అఫ్గానిస్తాన్: షరియా అంటే ఏమిటి, ఈ చట్టం మహిళల గురించి ఏం చెబుతుంది?
- పద్మ మీనాక్షి
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, Getty Images
ఇస్లాం న్యాయ వ్యవస్థ అయిన షరియా చట్టాన్ని నిక్కచ్చిగా అమలు చేయడం ద్వారా అఫ్గానిస్తాన్‌ను పరిపాలిస్తామని కాబుల్‌ను స్వాధీనం చేసుకున్నాక ఏర్పాటు చేసిన మొదటి విలేఖరుల సమావేశంలో తాలిబాన్లు ప్రకటించారు.
పత్రికా స్వేచ్ఛ, మహిళల హక్కులను షరియా చట్ట పరిధిలోనే గౌరవిస్తామని తాలిబాన్ అధికార ప్రతినిధి అన్నారు. అయితే, షరియా చట్టం అమలు ఎలా ఉంటుందనే విషయంలో వారు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు.
షరియా అంటే ఏమిటి?
షరియా అంటే ఇస్లాం న్యాయవ్యవస్థ. ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌లోని అంశాలు, మత పెద్దలు చేసిన ఫత్వాల (ఆదేశాలు) ఆధారంగా దీనిని రూపొందించారు.
వాచ్యార్థంలో తీసుకుంటే, "నీటి వద్దకు వెళ్లే స్పష్టమైన, నిర్దిష్టమైన మార్గమే' షరియా.
ముస్లింలు తమ జీవితంలో వేసే ప్రతి అడుగునీ, ఆచరించే ప్రతి పనినీ ఈ చట్టంలో పొందుపరిచిన నియమాలను అనుసరించే చేయాలి. అంటే, వారి జీవన విధానం అంతా వారు పొద్దున్న లేచి చేసే ప్రార్ధనల నుంచీ పర్వదినాల్లో పాటించే ఉపవాసాలు, పేదలకు చేసే దానాల వరకు అన్నీ ఈ చట్టానికి లోబడే ఉంటాయి.
ఫొటో సోర్స్, Getty Images
పురుషులు, మహిళలు నిండుగా వస్త్రాలు ధరించాలని షరియా ఆదేశిస్తుంది. ఈ నియమాల అర్థాలు ప్రాంతాన్ని బట్టి మారుతున్నాయి.
ఇస్లాంలో మూడు ముఖ్యమైన భాగాలున్నాయి, అందులో మొదటిది భగవంతుడు, మానవుల సృష్టి, మరణానంతరం జరిగే పరిణామాలు.
రెండవది ప్రార్థన, ఉపవాసాలు, దానాలు, యాత్రలు మొదలైనవి.
మూడవది చట్టం.
ఇందులో, దొంగతనం, అత్యాచారం, హత్యల్లాంటి నేరాలకు విధించే శిక్షలు, వివాహం, విడాకులు, వారసత్వ హక్కులను నిర్దేశించే కుటుంబ చట్టాలకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఇస్లాంలో ఉన్న ఈ చట్టాలన్నింటినీ కలిపే షరియా అని అంటారని ఇస్లామిక్ అకాడెమీ ఫర్ కంపారిటివ్ రెలీజియన్ అధ్యక్షుడు అసీఫుద్దీన్ ముహమ్మద్ బీబీసీకి వివరించారు.
ముస్లిం మతస్థులు తమ జీవితాన్ని భగవంతుని ఇష్టాలకనుగుణంగా గడిపే విధానాన్ని అర్ధం చేసుకోవడానికి సహాయపడటమే ఈ చట్టం లక్ష్యం.
ముస్లింల దైనందిన జీవితంలో షరియా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. షరియా చట్టంలో ముస్లింల దైనందిన జీవితాల్లో ఇమిడి ఉన్న అంశాల గురించి అసీఫుద్దీన్ ముహమ్మద్ బీబీసీకి వివరించారు.
ప్రార్ధన
ముస్లింలందరూ రోజుకు అయిదు సార్లు ప్రార్ధన చేయాలి. ప్రార్ధన చేయలేని వారిని పాపం చేసినవారిలా షరియా చట్టం చూస్తుంది.
అయితే, ప్రార్ధన చేయనందుకు ఖురాన్ లో గానీ, సున్నాహ్ లో గానీ ఎటువంటి శిక్షలు లేవు. కొన్ని ప్రభుత్వాలు ప్రార్ధన సమయంలో ప్రజలను రోడ్ల పై నడవడాన్ని నిషేధించాయి.
కానీ, ఇస్లాం మాత్రం మనిషి భగవంతునికి తనను తాను ఇష్టపూర్వకంగా సమర్పించుకోవాలని చెబుతుంది.
