ఆంధ్రప్రదేశ్: కొత్త విద్యా విధానంతో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?
- శంకర్ వడిశెట్టి
- బీబీసీ కోసం

ఫొటో సోర్స్, Thinkstock
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగంలో పెను మార్పులు తీసుకొస్తోంది. ఇప్పటికే పాఠశాల పరిసరాల్లో నాడు-నేడు పేరుతో కొత్తదనం తీసుకొస్తోంది.
ప్రభుత్వ విద్య పట్ల ఆదరణ పెంచేందుకు అనుగుణంగా స్కూల్ పరిసరాలను తయారు చేస్తున్నారు. దీంతో పాటు మొత్తం విద్యా విధానాన్నే సమూలంగా మార్చేస్తోంది.
ఇప్పటికే అన్ని తరగతుల్లోనూ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది. సుదీర్ఘకాలంగా దేశవ్యాప్తంగా అమలవుతున్న 10+2+3 విధానాన్ని మార్చేస్తూ కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానాన్ని తొలిసారిగా అమలులోకి తెస్తోంది.
అంగన్వాడీలను కూడా పాఠశాల విద్యగానే పరిగణించేందుకు అనుగుణంగా ప్రీ ప్రైమరీ విద్యగా మార్చేస్తోంది. ఈ మార్పుల ఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది.
ఫొటో సోర్స్, iStock
పాత వ్యవస్థకు కొత్త రూపు
దేశవ్యాప్తంగా విద్యారంగంపై కొఠారి కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా 10+2+3 విధానం అమల్లోకి వచ్చింది. 1964లో డాక్టర్ డీఎస్ కొఠారి సారథ్యంలోని కమిటీ చేసిన ప్రతిపాదనల మేరకు ఈ విధానం అమల్లోకి వచ్చింది.
దాదాపు 5 దశాబ్దాలుగా ఈ పద్ధతి అమలులో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో పదేళ్ల పాఠశాల విద్యను ప్రాథమిక విద్యాశాఖ, రెండేళ్ల ఇంటర్మీడియట్‌ను ఇంటర్ బోర్డ్, మూడేళ్ల డిగ్రీని వివిధ యూనివర్సిటీల సారథ్యంలో నిర్వహిస్తున్నారు.
పాఠశాల విద్యలో 1 నుంచి 5వ తరగతి వరకు ప్రాథమిక విద్య, ఆ తర్వాత 10వ తరగతి వరకు ఉన్నత పాఠశాల విద్యగా భావిస్తూ స్కూళ్లను విభజించారు. ప్రాథమికోన్నత పాఠశాలల పేరుతో కొన్ని చోట్ల 1 నుంచి 8వ తరగతి వరకు నడుపుతున్నారు.
ఆ తర్వాత 1986లో విద్యావిధానం కొంతమేరకు సవరించారు. జవహార్ నవోదయ పాఠశాలలు వంటివి ప్రవేశపెట్టారు.
ఆ తర్వాత మారిన పరిస్థితులకు అనుగుణంగా విద్యావిధానంలో మార్పులు తీసుకురావాలని సుదీర్ఘకాలంగా చర్చ సాగుతోంది. చివరకు గత ఏడాది కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానం తీసుకొచ్చింది.
ఫొటో సోర్స్, iStock
తొలిసారిగా ఏపీలోనే అమలు
కేంద్రం ప్రతిపాదించిన నూతన విద్యావిధానం మీద కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. పలు మార్పులు సూచించారు. కానీ చివరకు 2020 జులై 29న కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందింది. అదే విధానాన్ని కొన్ని రాష్ట్రాలలో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ విధానాన్ని మొట్టమొదటిసారిగా ఆచరణలో పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమాయత్తమయ్యింది. దానికి అనుగుణంగా విద్యావ్యవస్థను పునర్వవస్థీకరించింది. అకాడమిక్, అడ్మినిస్ట్రేటివ్‌లో కూడా మార్పులు తీసుకొస్తూ చేసిన నిర్ణయాన్ని ఆగష్టు 6నాటి ఏపీ క్యాబినెట్ సమావేశం ఆమోదించింది.
కొత్త విధానం ప్రకారం ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ సెంటర్లు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న మండల, జిల్లా పరిషత్ స్కూళ్లు, మున్సిపల్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూళ్ల నిర్వహణను ఒకే విధానంలోకి తీసుకొస్తారు. అందుకు అనుగుణంగా ఆరు రకాలుగా వర్గీకరిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
NEP 2020: కొత్త విద్యా విధానంలో అసలేముంది?
