ఆర్‌బీఐ: త్వరలో డిజిటల్ కరెన్సీ - ప్రెస్ రివ్యూ

రిజర్వ్ బ్యాంక్

ఫొటో సోర్స్, AFP

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) తన సొంత డిజిటల్‌ కరెన్సీని దశల వారీగా ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఈనాడు దిన పత్రిక పేర్కొంది. 'సమీప భవిష్యత్‌లో టోకు, రిటైల్‌విభాగాల్లో ప్రయోగాత్మకంగా డిజిటల్‌ కరెన్సీ తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ పని చేస్తోందని గురువారం బ్యాంకు డిప్యూటీ గవర్నర్‌ టీ. రవిశంకర్‌ తెలిపారు.

పలు దేశాల్లో టోకు, రిటైల్‌ విభాగాల్లో 'సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ)లు ఇప్పటికే అమలవుతున్నాయిని ఆయన గుర్తు చేశారు.

ప్రైవేట్ వర్చువల్‌ కరెన్సీ(వీసీ) తరహాలో ఉపయోగించుకునేలా దేశీయ సీబీడీసీని ఆర్‌బీఐ అభివృద్ధి చేస్తోందన్నారు.

ప్రభుత్వ ఆమోద ముద్ర లేని కొన్ని వర్చువల్‌ కరెన్సీల విలువల్లో ఏర్పడుతున్న'హెచ్చుతగ్గుల భయం' లేకుండా సీబీడీసీని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

దీని వల్ల నగదుపై ఆధారపడడం తగ్గుతుందని, కరెన్సీ విలువకు, తయారీ ఖర్చుకు మధ్య అంతరం భారీగా పెరుగుతుందని, సెటిల్‌మెంట్‌ రిస్క్‌ కూడా పరిమితంగానే ఉంటుందని ఆయన వివరించారు.

డిజిటల్‌ కరెన్సీని తీసుకురావడానికి కాయినేజ్‌ యాక్ట్‌, ఫెమా, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టాల్లో సవరణలు చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారని ఈనాడు కథనంలో తెలిపారు.

ఏపీలో గోదావరి 'ఉగ్రరూపం'

గోదావరి ఉగ్రరూపం దాల్చి, పోటెత్తి ప్రవహిస్తోందని సాక్షిదిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

'తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలతోపాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో ఉపనదులు పొంగి గోదావరికి వరద పెరిగింది.

తెలంగాణలోని శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, కాళేశ్వరంలో అంతర్భాగమైన లక్ష్మీ, సరస్వతి, పార్వతి బ్యారేజీలు, మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు, కడెం జలాశయాల గేట్లన్నీ ఎత్తేసి దిగువకు భారీగా వరదను విడుదల చేస్తున్నారు.

దీంతో పోలవరం ప్రాజెక్టు వద్ద వరద గంటగంటకు పెరుగుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు పోలవరం వద్దకు 1.65 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. నీటిమట్టం 27.7 మీటర్లకు చేరింది.

వచ్చిన వరదను వచ్చినట్టుగా 48 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ఎగువనుంచి ఇంకా భారీగా వరద వస్తున్న నేపథ్యంలో శుక్రవారం పోలవరం వద్దకు నాలుగు లక్షల క్యూసెక్కుల జలాలు వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.

ధవళేశ్వరం బ్యారేజీలోకి 62,219 క్యూసెక్కుల వరద వస్తుండగా.. మిగులుగా ఉన్న 63,608 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.

ఫొటో సోర్స్, http://rythubandhu.telangana.gov.in/

రైతు బంధు కోసం బతికున్న వ్యక్తికి డెత్ సర్టిఫికెట్

తెలంగాణలో ఓ మహిళా రైతు బతికుండగానే చనిపోయినట్టు పత్రాలు సృష్టించి రైతుబీమా పొందారని నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.

రైతుబంధు గ్రామ కో ఆర్డినేటర్‌ ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు.

వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల మండలం పుట్టపహాడ్‌కు చెందిన మహిళారైతు చంద్రమ్మకు 1.30 ఎకరాల వ్యవసాయభూమి ఉన్నది.

ఆమెకు క్రమంతప్పకుండా రైతుబంధు సాయం అందుతున్నది. గత రెండుపర్యాయాలు రైతుబంధు సొమ్ము ఆమె ఖాతాలో జమకాలేదు.

