సొంత రాష్ట్రంలో 19 శాతం జనాదరణ కూడా పొందని జగన్, కేసీఆర్.. 26 శాతానికి చేరిన మోదీ పాపులారిటీ - ఇండియా టుడే సర్వే : ప్రెస్‌రివ్యూ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రజాదరణ తగ్గిపోతోందని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాపులారిటీ కూడా తగ్గుతుందని దీనిలో పేర్కొన్నారు.
''ఇండియా టుడే నిర్వహించిన 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వేలో జగన్ గ్రాఫ్ బాగా పడిపోనట్లు వెల్లడైంది.
'స్టాలిన్ బెస్ట్ సీఎం' అని తమిళనాడులో 42 శాతం మంది ఓటేసి ఆయనను అగ్రస్థానంలో నిలబెట్టారు.
38 శాతం మంది ఒడిశా ప్రజల ఆదరణతో నవీన్ పట్నాయక్ రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో పినరయి విజయన్ (35 శాతం) ఉన్నారు.
'స్వరాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ ఉన్న ముఖ్యమంత్రులు' (మోస్ట్ పాపులర్ సీఎమ్స్ ఇన్ దెయిర్ హోమ్ స్టేట్స్) అనే ఈ జాబితాలో టాప్-టెన్‌లో కూడా జగన్ లేరు.''
హేమంత్ సొరేన్ (జార్ఖండ్), భూపేశ్ (ఛత్తీస్‌గఢ్) 19 శాతం ఆదరణ సాధించి వరుసగా 10, 11 స్థానాల్లో నిలిచారు. అంటే... జగన్‌ను ఏపీలో కనీసం 19 శాతం మంది కూడా 'బెస్ట్ సీఎం'గా గుర్తించలేదని ఆంధ్రజ్యోతి తెలిపింది.
'ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో వరాలు ప్రకటించి, ప్రజాకర్షక పథకాలు అమలు చేస్తున్నప్పటికీ... జగన్‌కు ప్రజాదరణ తగ్గిపోయింది'' అని ఇండియా టుడే వ్యాఖ్యానించింది.''
''జాతీయ స్థాయిలో ఉత్తమ పనితీరు ప్రదర్శిస్తున్న సీఎంగా జగన్‌కు 11 శాతం మంది ఓటు వేశారు. ఇప్పుడు ఆ సంఖ్య ఆరు శాతానికి పడిపోయింది. జాతీయ స్థాయిలో 19 శాతం ఓట్లతో యూపీ సీఎం ఆదిత్యనాథ్ దాస్ అగ్రస్థానంలో నిలిచారు.’’
ఇక.. తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు ఏ జాబితాలోనూ కనిపించలేదు''అని ఆంధ్రజ్యోతి తెలిపింది.
ఫొటో సోర్స్, Getty Images
''మరోవైపు ప్రధాని మోదీ ప్రజాదరణ కూడా పడిపోయింది. నిరుడు ఆగస్టులో 66 శాతంగా ఉన్న పాపులారిటీ ప్రస్తుతం 26 శాతమే నమోదైనట్లు సర్వేలో వెల్లడైంది.
ఈ ఏడాది జనవరికే మోదీ పాపులారిటీ 66 శాతం నుంచి 38 శాతానికి పడిపోగా.. ఇప్పుడది మరింత క్షీణించి 26 శాతానికి చేరింది. అయినప్పటికీ దేశ ఉత్తమ ప్రధానిగా 24 శాతం మంది ఆయనవైపే మొగ్గుచూపారు.
తర్వాతి స్థానంలో (11%) యోగి ఆదిత్యనాథ్ నిలిచారు. మూడో స్థానంలో (10%) ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పాపులారిటీ గత ఏడాదితో పోల్చితే రెండు శాతం పెరిగిందని సర్వే పేర్కొంది''అని ఆంధ్రజ్యోతి తెలిపింది.
ఫొటో సోర్స్, Getty Images
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు రూ. లక్ష జరిమానా విధించిన సుప్రీంకోర్టు
రాష్ట్రాల్లో న్యాయమూర్తులు, కోర్టు ప్రాంగణాల భద్రత కోసం తీసుకున్న చర్యలపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు రూ. లక్ష జరిమానా విధించిందని ఈనాడు తెలిపింది.
