కొండపల్లిలో క్వారీల గొడవ నాయకులు రాళ్లు విసురుకునేదాకా ఎందుకొచ్చింది? బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

  • శంకర్ వడిశెట్టి
  • బీబీసీ కోసం
కొండపల్లి బొమ్మల తయారీ

ఫొటో సోర్స్, BBC/shankar

ఫొటో క్యాప్షన్,

కొండపల్లి బొమ్మల తయారీ

ఆంధ్రప్రదేశ్‌లోని మైలవరం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇవి రాజకీయంగా అధికార, ప్రతిపక్ష నేతలు వాదోపవాదాలకు దిగేవరకూ తీసుకొచ్చాయి.

కొండపల్లి ప్రాంతంలోని కొండల్లో జరుగుతున్న తవ్వకాలతో ఈ వివాదం తీవ్రమైంది. చివరకు మాజీ మంత్రి దేవినేని ఉమ మీద ఎస్సీ,ఎస్టీ కేసులు నమోదు చేసి జైలుకు పంపించడానికి కారణమైంది.

రిజర్వు ఫారెస్టు ప్రాంతంలో కంకర, గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని ఇరు పార్టీల నేతలు ఆరోపిస్తున్న సమయంలో అధికార యంత్రాంగం ఎందుకు ఉపేక్షించింది, స్థానికుల ఫిర్యాదులను ఎందుకు విస్మరించిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

రాళ్ల క్వారీల వివాదం చివరకు రాళ్లు విసురుకుని ఘర్షణలకు దిగే స్థాయికి ఎందుకు వచ్చిందనే విషయాన్ని బీబీసీ క్షేత్రస్థాయిలో పరిశీలించింది.

ఫొటో సోర్స్, BBC/shankar

ఫొటో క్యాప్షన్,

కొండపల్లి బొమ్మల తయారీ

కొండపల్లి బొమ్మల తయారీకి కష్టం

చారిత్రక ప్రాంతమైన కొండపల్లిలో ఎంతో విలువైన అటవీ సంపద ఉంది. 1891లో కొండపల్లి, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలోని అడవిని నోటిఫై చేశారు.

1933లో అప్పటి వరకూ సర్వే జరగని ప్రాంతాలను కూడా రిజర్వు ఫారెస్ట్ పరిధిలోకి తీసుకొచ్చారు. అక్కడి అడవుల నుంచి లభించే కలప ప్రసిద్ధి చెందిన కొండపల్లి బొమ్మల తయారీకి ఉపయోగపడుతోంది.

కానీ, కొండపల్లి బొమ్మల తయారీకి ప్రధాన ముడిసరకైన పునికి చెట్లు ప్రస్తుతం కనుమరుగవుతుండడంతో ఆందోళన కనిపిస్తోంది.

కలప కొరత వల్ల బొమ్మల తయారీకి ఆటంకం ఏర్పడుతోందని, ఇప్పటికే కొండపల్లి పరిసరాల్లో పునికి చెట్లు దాదాపు కనిపించకుండా పోయాయని, దూర ప్రాంతాల నుంచి కలప తీసుకురావాల్సి వస్తుండంతో పెట్టుబడి వ్యయం పెరిగిందని బొమ్మల తయారీదారులు చెబుతున్నారు.

ఒకప్పుడు కొండపల్లి బొమ్మల తయారీ చాలా జోరుగా సాగేది. ఎక్కువ మంది తయారీదారులు కూడా ఉండేవారు. అయినా, అందరికీ అవసరమైన మేరకు కలప అందుబాటులో ఉండేది.

ఇప్పుడు దానికి భిన్నంగా ఉంది. కొండపల్లి బొమ్మలకు మార్కెట్లో ఆదరణ ఉన్నా, వాటి తయారీకి పునికి కలప అవసరం. కానీ అది లభించడం గగనం అవుతోంది.

"చుట్టుపక్కల రిజర్వు ఫారెస్టు ప్రాంతాల్లో కూడా మైనింగ్ జరుగుతోంది. క్వారీల్లో బ్లాస్టింగ్ పుణ్యమా అని పునికి చెట్లు కోల్పోతున్నాం. పైగా అవి సహజంగా పెరిగే చెట్లు. వాటిని పెంచాలని, కొన్ని మొక్కలు కూడా నాటాం. అయితే, ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పటికే కలప కొరత పెరుగుతుండడంతో భవిష్యత్తులో ఇంకా ఎన్ని సమస్యలొస్తాయో అని అంతా ఆందోళనతో ఉన్నారు" అని బాలబ్రహ్మ బొమ్మల తయారీ కంపెనీ యజమాని కె. శ్రీనివాస్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, BBC/shankar

ఫొటో క్యాప్షన్,

కొండపల్లి కొండల్లో తవ్వకాలు

రిజర్వు ఫారెస్టులో మైనింగ్ ఎలా జరుగుతోంది..

