భారత సరిహద్దుల సమీపంలో చైనా తన అణు సామర్ధ్యాన్ని పెంచుకుంటోందా? ఉపగ్రహ చిత్రాలు ఏం చెబుతున్నాయి

  • రాఘవేంద్ర రావు
  • బీబీసీ న్యూస్
చైనా

ఫొటో సోర్స్, FEDERATION OF AMERICAN SCIENTISTS

చైనా-భారత్ మధ్య వాస్తవాధీన రేఖ దగ్గర గత ఏడాదిగా నెలకొన్న ప్రతిష్టంభన నడుమ అక్కడకు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే క్షిపణులను భద్రపరిచేందుకు చైనా భూగర్భ గోతులు(సైలోస్) నిర్మిస్తూ ఉండవచ్చనే నివేదికలు వస్తున్నాయి.

ఈ నివేదికలు భారత భద్రతా వర్గాల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. భూగర్భం నుంచే క్షిపణులను ప్రయోగించడానికి ఇలాంటి గోతులను ఉపయోగిస్తారు.

దిల్లీకి ఈశాన్యంగా 2 వేల కిలోమీటర్ల దూరంలోని తూర్పు షిన్జియాంగ్ ప్రాంతంలోని హమీలో ఒక విశాలమైన స్థలంలో ఈ గోతులు తవ్వుతున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్(ఎఫ్‌ఏఎస్) సేకరించిన ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి.

గాన్సు ప్రావిన్స్‌లోని యుమెన్ దగ్గర కూడా క్షిపణులను భద్రపరిచడానికి చైనా 120 గోతులను తవ్వుతున్నట్లు జులై మొదట్లో నివేదికలు వచ్చాయి. ఈ ప్రాంతం షిన్జియాంగ్‌కు ఆగ్నేయంగా 380 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ ఉపగ్రహ చిత్రాల ఆధారంగా చైనా షిన్జియాంగ్ దగ్గర కొత్త అణు క్షిపణి క్షేత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఎఫ్‌ఏ‌ఎస్ చెబుతోంది.

ఈ విషయం తెలిసినప్పటి నుంచీ, చైనా అణు క్షిపణులను ప్రయోగించే, నిల్వ చేసే తన సామర్ధ్యాన్ని పెంచుకుంటోందనే ఊహాగానాలు అమెరికా భద్రతా వలయాల్లో జోరందుకున్నాయి.

అణు క్షిపణులను భద్రపరచడానికి చైనా నిర్మిస్తున్న ఈ వందలాది గోతులు ప్రాంతీయ ఆధిపత్యాన్ని పెంచుకోవడానికి చైనా వ్యూహాత్మకంగా అనుసరిస్తున్న విధానమనే మరో సిద్ధాంతం కూడా ఉంది.

ఇది భారత్ కు ఎంత ఆందోళన కలిగిస్తుంది?

"అణు క్షిపణులను భద్రపరిచే ఈ గోతులను అమెరికా లక్ష్యంగా చేసుకుని నిర్మిస్తుండడం వల్ల భారత్ వీటి గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, ఇటీవల భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగుతున్న నేపథ్యంలో ఈ విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి" అని తక్షశిల సంస్థలో చైనా స్టడీస్ ప్రోగ్రాం రీసెర్చ్ అసోసియేట్ సుయాష్ దేశాయ్ అన్నారు.

"అణు సామర్థ్యాన్ని పెంచుకోవడం ద్వారా ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా భౌగోళిక. రాజకీయ ఆధిపత్యాన్ని తిప్పి కొట్టాలని చైనా చూస్తోంది. ముఖ్యంగా సౌత్ చైనా సీ, హిందూ మహాసముద్రం. తైవాన్ జలసంధిలో అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టాలని చూస్తోంది.

హిందూ మహాసముద్రం ప్రాంతంలో భద్రతా పరిష్కారాలు అందించేందుకు నావికా దళ పర్యవేక్షణ, ఆధునీకరణపై దృష్టిపెట్టి భారతదేశం వ్యూహాత్మకంగా సన్నద్ధమై ఉండాలి" అని ఆయన అన్నారు.

