దళిత గిరిజన దండోరా: 'దళిత బంధు' రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు అమలు చేయరు-రేవంత్‌రెడ్డి

  • ప్రవీణ్ కుమార్
  • బీబీసీ కోసం
రేవంత్ రెడ్డి

ఫొటో సోర్స్, twitter/Revanth Reddy

ఉప ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్‌కు ఎస్సీలు గుర్తొస్తారని, దళిత బంధును రాష్ట్రవ్యాప్తంగా ఎందుకు అమలు చేయడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన దళిత గిరిజన దండోరా సభలో ఆయన పాల్గొన్నారు.

తెలంగాణలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు వస్తే తప్ప దళితబంధు అందరికి వర్తించేలా లేదని రేవంత్ రెడ్డి అన్నారు.

ఇది రావుల రాజ్యం అని, ఇందులో ఎవరికీ ఏ సంక్షేమాలు రావని, పోరాడి దళిత బడుగుల రాజ్యం తెచ్చుకోవాలని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, twitter/Revanth reddy

ఇంద్రవెల్లి సభలో రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..

ఇంద్రవెల్లి గాలి పీలుస్తుంటే స్వేచ్ఛ కోసం గొంతెత్తి పోరాటం చేయాలన్న స్ఫూర్తి కలుగుతోంది. ఇంద్రవెల్లి గడ్డ మీద నుంచే కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా శంఖం ఊదుతున్నాం.

ఎన్నికల్లో లబ్దిపొందడానికే దళితబంధు అని కేసీఆర్ చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో దళిత కుటుంబాలన్నింటికి పది లక్షలు చొప్పున ఇచ్చేలా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిలదీయాలి.

నిన్నటి వరకు ఒక లెక్క. లెక్కకు లెక్క అప్పగిస్తాం. దెబ్బకు దెబ్బ తీస్తాం. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే సహించేది లేదు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్, ఫాంహౌజ్ గోడలు బద్దలు కొట్టి కేసీఆర్‌ను చర్లపల్లి జైలులో పెడతాం.

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు కేసీఆర్ పాలనలో నెరవేరలేదు. ఉద్యమకారులపై కేసులు తొలగించలేదు. దళిత మైనార్టీలకు రిజర్వేషన్లు, కేజీ టు పీజీ హామీలు అమలు కాలేదు. కానీ తరాలు కూర్చుని తిన్నా తరిగిపోని ఆస్తులను కేసీఆర్ కుటుంబం అక్రమంగా సంపాదించుకుంది.

70ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతున్నారు.. దళితులను రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్, కేంద్ర హోం మంత్రులను చేసింది.

దళితుల అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి చేస్తే, దళితుడే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అని కేసీఆర్ మాటిచ్చి తప్పారు.

అవినీతి ముద్ర వేసి రాజయ్యను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు. ఆయనపై చేసిన అవినీతి ఆరోపణలను ఇప్పటివరకు నిరూపించలేకపోయారు.

ఫొటో సోర్స్, twitter/Revanth Reddy

ఉమ్మడి రాష్ట్రంలో 1981 ఏప్రిల్ 20న కాల్చేస్తుంటే ఈ ప్రాంత నాయకులు నిస్సహాయంగా ఉండిపోయారు. ఈ రోజు ఇదే గడ్డ మీద నుంచి పోలీసు కాల్పుల్లో అమరులైన వారికి నివాళులు అర్పిస్తున్నాను.

ఇంద్రవెల్లి ఆదివాసీ అమరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇంద్రవెల్లి అమరుల స్మారక స్థూపాన్ని నిర్మించి శిలాఫలకంపై ఆనాటి కాల్పుల్లో అసువులు బాసిన ఆదివాసీల పేర్లు చెక్కిస్తాం.

ఇంద్రవెల్లి సభకు రాకుండా ఉట్నూర్ వద్ద 10వేల మందిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు ఖాకీ యూనిఫాం వేసుకున్న రజాకార్లుగా మారారు.

తెలంగాణలో ఆదివాసీ, గిరిజనులు సాగుచేస్తున్న పోడు భూములు పోరు భూములుగా మారాయి. అడవి జంతువులకన్నా హీనంగా గిరిజనుల బతుకులు మారాయి.

ఆదివాసీ, దళితుల హక్కుల సాధనకు ఆగష్టు 18న ఇబ్రహీంపట్నంలో రెండవ సభను నిర్వహిస్తామని రేవంత్ చెప్పారు.

ఫొటో సోర్స్, twitter/Revanth Reddy

రేవంత్ రెడ్డి విమర్శలపై టీఆర్ఎస్ పార్టీ స్పందించింది.

చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు సుంకె రవిశంకర్ బీబీసీతో మాట్లాడారు.

ఉనికి కోసం రేవంత్ ఆరాటపడుతున్నారు. దళిత బంధు అమలైతే దళితులు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ దూరమవుతారో అన్న భయం వాళ్లకు పట్టుకుంది. రేవంత్‌కు పార్టీ పదవి వచ్చిందని అసత్యాలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దళితుల కోసం ఏం చేసింది? కేసీఆర్ నాయకత్వంలో దళితులకు నాణ్యమైన కార్పొరేట్ విద్య అందించాం. రాజయ్యపై ఆనాడు తీసుకున్న చర్య పార్టీ పరంగా తీసుకున్నదే తప్ప మరొకటి కాదు అని చొప్పదండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు.

కరీంనగర్ నుంచి మొదలుపెడితే కలిసి వస్తుందన్న సెంటిమెంట్‌ టీఆర్ఎస్‌కు ఉంది. సింహగర్జన సభ నుంచి రైతుబంధు వరకు కరీంనగర్ నుంచే ప్రారంభించాం. అందుకే ఈసారి దళిత బంధు కూడా ఆ జిల్లా నుంచే మొదలుపెడుతున్నాం అని ఆయన చెప్పారు.

ఇంద్రవెల్లి స్థూపం వద్ద సభ నిర్వహించే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదు. ఇంద్రవెల్లిలో ఆదివాసీలను కాల్చి రక్తం కళ్లజూసింది కాంగ్రెస్సే. కాంగ్రెస్‌లో దళితులు అణవేతకు గురైనంతగా వేరే ఏ పార్టీలో కాలేదు అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)