కృష్ణా జిల్లా జి కొండూరు మండలంలో కంకర , గ్రావెల్ క్వారీలు ఉన్నాయి. సమీపంలోనే క్రషర్లు కూడా ఏర్పాటు చేసుకున్నారు. కృష్ణా జిల్లాతో పాటూ, తెలంగాణాకు కూడా ఇక్కడి నుంచి కంకర ఎగుమతులు జరుగుతుంటాయి. నిత్యం టిప్పర్లలో సరఫరా జరుగుతుంటుంది.

ఈ క్వారీల నిర్వాహకులకు అధికార పార్టీ పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్నాయని జి కొండూరుకి చెందిన ఆర్టీఐ కార్యకర్త బి రాజేశ్వర రావు బీబీసీతో అన్నారు.

"జి. కొండూరు నుంచి చుట్టు పక్కల రోడ్లన్నీ ఎన్నిసార్లు వేసినా పాడయిపోతున్నాయి. దానికి ప్రధాన కారణం క్వారీ టిప్పర్లే. విలువైన కంకర తవ్వడమే కాకుండా అక్కడే వాటిని క్రషర్లలో వినియోగానికి అనుగుణంగా సిద్ధం చేస్తారు. దూర ప్రాంతాలకు కూడా తరలిస్తారు. ఇదంతా వందల కోట్ల వ్యవహారం. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా జరిగింది. ఇప్పుడు వైసీపీ హయంలోనూ ఎమ్మెల్యే అనుచరులే చేస్తున్నారు. నాయకులు, నిర్వాహకులు మారారే తప్ప మైనింగ్ మాత్రం ఆగలేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించరు. గతంలో ఓసారి జేసీబీలు, లారీలు సీజ్ చేసినా యజమానులు వాటిని విడిపించుకుపోయారు. కేసు కూడా ఏమైందో తెలియదు" అన్నారు.

జి కొండూరు మండలంలో అప్పట్లో సర్వే చేయని భూములు సుమారు 280 ఎకరాలున్నాయి. అవి సర్వే నెంబర్ 26/1 పరిధిలో ఉన్నాయి. 2009లో వాటిని ఫారెస్ట్ భూములుగా అటవీశాఖ ప్రకటించింది.

అయినప్పటికీ రెవెన్యూ, మైనింగ్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి తవ్వకందారులు మాత్రం యథావిధిగా మైనింగ్ సాగించారు. వాటితో పాటుగా సర్వే నెంబర్ 143 సృష్టించి అటవీ భూముల్లో తవ్వకాలు జరిపారనేది మరో ఆరోపణ.

ఫొటో సోర్స్, BBC/shankar

ఫొటో క్యాప్షన్,

అడవి భూముల్లో క్రషర్లు

మైనింగ్ ఎవరు చేస్తున్నారు

కొండపల్లి రిజర్వు ఫారెస్టులో కూడా మైనింగ్ జరుగుతోందని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా అంగీకరిస్తున్నారు. అయితే టీడీపీ హయంలోనే జరిగిందని వైసీపీ ఆరోపిస్తుండగా, వైసీపీ హయంలోనే అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని టీడీపీ విమర్శిస్తోంది.

గత కొన్నేళ్లుగా యధేచ్చగా జరుగుతున్న తవ్వకాలను స్థానికులు గమనిస్తున్నారు. విలువైన కంకర, గ్రావెల్ తరలింపు తమ కళ్లెదురుగా సాగుతోందని, కానీ చర్యలు మాత్రం లేవని వారు చెబుతున్నారు.

కొండపల్లి రిజర్వు ఫారెస్ట్ పరిధిలో ముఖ్యంగా కడెం పోతవరం, లోయ గ్రామాల సమీపంలో సుమారు 200 ఎకరాల మేర రిజర్వు ఫారెస్ట్‌ అన్యాక్రాంతం అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మైనింగ్ జరుగుతున్న తీరు బహిరంగంగా చూడవచ్చు. కంకర , గ్రావెల్ క్వారీలు యధేచ్చగా సాగుతున్నాయి. కానీ అధికారులు మాత్రం నామమాత్రపు చర్యలతో సరిపెట్టినట్టు కనిపిస్తోంది.

కొన్నేళ్లుగా ఇక్కడ కొందరు మైనింగ్ కోసం ఫారెస్టు భూముల్లో సైతం ఎన్వోసీలు సాధించారు. రెవెన్యూ శాఖ అనుమతించిన భూములు రిజర్వు ఫారెస్ట్ వంటూ అటవీశాఖ అభ్యంతరం కూడా చెప్పింది. వాటిపై రెవెన్యూ శాఖ స్టే విధించింది. అయినా తవ్వకాలు మాత్రం ఆగలేదు.

ఫారెస్ట్, రెవెన్యూ శాఖల పరిధిల్లోని భూములు ఏవో తేల్చడంలో అధికారులు తాత్సారంతో, క్షేత్రస్థాయిలో తవ్వకాలకు అడ్డులేకుండా పోయింది. చివరకు అధికార మార్పిడి జరగడంతో కొన్నాళ్ల పాటు ఇక్కడ మైనింగ్‌కు విరామం ఏర్పడింది.

