సెక్స్ తర్వాత గర్భం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

  • శైలజా చందు
  • బీబీసీ కోసం
లైంగిక బంధం

ఫొటో సోర్స్, Getty Images

ప్రణీతకు పెళ్లయిన వెంటనే ఉద్యోగరీత్యా భర్త విదేశాలకు వెళ్లిపోయాడు. సంవత్సరం కావొస్తోంది. ఆమె పుట్టిన రోజుకి హఠాత్తుగా వచ్చేసి సర్ప్రైజ్ చేశాడు భర్త. నాలుగు రోజులు ఆనందంగా గడిపి, తిరిగి ఉద్యోగంలో చేరేందుకు వెళ్లాడు.

భర్త వెళ్లిపోయాక, తామిద్దరూ కలిసి వున్న రోజుల్లో, గర్భం రాకుండా ఎలాంటి రక్షణా తీసుకోలేదన్న విషయం ఆమెకు బోధపడింది.

ఆమె ఇంకా కెరియర్‌లో స్థిరపడలేదు. భవిష్యత్తు పట్ల ఎన్నో ఆశలున్నాయి. వెంటనే పిల్లల్ని కనాలన్న ఉద్దేశం ఆమెకు లేదు.

దీంతో కంగారు పడుతూ ఆమె డాక్టరును సంప్రదించారు.

ఫొటో సోర్స్, Getty Images

అరక్షిత లైంగిక సంపర్కం అంటే?

గర్భం నిరోధించే ఎటువంటి సాధనమూ వాడకుండా సెక్స్‌లో పాల్గొనడాన్నే అరక్షితమైన లైంగిక సంపర్కం లేదా అన్‌ప్రొటెక్టెడ్ సెక్సువల్ ఇంటెర్‌కోర్స్ (Un Protected Sexual Intercourse) అంటారు.

రక్షణ లేకుండా సెక్స్‌లో పాల్గొన్న మహిళ ఒకవేళ గర్భం వద్దనుకుంటే అత్యవసర గర్భ నిరోధకాలను (Emergency Contraception) వాడుకోవాలి.

ఆ సందర్భాల్లో వాడాలి...

మమతకు కాన్పు అయి మూడు వారాలైంది. బిడ్డను చూడడానికి వేరే వూరి నుండి ఆమె భర్త వచ్చాడు. లైంగికంగా కలిశారు. డెలివరీ అయి నెల కూడా కాలేదు. గర్భం ఎందుకొస్తుందిలే అనుకున్నారు. కానీ వచ్చింది.

ప్రసవం అయి 21 రోజులు గడిచాక, బిడ్డకు పాలివ్వని పక్షంలో, సెక్స్‌లో పాల్గొంటే, వారికి గర్భం వచ్చే అవకాశాలున్నాయి.

గర్భ స్రావం జరిగాక అయిదవ రోజు నుండి , అబార్షన్ చేయించుకున్నా, ముత్యాల గర్భాన్ని క్లీన్ చేసినా, అయిదు రోజుల నుండి రక్షణ తీసుకోకుండా సెక్స్‌లో పాల్గొన్నా.. స్త్రీకి గర్భం వచ్చే అవకాశాలుంటాయి.

గర్భధారణ ఇష్టం లేని పక్షంలో అత్యవసర గర్భ నిరోధక సాధనాలు వాడవలసి వుంటుంది.

వీడియో క్యాప్షన్,

శోభనం రాత్రి స్పెషల్ హల్వా.. 'మాడుగుల హల్వా'

అత్యవసర గర్భ నిరోధక సాధనాలు

సాధారణంగా గర్భం రాకుండా వాడే ఏ పద్ధతి అయినా సెక్స్‌లో పాల్గొనడానికి ముందు వాడతారు. అత్యవసర గర్భ నిరోధక పద్ధతి మాత్రం, సెక్స్‌లో పాల్గొన్న తర్వాత వాడతారు.

