పారిశుద్ధ్య కార్మికులెవరూ మురుగు కాల్వలు శుభ్రం చేస్తూ చనిపోలేదని కేంద్రం చేసిన ప్రకటనలో నిజమెంత? - FactCheck
- కీర్తీ దుబే
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, AFP
గత ఐదేళ్లలో చేతులతో మురుగునీరు శుభ్రం చేసే (మాన్యువల్ స్కావెంజింగ్) సమయంలో ఒక్క పారిశుద్ధ్య కార్మికుడు కూడా చనిపోలేదని కేంద్రం చెబుతోంది.
జులై 28న రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే, ఎల్ హనుమంతయ్య అడిగిన ఒక ప్రశ్నకు సామాజిక న్యాయం శాఖ మంత్రి రామ్‌దాస్ అథవాలే "గత ఐదేళ్లలో చేతులతో మలం శుభ్రం చేస్తూ ఎవరైనా చనిపోయిన కేసులు ఏవీ నమోదు కాలేదు" అని చెప్పారు.
కానీ, ఇదే ఏడాది ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాల సమయంలో "గత ఐదేళ్లలో సెప్టిక్ ట్యాంక్, మురుగు కాలువలు శుభ్రం చేస్తున్నప్పుడు 340 మంది చనిపోయారని ఇదే మంత్రి లోక్‌సభలో ఒక లిఖిత సమాధానంలో చెప్పారు.
2010 నుంచి 2020 మార్చి వరకూ, అంటే పదేళ్లలోపే సెప్టిక్ ట్యాంక్, మురుగు కాలువలు శుభ్రం చేస్తున్నప్పుడు 631 మంది మృత్యువాత పడ్డారని 2020లో ప్రభుత్వ సంస్థ నేషనల్ కమిషన్ ఆఫ్ సఫాయీ కర్మచారీస్ తమ నివేదికలో చెప్పింది.
కానీ, ఇప్పుడు ప్రభుత్వం పారిశుద్ధ్య పనులు చేస్తూ గత ఐదేళ్లలో ఒక్కరు కూడా చనిపోలేదని అంటోంది.
ఆంధ్రప్రదేశ్: శ్మశానాలకు దారేదీ? శవాలకు చోటేదీ? - దళితులు ప్రశ్న
2013లో కేంద్రం 'పాకీ పనిపై నిషేధం, పునరావాస చట్టం' తీసుకువచ్చిందని, అందులో మాన్యువల్ స్కావెంజర్ అనే మాటకు ప్రభుత్వం ఒక నిర్వచనాన్ని ఇచ్చిందని ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది..
ఈ నిర్వచనం ప్రకారం ఒక వ్యక్తి చేతులతో మలం తీయించడం, డ్రైనేజీ శుభ్రం చేయించడం, మనుషుల మలమూత్రాలు చేరే మురుగు కాలువలు, గుంతలను శుభ్రం చేయించడం.. లాంటి పనులను మాన్యువల్ స్కావెంజింగ్ అంటారు.
ఈ చట్టం మూడో అధ్యాయం ఏడో పాయింట్లో.. ‘‘ఇది అమలైన తర్వాత స్థానిక అధికారులు లేదా ఇతరులు ఏ వ్యక్తికీ సెప్టిక్ ట్యాంక్ లేదా మురుగు కాలువలను చేతులతో శుభ్రం చేసే ప్రమాదకరమైన పనులు ఇవ్వకూడదు’’ అని చెప్పారు.
అంటే చేతులతో మురుగు తీసే వ్యవస్థను అంతం చేయాలంటే స్థానిక యంత్రాంగం సీవర్, సెప్టిక్ ట్యాంకులను శుభ్రం చేయడానికి ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాల్సుంటుంది.
కాంట్రాక్టర్ లేదా అధికారులు ఎవరైనా సెప్టిక్ ట్యాంక్, డ్రైనేజీలు శుభ్రం చేయడానికి సురక్షిత పరికరాలు లేకుండా పారిశుద్ధ్య కార్మికులతో పని చేయించకూడదు. అది పూర్తిగా నిషేధం.
కానీ వాస్తవం ఏంటంటే డ్రైనేజీలు, సెప్టిక్ ట్యాంకులు శుభ్రం చేసే సమయంలో ఎక్కువమంది పారిశుద్ధ్య కార్మికులు వాటి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.
ఫొటో సోర్స్, Getty Images
ఈ ఏడాది ఇప్పటికే 26 మంది చనిపోయారు
పారిశుద్ధ్య కార్మికుల ఉద్యమ జాతీయ కన్వీనర్ బెజవాడ విల్సన్ దీనిపై బీబీసీతో మాట్లాడారు.
ఈ ఐదేళ్లలో పాకీ పని చేస్తూ 472 మంది పారిశుద్ధ్య కార్మికులు చనిపోయారని ఆయన చెప్పారు.
