కోవిడ్ వ్యాక్సినేషన్: భారతదేశంలో అందరికీ సరిపడా టీకాలు ఉన్నాయా?

  • శృతి మేన‌న్‌
  • బీబీసీ రియాలిటీ చెక్
కరోనావైరస్ వ్యాక్సీన్లు

ఫొటో సోర్స్, Getty Images

2021 చివరి నాటికి దేశంలోని వయోజనులందరికీ టీకాలు అందిస్తామని భారత ప్రభుత్వం వాగ్దానాలు చేస్తోంది. కానీ భారత్ వద్ద అందుకు సరిపడా వ్యాక్సీన్లు ఉన్నాయా అనే అంశం ఎన్నో ప్రశ్నలకు తావిస్తోంది.

భారత్‌లో టీకాల ఉత్పత్తి సామర్థ్యం, పంపిణీలను ప్రభావితం చేసే అంశాల గురించి బీబీసీ పరిశోధన చేసింది.

భారత్ ఇప్పుడు ఎంత మొత్తంలో వ్యాక్సీన్లను ఉత్పత్తి చేస్తోంది?

భారతదేశపు వ్యాక్సీన్ కార్యక్రమంలో కీలకమైన రెండు స్వదేశీ టీకాలు కోవిషీల్డ్, కోవాగ్జిన్‌ల ఉత్పత్తిపై ఇటీవల భారత ప్రభుత్వం రెండు వేర్వేరు సందర్భాల్లో భిన్నంగా స్పందించింది.

సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) కోవిషీల్డ్‌ను తయారు చేస్తుండగా, దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తోంది.

ఫొటో సోర్స్, AFP

జూలై 20న పార్లమెంటులో ఒక ప్రశ్నకు స్పందిస్తూ భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ‘కోవిషీల్డ్ వ్యాక్సీన్ ఉత్పత్తిని నెలకు 11 కోట్ల నుంచి 12 కోట్ల డోసులకు పైగా పెంచేందుకు ప్రణాళికలు చేస్తున్నాం’ అని తెలిపింది.

కానీ ఇదే అంశంపై మరో ప్రశ్నకు సమాధానమిస్తూ టీకాల ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు 13 కోట్ల కంటే కాస్త ఎక్కువగా పేర్కొంది.

దీని గురించి ఎస్ఐఐని అడగగా... ప్రస్తుతం జులై నెలలో కోవిషీల్డ్ ఉత్పత్తి సామర్థ్యం 11 కోట్ల నుంచి 12 కోట్ల డోసుల మధ్య ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది. భవిష్యత్‌లో ఉత్పత్తి పరిమాణాన్ని పెంచే ప్రణాళికలు అయితే ఇప్పట్లో లేవని సంస్థ వెల్లడించింది.

ఈ ఏడాది ఆరంభంలో భారత వ్యాక్సీన్ తయారీదారులు ముడిసరుకు కొరతను ఎదుర్కొన్నారు. స్వదేశీ వ్యాక్సీన్ తయారీ కంపెనీలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని జో బైడెన్ ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో భారత్‌కు ముడిసరుకు కొరత ఎదురైంది. కానీ భారత్‌లో కోవిడ్ తీవ్రంగా విజృంభించిన‌ తరుణంలో అమెరికా తమ విధానంలో సడలింపులు ఇచ్చింది.

ఫొటో సోర్స్, AFP

కోవాగ్జిన్ విషయంలోనూ భారత ప్రభుత్వం భిన్నమైన గణాంకాలను వెల్లడించింది. రాబోయే నెలల్లో కోవాగ్జిన్ ఉత్పత్తిని నెలకు కోటి డోసుల నుంచి 10 కోట్ల డోసులకు పెంచుతామని ప్రకటించింది.

భారత్ బయోటెక్ ద్వారా ఈ గణాంకాల గురించి తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ ఈ వార్త ప్రచురించే సమయానికి వారినుంచి స్పందన లభించలేదు.

ఆగస్టు- డిసెంబర్ నెలల మధ్యలో మొత్తంగా 4 కోట్ల కోవాగ్జిన్ డోసుల ఉత్పత్తిని ఆశిస్తున్నట్లు భారత్ ప్రభుత్వం మే నెలలో పేర్కొంది.

కానీ తొలుత అనుకున్న ప్రకారం జనవరి-జులై నెలల మధ్యలో అందించాల్సిన 8 కోట్ల డోసుల ఆర్డర్‌నే భారత్ బయోటెక్ ఇంకా పూర్తిచేయలేకపోయింది. జూలై 16 నాటికి కేవలం 60 లక్షల డోసులను మాత్రమే అందించగలిగింది.

భారత్‌లో తయారైన ఇతర వ్యాక్సీన్లను కూడా కోవిడ్‌కు వ్యతిరేకంగా ఉపయోగించాలని భావిస్తున్నారు. కానీ వాటికి ఇంకా ఆమోదం లభించలేదు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్,

బంగ్లాదేశ్‌కు చేరుకున్న కోవిషీల్డ్ టీకాలు

భారత్ ఉపయోగించగలిగే ఇతర టీకాలు ఏవి?

భారత్‌లో అత్యవసర వినియోగానికి రష్యా వ్యాక్సీన్ ‘స్పుత్నిక్ వి’ ఆమోదం పొందింది. తొలుత 30 లక్షల డోసులకు భారత ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది.