అరక్షితమైన సెక్స్ తర్వాత గర్భం రాకుండా కాపాడే, సమర్థవంతమైన ఎమర్జెన్సీ గర్భ నిరోధక సాధనాలు మూడు అందుబాటులో వున్నాయి. (వీటిని డాక్టర్‌ని సంప్రదించిన తర్వాత, వారి సలహాలు, సూచనలతోనే వాడాలి.)

  • నోటి మాత్రలు
  • కాపర్ టీ సాధనం. ( 5 రోజులు /120 గంటల లోపు)

అండం విడుదల సమయానికి ముందు 5 రోజుల్లో గనక సెక్స్ జరిపితే, గర్భం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.

అలాంటి పరిస్థితిలో ఎమెర్జెన్సీ గర్భ నిరోధక సాధనాలలో అన్నిటికన్నా సమర్థవంతమైనది కాపర్ టీ . రక్షణ లేకుండా జరిపిన సెక్స్ జరిగిన 5 రోజుల లోపు గర్భాశయంలో కాపర్ టీ గనక అమర్చగలిగితే, గర్భం రాకుండా అడ్డుకోవచ్చు.

వీడియో క్యాప్షన్,

ఇండియాలో అబార్షన్ చేయించుకోవడానికి నిబంధనలేమిటి

గర్భ నిరోధకాలు వాడవలసిన ప్రత్యేక పరిస్థితులు

కొంత మంది స్త్రీలు అప్పటికే కొన్ని గర్భ నిరోధక పద్ధతులు వాడుతూ వుండి వుంటారు. ఆ పద్ధతుల్ని సరిగా పాటించకపోయినపుడు ఎమెర్జెన్సీ గర్భ నిరోధక సాధనాలను పాటించాల్సి వస్తుంది.

ఈస్ట్రోజెన్ + ప్రోగెస్టోజెన్ హార్మోన్ వాడే స్త్రీలు

  • రోజు వారి వాడే గర్భ నిరోధక మాత్రలు రెండు రోజులుగా (48 గంటలు) వాడకపోయినా.
  • చర్మానికి అంటించుకునే గర్భ నిరోధక పాచ్ రెండు రోజుల (48 గంటలు) పాటు వూడిపోయినా, లేదా కొత్త పాచ్ అంటించుకోవడానికి రెండు రోజుల (48 గంటలు) పాటు జాప్యం జరిగినా

ప్రోజెస్ట్రోజెన్ గర్భ నిరోధక మాత్రలు వాడే స్త్రీలు

  • వారు ప్రతిరోజూ వాడే మాత్రలు , ఏనాడైనా 27 గంటలకు మించి ఆలస్యమైతే..

ప్రోజెస్ట్రోజెన్ ఇంజెక్షన్లు వాడే స్త్రీలు

  • ప్రోజెస్ట్రోజెన్ ఇంజెక్షన్ , గర్భ నిరోధక సాధనంగా పనిచేయాలంటే ప్రతి 12 వారాలకూ ఒకటి వేయించుకోవాలి. ఒకవేళ చివరి ఇంజెక్షన్ తర్వాత 14 వారాలు దాటినా, తర్వాతి ఇంజెక్షన్ వేయించుకోనట్లైతే, వారికి గర్భం వచ్చే అవకాశముంటుంది. ఆ సమయంలో అరక్షిత సెక్స్‌లో పాల్గొన్నట్లైతే, ఎమర్జెన్సీ గర్భ నిరోధక సాధనాలు వాడాల్సిన అవసరం వుంది.