అయితే, "మతంలో ఎటువంటి నిర్బంధాలు లేవు" అని ఖురాన్ సూత్రాలు చెబుతున్నాయని అసీఫుద్దీన్ తెలిపారు.
కాగా, సౌదీ అరేబియా లాంటి దేశాల్లో ప్రార్ధన సమయంలో అన్ని సేవలనూ నిలిపేస్తారు. ఈ విధానాన్ని సడలించాలని ఆధునిక కాలంలో అనేక మంది ఉద్యమకారులు కోరుతున్నారు. ప్రార్ధన సమయంలో దుకాణాలు, మాల్స్, మందుల షాపులు లాంటివాటిని మూసి ఉంచడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
ముస్లింలు విద్య అభ్యసించవచ్చా?
ముస్లింలు తమకిష్టమైన విద్యనభ్యసించవచ్చు. ఆసక్తి ఉన్న కళల్లో నైపుణ్యం సంపాదించవచ్చు.
వ్యాపారం, పరిశోధన, సాంకేతిక రంగాలను వృత్తులుగా ఎంచుకోవడాన్ని ఇస్లాం ప్రోత్సహిస్తుంది.
గతంలో తాలిబాన్ల పాలనలో స్త్రీ విద్య నిషిద్ధం. 15 ఏళ్ల వయసులోనే పాకిస్తాన్లో బాలికల విద్య కోసం పోరాడిన మలాలా మీద 2012లో తాలిబాన్ మిలిటెంట్లు కాల్పులు జరిపారు. అయితే, మహిళల హక్కులు గౌరవిస్తామని, విద్యను కొనసాగించవచ్చని తాలిబాన్లు ఇప్పుడు చెబుతున్నారు.
కానీ, తాలిబాన్లు ఇప్పటికే కొన్ని ప్రావిన్సులలో స్కూళ్లను పూర్తిగా మూసివేసినట్లు స్థానికులు బీబీసీకి తెలిపారు. పూర్తిగా షరియా తరహా విద్యా విధానాన్ని అమలు చేయడమే వారి లక్ష్యం అని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఫొటో సోర్స్, AFP
ఎటువంటి ఆహారం తినాలి?
హలాల్ గురించి చాలా ఎక్కువగా వింటూ ఉంటాం. హలాల్ అంటే ఆమోదం పొందినది అని అర్ధం.
అన్ని కాయగూరలూ, కోడిగుడ్లు, సముద్ర ఆహార ఉత్పత్తులు తినడానికి ఆమోదయోగ్యమైనవే.
అయితే, జంతు మాంసం తినేటప్పుడు మాత్రం ముస్లింలు ఆ మాంసం హలాల్ చేసిందా కాదా అని మాత్రం చూసుకోవాలి.
బ్రహ్మచర్యం పాటించకూడదా?
ఇస్లాం ననుసరించి ముస్లింలు బ్రహ్మచర్యాన్ని పాటించడం, సన్యసించడం నిషేధం. మనుషులంతా సాధారణ ప్రాపంచిక జీవితాన్ని అనుభవిస్తూ, శాశ్వతమైన లక్ష్యాన్ని చేరే విధంగా జీవించాలి.
విందులకు హాజరు కావచ్చా?
ఎందుకు కాకూడదు? ముస్లింలు నిరభ్యంతరంగా స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పార్టీలకు హాజరు కావచ్చు. అయితే, సాధారణ సమయంలో నిషేధమైనవే పార్టీల సమయంలో కూడా వర్తిస్తాయి. ఉదాహరణకు పార్టీల్లో పొగ తాగడం, మద్యపానం సేవించడం, మాదకద్రవ్యాలు తీసుకోవడం లాంటివి చేయకూడదు.
అయితే, పార్టీలకు వెళ్ళినప్పుడు పురుషులు ఇతర కుటుంబాలకు సంబంధించిన మహిళలతో మాట్లాడకూడదు. ఇదే ఇతర మతాల వారికీ ముస్లింలకు ఉన్న ప్రధానమైన తేడా. తమ సొంత కుటుంబంలోని మహిళలతో మాత్రమే మాటలైనా, వినోదమైనా సరే.
అయితే, ఉద్యోగాలకు బయటకు వెళ్లే వారు మాత్రం హద్దులు దాటకుండా మహిళా సహోద్యోగులతో మాట్లాడవచ్చు.
గత రెండు దాశాబ్దాలుగా వీకెండ్ పార్టీలు, సంగీతాన్ని ఆస్వాదించిన ప్రజలు మాత్రం ఇకపై పార్టీలకు చెక్ పెట్టాల్సి వస్తుందేమోననే భయాలు వ్యక్తం చేస్తున్నారు. తాలిబాన్లు తమ పాలనలో సంగీతం వినడం, టీవీ చూడటాన్ని గతంలో నిషేధించారు.
