తెలంగాణ: వీఆర్ఓలకు పని లేకుండా జీతాలు, 10 నెలలైనా జాబ్ చార్ట్ ఊసే లేదు

  • సురేఖ అబ్బూరి
  • బీబీసీ ప్రతినిధి
కేసీఆర్

ఫొటో సోర్స్, TelanganaCMO/FB

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 నెలల కిందట తీసుకున్న నిర్ణయం వీఆర్‌వో‌ల భవిష్యత్తును అగమ్యగోచరంగా మార్చడమే కాకుండా, ప్రభుత్వ ఖజానాకు కూడా గండి కొడుతోంది.

గ్రామ రెవెన్యూ వ్యవస్థలో అక్రమాలు పెరిగిపోతున్నాయని చెబుతూ కేసీఆర్ గత ఏడాది సెప్టెంబర్ 9న అధికారికంగా 5,485 మంది వీఆర్‌వో పోస్టులను రద్దు చేశారు.

అప్పటి నుంచి ప్రతి నెల వారికి జీతం ఇస్తున్నారు. కానీ, హామీ ఇచ్చినట్టుగా ఆ పోస్టును పునరుద్ధరించి రెవెన్యూ శాఖలో సర్దుబాటు చేయలేదు.

“ఒక వైపు ఉద్యోగం పరిస్థితి ఏమిటో తెలియకుండా, రోజూ కేవలం ఆఫీసుకు వెళ్ళి కూర్చోవడం పట్ల వీఆర్‌వోలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే జీతం సరిపోవడం లేదు. ఎక్కడో ఉన్న ఆఫీసుకు కేవలం వెళ్ళి కూర్చోవడానికి నెలకు పెట్రోలుకు వేల రూపాయలు ఖర్చవుతోంది. అలా అని వేరే ఉద్యోగం చేసుకోవడానికి లేదు. సమాజంలో మాపై చిన్న చూపు ఏర్పడుతోంది. తహశీల్దార్ ఏదైనా పని అప్పజెపితే చేయడానికి లేక ఎవరైనా, ఏదైనా సలహా అడిగితే ఇవ్వడానికే మేము పరిమితమై పోయాం. మాకు జాబ్ చార్ట్ లేదు. అలా అని వేరే పని ఏమన్నా అప్పజెబుతారు అంటే అదీ లేదు” అని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక వీఆర్‌వో‌ తన బాధను బీబీసీతో పంచుకున్నారు.

ఫొటో క్యాప్షన్,

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వీఆర్‌వోలు

“2018 వరుకు మేము ఇచ్చిన లెక్కల ఆధారంగానే ధరణిలో డేటా పొందుపరిచింది ప్రభుత్వం” అని వీఆర్‌వో‌ల సంఘం అధ్యక్షులు సతీష్ చెప్పుకొచ్చారు.

“రెవెన్యూ మంత్రిత్వ శాఖను తన దగ్గరే ఉంచుకున్నారు ముఖ్యమంత్రి. అంటే, ఇది ప్రిన్సిపల్ సెక్రెటరీ సోమేష్ కుమార్ పరిధిలోకి వస్తుంది. వాళ్లు అపాయింట్‌మెంట్ ఇవ్వరు. 10 నెలలుగా రాష్ట్ర మంత్రులను, కేటీఆర్, కవిత అందరినీ కలిసాం. చేస్తాం, చూస్తాం అని చెప్పడం తప్ప వారు ఏమీ చేయలేదు. ఇతర సంఘాల వారిని పిలిచి మాట్లాడుతారు, కానీ, మమ్మల్ని పిలవరు” అని వీఆర్‌వో‌ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ సతీష్ అంటున్నారు.

దాదాపు 40 ఏళ్ల క్రితం పటేల్ పట్వారీ వ్యవస్థను తొలిగిస్తూ అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వీఆర్‌వో‌ వ్యవస్థను ప్రవేశ పెట్టారు. ఈ వ్యవస్థకు గత ఏడాది స్వస్తి పలికారు కేసీఆర్. కానీ, అటుపై దారి ఎటు అన్నది మాత్రం నిర్దేశించలేదు.

ఈ వ్యవస్థను రద్దు చేయడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి అని సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.

“ఒకటి ఈ వ్యవస్థలో అవినీతి బాగా పెరిగి పోయింది. రెండవది 139 పాత జీవోలను రద్దు చేయాలి, అందులో భాగంగా ఈ వ్యవస్థను కూడా రద్దు చేసి, కొత్త సిస్టమ్‌ను ప్రవేశ పెడతాం అని ముఖ్యమంత్రి అన్నారు. వీఆర్‌వో‌లతో పాటు, మున్సిపల్, హోం శాఖల్లోనూ అవినీతి ఉందని గుర్తించారు. కానీ, ఆ శాఖలపై ఏం చర్యలు తీసుకున్నారు? ఎమ్మార్వోలు లంచం తీసుకుంటూ పట్టుబడడం లేదా?" అని ఆయన ప్రశ్నించారు.

