రాఘవ్ చడ్ఢా: 'ఉచిత కరెంట్ వద్దు... నువ్వే కావాలి' అన్న యువతికి ఆప్ ఎమ్మెల్యే భలే రిప్లై – ప్రెస్‌రివ్యూ

ఫొటో సోర్స్, Getty Images
ఉచిత విద్యుత్‌కు బదులుగా తననే కోరుకున్న ఓ యువతికి దిల్లీలోని ఆప్ ఎమ్మెల్యే రాఘవ్ చడ్ఢా భలే సమాధానం ఇచ్చారని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.
‘‘పంజాబ్‌లో ఉచిత విద్యుత్ కావాలంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించాలంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు యువతి స్పందిస్తూ.. ‘నాకు ఉచిత విద్యుత్ వద్దు.. రాఘవ్ కావాలి’ అంటూ ఎమ్మెల్యేను ఉద్దేశించి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ రాఘవ్ చడ్ఢా దృష్టిని ఆకర్షించింది.
ఆమె కామెంట్ పట్ల ఎమ్మెల్యే కూడా అంతే ఆశ్చర్యకరంగా సమాధానమిచ్చారు. ‘పార్టీ మేనిఫెస్టోలో నేను లేను.. ఉచిత విద్యుత్ మాత్రమే ఉంది. కావాలంటే పంజాబ్‌లో ఆప్ అధికారం చేపట్టాక మీ ఇంటికి ఉచితంగా నిరంతరం విద్యుత్ సరఫరా అయ్యేట్టు చూస్తాలే’ అంటూ ఆమె ట్వీట్‌కు బదులిచ్చారు.
అయితే ట్విటర్లో ఆ యువతికి సంబంధించిన ట్వీట్‌ను కొద్దిసేపటి తర్వాత తొలగించగా.. రాఘవ్ ఆ ట్వీట్ల స్క్రీన్‌షాట్‌ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.
వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాగా వేయడమే లక్ష్యంగా ఇటీవల ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఇటీవల అక్కడ పర్యటించి ఉచిత విద్యుత్‌తో పాటు పలు హామీల వర్షం కురిపించిన విషయం తెలిసిందే’’అని ఈనాడు తెలిపింది.
ఫొటో సోర్స్, facebook/ysjagan
ఆంధ్రప్రదేశ్: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యాన్ని(డీఏ) 3.144 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసిందని సాక్షి ఓ కథనం ప్రచురించింది.
‘‘తాజా మార్పుల అనంతరం ఉద్యోగుల డీఏ వారి బేసిక్ జీతంలో 30.392 శాతం నుంచి 33.536 శాతానికి చేరుకుంది. ఈ పెరిగిన డీఏ 2019 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పెరిగిన డీఏతోనే జూలై నెల జీతాలు, పెన్షన్లు ఇవ్వనున్నారు. 2019 జనవరి నుంచి 2021 జూన్ వరకు ఉన్న డీఏ బకాయిలను పెన్షనర్లకు, సీపీఎస్ ఉద్యోగులకు మూడు విడతల్లో అందజేయనున్నారు.
అలాగే జనరల్ ప్రావిడెంట్ ఫండ్(జీపీఎఫ్) ఉన్న ఉద్యోగులకు బకాయిలను మూడు విడతలుగా.. వారి పీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తారు.
రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు ఇస్తున్న 30 శాతం ఇంటి అద్దె అలవెన్స్(హెచ్ఆర్ఏ)ను మరో ఏడాది కొనసాగిస్తూ ఆర్థిక శాఖ మరో ఉత్తర్వు విడుదల చేసింది.
హైదరాబాద్‌లోని సచివాలయం, శాఖల ప్రధాన కార్యాలయాల నుంచి వచ్చి.. అమరావతి, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లోని ప్రధాన కార్యాలయాల్లో పనిచేస్తున్న వారికి 2021 జూలై 1 నుంచి ఏడాది పాటు 30 శాతం హెచ్ఆర్ఏ అమల్లో ఉంటుంది’’అని సాక్షి తెలిపింది.
ఫొటో సోర్స్, Getty Images
సీరియల్ చూస్తూ బైక్ రైడ్ చేసిన వ్యక్తికి ఫైన్
సీరియల్ చూస్తూ మోటార్‌బైక్‌పై వెళ్లిన వ్యక్తిని సోషల్ మీడియాలో వెలువడిన దృశ్యాల ద్వారా గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు అతని నుంచి జరిమానా వసూలు చేశారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
‘‘కోయంబత్తూర్ గాంధీపురం ఫై ఓవర్‌పై మోటార్ బైక్‌పై వెళుతున్న వ్యక్తి బైక్ ముందు భాగంగా అమర్చిన స్టాండ్‌కు సెల్‌ఫోన్ ఉంచి ఒక సీరియల్ చేస్తూ బైక్‌పై వెళుతున్నాడు.
ఈ దృశ్యాన్ని వెనుక నుంచి మరో బైక్‌పై వస్తున్న యువకులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలని ట్రాఫిక్ పోలీసులకు నగర పోలీస్ డిప్యూటీ కమిషనర్ సెంథిల్‌కుమార్ ఆదేశించారు. అలాగే, అతని ఆచూకీ తెలపాలని పోలీసులు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ నేపథ్యంలో, సోషల్ మీడియాలో వచ్చిన దృశ్యాల ఆధారంగా వాహన నెంబరును విచారించిన పోలీసులు, సదరు వ్యక్తి కన్నప్పన్‌నగర్ ప్రాంతానికి చెంది ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న ముత్తుస్వామిగా గుర్తించి, అతనికి రూ.1,200 జరిమానా విధించారు’’అని ఆంధ్రజ్యోతి తెలిపింది.
ఫొటో సోర్స్, Facebook/DasariNarayanaRao
దర్శకుడు దాసరి నారాయణరావు కుమారులపై కేసు
అప్పు తీర్చమన్నందుకు చంపేస్తామని భయపెట్టారంటూ ప్రముఖ సినీ దర్శకుడు, దివంగత దాసరి నారాయణరావు కుమారులపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారని వెలుగు ఓ కథనం ప్రచురించింది.
‘‘గుంటూరు జిల్లాకు చెందిన అట్లూరి సోమశేఖర్ రావు హైదరాబాద్ నగరంలోని ఎల్లారెడ్డిగూడలో నివసిస్తున్నారు. దాసరి నారాయణరావుతో ఆయన సన్నిహితంగా ఉండేవారు.
అయితే దాసరి నారాయణరావు ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు పలు దఫాలుగా సోమశేఖరరావు వద్ద రూ.2.10 కోట్లు అప్పు తీసుకున్నారు. దాసరి మరణానంతరం పెద్దల సమక్షంలో ఆయన కుమారులు దాసరి ప్రభు, అరుణ్ 2018 నవంబరు 13వ తేదీన రూ.2.10 కోట్ల బదులు రూ. 1.15 కోట్లు చెల్లించేందుకు అంగీకరించారు.
అయితే డబ్బు ఇవ్వలేదు. దీంతో బాధితుడు సోమశేఖరరావు ఈ నెల 27న జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 46లోని దాసరి నారాయణరావు నివాసానికి వెళ్లి దాసరి ప్రభు, దాసరి అరుణ్ లను డబ్బులు ఇవ్వమని అడిగారు. అప్పు చెల్లించమని అడిగినందుకు చెల్లించకపోగా.. మరోసారి ఇంటికి వస్తే చంపేస్తామంటూ వారు తనను భయపెట్టారంటూ బాధితుడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు వారిద్దరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు’’అని వెలుగు పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)