ఫొటో సోర్స్, Joshua Paul for the BBC
మలేషియా షరియా హైకోర్టులో తొలి మహిళా జడ్జి నెన్నే సుషాయిదా
షరియా మహిళల వస్త్రధారణ గురించి ఏమి చెబుతోంది?
షరియా చట్టాన్ని అనుసరించి మహిళలు శరీరమంతా కప్పే వస్త్రాలు ధరించాలి. మహిళలు, హిజాబ్ లేదా బుర్ఖా ధరించాలి.
డ్రైవింగ్, వివిధ కళలు, విద్యారంగంలో బుర్ఖా ధరించిన మహిళలను చాలా మందిని చూస్తున్నాం అని అసీఫుద్దీన్ అన్నారు.
ముస్లిం అమ్మాయిలు మార్షల్ ఆర్ట్స్, ఫుట్ బాల్, పరుగు పందేలు, వెయిట్ లిఫ్టింగ్ లాంటి క్రీడల్లో అంతర్జాతీయంగా రాణిస్తున్నారు. పతకాలు కూడా సంపాదిస్తున్నారు అని చెప్పారు.
కాగా, "వీధి వీధికీ వీరి ముఠాలు పహారా కాస్తుండేవి. పురుషులు చీలమండలు కనిపించేలా బట్టలు వేసుకున్నా, పాశ్చాత్య దుస్తులు ధరించినా ఈ ముఠాలు దాడి చేసేవి" అని బీబీసీ వరల్డ్ అఫైర్స్ ఎడిటర్ జాన్ సింప్సన్ తాలిబాన్లను ఉద్దేశించి పేర్కొన్నారు. ఆయన కొన్ని రోజులు అఫ్గానిస్తాన్‌లో పని చేశారు.
పురుషులు లిఖితపూర్వకంగా అనుమతి ఇస్తేనే స్త్రీలు బయటకు వచ్చేవారు. అది కూడా శరీరాన్ని పూర్తిగా కప్పే విధంగా బుర్ఖాలు ధరించి మాత్రమే బయటకు రావాలి. మహిళలు బయటకు వెళ్లాలంటే, వారితో పాటు పురుషులు తోడుగా వెళ్ళాలి.
తాలిబాన్ల పాలనలో మహిళల హక్కులను కాలరాస్తారనే భయాలు మాత్రం చాలా మంది మహిళలు వ్యక్తం చేస్తున్నారు.
వివాహాల గురించి షరియా ఏమి చెబుతోంది?
నిఖా తప్పనిసరి. ఇది జరగని పక్షంలో వివాహానికి ఇస్లాంలో చట్టబద్ధత ఉండదు.
అలాగే, ముస్లింలు అరబిక్ భాషలో విడాకులు తీసుకుంటున్నట్లు తలాఖ్ అనే పదాన్ని మూడు సార్లు చెబితే చాలని, అది వారి హక్కు అని అనుకుంటారు. కానీ, ఆచరణలో మాత్రం విడాకులనే ఒక సుదీర్ఘమైన ప్రక్రియలో ఈ తలాఖ్ చెప్పడం అనేది ఒక చిన్న భాగం మాత్రమేనని అంటారు.
ఇస్లాం ప్రకారం వివాహం అనేది ఒక కాంట్రాక్టు. విడాకుల గురించి షరియా చట్టంలో విరుద్ధమైన అభిప్రాయాలతో కూడిన క్లిష్టమైన విశ్లేషణాలున్నాయి.
జెబ్ హనీఫా అనే కాబుల్‌లో నివసిస్తున్న కమ్యూనికేషన్స్ ఉద్యోగిని దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉద్యోగం చేసే మహిళలు తమ భవితవ్యం గురించి ఆందోళన చెందుతున్నారని ఆమె బీబీసీకి చెప్పారు. ఆమె స్నేహితులు కూడా కొందరు ఎలా అయినా దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
"ఉద్యోగాలకు వెళ్లలేకపోవడం, బలవంతంగా తాలిబాన్లను వివాహం చేసుకుని పిల్లల్ని కనే పనికే పరిమితమవుతామనే భయంకరమైన ఆలోచనలు మమ్మల్ని వెంటాడుతున్నాయి" అని హనీఫా బీబీసీతో తన భయాన్ని వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ వాడవచ్చా?
ఖురాన్, సున్నాహ్ లో నిషేధించిన అంశాలు తప్ప మిగిలినవేవైనా ముస్లింలు పాటించవచ్చు. అంటే, ముస్లింలు ఇంటర్నెట్, సోషల్ మీడియా, మీడియాను వాడవచ్చు. టీవీ చూడవచ్చు. వార్తాపత్రికలు చదవవచ్చు. వీటికి ఎటువంటి అభ్యంతరాలు లేవూ. అయితే, అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, నేరాలకు పాల్పడటం లాంటివి చేయనంతవరకూ అన్ని ఆధునిక టెక్నాలజీలను వాడవచ్చని ఆసీఫుద్దీన్ చెబుతున్నారు.
