారత్ నుంచి 85 క్రీడాంశాల్లో 120 మంది అథ్లెట్లు ఈసారి ఒలింపిక్స్ లో పోటీపడనున్నారు. షూటింగ్, రెజ్లింగ్, బాక్సింగ్, ఆర్చరీ, బ్యాడ్మింటన్ ఈవెంట్‌లలో టీమిండియాకు పతకం లభించే అవకాశాలున్నాయి.

2016 రియో ఒలింపిక్స్ లో భారత్ 2 పతకాలను గెలుచుకుంది. హైదరాబాద్ స్టార్ షట్లర్ పీవీ సింధు బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో రజత పతకాన్ని సాధించగా, రెజ్లింగ్ మహిళల 58 కేజీల ఫ్రీ స్టయిల్ ఈవెంట్ లో సాక్షి మలిక్ కాంస్య పతకాన్ని అందించింది.

ఈ క్రీడల్లో భారత్ తొలిసారిగా ఫెన్సింగ్, ఈక్వెస్ట్రియన్ క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం వహిస్తోంది. ఫెన్సింగ్ క్రీడలో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన తొలి ఫెన్సర్ గా భవానీ దేవి చరిత్ర సృష్టించారు. ఈక్వెస్ట్రియన్ క్రీడలో ఫౌద్ మీర్జా భారత్ కు ప్రాతినిధ్యం వహించనున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

మనూ భాకర్, సౌరభ్ చౌధరి షూటింగ్‌లో భారత్ తరఫున ఆశాకిరణాలు

షూటింగ్

15 మందితో కూడిన షూటింగ్ బృందంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ జట్టు భారత్ పతకాల సంఖ్య పెంచుతుందని అందరూ నమ్ముతున్నారు.

ముఖ్యంగా మను భాకర్, సౌరభ్ చౌధరీల నుంచి పతకాలను అందరూ ఆశిస్తున్నారు.

మహిళల 10మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో గట్టి పోటీనిచ్చే షూటర్లలో భారత్ నుంచి 19 ఏళ్ల భాకర్ ఒకరు. ఈ విభాగంలో ఆమె ఖాతాలో ప్రపంచ కప్ స్వర్ణాలు, కామన్వెల్త్ పతకాలు ఉన్నాయి. యూత్ ఒలింపిక్స్ లోనూ ఆమె పతకాన్ని గెలుచుకున్నారు.

ప్రపంచ నంబర్ 2 షూటర్, యూత్ ఒలింపిక్స్ చాంపియన్ సౌరభ్ చౌధరీ... 2018 ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన అతి పిన్న భారత షూటర్ గా రికార్డు నెలకొల్పారు. 16 ఏళ్ల వయస్సులో సౌరభ్ ఆ పతకాన్ని సాధించారు.

10మీ. ఎయిర్ పిస్టల్ మిక్స్ డ్ ఈవెంట్ లో పతకం గెలుపొందే జోడీల్లో మను భాకర్- సౌరభ్ జంట ఒకటి. వీరిద్దరూ జంటగా అంతర్జాతీయ షూటింగ్ టోర్నీల్లో వరుసగా 5 స్వర్ణాలను గెలుపొందారు. క్రొయేషియాలో జూన్ లో జరిగిన ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్ లో రజత పతకం సాధించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

2019 నుంచి సింధు ఆటతీరులో తడబాటు ఉన్నా ఆత్మవిశ్వాసంతోనే ఉన్నారు

బ్యాడ్మింటన్

21 ఏళ్ల పీవీ సింధు రియో ఒలింపిక్స్ లో రజత పతకాన్ని సాధించి కోట్లాది మంది హృద‌యాల‌ను గెలుచుకున్నారు. ఆ సమయంలో యువ షట్లర్ సింధు ఒలింపిక్ పతకం సాధిస్తారని ఎవరూ ఊహించలేదు. కానీ ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఆమె పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

'అప్పుడు నేను ఒలింపిక్స్ లో కేవలం భారత్ తరఫున ఆడే ఒక వ్యక్తిని మాత్రమే. కానీ ఇప్పుడు అందరూ సింధు తప్పకుండా పతకం సాధించాలి అని కోరుకుంటున్నారు' అని తనపై ప్రజల్లో ఉన్న అంచనాల గురించి పీవీ సింధు ఇటీవలే బీబీసీతో అన్నారు.

గతేడాది సింధు, బీబీసీ తొలి 'ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్' అవార్డుకు ఎంపికయ్యారు.

2019లో ప్రపంచ మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్ గా అవతరించారు. ఆ తర్వాత నుంచి ఆమె ఫామ్ గాడి తప్పింది. ఆటలో అస్థిరత ఏర్పడింది. అయినప్పటికీ భారత్ తరఫున ఒలింపిక్స్ పతకం సాధించే వారిలో తొలి స్థానం ఆమెదే.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

బాక్సర్ మేరీకోమ్‌కు ఇవే ఆఖరి ఒలింపిక్స్

బాక్సింగ్

భారత ఐరన్ లేడీ, మాగ్నిఫీషియంట్ మేరీ ఇలా ఎన్నో ఉపమానాలు తన పేర లిఖించుకున్న బాక్సర్ మేరీ కోమ్ ఈసారి ఒలింపిక్స్ లో ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్నారు.

2012 లండన్ ఒలింపిక్స్ లో ఆమె కాంస్య పతకాన్ని సాధించారు. ఈసారి మహిళల ఫ్లై వెయిట్ (51 కేజీలు) విభాగంలో భారత్ కు ప్రాతినిధ్యం వహిస్తోన్న మేరీ పతకం రంగును మార్చేందుకు సిద్ధమయ్యారు.

