పీవీ సింధు: వరసగా రెండు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన తెలుగు తేజం

  • వందన
  • బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్ టీవీ ఎడిటర్
పీవీ సింధు

ఫొటో సోర్స్, Getty Images

పీవీ సింధు పేరున ఇప్పటికే ఎన్నో రికార్డులు ఉన్నాయి. చైనాకు చెందిన బింగ్ జియావోపై విజయం సాధించి కాంస్య పతకాన్ని గెల్చుకోవడం ద్వారా ఆమె వరసగా రెండు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఏకైక భారతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా చరిత్ర సృష్టించారు.

ఇప్పటివరకూ ఈ ఘనత ఏ పురుష, మహిళా భారత బ్యాడ్మింటన్ ప్లేయరూ సాధించలేదు

ఇంతకు ముందు రియో ఒలింపిక్స్‌కు సింధు వెళ్లినపుడు అందరూ సరే చూద్దాంలే అనుకున్నారు. కానీ ఈసారీ టోక్యో వెళ్లే ముందే అందరూ ఆమె మీద ఆశలు పెట్టుకున్నారు. ఆమె మళ్లీ కచ్చితంగా పతకం సాధిస్తారనే నమ్మకంతో ఉన్నారు.

'అంచనాలు భారీగా ఉన్నాయి. దానివల్ల నేను ఒత్తిడికి దూరంగా నా గేమ్ మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నా. మెడల్ గెలిచే ప్రయత్నం చేయాలి' అని టోక్యో వెళ్లడానికి ముందు పీవీ సింధు అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images

రియో ఒలింపిక్, టోక్యో మధ్య ఐదేళ్ల తేడా ఉంది. దానితోపాటూ ఈలోపు సింధు, కోచ్ గోపీచంద్ అనే అద్భుతమైన జోడీ కూడా విడిపోయింది.

1995 జులై 5న హైదరాబాద్‌లో పుట్టిన దాదాపు ఆరడుగుల పొడవుండే సింధు విజయగాధ ఒక క్రీడాకారిణి పట్టుదల, కృషి, ఫోకస్, గేమ్ మీద పట్టుకు సంబంధించిన ఒక కథ.

హైదరాబాద్ కోర్ట్‌లో ఆమెను గంటలపాటు చూసే అవకాశం లభించింది. కోర్ట్‌లో దాదాపు నాలుగు గంటల ప్రాక్టీస్‌లో ఒక్కసారి కూడా సింధు దృష్టి మళ్లలేదు. కోర్ట్‌లో ఆగకుండా ప్రాక్టీస్ చేసేవారు.

ప్రపంచ చాంపియన్‌షిప్, ఒలింపిక్ పతకం గెలిచిన సింధు కథ విజయానికి ఉదాహరణ. కానీ ఈ విజయం రాత్రికి రాత్రే వచ్చింది కాదు.

ఫొటో సోర్స్, Getty Images

సింధు ఎనిమిదేళ్ల వయసు నుంచే బ్యాడ్మింటన్ ఆడడం ప్రారంభించారు. ఇంట్లో క్రీడా వాతావరణం ఉండేది. ఎందుకంటే తల్లిదండ్రులు ఇద్దరూ వాలీబాల్ క్రీడాకారులు.

తండ్రి రైల్వే గ్రౌండ్‌లో వాలీబాల్ ఆడ్డానికి వెళ్తున్నప్పుడు, పక్కనే ఉన్న బ్యాడ్మింటన్ కోర్టులో సింధు ఆడుకునేది ఆమె క్రీడా ప్రస్థానం అప్పుడే మొదలైంది. మహబూబ్ అలీ ఆమె మొదట కోచ్.

పదేళ్ల వయసులో గోపీచంద్ అకాడమీకి వచ్చారు. మొదటి ఒలింపిక్ పతకం గెలిచేవరకూ సింధు గోపీచంద్‌తోపాటూ ప్రయాణించారు.

పీవీ సింధు ఒక చైల్డ్ ప్రాడజీ. 2009లో సబ్ జూనియర్ ఏషియన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచిన సింధు తర్వాత ఎప్పుడూ వెనుతిరిగి చూసుకోలేదు.

18 ఏళ్లకే సింధు వరల్డ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచారు. అలా గెలిచిన మొదటి భారత మహిళా క్రీడాకారిణిగా నిలిచారు.

అప్పటి నుంచి ఇప్పటివరకూ సింధు ఎన్నో టైటిల్స్ గెలిచారు. కానీ రియో ఒలింపిక్ ఆమెకు అత్యంత ఇష్టమైన టైటిల్.