‘‘ఆ మొత్తాన్ని సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ సంక్షేమ నిధికి అందజేయాలని సుప్రీం కోర్టు పేర్కొంది. పది రోజుల్లోపు కౌంటర్లు దాఖలుచేయకపోతే రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను పిలిపించాల్సి వస్తుందని హెచ్చరించింది.
జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఉత్తమ్ ఆనంద్ హత్య నేపథ్యంలో.. దేశవ్యాప్తంగా న్యాయమూర్తులు, కోర్టుల రక్షణ కోసం సీఐఎస్‌ఎఫ్ తరహాలో ప్రత్యేక భద్రత బలగాన్ని ఏర్పాటుచేయాలని కోరుతూ కరుణాకర్ మహాళిక్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ న్యాయమూర్తులు, కోర్టుల భద్రతకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీచేసిందని, వాటిని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయా? లేదా? అన్నదానిపై స్థాయీ నివేదికను కోరవచ్చని చెప్పారు.
జస్టిస్ ఎన్.వి. రమణ స్పందిస్తూ ‘‘కోర్టులు, న్యాయమూర్తులకు మీరు ప్రత్యేక భద్రత విభాగాన్ని ఏర్పాటుచేయడానికి సిద్ధంగా ఉన్నారా? లేదా?’’ అని ప్రశ్నించారు. అంతిమంగా మీరు ఏం చెబితే అది చేస్తామని మెహతా బదులిచ్చారు.
ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ‘‘ఇవన్నీ పరిపాలన పరమైన అంశాలు. ఫలానాది చేయమని మేం సలహా ఇవ్వలేం. మీరు రాష్ట్రాలతో మాట్లాడి న్యాయమూర్తుల భద్రతపై దేశవ్యాప్తంగా ఒకే విధానం గురించి నిర్ణయం తీసుకోవచ్చు’’ అని సూచించారు.
మెహతా బదులిస్తూ ‘‘న్యాయమూర్తుల భద్రతకోసం దేశవ్యాప్తంగా ప్రత్యేక దళం ఏర్పాటు సాధ్యం కాదు. భద్రత ఏర్పాట్లు స్థానిక పరిస్థితులకు తగ్గట్టు ఉండాలి’’ అన్నారు. జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ మీరు రాష్ట్రాల కార్యదర్శులు, డీజీపీలను పిలిచి దీనిపై మాట్లాడవచ్చన్నారు.
గత విచారణ సమయంలో కోర్టు జారీచేసిన ఆదేశాల మేరకు న్యాయమూర్తుల భద్రతకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడిస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్రాలకు చెప్పామని, లేదంటే అలా దాఖలుచేసే హక్కును కోల్పోతాయని హెచ్చరించామని మెహతా తెలిపారు.
కానీ ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, గోవా, కేరళ, మహారాష్ట్ర, మిజోరం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లు కౌంటర్ అఫిడవిట్ దాఖలుచేయలేదని జస్టిస్ ఎన్.వి. రమణ చెప్పారు. అఫిడవిట్లు దాఖలుచేసిన రాష్ట్రాలన్నీ ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నా దుర్ఘటనలు జరుగుతూనే ఉన్నాయని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు.
అఫిడవిట్లు దాఖలుచేయని రాష్ట్రాలు ఎప్పటిలోపు ఆ పని చేస్తాయని జస్టిస్ ఎన్.వి. రమణ అడిగినప్పుడు కేరళ, గోవా న్యాయవాదులు మాత్రమే హాజరై తమకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. అందుకు ప్రధాన న్యాయమూర్తి అంగీకరించలేదు. ఇంతవరకూ కౌంటర్ అఫిడవిట్ దాఖలుచేయని రాష్ట్రాలపై రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు చెప్పారు. పది రోజుల్లోపు కౌంటర్ అఫిడవిట్ దాఖలుచేయాలని, లేదంటే ఆ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించారు’’అని ఈనాడు తెలిపింది.
ఫొటో సోర్స్, ANI
భర్త తిరుపతికి రాననడంతో ఇద్దరు పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్య
భర్త తిరుపతికి రానని చెప్పడంతో ఇద్దరు పిల్లలతో కలిసి భార్య ఆత్మహత్య చేసుకున్నారని సాక్షి ఓ కథనం ప్రచురించింది.