ఇక నుంచి ఏపీలో పాఠశాలల వర్గీకరణ ఇలా ఉంటుంది
1. శాటిలైట్ ఫౌండేషన్ స్కూళ్లు (పీపీ–1, పీపీ–2)
2. ఫౌండేషనల్ స్కూల్స్ (పీపీ–1, పీపీ–2, 1, 2 తరగతులు)
3. ఫౌండేషనల్ ప్లస్ స్కూల్స్ (పీపీ–1 నుంచి 5వ తరగతి వరకు)
4. ప్రీ హైస్కూల్స్ (3వ తరగతి నుంచి 7 లేదా 8వ తరగతి వరకు)
5. హైస్కూళ్లు (3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు)
6. హైస్కూల్ ప్లస్ స్కూళ్లు (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు)
ప్రైవేటు స్కూళ్లలో ఉండే ఎల్కే జీ, యూకేజీలను పీపీ-1, పీపీ-2గా పరిగణిస్తుండగా ఇంటర్మీడియట్‌ను ఇకపై సీబీఎస్ఈ తరహాలో 11, 12వ తరగతులుగా పేర్కొనబోతున్నారు. దానికి తగ్గట్టుగా పాఠశాలల్లో ఉన్న మౌలిక సదుపాయాలను అనుసరించి ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
ప్రతీకాత్మక చిత్రం
అమలులోకి నాలుగేళ్ల డిగ్రీ కోర్సు
12వ తరగతి తర్వాత అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుని నాలుగేళ్ల పాటు కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి దీన్ని అమలులోకి తెస్తోంది.
ఇప్పటి వరకూ మూడేళ్లుగా ఉన్న డిగ్రీ కోర్సు ఇకపై అదనంగా మరో సంవత్సరం పొడిగించారు. అంటే గతంలో ఐదేళ్లు నిండిన విద్యార్థిని ప్రాథమిక పాఠశాలలో చేర్చుకునే అవకాశం ఉండగా 19ఏళ్లకు డిగ్రీ సర్టిఫికెట్ చేతికి వచ్చేది.
ఇక నుంచి మూడో ఏటనే పీపీ-1 పేరుతో బడిలో చేర్చడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఆ తర్వాత నాలుగేళ్ల డిగ్రీ పట్టా అందుకునే సరికి 20ఏళ్లు నిండే అవకాశం ఉంటుంది.
నాడు- నేడు కొత్తగా రూపుదిద్దుకున్న ప్రభుత్వ స్కూళ్లు
రాష్ట్రంలో 34వేల ప్రాథమిక పాఠశాలలున్నాయి. మరో 12వేల జిల్లా పరిషత్ హైస్కూళ్లున్నాయి. ఇప్పటికే ఆయా పాఠశాలలను మూడు విడతలుగా అభివృద్ధి చేసేందుకు జగన్ ప్రభుత్వం గత ఏడాది నుంచి మన బడి నాడు- నేడు పథకం అమలు చేస్తోంది.
మొత్తం రూ. 16,021 కోట్లతో ప్రభుత్వ స్కూళ్ల ఆధునికీకరణ, మౌలికవసతుల కల్పన చేపడతామని ప్రకటించింది. తొలివిడతలో భాగంగా ఇప్పటి వరకు రూ.3,669 కోట్లను ఖర్చు చేసినట్టు చెబుతోంది.
ప్రభుత్వ బడుల్లో అనేక చోట్ల కొత్తదనం కనిపిస్తోంది. తరగతి గదుల్లో సదుపాయాలు మెరుగుపడ్డాయి. ఆటస్థలాలు, ఇతర సదుపాయాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేటు స్కూళ్లతో పోటీపడేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని ప్రభుత్వం చేసిన ప్రకటన కొంతమేరకు కార్యరూపం దాల్చినట్లు కనిపిస్తోంది.
టీచర్ల నియామకాలు ఎలా?
వైసీపీ విపక్షంలో ఉన్న సమయంలో ఎన్నికల హామీలో భాగంగా ఏటా డీఎస్సీ పరీక్షలు నిర్వహించి, ఉపాధ్యాయ నియామకాలు చేపడతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. కానీ ప్రస్తుతం రెండేళ్లు దాటినా దాని జోలికిపోలేదు. ఇటీవల ఉద్యోగ క్యాలెండర్లో కూడా డీఎస్సీ నియామకాలను ప్రస్తావించలేదు. ఇది అనేక మంది ఆశావాహులను నిరుత్సాహపరిచింది. కొన్నిచోట్ల పెద్ద స్థాయిలో నిరసనలు వ్యక్తమయ్యాయి.