ఆ విజయం సాధించి ఐదేళ్లవుతున్నప్పటికీ ఒలింపిక్ మాటెత్తగానే సింధు ముఖంలో ఒక వెలుగు కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images

ఆమె బీబీసీతో మాట్లాడుతూ, "రియో ఒలింపిక్ మెడల్ నాకు చాలా ప్రత్యేకం. 2016 ఒలింపిక్‌కు ముందు గాయపడ్డాను. ఆరు నెలల పాటు ఆటకు దూరంగా ఉన్నాను. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది నా మొదటి ఒలింపిక్స్, నా బెస్ట్ ఇవ్వాలి అని మాత్రమే ఆలోచించా. ఫైనల్లో కూడా నేను వంద శాతం ఆడాను. నేను సిల్వర్ మెడల్ గెలవడం మామూలు విషయం కాదు. నేను భారత్ తిరిగొచ్చినపుడు వీధుల్లో అంతా స్వాగతం పలకడానికి నిలబడ్డారు. అది తలుచుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి" అని అన్నారు.

'బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ వుమన్ ఆఫ్ ది ఇయర్-2019' అవార్డు కూడా గెల్చుకున్న సింధుతో మాట్లాడితే ఒక విషయం అర్థమవుతుంది. సింధు ఎప్పుడూ ఆశావాదంతో ఉంటారు.. ఆమె ఎటర్నల్ ఆప్టిమిస్ట్.

రియో ఒలింపిక్ ఫైనల్లో ఓడిన బాధ ఇప్పుడు కూడా ఉంటుందా అని నేను సింధును అడిగినప్పుడు, "ఓడిపోయినప్పుడు నాకు కాస్త బాధగా అనిపించింది. కానీ మనకు ఎప్పుడూ రెండో అవకాశం దొరుకుతుంది. ఏ మెడల్ నేను గెలుస్తానని అసలు అనుకోలేదో, అది సాధించాను అదే నాకు సంతోషం" అన్నారు.

కానీ, విజయ పరంపర అంత సులభంగా సాధ్యం కాలేదు. గోపీచంద్ కోచింగ్‌లో ఆమె కఠిన శిక్షణ తీసుకున్నారు. 21 ఏళ్ల సింధు నుంచి ఫోన్ కూడా కొన్ని నెలల పాటు తీసుకునేశారు. ఐస్‌క్రీమ్ లాంటి చిన్న చిన్న ఆశలు కూడా ఆమెకు తీర్చుకోలేనంత దూరంలో నిలిచాయి.

మీలో చాలా మందికి ఒలింపిక్ మెడల్ గెలిచిన తర్వాత సింధు ఐస్‌క్రీమ్ తింటున్న ఒక వైరల్ వీడియో గుర్తుండే ఉంటుంది.

అది కష్టాలైనా, వైఫల్యాలైనా దేని గురించి అడిగినా, సింధు ఇచ్చే ప్రతి సమాధానం చిరునవ్వుతోనే ముగుస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images

తిరుగులేని విజయాల తర్వాత కూడా సింధును విమర్శించేవారు కూడా ఉన్నారు. ఫైనల్ మ్యాచ్‌లో ఆమె ఓడిపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. కానీ సింధు అలాంటి వాటికి మాటల్లో సమాధానం ఇచ్చేవారు కాదు.

ఈమెకు ఫైనల్లో ఏమవుతుంది. సింధుకు ఫైనల్ ఫోబియా ఉంది అని చాలా మంది అన్నారు. కానీ నేను నా సమాధానం రాకెట్‌తో ఇవ్వాలి అనుకున్నా. నన్ను నేను నిరూపించుకున్నా.

ఆమె ఈ మాటను 2019లో గెలిచిన వరల్డ్ చాంపియన్ షిప్ ఉద్దేశించి అన్నారు. అంతకు ముందు ఆమె 2018, 2017 ఫైనల్లో ఓడిపోయారు.

సింధు భారత్‌లో అత్యంత విజయవంతమైన మహిళా క్రీడాకారిణుల్లో ఒకరు మాత్రమే కాదు. అత్యధిక సంపాదన ఉన్న ఆటగాళ్లలో కూడా ఒకరుగా నిలిచారు.

ఫోర్బ్స్ 2018లో సింధును ప్రపంచంలో అత్యధిక సంపాదన ఉన్న మహిళా క్రీడాకారుల్లో చేర్చింది. సింధు స్వయంగా ఒక బ్రాండ్ అయ్యారు. ఫేస్ ఆఫ్ ద బ్రాండ్ అయ్యారు.