రైతు బతికిఉండగానే చనిపోయినట్టుగా పత్రాలు తయారుచేసి రైతుబీమా పొందుతున్నారంటూ గ్రామానికి చెందిన ఒకమహిళ వ్యవసాయాధికారులకు ఫిర్యాదుచేసింది. దీనిపై అధికారులు విచారణ చేపట్టడంతో విషయం వెలుగులోకివచ్చింది.

చంద్రమ్మ చనిపోయినట్టు నకిలీపత్రాలతో బీమాసొమ్ము పొందినట్టు తేలింది. 14-09-2020న చంద్రమ్మ మృతిచెందినట్టుగా రైతుబంధు గ్రామ కో-ఆర్డినేటర్‌ రాఘవేందర్‌రెడ్డి 30-09-2020న డెత్‌సర్టిఫికెట్‌ సృష్టించారు.

జిరాక్స్‌షాపులో మరణ ధ్రువీకరణ పత్రం కొనుగోలుచేసి పంచాయతీ ముద్రలను నకిలీవి తయారుచేయించాడు. బీమా క్లెయిమ్‌కోసం పత్రాలు నింపి గ్రామంలో చనిపోయిన ముగ్గురు రైతుల క్లెయిమ్‌ ఫైళ్లతోపాటు అధికారులకు అందజేశాడు.

ఒకేసారి నాలుగు ఫైళ్లు రావడంతో వ్యవసాయాధికారులు విచారణ లేకుండానే వాటిని బీమా కోసం పంపించారు.

2020 డిసెంబర్‌9న బీమా క్లెయిమ్‌ అయింది. వడ్ల డబ్బులు బాలయ్య ఖాతాలో పడ్డాయని నమ్మించి అతడి ఖాతా నుంచి రాఘవేందర్‌రెడ్డి పలుదఫాలుగా డబ్బులు తీసేసుకున్నాడు.

రైతుబీమా డబ్బులు దుర్వినియోగమైనట్టు తెలుసుకున్న వ్యవసాయశాఖ అధికారులు గురువారం గ్రామానికి చేరుకుని పంచాయతీలో రికార్డులను పరిశీలించారు.

డెత్‌సర్టిఫికెట్‌ తీసుకున్న తేదీని విచారించగా.. పంచాయతీ నుంచి తీసుకోలేదని తేలింది. అధికారులు రాఘవేందర్‌రెడ్డి, బాలయ్యపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారని ఈ కథనంలో తెలిపారు.

ఫొటో సోర్స్, UGC

5 లక్షలు లంచం అడిగి ఏసీబీకి చిక్కిన మహిళా తహసీల్దార్

భూమి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, పాస్‌ పుస్తకం జారీ చేసేందుకు భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ భూపాలపల్లి జిల్లా కాటారం తహసీల్దార్‌ మేడిపల్లి సునీత ఏసీబీ అధికారులకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికి పోయారని ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రచురించింది. 'కాటారం మండలంలోని సుందర్రాజ్‌పేటకు చెందిన దివ్యాంగుడైన రైతు హరికృష్ణకు కొత్తపల్లి శివారులోని సర్వే నంబరు 3, 4లలో నాలుగెకరాల 25 గుంటల భూమి ఉంది.

పాత పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్నా భూమి వివరాలు ధరణిలో నమోదు కాలేదు. రెండు నెలల క్రితం తహసీల్దార్‌ సునీతను కలిసిన హరికృష్ణ. నూతన పట్టాదారు పాస్‌ పుస్తకం ఇప్పించాలని కోరాడు. దీనికి ఆమె రూ.5 లక్షలు లంచం డిమాండ్‌ చేశారని పత్రిక రాసింది.

అప్పటికప్పుడు రూ.50వేలు ఇచ్చిన హరికృష్ణ.. కొద్ది రోజుల అనంతరం తహసీల్దార్‌ను కలువగా మిగతా మొత్తం ఇస్తేనే పని అవుతుందని చెప్పారు.

అంత ఇవ్వలేనని హరికృష్ణ బతిమలాడగా... రూ.2.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో హరికృష్ణ 12న ఏసీబీ అధికారులను సంప్రదించాడు.

వారి సూచనమేరకు గురువారం తహసీల్దార్‌కు ఆమె కార్యాలయంలో రూ.2 లక్షలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

శుక్రవారం తహసీల్దార్‌ను హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని వరంగల్‌ రేంజ్‌ ఏసీబీ డీఎస్పీ మధుసూదన్‌ చెప్పారు' అని ఆ కథనంలో పేర్కొన్నారు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)