ప్రస్తుతం ప్రభుత్వ బడుల రూపురేఖలు మారినప్పటికీ ఉపాధ్యాయ నియామకాలు జరగకపోవడంతో అనేక చోట్ల టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. పైగా గడిచిన ఏడాది ప్రైవేటు స్కూళ్ల నుంచి సుమారుగా 7లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడులకు వచ్చారని ప్రభుత్వం ప్రకటించింది అంటే ఏపీలో బడులు బాగుపడుతున్నాయి..పిల్లల సంఖ్య పెరుగుతోంది. కానీ దానికి అనుగుణంగా టీచర్ నియామకాలు మాత్రం జరగడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది.
వీడియో: ‘రోజుకు 4 గంటలే చదువు.. మిగతా సమయంలో వ్యవసాయం, ఆటలు, కమ్యూనిటీ పనులు’
"నూతన విద్యావిధానం మూలంగా ఉపాధ్యాయ నియామకాలు మరింత జాప్యం అవుతాయి. స్కూళ్లను వర్గీకరణ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలతో వచ్చే ఏడాది కూడా డీఎస్సీ అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే సుమారు 70వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కానీ ప్రభుత్వం అంగన్ వాడీ సెంటర్లను కలిపేసి ఆ సిబ్బందిని కూడా విద్యాబోధకులుగా లెక్కల్లో చూపించే ప్రయత్నం చేయబోతోంది.
ప్రీ ప్రైమరీ స్కూళ్ల పేరుతో అంగన్ వాడీలను కూడా ప్రైమరీ స్కూల్ ప్రాంగణంలోకి తీసుకొస్తున్నారు. ఫలితంగా సెకండరీ గ్రేడ్ టీచర్లు పీపీ1, పీపీ2లకు పాఠాలు చెబుతారని కూడా పేర్కొన్నారు. దాంతో ఇక అంగన్ వాడీల సంఖ్యను చూపించి ఫౌండేషనల్ స్కూళ్ల వరకు కొత్త సిబ్బందిని నియమించే అవకాశాలు కనిపించడం లేదు. ఇది భవిష్యత్తులో చేటు చేస్తుంది. పైగా మార్పుల మూలంగా స్కూళ్లు దూరమయ్యి డ్రాపవుట్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. కొందరు మళ్లీ ప్రైవేటు సంస్థలకు మళ్లాల్సి వస్తుంది" అంటూ ఉపాధ్యాయ నేత, ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వర రావు అభిప్రాయపడ్డారు.
ఫొటో సోర్స్, iStock
ఇంగ్లీష్ మీడియం, సీబీఎస్ఈ తరహా బోధన
ఇప్పటికే పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని కొందరు వ్యతిరేకించారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తోంది. అదే సమయంలో ప్రతి తరగతిలోనూ తెలుగుని తప్పనిసరి చేస్తున్నట్టు ప్రకటించింది.
వాటితో పాటుగా ప్రస్తుతం ఎన్సీఈఆర్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న బోధనాంశాలను సీబీఎస్ఈ తరహాలో మార్చేందుకు కూడా సిద్ధమవుతోంది. సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనలు ఇప్పటికే ఏపీ విద్యాశాఖ నుంచి వచ్చాయి. త్వరలోనే దానికి సంబంధించి తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంటుందని విద్యారంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఫొటో సోర్స్, WDCW.AP.GOV.IN
అంగన్ వాడీల భవిష్యత్ ఏంటి?
అంగన్వాడీ కేంద్రాలను ఐసీడీఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా అమలు చేస్తున్నారు. ఏపీలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలో అంగన్ వాడీ కార్యకర్తలు పనిచేస్తున్నారు. బాలింతలు, శిశువులు, కిషోరబాలికలకు పౌష్టికాహారం అందించడం, వారిలో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడం లక్ష్యంగా వారు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా అంగన్ వాడీ కేంద్రాలు కూడా నిర్మించి వాటిని నడుపుతున్నారు.
