కరోనావైరస్: థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు భారత్ ఎలాంటి అస్త్రాలను సిద్ధం చేస్తోంది

జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సీన్

ఫొటో సోర్స్, Getty Images

కరోనావైరస్ థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో భారత్ కోవిడ్ వ్యాక్సీన్ల ఉత్పత్తి వేగం పెంచుతోంది.

ఇప్పటికే కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్-వి టీకాలను వినియోగిస్తున్న భారత్ అత్యవసర వినియోగం కోసం 'జాన్సన్ అండ్ జాన్సన్' సింగిల్ డోస్ టీకాకు అనుమతి ఇచ్చింది.

దేశీయ వ్యాక్సీన్ తయారీ సంస్థ 'బయోలాజికల్-ఈ'తో సరఫరా ఒప్పందం ద్వారా భారత్‌లో దీన్ని అందుబాటులోకి తేనున్నారు.

జాన్సన్ అండ్ జాన్సన్ టీకా 85 శాతం దక్షత కలిగి ఉందని ప్రయోగాలలో నిరూపణ అయింది.

అయితే, ఇది ఎప్పటికి అందుబాటులోకి వస్తుందనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. సరఫరా షెడ్యూల్ ఇప్పుడే ప్రకటించలేమని జాన్సన్ అండ్ జాన్సన్ చెబుతోంది.

భారత్‌లో ఇప్పటికే 50 కోట్లకు పైగా డోసుల టీకాలు వేయగలిగారు. ఇండియాలో అత్యవసర వినియోగానికి ఆమోదముద్ర వేసిన రెండో విదేశీ వ్యాక్సీన్ 'జాన్సన్ అండ్ జాన్సన్' టీకా. ఇప్పటికే వినియోగిస్తున్న మూడు రకాల వ్యాక్సీన్లలో రష్యాకు చెందిన 'స్పుత్నిక్-వి' వ్యాక్సీన్ కూడా ఉంది.

భారత్‌లో క్లినికల్ ట్రయల్స్ నిర్వహించనప్పటికీ ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా అమెరికా, బ్రిటన్, జపాన్, యూరోపియన్ యూనియన్ అనుమతిస్తే అలాంటి టీకాలకు అత్యవసర అనుమతి ఇచ్చేలా కొత్త విధానం రూపొందించడంతో దాని ప్రకారం జాన్సన్ అండ్ జాన్సన్‌కు అనుమతి లభించింది.

ఫొటో సోర్స్, Getty Images

మోడెర్నా వ్యాక్సీన్ ఎందుకు ఆగిందంటే..

మరోవైపు భారత ప్రభుత్వం జూన్‌లో.. మోడెర్నా వ్యాక్సీన్ దిగుమతి చేసుకునేందుకు దేశీయ కంపెనీ సిప్లాకు అనుమతులు జారీ చేసింది. మోడెర్నా వ్యాక్సీన్ దక్షత 95 శాతం ఉన్నట్లు ప్రయోగాలు చెబుతున్నాయి.

అయితే, వ్యాక్సీన్ వేసుకున్నాక తలెత్తే ఎలాంటి పరిణామాలకైనా తమను బాధ్యులను చేయరాదని, చట్టపరమైన రక్షణ కల్పించాలని మోడెర్నా కోరడంతో భారత ప్రభుత్వం అందుకు నిరాకరించింది. దీంతో ఆ వ్యాక్సీన్ భారత్‌కు దిగుమతి కాలేదు.

ఇలాంటి చట్టపరమైన రక్షణ భారత్‌తో వినియోగిస్తున్న ఏ వ్యాక్సీన్‌కూ లేదు.

ఫొటో సోర్స్, Getty Images

అందరికీ రెండు డోసుల వ్యాక్సీన్ ఎప్పటికి పూర్తయ్యేను?

భారత్‌లో ఇప్పటివరకు మొత్తం 3.2 కోట్లకు పైగా కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అమెరికా తరువాత భారత్‌లోనే ఇంత భారీ మొత్తంలో కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం దేశంలో రోజుకు 40 వేలకు అటూఇటుగా కేసుల సంఖ్య ఉంటోంది. రెండో వేవ్‌లో రోజుకు 4 లక్షలకు పైగా కేసులు నమోదైన పరిస్థితి నుంచి ప్రస్తుతం సుమారు 40 వేల కేసులకు తగ్గాయి.

అయితే, థర్డ్ వేవ్ తప్పనిసరిగా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు అమెరికా, బ్రెజిల్‌ల తరువాత 4 లక్షలకు పైగా మరణాలు నమోదైన దేశం భారత్.