"అంతకు ముందు ప్రభుత్వం 340 మంది చనిపోయారని చెప్పింది. కానీ వారిలో కూడా 122 మందిని లెక్కించలేదు. ఈ ఏడాది 2021లో ఇప్పటికే 26 మంది పాకీ పని చేస్తూ చనిపోయారు. అంటే ఇప్పటివరకూ మొత్తం 498 మంది చనిపోయారు. కానీ, దీనిని ప్రభుత్వం పూర్తిగా కొట్టిపారేస్తోంది" అన్నారు.
"ప్రభుత్వం ఇంతకు ముందు నుంచీ అదే చెబుతోంది. దేశంలో చేతులతో డ్రైనేజీలు శుభ్రం చేసే పద్ధతి ముగిసిందని చెబుతోంది. కానీ, ఇదంతా అస్తవ్యస్తంగా ఉందనడానికి మా దగ్గర ఆధారాలు ఉన్నాయని సుప్రీంకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాతే ప్రభుత్వం 2013లో ఈ చట్టం తీసుకొచ్చింది" అన్నారు.
"కోర్టు ఇందులో జోక్యం చేసుకున్న తర్వాత అది ఆపేశారు. ఇప్పుడు మళ్లీ దేశంలో మాన్యువల్ స్కావెంజింగ్ లేదని, దానివల్ల ఎవరూ చనిపోవడం లేదని చెబుతున్నారు. మీరే ఆలోచించండి. జనం చచ్చిపోతుంటే, మరణాలే లేవని పార్లమెంటులో చెబుతున్నారు".
ఫొటో సోర్స్, GETTY IMAGES/SUDHARAK OLWE
నిర్వచనం వివరణపై ప్రశ్నలు
సాంకేతిక నిర్వచనాన్ని ఉటంకిస్తూ ప్రభుత్వం ఈ మాట చెబుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో 340 మంది పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేస్తూ చనిపోయారని కేంద్రం చెప్పినప్పుడు, 'మాన్యువల్ స్కావెంజింగ్' అనే మాట ఉపయోగించకుండా సీవర్, సెప్టిక్ ట్యాంక్ శుభ్రం అనే మాటను ఉపయోగించింది.
అంటే 2013 చట్టానికి విరుద్ధంగా ప్రభుత్వం మురుగు కాలువలు, డ్రైనేజీలు శుభ్రం చేసేవారిని మాన్యువల్ స్కావెంజర్‌గా భావించడం లేదు.
"మాన్యువల్ స్కావెంజింగ్ అంటే చేత్తో మలమూత్రాలు శుభ్రం చేయడం, అది జరగడం లేదు అని వీళ్లు లెక్కలేస్తున్నారు. కానీ సీవర్ లోపల ఎవరు దిగుతున్నారో, వాళ్లు వాటిని తాకకుండా పనిచేయగలరా, వాళ్లు స్వయంగా ఆ మలమూత్రాల్లో మునుగుతున్నారు" అని విల్సన్ అన్నారు.
చట్టం ఒక విషయం చెబుతుంది. మానవ మలమూత్రాలను, మురుగు కాలువలు, సెప్టిక్ ట్యాంక్‌ను ఎవరైనా ఏ రకంగా అయినా చేతులతో శుభ్రం చేయించడం నిషేధం అంటోంది. అంటే నిర్వచనాన్ని బట్టి చూసినా అది అబద్ధం."
"ప్రభుత్వం ఆక్సిజన్ కొరతతో దేశంలో ఎవరూ చనిపోలేదని చెప్పింది. అంటే మనం చూస్తున్నది, చూసింది అన్నిటినీ ప్రభుత్వ ప్రకటనలే ధ్రువీకరిస్తాయా. డేటా ఏదీ లేదని చెప్పి ప్రశ్నలు నుంచి తప్పించుకోవడం చాలా సులభం. ఎందుకంటే వాళ్లు డేటా ఇస్తే వారిని మరిన్ని ప్రశ్నలు అడుగుతారు. డేటా కరెక్ట్ లేదంటే ప్రజలు ప్రశ్నలు లేవనెత్తుతారు. దానికంటే అసలు అలా జరగలేదని, డేటా లేదని చెప్పేయడం మంచిది కదా. జవాబుదారీని తప్పించుకోడానికి ఇంతకంటే సులభమైన పద్ధతి ఇంకేముంటుంది" అంటారు విల్సన్.
ఫుట్‌పాత్ మీద చదువుకుంటూ సొంతింటి కల నిజం చేసుకోవాలనుకుంటున్న ఆస్మా షేక్
ప్రభుత్వం అంగీకరించని మరణాలు
- 2019 జనవరిలో కిషన్‌లాల్ భార్య ఇందూ దేవిని బీబీసీ కలిసింది. ఆమె తన ముగ్గురు పిల్లలతో తిమార్పూర్లోని ఒక బస్తీలో ఉన్నారు. ఆ కుటుంబాన్ని పోషించే కిషన్‌లాల్ నాలా శుభ్రం చేస్తూ చనిపోయారు. దాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు ఆయనకు వెదురు కర్ర కూడా ఇవ్వలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
- ఒక ప్రభుత్వ నివేదిక ప్రకారం 2019 నవంబర్ 23న అశోక్ అనే ఒక పారిశుధ్య కార్మికుడు విష వాయువుల వల్ల ఊపిరాడక చనిపోయారు. అశోక్ దిల్లీలోని షాకుర్పూర్లోని ఒక డ్రైనేజీని శుభ్రం చేస్తున్నప్పుడు అది జరిగింది.