"వీఆర్వోలను వేరే శాఖకు మారుస్తామని అన్నారు. అది చెప్పి 10 నెలలు దాటిపోయింది. ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయం. కొంత మంది అవినీతి చేస్తున్నారు కాబట్టి మొత్తం వ్యవస్థనే తీసేయడం అంటే పిచ్చికుక్కని ముద్రవేసి రాళ్ళతో కొట్టి చంపేయడం అన్నసామెత గుర్తుకు వస్తోంది. ఈ ప్రభుత్వ నిర్ణయం వెనుక వేరే ఉద్దేశాలు ఉన్నాయి. ఇది పారదర్శకంగా తీసుకున్న నిర్ణయం కాదు” అని శ్రీనివాస్ రెడ్డి బీబీసీతో చెప్పారు.

ఫొటో క్యాప్షన్,

వీఆర్‌వో‌ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోల్కొండ సతీష్

విధులు లేక 10 నెలలుగా ఖాళీగా కూర్చున్నారు వీఆర్‌వో‌లు. అయితే, జాబ్ చార్ట్ ఇవ్వకుండానే నెల నెలా జీతాలు మాత్రం ఇస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోందన్నది కొందరి వాదన.

దీన్ని వీఆర్‌వో‌ సంఘం ఖండిస్తున్నప్పటికీ, ఇందులో నిజం లేకపోలేదు. వారితో సరి అయిన పని చేయించలేక పోగా ప్రభుత్వం అలసత్వం కారణంగా ప్రభుత్వ ధనం ఈ రకంగా దుబారా అవుతోందన్నది నిజమేనన్నారు సీనియర్ పాత్రికేయులు శ్రీనివాస్ రెడ్డి.

“గతంలో ఎప్పుడు లేదు ఇలాంటి పరిస్థితి. ఏ మంత్రీ స్వయంగా నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. రెవెన్యూ శాఖ మంత్రి ఉంటే తమ సమస్యను వారి దగ్గర చెప్పుకునేవారు ఏమో కానీ, మంత్రి తనకు తాను నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మాత్రం లేదు” అని ఆయన అన్నారు.

ఫొటో క్యాప్షన్,

ఉద్యోగం పరిస్థితి ఏమిటో తెలియకుండా, రోజూ ఆఫీసుకు వెళ్ళి కూర్చోవడం పట్ల వీఆర్‌వోలు అసహనం వ్యక్తం చేస్తున్నారు

ఇది ఇలా ఉండగా, వీఆర్‌వో‌ సంఘం తమ ఆందోళన పెంచుతుందేమోనని అనుమానించిన కేసీఆర్, "అలా చేస్తే వారికే భారీ నష్టం జరుగుతుంది" అని గత ఏడాది ఓ హెచ్చరిక జారీ చేశారు.

దీనితో ఇప్పుడు వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వివిధ శాఖలలో 56,979 పోస్టులు ఖాళీ ఉన్నాయి అని ప్రభుత్వం చెప్పుకొస్తున్నా, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు, అలానే పదోన్నతుల కోసం ఆశపడుతున్నవారికి ఇవి అందని ద్రాక్షలుగా మిగులుతున్నాయి .

తెలంగాణ సర్కార్ వీఆర్‌వోలను మాతృశాఖలోనూ కొనసాగించలేదు, అటువేరే శాఖకు బదిలీ చేస్తామన్న మాట కూడా అమలు చేయలేదు. వారికి ఎటువంటి జాబ్ చార్ట్ ఇవ్వలేదు. దాంతో, వారు చేసే పనితో పాటు వేరే పనులు కూడా అదనంగా చేయించుకుంటున్నారని వీఆర్వో సంఘాల వారు అంటున్నారు.

గత పట్టభద్రుల ఎన్నికల సమయంలో వీఆర్‌వోలను వేరే శాఖకు మార్చి, అర్హులు అయినవారికి పదోన్నతి ఇస్తామని హామీ కేసీఆర్ ఇచ్చారు అని, అయితే ఇప్పుడు కనీసం చీఫ్ సెక్రెటరీ అపాయింట్‌మెంట్ కూడా దక్కడం లేదని వీఆర్‌వో సంఘం రాష్ట్ర అధ్యక్షులు సతీష్ అంటున్నారు.

గత 10 నెలలుగా కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు అని కొంత మంది విమర్శిస్తూ ఉంటే, అర్హులయిన వారికి ప్రమోషన్ లేదు సరికదా, ఈ 10 నెలలు మాకు ఏ రకంగా సర్వీసులో కలుపుతారో అర్ధం కావడం లేదని, తమకు న్యాయం చేయండి అంటూ వీఆర్వో సంఘం మొర పెట్టుకుంటోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)