దుబాయ్ వేదికగా మే నెలలో జరిగిన ఆసియా బాక్సింగ్ చాంపియన్ షిప్ మేరీ రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు. ఫైనల్లో ఆమె కజకిస్తాన్ బాక్సర్ నజిమ్ కిజబే చేతిలో పరాజయం పాలయ్యారు.

38 ఏళ్ల దిగ్గజ బాక్సర్ కు ఇవే చివరి ఒలింపిక్స్ కానున్నాయి. ఆమె తన కెరీర్ ను ముగించే ముందు ఈ క్రీడల్లో పతకం సాధిస్తే చూడాలని యావత్ దేశం ఆశ పడుతోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

గత ఒలింపిక్స్ ‌లో గాయాల కారణంగా వినేశ్ ఫోగాట్ మధ్యలోని తిరిగి వచ్చారు.

రెజ్లింగ్

2016 రియో ఒలింపిక్స్ లో భారత్ రెజ్లింగ్ ఈవెంట్ లో మంచి ప్రదర్శనను కనబరిచింది. మహిళల విభాగంలో సాక్షి మలిక్ అనూహ్యంగా కాంస్య పతకాన్ని సాధించి పతకాల సంఖ్యను పెంచారు. టోక్యోలో భారత మహిళల రెజ్లింగ్ దళాన్ని వినేశ్ ఫొగాట్ నడిపించనున్నారు.

రియో ఒలింపిక్స్ లో పోటీపడి తీవ్రంగా గాయపడిన వినేశ్... వీల్ చైర్ లో భారత్ కు తిరుగు పయనమయ్యారు. శస్త్ర చికిత్స అనంతరం కోలుకొని టోక్యో కోసం సిద్ధమయ్యారు.

26 ఏళ్ల వినేశ్ 53 కేజీల విభాగంలో టైటిల్ ఫేవరెట్ గా ఉన్నారు. గత రెండు నెలల్లో ఆమె గొప్ప ప్రదర్శన కనబరిచి, ఈ విభాగంలో ప్రపంచ నంబర్ వన్ రెజ్లర్ గా నిలిచారు.

‘ఒకానొక సమయంలో గాయం కారణంగా నా కెరీర్ ముగిసి పోయిందనే అనుకున్నా. కానీ నాకు రెండో అవకాశం లభించింది. ఇప్పుడు నా కలల్ని నిజం చేసుకుంటా' అని వినేశ్ చెప్పారు.

పురుషుల 65 కేజీల విభాగంలో భారత్ నుంచి బజరంగ్ పూనియా పతకాన్ని ఆశిస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు ప్రపంచ చాంపియన్ గా నిలిచిన బజరంగ్ కు ఇదే తొలి ఒలింపిక్స్ కావడం విశేషం.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

వెయిట్ లిఫ్టింగ్‌లో భారత ఏకైక స్టార్ మీరాభాయి చాను

వెయిట్ లిఫ్టింగ్

టోక్యో వేదికపై లిఫ్టర్ మీరాబాయి చాను తన అదృష్టాన్ని రెండోసారి పరీక్షించుకోనున్నారు. 2016లో రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించిన చాను... మహిళల 48 కేజీల క్లీన్ అండ్ జెర్క్ విభాగంలో నిర్ణీత 3 ప్రయత్నాల్లో కూడా సఫలం కాలేకపోయారు.

2017 ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో స్వర్ణం సాధించిన చాను, ఆ తర్వాత ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకాన్ని చేజిక్కించుకున్నారు. 2019 ఆసియా వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్యాన్ని గెలుపొందారు.

వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్ లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోన్న ఏకైక లిఫ్టర్ మీరాబాయి చాను టోక్యోలో పతకంపై దృష్టి సారించారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

రికర్వ్ విభాగంలో దీపికా కుమారి వరల్డ్ నంబర్ వన్

ఆర్చరీ

గత నెలలోనే భారత అగ్రశ్రేణి ఆర్చర్ దీపికా కుమారి మూడు ప్రపంచకప్ స్వర్ణాలను కొల్లగొట్టారు.

మహిళల రికర్వ్ విభాగంలో ఆమె ఇప్పుడు ప్రపంచ నంబర్ వన్ ప్లేయర్. టోక్యోలో పతకం గెలిచే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి.

దీపిక ఇప్పటివరకు పలు ఆర్చరీ ప్రపంచ కప్ టోర్నీలలో మొత్తం 9 స్వర్ణాలు, 12 రజతాలు, 7 కాంస్య పతకాలను గెలుపొందారు. ఇప్పుడు ఒలింపిక్ పతకాన్ని తన ఖాతాలో వేసుకునే ప్రయత్నంలో ఉన్నారు.

ఇటీవలి ఒలింపిక్స్ క్రీడల్లో భారత పతకాల సంఖ్య

2016 రియో ఒలింపిక్స్: 1 రజతం, 1 కాంస్యం

2012 లండన్ ఒలింపిక్స్: 2 రజతాలు, 4 కాంస్యాలు

2008 బీజింగ్ ఒలింపిక్స్: 1 స్వర్ణం, 2 కాంస్యాలు.

భారత్ 1900 నుంచి ఇప్పటివరకు ఒలింపిక్స్ లో మొత్తం 28 పతకాలను గెలుపొందింది. ఇందులో 11 పతకాలు హాకీ క్రీడలో సాధించగా... రెజ్లింగ్ లో 5, షూటింగ్ లో 4, బ్యాడ్మింటన్, బాక్సింగ్, అథ్లెటిక్ క్రీడాంశాల్లో 2 , టెన్నిస్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడల్లో ఒకటి చొప్పున పతకాలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)