ప్రోజెస్ట్రోజెన్ ఇంప్లాంట్

  • గర్భం రాకుండా ఉండేందుకు ఈ ఇంప్లాంట్‌ని చేతి లోపలి భాగంలో చర్మం కింద అమరుస్తారు. సాధారణంగా 3 నుండి 5 సంవత్సరాల పాటు పనిచేసే ఇంప్లాంట్స్ అందుబాటులో వున్నాయి. ఎక్స్పైరీ పీరియడ్ దాటాక కూడా కొత్తది మార్చకుండా, సెక్స్‌లో పాల్గొన్నపుడు గర్భం వచ్చే అవకాశం వుంది. ఒక వేళ గర్భం రాకూడదనుకుంటే లైంగిక సంపర్కం అయాక ఎమర్జెన్సీ పద్ధతులు వాడాలి.

ఫొటో సోర్స్, PA

దుష్ప్రభావాలు ఉంటాయా?

వాంతులు రావొచ్చు.. ఒక వేళ ఎమర్జెన్సీ గర్భ నిరోధక మాత్రలు వాడిన మూడు గంటలలో వాంతులు అయినట్లైతే, మరొకసారి వాడాలి.

ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ.. అంటే గర్భాశయం లోపల కాకుండా బయట వచ్చే గర్భం. ఎమెర్జెన్సీ గర్భ నిరోధక సాధనాలవల్ల ఎక్టోపిక్ ప్రెగ్నన్సీ వచ్చే అవకాశం వుంది.

పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం.. మెన్సెస్ వారం ముందుగా గానీ , లేటుగా గానీ వచ్చే అవకాశముంటుంది.

ఒకవేళ ఎమెర్జెన్సీ గర్భ నిరోధక మాత్రలు పనిచేయక, గర్భం వస్తే, ఆ బిడ్డకు ఎమైనా అవయవలోపం కలిగే అవకాశముందా?

ఇంతవరకూ ఈ పద్ధతి విఫలమై గర్భధారణ జరిగి, పుట్టిన బిడ్డలలో అవయవలోపం వచ్చిన సాక్ష్యాధారాలు లేవు.

రేప్‌కు గురైన మహిళకు, గర్భం వచ్చే అవకాశముంటుంది. వైద్య నిపుణులు ఫారెన్సిక్ శాంపుల్స్ సేకరించిన తర్వాత, ఎమెర్జెన్సీ గర్భ నిరోధక పద్ధతుల గురించి వివరించాలి.

కాపర్ టీ అమర్చడం ద్వారా కానీ, హార్మోన్ మాత్రల ద్వారా గానీ గర్భం రాకుండా నివారించవచ్చు.

ఫొటో సోర్స్, GETTY IMAGES

మహిళలకు ఎలాంటి సలహా ఇవ్వాలి?

ఎమర్జెన్సీ రక్షణ తీసుకున్నట్లైతే, ముందు ముందు గర్భం రాకుండా వుండేందుకు, అందుబాటులో వున్న దీర్ఘ కాలిక పద్ధతుల గురించి వివరించాలి.

ఒక వేళ ఆమె ఎమర్జెన్సీ గర్భ నిరోధక సాధనంగా కాపర్ టీని ఎంచుకున్నట్లైతే అది 3 నుండి 5 సంవత్సరాల వరకూ పనిచేసే సామర్థ్యం వుంటుంది. దాన్ని కొనసాగించ వచ్చు.

శాశ్వత పద్ధతులైన గర్భ నిరోధక మాత్రలు గానీ, హార్మోన్ ఇంప్లాంట్ గానీ, ఇంజెక్షన్లు కానీ, ఎమర్జెన్సీ పద్ధతి వాడిన అయిదు రోజుల్లోపల ప్రారంభించాలి.

ఎమర్జెన్సీ గర్భ నిరోధక పద్ధతి వాడిన స్త్రీలకు ఎటువంటి సూచన ఇవ్వాలి? మెన్సెస్ రావడం నిర్ణీత సమయం కన్నా వారం ఆలస్యమైతే, ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించాలి. గర్భం వచ్చిన సూచన వస్తే, వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి.

(అభిప్రాయాలు వాసకర్త వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)