"హిందూ మహాసముద్రం ప్రాంతంలో అవసరానికి మించి అమెరికా మీద ఆధారపడే విషయంలో భారత్ భౌగోళికంగా, రాజకీయంగా జాగ్రత్తగా వ్యవహరించాలి" అని డాక్టర్ అహ్మద్ అన్నారు.

"చైనా ఎదుగుదలను నిరోధించేందుకు అమెరికాకు సొంత వ్యూహాత్మక ప్రయోజనాలున్నాయి. అలాగే, ఇండో పసిఫిక్ ప్రాంతంలో అమెరికా బలోపేతం కాకుండా ఆపాలనే ఆశ చైనాకు ఉంది. భారతదేశం ఏ పక్షమూ వహించకుండా, దేశ భౌగోళిక వ్యూహాత్మక ప్రయోజనాల పై మాత్రమే దృష్టి సారించాలి" అని ఆయన అన్నారు.

షిన్జియాంగ్‌లో ఈ ఏడాది మార్చిలో మొదలయిన సైలోస్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు ఎఫ్ఏఎస్ చెబుతోంది.

14 గోతులు కనిపించకుండా పైన కప్పేసిన చైనా, మరో 19 గోతుల కోసం మట్టిని కూడా తొలగించిందని ఎఫ్ఏఎస్ చెబుతోంది.

గ్రిడ్ తరహాలో ఉన్న ఈ ప్రాంగణంలో సుమారు 110 గోతులు నిర్మించవచ్చని ఎఫ్ఏఎస్ అంచనా వేస్తోంది.

ఫొటో సోర్స్, FEDERATION OF AMERICAN SCIENTISTS

అణు క్షిపణులు ఉంచడానికే వీటిని నిర్మిస్తున్నారా?

చరిత్ర ప్రకారం చూస్తే ఇలాంటి గోతులను క్షిపణులను భద్రపర్చడానికే వాడుతున్నారని భద్రతా నిపుణులు చెబుతున్నారు.

"అమెరికా గుర్తించిన ఈ విషయాన్ని చైనా మీడియా తప్పుడు వార్తలుగా, తప్పుడు సమాచారంగా చెబుతోంది" అని బీబీసీ చైనా ఎడిటర్ హోవార్డ్ ఝాన్గ్ అన్నారు.

"ఇదంతా పనికిమాలిన వ్యవహారం" అని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ చెప్పగా, ఆ గోతులను కొత్తగా నిర్మిస్తున్న "విండ్ ఫార్మ్స్" అని ఝాన్గ్ చెప్పారు.

కానీ, ఈ విషయం గురించి చైనా ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. అమెరికా అభియోగాలకు, చైనా మీడియా చెబుతున్న విండ్ ఫార్మ్ సిద్ధాంతానికి స్పందించలేదు.

చైనా 'నో ఫస్ట్ యూజ్‌' పాలసీకి కట్టుబడి ఉందని, ఎవరికైనా సమాధానం ఇవ్వడానికి, ప్రతిఘటించడానికి మాత్రమే అణ్వాయుధాలను వాడుతామని బీజింగ్ నొక్కిచెబుతోంది.

ఫొటో సోర్స్, MATT ANDERSON PHOTOGRAPHY

"తమ అణు శక్తి గురించి చైనా ఎప్పుడూ బహిరంగంగా వెల్లడించలేదు. బీజింగ్ ఎప్పుడూ "మినిమమ్ డిటరెంట్" అణు విధానాన్నే అనుసరిస్తుందని చెబుతుంది. అంటే, చైనా అణ్వాయుధాలను కనీస స్థాయిలోనే ఉంచుకుంటుందని ఎప్పుడూ చెబుతుంది" అని ఝాన్గ్ చెప్పారు.