- 2019 జూన్ 26న హరియాణా రోహ్తక్లో సీవర్ శుభ్రం చేస్తూ నలుగురు పారిశుధ్య కార్మికులు చనిపోయారు.
- 2019 ఆగస్టు 28న ఉత్తరప్రదేశ్ మధురలో నలుగురు పారిశుద్ధ్య కార్మికులు సీవర్ శుభ్రం చేస్తున్న సమయంలో చనిపోయారు.
- 2020 ఫిబ్రవరిలో 24 ఏళ్ల రవి 15 అడుగుల లోతున్న డ్రైనేజీని శుభ్రం చేస్తూ చనిపోయారు. దిల్లీ షాహ్దరా ప్రాంతంలో రవి, 35 ఏళ్ల సంజయ్‌కు సీవర్ శుభ్రం చేసే పనిచ్చారు. కానీ రవి విష వాయువు పీల్చడంతో చనిపోయారు. సంజయ్‌ను సమయానికి ఆస్పత్రికి తరలించి కాపాడారు.
- 2021 మార్చిలో రూ. 1500 ఇస్తామనడంతో లోకేష్, ప్రేమ్ చంద్ దిల్లీలోని గాజీపూర్ ఎంపరర్ బాంకెట్ హాల్ సీవర్ శుభ్రం చేసే పనికి ఒప్పుకున్నారు. కానీ డ్రైనేజీలో ఊపిరాడక ఇద్దరూ చనిపోయారు.
- 2021 మే 28న 21 ఏళ్ల ఒక పారిశుద్ధ్య కార్మికుడు చనిపోయాడు. ఆయనకు ఎలాంటి రక్షణ పరికరాలు ఇవ్వకుండానే కాంట్రాక్టర్ అతడిని సీవర్లోకి దించాడు.
సీవర్ లోపలకు వెళ్లి శుభ్రం చేస్తూ చనిపోయిన వారిలో ఇవి కొన్ని పేర్లు మాత్రమే. ఇలా చనిపోయిన వారి జాబితా చాలా పెద్దది. కానీ ప్రభుత్వ దస్తావేజుల్లో మాత్రం వీరికి ఎలాంటి చోటు దక్కలేదు.
వీరి పేర్లే కాదు, వారి సంఖ్యను కూడా లెక్కేయడం లేదు. వీరిలో ఎవరూ చేతులతో మలమూత్రాలు శుభ్రం చేస్తూ లేదా సీవర్ శుభ్రం చేస్తూ చనిపోలేదని కేంద్రం భావిస్తోంది.
గుజరాత్: మట్టి కుండలు ఇంత అందంగా తయారు చేస్తే వచ్చేది ఆరు రూపాయలే
పెరుగుతున్న మాన్యువల్ స్కావెంజింగ్
రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా సామాజిక న్యాయం మంత్రిత్వ శాఖ దేశంలో ప్రస్తుతం 66 వేల మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారని, వారు చేతులతో మలమూత్రాలు శుభ్రం చేస్తున్నారని చెప్పింది.
2019లో నీతీఆయోగ్ ఒక నివేదిక ప్రకారం 2013లో మాన్యువల్ స్కావెంజింగ్ అడ్డుకోడానికి చట్టం తీసుకొచ్చిన సమయంలో దేశంలో 14 వేలకు పైగా పాకీ పనివారు ఉన్నారు. వారిని మాన్యువల్ స్కావెంజర్ కేటగిరీలో ఉంచారు.
2018లో జరిగిన సర్వేలో ఈ సంఖ్య 39 వేలు దాటింది. 2019లో అది మరింత పెరిగి 54 వేలకు పైకి చేరింది. ఇప్పుడు వారి సంఖ్య 66 వేలకు పైనే ఉంది.
ప్రస్తుతం చేత్తో మలమూత్రాలు శుభ్రం చేసేవారు ఎక్కువగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉన్నారు. అక్కడ వీరి సంఖ్య 37 వేలకు పైనే ఉంది. ఇక 7,300 మందితో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఛత్తీస్‌గఢ్ ఈ జాబితాలో అన్నిటికంటే దిగువన ఉంది. అక్కడ కేవలం ముగ్గురు మాన్యువల్ స్కావెంజర్స్ మాత్రమే ఉన్నట్లు లెక్కించారు.
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 ఎప్పటికీ అంతం కాకపోవచ్చు, దానితో కలిసి జీవించడం ఎలా?
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- కోవిడ్-19ను మనం నోరోవైరస్లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్ అంటే ఏమిటి
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)