జులై లేదా ఆగస్టులో ఈ వ్యాక్సీన్‌ను స్థానికంగా ఉత్పత్తి చేయాలని ముందుగా అనుకున్నారు. కానీ రష్యన్ తయారీదారులు ఇటీవల వెల్లడించిన దాని ప్రకారం సెప్టెంబర్‌లో తొలి విడత వ్యాక్సీన్ ఉత్పత్తి అవుతుందని భావిస్తున్నారు.

ఏడాది కాలంలో భారత్‌లో 30 కోట్ల డోసులకు పైగా స్పుత్నిక్ వి వ్యాక్సీన్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ ఈ లక్ష్యాన్ని ఎప్పుడు చేరుకుంటారో అనే అంశంపై స్పష్టత లేదు.

నోవావాక్స్‌ టీకాను అమెరికా అభివృద్ధి చేసింది. దీన్ని భారత్‌లో కోవావ్యాక్స్‌గా పిలుస్తున్నారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ భారత్‌లో ఈ టీకాను తయారు చేస్తోంది. కానీ దీనికి ఇంకా ఆమోదం లభించలేదు.

ఫొటో సోర్స్, EPA

ప్రస్తుతానికి ఈ టీకా డోసులను నిల్వచేస్తున్నట్లు బీబీసీతో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.

ఈ ఏడాది ఆగస్టు- డిసెంబర్ వ్యవధిలో సరఫరా చేయాల్సిన టీకాల జాబితాలో భారత ప్రభుత్వం ఈ కోవావ్యాక్స్‌ను కూడా చేర్చింది. దీనికి త్వరలోనే ఆమోదం లభించవచ్చు.

జూన్‌లో భారత ప్రభుత్వం అమెరికాకు చెందిన మోడెర్నా టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది. కానీ ఇప్పటివరకు ఒక్క డోసు టీకా కూడా భారత్‌కు చేరలేదు.

జాన్సన్ అండ్ జాన్సన్, ఫైజర్ టీకాలు భారత్‌లో అత్యవసర వినియోగం ఆమోదం కోసం ఇంకా దరఖాస్తు చేసుకోలేదు.

జూన్‌లో అమెరికా, జీ-7 దేశాలు, వ్యాక్సీన్ డోసులను ఇతర దేశాలకు విరాళంగా ఇస్తామని వాగ్దానం చేశాయి. వాటి నుంచి లబ్ధి పొందే వారిలో భారత్ కూడా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images

లక్ష్యాన్ని చేరుకోవడానికి సరిపడా వ్యాక్సీన్లు ఉన్నాయా?

ప్రస్తుతమైతే అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. కానీ పరిస్థితులు మారవచ్చు.

2011 జనాభా లెక్కల ప్రకారం, భారత్‌లో 18 ఏళ్లు లేదా ఆ పైబడిన జనాభా 90-95 కోట్ల వరకు ఉంది. వీరంతా టీకా తీసుకోవడానికి అర్హులే.

టీకాకు అర్హులైన జనాభాలో ఇప్పటివరకు దాదాపు 10 శాతం మంది మాత్రమే రెండు డోసులు అంటే పూర్తిస్థాయిలో టీకా తీసుకున్నారు.

అంటే 2021 చివరి నాటికి మిగిలిన వయోజనులందరికీ టీకాలు వేయడానికి... వచ్చే 5 నెలల్లో నెలకు 29.2 కోట్లు చొప్పున టీకాలు అవసరం.

ప్రభుత్వ అంచనా ప్రకారం చూస్తే, ప్రస్తుతం భారత్ టీకా ఉత్పత్తి సామర్థ్యం నెలకు 12- 13 కోట్ల డోసులు. ఇలాగైతే ఏడాది చివరి నాటికి అందరికీ టీకా అందించడం సాధ్యమయ్యే పనికాదు.

రాబోయే నెలల్లో ఉత్పత్తి సామర్థ్యం పెరగొచ్చు. ఇతర వ్యాక్సీన్లు కూడా అందుబాటులోకి రావొచ్చు. విదేశీ టీకాలు కూడా భారత్‌కు చేరవచ్చు.

కానీ ప్రస్తుతానికైతే, భారత్ తన అవసరాల కన్నా చాలా తక్కువ మొత్తంలో వ్యాక్సీన్లను ఉత్పత్తి చేస్తోంది.

వచ్చే నెల నుంచి పిల్లలకు కూడా టీకాలు వేస్తామని భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల చెప్పింది. ఇదే జరిగితే సరఫరా సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి.

ఫొటో సోర్స్, AFP

భారత టీకాల ఎగుమతి సంగతేంటి?

భారత్ తమ పొరుగు దేశాలతో పాటు గ్లోబల్ కోవాక్స్ పథకం కింద పేద దేశాలకు ఏప్రిల్ వరకు టీకాలను సరఫరా చేసింది. ఏప్రిల్‌లో భారత్ ఎగుమతులు నిలిపివేశాక తన లక్ష్యాలను అందుకోవడానికి కోవాక్స్ కష్టపడుతోంది.

ఇప్పుడు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలు చైనా వ్యాక్సీన్లపై, ఇతర దేశాల విరాళాలపై ఆధారపడుతున్నాయి.

టీకాల ఎగుమతి పునరుద్ధరణ గురించి భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని బీబీసీతో కోవాక్స్ వెల్లడించింది. కానీ తేదీలను ఇంకా నిర్ణయించలేదని తెలిపింది.

భారత అవసరాలే తమ తొలి ప్రాధాన్యత అని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. ఈ ఏడాది చివరి వరకు టీకాలు ఎగుమతి ఉండకపోవచ్చని వ్యాఖ్యానించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)