‘‘పిడుగురాళ్ల పట్టణానికి చెందిన మానస (27), బండారు శ్రావణ్‌కుమార్‌కు ఏడేళ్ల కిందట వివాహం జరిగింది.
ఇటీవల మానస తిరుపతి పుణ్యక్షేత్రం వెళ్లాలని కోరడంతో కుటుంబ సభ్యులంతా సిద్ధమయ్యారు. అయితే మానస భర్త శ్రావణ్‌కుమార్ పని వత్తిడి వల్ల తిరుపతికి రాలేనని అత్తమామలతో కలసి పిల్లలను తీసుకెళ్లాలని సూచించాడు.
ఈ విషయమై ఇద్దరు గొడవ పడ్డారు. అయితే రోజు మాదిరిగానే శనివారం రాత్రి శ్రావణ్ కుమార్ ఇంటి పైపోర్షన్‌లో పడుకున్నాడు. కింద పోర్షన్‌లో మానస, పిల్లలిద్దరూ పడుకున్నారు.
అయితే ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటలకు శ్రావణ్‌కుమార్ నిద్రలేచి కిందకు వచ్చి ఎంతసేపు తలుపు కొట్టినా తలుపు తీయకపోవడంతో, భార్యకు ఫోన్ చేశాడు.
ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో తలుపులు పగలగొట్టారు. అప్పటికే ఇద్దరు చిన్నారులు షర్మిల (3), జ్యోతి (2), మానస విగత జీవులయ్యారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పట్టణ ఎస్‌ఐ సమీర్ బాషా వివరాలను సేకరించారు. ఇద్దరు చిన్నారుల మెడకు కాటన్ క్లాత్ గట్టిగా బిగించి దివాన్‌కాట్‌కు కట్టేసి చంపేసిన అనంతరం మానస కూడా ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు.
మానస తండ్రి గుంజా శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ సమీర్ బాషా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అయితే తన కుమార్తెకు కోపం ఎక్కువని, గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసిందని మృతురాలి తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్‌ఐ తెలిపారు’’అని సాక్షి తెలిపింది.
ఫొటో సోర్స్, Getty Images
భానుమూర్తి
గూగుల్‌లోకి భానుమూర్తి
వరంగల్ నీట్ పూర్వవిద్యార్థి, సీనియర్ ఐటీ నిపుణులు భానుమూర్తి బల్లాపురం.. గూగుల్ క్లౌడ్ జపాన్, ఆసియా-పసిఫిక్ (జేఏపీఏసీ) కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.
‘‘గతంలో ఈయన విప్రో అధ్యక్షుడు, సీవోవో గానూ పనిచేసిన విషయం తెలిసిందే. అక్కడే ఈ ఏడాది జూలైలో రిటైర్ అయ్యారు. ఈ క్రమంలోనే ఇప్పుడు గూగుల్ క్లౌడ్ లీడర్‌షిప్ టీంలో చేరారు.
అమెరికాలోని గూగుల్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఉపాధ్యక్షుడు జాన్ జేస్టర్‌కు భానుమూర్తి రిపోర్ట్ చేస్తారని సంస్థ ఓ ప్రకటనలో తెలియజేసింది.
ఐఐఎం అహ్మదాబాద్‌లోనూ విద్యనభ్యసించిన భానుమూర్తికి ఐటీ రంగంలో 25 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. ఎన్నో సంస్థల్లో సీనియర్ మేనేజ్‌మెంట్ స్థాయిల్లో పనిచేశారు.
గ్లోబల్ ఫార్చూన్ 500 కస్టమర్స్‌కూ సేవలందించారు. ‘మా ప్రాంతీయ నాయకత్వంలో భానుమూర్తి భాగస్వామి కానున్నారు. భానుమూర్తి రాకతో మార్కెట్‌లో సంస్థ ప్రతిష్ఠ మరింత ఇనుమడిస్తుందని ఆశిస్తున్నాం’ అని గూగుల్ క్లౌడ్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేసింది’’అని నమస్తే తెలంగాణ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- అమెరికా 'సైగన్ పతనం': 1975లో వియత్నాంలో జరిగిందే ఇప్పుడు కాబుల్‌లో పునరావృతం అయ్యిందా?
- ఆంధ్రప్రదేశ్: జీవోలను ఆన్లైన్లో పెట్టొద్దన్న ప్రభుత్వం, తాజా ఉత్తర్వులపై విమర్శలు
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)