2018లో కోర్టులో ఆడుతూ సింధు ఐదు లక్షల డాలర్లు సంపాదించారు. ప్రకటనల ద్వారా ఆమె 80 లక్షల డాలర్లు అదనంగా లభించాయి. అంటే ప్రతి వారం ఆమె కనీసం లక్షా 63 వేల డాలర్లు సంపాదించారు. అది ఎంతో మంది క్రికెటర్ల కంటే కూడా ఎక్కువ.

ఫొటో సోర్స్, Getty Images

ఒక విజయవంతమైన క్రీడాకారిణి కావడంతోపాటూ మాటల్లో తన సామర్థ్యంపై పూర్తి నమ్మకం ఉన్న ఒక వ్యక్తిగా సింధు ఆవిర్భవించారు. ఆమె తన భుజస్కందాల మీద ఉన్న ఆశలు, బాధ్యతల గురించి ఆమెకు తెలుసు. ఒత్తిడి ఉన్నప్పటికీ ఆమె తన గేమ్‌ను పూర్తిగా ఆస్వాదిస్తున్నారు.

కఠిన ప్రాక్టీస్ షెడ్యూల్, ప్రపంచమంతా ఆడడానికి వరుస ప్రయాణాలు, బిజినెస్, ప్రకటనలు ఇదంతా చాలా ఎక్కువ కాదా..

తన గేమ్ లాగే సింధు తన ఆలోచన కూడా చాలా స్పష్టంగా ఉంది.

ఇలా మీకు పర్సనల్ లైఫ్ అనేదే లేకుండా పోతుందిగా అని జనం అడుగుతుంటారు. కానీ నాకు ఇది అమూల్యమైన సమయం. ఎందుకంటే మనం ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉండాల్సిన అవసరం లేదు. నేను జీవితంలో ఏదో మిస్ అవుతున్నట్టు నాకు ఎప్పుడూ అనిపించలేదు. బ్యాడ్మింటన్ నా పాషన్.

అయితే సింధు సక్కెస్ మంత్రం ఏంటి అని అడిగితే "ఏది ఏమైనా సరే. ఎప్పుడూ మన మీద నమ్మకం ఉంచడం. అదే నా బలం. ఎందుకంటే వేరే వాళ్ల కోసం కాదు మన కోసం ఆడుతున్నాం. మనం ఏమైనా సాధించగలం అని మనకే చెప్పుకోవాలి" అని సింధు ప్రపంచ చాంపియన్‌కు మాత్రమే అండగలిగే ఆత్మవిశ్వాసంతో సమాధానం ఇస్తారు.

కానీ ప్రపంచ చాంపియన్ అవడం అంటే కేవలం శ్రమ, నీరసం అని మాత్రమే అనుకుంటే.. అక్కడ కూడా సింధు అది తప్పు అని నిరూపిస్తారు.

ఆటలతోపాటూ సింధు ఫ్యాషన్ ఐకాన్ కూడా అయ్యారు. "బిల్‌బోర్డ్‌ మీద, ప్రకటనల్లో నన్ను నేను చూసుకోవడం బాగుంటుంది. మంచి బట్టలు వేసుకోవడం, మేకప్ చేసుకోవడం బాగుంటుంది" అని సింధు అంటారు. ఆమె వేళ్లకు ఉన్న మెరిసే నెయిల్ పాలిష్ కూడా అదే చెబుతుంది.

హైదరాబాదీ కావడం వల్ల హైదరాబాదీ బిరియానీకి కూడా ఆమె ఫ్యాన్. ఫుడ్, ఫ్యాషన్, ఫామిలీతోపాటూ సింధు మొత్తం ఫోకస్ టోక్యో ఒలింపిక్స్ మీద ఉంది.

అయితే గత ఏడాదిగా సింధు ప్రదర్శన అంత మెరుగ్గా ఏం లేదు. ఒలింపిక్ మెడల్ రెండోసారి గెలవాలన్నది ఆమెకు అతిపెద్ద కల. ఆ కలను సింధు నిజం చేసుకుంది.

"కొందరు నా నుంచి స్ఫూర్తి పొందడంపై నాకు సంతోషంగా ఉంది. చాలా మంది బ్యాడ్మింటన్‌ను కెరీర్‌గా చేసుకోవాలనుకుంటున్నారు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా ఈ కష్టం కొన్ని వారాలు కాదు, ఏళ్లు పడుతుంది. విజయం అంత సులభంగా రాదు" అని ఆమె అన్నారు.

అలాంటి విజయానికి సింధు ఒక ఉదాహరణ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)