అణ్వాయుధాల నియంత్రణ చర్చల్లో చైనా పాల్గొనాలని అమెరికా ప్రయత్నిస్తోంది. ఇటీవల అమెరికా రష్యాల మధ్య ఈ చర్చలు జరిగాయి. అయితే, అమెరికా, రష్యాలతో పోలిస్తే తమ అణు శక్తి చాలా తక్కువని చైనా ఇప్పటివరకూ ఈ చర్చల్లో పాల్గొనడానికి నిరాకరిస్తూ వస్తోంది.

"ఎఫ్ఏఎస్ నివేదికల ప్రకారం ఈ గోతుల నిర్మాణం నిజమే అయితే, చైనా క్షిపణుల కోసం తవ్వుతున్న గోతుల సంఖ్య రష్యాను మించిపోవడమో, లేదంటే ప్రస్తుతం అమెరికాకు ఉన్న వాటిలో సగం కానీ అవుతాయి" అని ఝాన్గ్ అన్నారు.

ప్రస్తుతం చైనా దగ్గర 350 అణ్వాయుధాల నిల్వ ఉండగా, రష్యాలో 6255, అమెరికాలో 5550, బ్రిటన్‌లో 225, భారత్‌లో 156, పాకిస్తాన్ లో 165 ఆయుధాల నిల్వ ఉందని స్టాక్ హామ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తాజా అంచనాలు చెబుతున్నాయి.

అయితే, చైనా ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదా ఖండించడం చేయకపోవడంతో, చైనా బయటి విలేఖరులకు దీనికి స్పష్టమైన సమాధానం లభించదని ఝాన్గ్ అన్నారు.

ప్రస్తుతం చైనా, అమెరికా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ గోతులను కనిపించేలా చేయడం అనేది, ఇరుదేశాల మధ్య చర్చలు జరిగేలా రచించిన వ్యూహం కూడా అయి ఉండవచ్చని కొంత మంది అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, KEVIN FRAYER/GETTY IMAGES

శత్రువులను మోసం చేసేందుకే చైనా ఇవి నిర్మిస్తోందా?

చైనా గోతులను నిర్మించే అవకాశం ఉందని దేశాయ్ అన్నారు.

"ఉదాహరణకు, చైనా 100 గోతులను నిర్మిస్తే, వాటన్నిటిలో క్షిపణులు ఉండాలనే నియమం ఏదీ లేదు. అది ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు ఇతర దేశాలను అయోమయంలోకి నెట్టేస్తుంది. చైనాపై దాడి చేసే ఏ దేశమైనా అణ్వాయుధాలను ధ్వంసం చేయాలంటే, ముందు ఈ గోతులన్నీ నాశనం చేయాలి. ఇలాంటి గోతుల సంఖ్యను పెంచడం ద్వారా చైనా ఒక ప్రతిబంధకాన్ని సృష్టిస్తోంది" అని ఆయన అన్నారు. .

చైనా అణు సామర్ధ్యం అమెరికా కంటే తక్కువగానే ఉన్నప్పటికీ, చైనా అణు సామర్ధ్యం మాత్రం ఒక ప్రతిబంధకంగా ఉంటుందని డాక్టర్ అహ్మద్ అన్నారు.

"ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా భౌగోళిక వ్యూహాత్మక పాత్రకు ఈ చర్య ఊతమిస్తుంది" అని ఆయన అన్నారు.

చైనా అణు విధానం సాధారణంగా కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామనే విధంగానే ఉంటుందని అని దేశాయ్ అన్నారు.

"ఈ గోతులను కనిపెట్టడం ద్వారా చైనా వైఖరిలో స్వల్ప మార్పులను నిపుణులు సూచిస్తున్నారు. అంటే, హెచ్చరిక అందిన వెంటనే ప్రతిఘటించడానికి చైనా సిద్ధంగా ఉంటుంది" అని ఆయన చెప్పారు.

చైనా ఆయుధాలు పెరుగుతున్నాయని, అంచనాల ప్రకారం చైనా అణ్వాయుధాలు 300 నుంచి సుమారు 900కి పెరిగాయని దేశాయ్ చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)