ఈ ఏడాది చివరి నాటికి దేశ ప్రజలందరికీ వ్యాక్సీన్ వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

వ్యాక్సీన్లు తగినన్ని అందుబాటులో లేకపోవడం, ప్రజలలో చాలామంది టీకా వేసుకునేందుకు సుముఖంగా లేకపోవడం వంటి కారణాలతో దేశంలో వ్యాక్సినేషన్ వేగవంతం కావడం లేదు.

ఈ ఏడాది జనవరిలో వ్యాక్సినేషన్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు దేశ జనాభాలో 11 శాతం మందికి పూర్తిస్థాయిలో రెండు డోసుల టీకా వేశారు.

థర్డ్ వేవ్ వస్తుందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో భారత్ ఇప్పుడు వ్యాక్సీన్ల ఉత్పత్తి, వ్యాక్సినేషన్ రెండింటి వేగం పెంచుతోంది.

ఇందులో భాగంగానే సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారంతో 'నోవావాక్స్' టీకా ఉత్పత్తి కూడా ప్రారంభించాలనుకుంటోంది.

బయోలాజికల్-ఇ సంస్థ అందించబోయే మరో వ్యాక్సీన్ 30 కోట్ల డోసుల కోసం కూడా ఆర్డర్ ఇచ్చింది ప్రభుత్వం.

ఫొటో సోర్స్, Getty Images

నోవావాక్స్ ఎప్పటికి అందుబాటులోకి వస్తుంది?

భారత్‌లో 200 కోట్ల డోసుల వ్యాక్సీన్ తయారు చేయడం కోసం 'నోవావాక్స్' సంస్థ 2020 సెప్టెంబరులో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకుంది.

ఈ టీకాను కోవోవాక్స్ పేరుతో వచ్చే సెప్టెంబరు నాటికి అందుబాటులోకి తేవాలని ఆశిస్తున్నట్లు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా చెప్పారు.

దీనికి సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ పూర్తికానున్నాయని ఆయన తెలిపారు.

అమెరికాలో వలంటీర్లపై జరిపిన ట్రయల్స్ ప్రకారం ఇది 91 శాతం సామర్థ్యంతో పనిచేస్తున్నట్లు తేలింది.

ఫొటో సోర్స్, Getty Images

బయోలాజికల్-ఇ వ్యాక్సీన్ సంగతేమిటి?

అమెరికా కేంద్రంగా పనిచేసే డైనావాక్స్, బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసన్ సంయుక్తంగా తయారుచేసిన ఓ వ్యాక్సీన్‌ను ఉత్పత్తి చేసి తమకు సరఫరా చేసేలా 30 కోట్ల డోసులకు బయోలాజికల్-ఇ సంస్థకు భారత ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది.

20.6 కోట్ల డాలర్ల విలువైన ఈ ఒప్పందం భారత్ టీకా కోసం చేసుకున్న మొదటి ఒప్పందం, అయితే, ఈ వ్యాక్సీన్‌కు ఇంతవరకు అత్యవసర అనుమతులు దొరకలేదు.

ఇంకా పేరు పెట్టని ఈ వ్యాక్సీన్ ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్‌లో ఉంది. మొదటి రెండు దశల ట్రయల్స్‌లో ఇది మంచి ఫలితాలిచ్చిందని ప్రభుత్వం చెబుతోంది.

ఫొటో సోర్స్, Ani

ఇంకా ఏమేం వ్యాక్సీన్లు రానున్నాయి?

ఇవే కాకుండా మరికొన్ని వ్యాక్సీన్లు కూడా భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఇవి వివిధ దశల ప్రయోగాలలో ఉన్నాయి.

అహ్మదాబాద్‌కు చెందిన జైడస్-కేడిలా సంస్థ అభివృద్ధి చేస్తున్న జైకోవ్-డి వ్యాక్సీన్ ప్రయోగ దశలో ఉంది.

పుణెకు చెందిన జెనోవా సంస్థ, సీటెల్ కేంద్రంగా పనిచేసే హెచ్‌డీటీ బయోటెక్ కార్పొరేషన్ కలిసి అభివృద్ధి చేస్తున్న 'హెచ్‌జీసీఓ-19' వ్యాక్సీన్ కూడా ప్రయోగ దశలో ఉంది. ఇది భారత్‌లో రూపొందుతున్న తొలి ఎంఆర్ఎన్ఏ రకం వ్యాక్సీన్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)