ఇకపై ఏపీలో అంగన్ వాడీ కేంద్రాలను కూడా పాఠశాలల్లో భాగంగా మార్చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ అంగన్ వాడీ వర్కర్స్, హెల్సర్స్ యూనియన్ వ్యతిరేకిస్తోంది.
"రాష్ట్రంలో లక్షమంది ఐసీడీఎస్‌లో పనిచేస్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వ బడులలో పనిచేయాలని ప్రభుత్వం చెబుతోంది. పిల్లలకు ఆహారం అందించడానికి కార్యకర్తతో పాటుగా హెల్పర్ కూడా ఉంటుంది. ప్రభుత్వ బడుల్లో ఆహారం మిడ్ డే మీల్ వర్కర్ సిద్ధం చేస్తోంది. ఇకపై అంగన్ వాడీ ఆయాలు గానీ, మిడ్డే మీల్ వర్కర్ గానీ ఎవరో ఒకరినే కొనసాగించే ముప్పు ఉంది. ఇది ఆ పథకం లక్ష్యాలను దెబ్బతీస్తోంది. అంగన్ వాడీలకు భద్రత లేకుడా చేస్తుంది. ఎస్జీటీ కూడా పీపీ-1, పీపీ-2 బోధించడం మొదలయితే ఇక అంగన్ వాడీ కార్యకర్తల నియామకాలు కూడా నిలిపివేస్తారనే ఆందోళన ఉంది" అని ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కే సుబ్బారావమ్మ బీబీసీతో అన్నారు.
కొత్త స్కూళ్లు ఏర్పాటు, ఒక్క టీచర్ ఉద్యోగం కూడా పోదు
"రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నాం. దేశంలో మొదటిసారిగా అనేక మార్పులు చేస్తున్నాం. కొత్త విద్యావిధానం వల్ల ఒక్క టీచర్ ఉద్యోగం కూడా పోదు. స్కూళ్లను అందుబాటులోకి తీసుకొస్తాం. సబ్జెక్ట్ వారిగా టీచర్ ఉండాలి, ప్రతి తరగతికి గది ఉండాలని నిర్ణయించాం. దానికి తగ్గట్టుగానే 4,878 అదనపు తరగతి గదుల నిర్మాణం చేయాలని తీర్మానించాం.
ఆర్థిక సమస్యల కారణంగా పిల్లలు చదువుకి దూరం కాకూడదని జగన్ ప్రభుత్వం భావిస్తోంది. పదో తరగతి తర్వాత కాలేజీలు అందుబాటులో లేక చదువు మానేస్తున్న వారున్నారు. ఇకపై అలాంటి సమస్య ఉండదు. ఎవరికీ అనుమానాలు అవసరం లేదు. డబ్బులు లేకపోవడం వల్ల చదువుకి దూరమయ్యే విద్యార్థి ఒక్కరు కూడా ఉండకూడదనే లక్ష్యంతోనే ఆర్థిక సమస్యలున్నా విద్యారంగానికి ప్రాధాన్యతనిస్తున్నాం" అని ఏపీ సమాచారశాఖ మంత్రి పేర్ని నాని బీబీసీతో అన్నారు.
ఆంధ్రప్రదేశ్ విద్యావిధానంలో తీసుకొస్తున్న మార్పులు పట్ల పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ సర్కారు మాత్రం వేగంగా ముందుకెళుతోంది. ఏపీ తర్వాత వివిధ రాష్ట్రాలు కూడా ఇదే విద్యావిధానం అనుసరించే అవకాశం ఉన్న తరుణంలో ఈ రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉంటాయన్నది చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ లక్షణాలు: ఏమిటి? ఎలా గుర్తించాలి? నన్ను నేను ఎలా కాపాడుకోవాలి?
- న్యూజీలాండ్‌లో 'జీరో' కరోనావైరస్ కేసులు ఎలా సాధ్యమయ్యాయి?
- 'ప్రేమించి గర్భవతి అయిన కూతురిని తల్లిదండ్రులే చంపేశారు'
- నా కళ్లతో చూశాను.. ఒక్కొక్కరు చనిపోతుంటే బోటులోంచి సముద్రంలోకి విసిరేశారు
- నేను స్మోకింగ్ ఎలా మానేశానంటే: ‘పొగంగేట్రం’ నుంచి ఉపసంహారం దాకా
- స్వాల్బార్డ్‌కి సుస్వాగతం: ఇది అందరిదీ.. వీసా లేకున్నా ఎవరైనా రావొచ్చు, ఉండొచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)