గత ఏడాది నుంచి మళ్లీ మైనింగ్ జోరందుకుంది. జగనన్న ఇళ్ల కాలనీల కోసం అంటూ మొదట గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగాయి. ఆ తర్వాత కంకర కూడా తవ్వేస్తున్నారు.

గత ఏడాది ఆగష్టులో పలు ఫిర్యాదుల తర్వాత ఫారెస్ట్ అధికారులు జేసీబీలు, లారీలు కూడా సీజ్ చేశారు. అటవీ భూముల్లో తవ్వకాలు జరుగుతున్నాయని కేసులు కూడా నమోదు చేశారు. రూ. 10 కోట్ల వరకూ అక్రమ తవ్వకాలు జరిగాయని నిర్ణయించి రూ.10 లక్షల జరిమానా కూడా వసూలు చేశారు.

అంతేకాదు, నిర్లక్ష్యం వహించారంటూ నలుగురు క్షేత్రస్థాయి సిబ్బందిపై చర్యలు కూడా తీసుకున్నారు. అయినా కొండపల్లి రిజర్వు ఫారెస్టులో మైనింగ్ మాత్రం సాగుతూనే ఉందని అక్కడ తవ్వేసిన కొండలే చెబుతున్నాయి.

ఫొటో సోర్స్, BBC/shankar

పరిశీలకుల కమిటీ ఏం చేస్తోంది?

కొండపల్లి రిజర్వు ఫారెస్టులో అక్రమ తవ్వకాలు ఏ మేరకు జరిగాయేనది పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానికి తగ్గట్టు విజయవాడ సబ్ కలెక్టర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, మైన్స్ ఏడీతో ఓ కమిటీని కూడా వేశారు.

కానీ, ఆ కమిటీ మాత్రం కాలు కదిపిన దాఖలాలే లేవు. దానికి కారణాలు మాత్రం తెలియదు. ఆయా అధికారులను బీబీసీ సంప్రదించింది.

కోర్టుల పరిధిలో కూడా వివాదాలు ఉన్నాయని, వాటిని పరిష్కరించడానికి వేచి చూస్తున్నామని మాత్రం వారు సమాధానం ఇచ్చారు.

జూలై 26న టీడీపీ బృందం మైనింగ్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లింది. తిరిగి వస్తున్న సమయంలో జి. కొండూరు దగ్గర మాజీ మంత్రి దేవినేని ఉమ తదితరులను వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు.

ఆ సమయలో ఘర్షణ జరిగింది. ఉమ సహా పలువురు టీడీపీ నేతల మీద ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

దేవినేని ఉమను ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉంచారు. మరో 12 మంది వైసీపీ కార్యకర్తల మీద వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదుతో కేసులు పెట్టినప్పటికీ వారిని ఇంకా అరెస్టు చేయలేదు.

ఫొటో సోర్స్, HTTP://HC.AP.NIC.IN/

హైకోర్టులోనూ విచారణ

పంటకాలువలను పూడ్చేసి దానిపై క్రషర్లు ఏర్పాటు చేసి, రోడ్లు నిర్మించినవారు అటవీ భూములను ఆక్రమించలేదంటే నమ్మలేమని ఏపీ హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఇబ్రహీంపట్నం కాలువ ఆక్రమణలపై దాఖలయిన పిల్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

కాలువ మాత్రమే ఆక్రమించారని, కొండపల్లి అటవీ ప్రాంతం ఆక్రమణకు గురికాలేదని అధికారులు చెప్పడం జీర్ణించుకోలేని విధంగా ఉందని జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జయసూర్యతో కూడిన బెంచ్ పేర్కొంది.

ఈ వ్యవహారాన్ని పూర్తిగా పరిశీలించి అఫిడవిట్ దాఖలు చేయలంటూ 23 మందికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న వారిలో కాలుష్య నియంత్రణ మండలి, గనులు, అటవీ శాఖల అధికారులతో పాటుగా కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా ఉన్నారు.

అటవీ భూముల్లో విలువైన సంపద అక్రమార్కులు కాజేసినట్టు కోర్టు భావిస్తోంది. ప్రధాన పార్టీల నేతలు కూడా వందల కోట్ల అక్రమాలు జరిగాయని అంగీకరిస్తున్నారు.

అధికారులు కూడా అన్యాక్రాంతం జరిగిందన్నది తోసిపుచ్చడం లేదు. కొండపల్లి కొండల్లో జరిగిన తవ్వకాలు అందరికీ కనిపిస్తున్నాయి.

అయినా దీనిని రాజకీయ వివాదంగా పరిగణిస్తే సమస్య పరిష్కారం కాదని, ఇప్పటికైనా సమగ్ర చర్యలు అవసరం అని స్థానికులు భావిస్తున్నారు.

లేదంటే కళ్లెదురుగా కొండపల్లి కొండలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని, కొండపల్లి బొమ్మల తయారీకి సమస్యలు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)