అయితే, అఫ్గానిస్తాన్ ను తాలిబాన్లు స్వాధీనపరుచుకున్న నేపథ్యంలో, వారి భావాలకనుగుణంగా, టీవీ ని నిషేధిస్తారేమోనని పలువురు భయపడుతున్నారు.
గతంలో తాలిబాన్లు అఫ్గానిస్తాన్ ను పరిపాలించినప్పుడు ఆ దేశంలో ప్రజలు టీవీ చూడటాన్ని నిషేధించారు. అలాగే, సంగీతం వినడం, పార్టీలకు వెళ్లడాన్ని కూడా తాలిబాన్లు నిషేధించారు. చివరకు జాతీయగీతం కూడా పాడకుండా చేశారు.
నేరాల గురించి ఏమి చెబుతోంది?
షరియా చట్టం నేరాలను హద్ నేరాలు (కఠినమైన శిక్షలుండే తీవ్రమైన నేరాలు) , తాజిర్ నేరాలని (న్యాయాధిపతి నిర్ణయం మేరకు విధించే శిక్ష) రెండు రకాలుగా వర్గీకరిస్తుంది.
దొంగతనం, వ్యభిచారం హద్ నేరాల జాబితాలోకి వస్తాయి.
దీనికి చేతులు నరకడం, రాళ్లతో కొట్టి చంపడం లాంటి శిక్షలుంటాయని చెబుతారు. అయితే, ఈ శిక్షలు విధించడానికి చాలా బలమైన సాక్ష్యాలుండాలని కొన్ని ఇస్లామిక్ సంస్థలు చెబుతాయి.
రాళ్లతో కొట్టి చంపడాన్ని ఐక్యరాజ్య సమితి క్రూరమైన అమానవీయ చర్యగా అభివర్ణించి వీటిని నిషేధించింది.
అయితే, ఇలాంటి శిక్షలను అన్ని ముస్లిం దేశాలు అమలు చేయవు.
"షరియా చట్టం అత్యంత భయంకర రూపాల్లో దేశమంతటా అమలులో ఉండేది. బహిరంగ ఉరిశిక్షలు, రాళ్లతో కొట్టి చంపడం, కొరడా దెబ్బలు విరివిగా ఉండేవి" అని జాన్ సింప్సన్ అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల పాలనా కాలంలో ఉన్ననాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
మతమార్పిడి నేరమా?
మతమార్పిడిని ముస్లింలు నేరంగా పరిగణిస్తారు. ఈ నేరానికి మరణశిక్షే సరైనది అని భావిస్తారు.
అయితే, ఇలాంటి నేరాలకు శిక్షను భగవంతుని పైనే వదిలేయాలని కొంత మంది ఆధునిక ముస్లిం నిపుణులు అంటారు.
మతంలో నిర్బంధం లేదని ఖురాన్ చెబుతోందని అంటారు.
ఈ నియమావళిని ఎవరు రూపొందిస్తారు?
షరియా చట్టం సంక్లిష్టమైనది. దీనిని ఆచరించడం పూర్తిగా నిపుణులు తీసుకున్న శిక్షణ, నైపుణ్యం పై ఆధారపడి ఉంటుంది. ఇస్లామిక్ న్యాయవేత్తలు షరియా నియమావళిని, ఆదేశాలను జారీ చేస్తారు. ఈ నియమావళిని చట్టబద్ధం చేస్తే ఫత్వా అంటారు.
షరియా చట్టంలో మొత్తం అయిదు రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. అందులో హంబలీ, మాలికీ, షఫీ, హనాఫీ, అనే నాలుగు సున్నీ సిద్ధాంతాలు, జాఫరీ అనే షియా సిద్ధాంతం ఉంది. షరియా చట్టానికి మూలంగా పరిగణించిన మూలగ్రంథాలలోని అంశాల పై వివిధ వర్గాల వారు చేసే విశ్లేషణల ఆధారంగా నియమావళిలో తేడాలుంటాయి.
పాశ్చాత్య చట్టాలకు షరియాకు తేడా ఏంటి?
పాశ్చాత్య చట్టాలలో పూర్తిగా నేర సంబంధిత విషయాలు, పౌర సంబంధాలు, వ్యక్తిగత హక్కులకు సంబందించిన నియమావళి ఉంటే, షరియాలో ముస్లింలు భగవంతుని ఆదేశాలకనుగుణంగా జీవించేందుకు సంబంధించిన అంశాలన్నీ ఉంటాయి.
పాశ్చాత్య దేశాల్లో కూడా ముస్లింల కోసం షరియా న్యాయస్థానాలుంటాయి. వీటిని ముఖ్యంగా, కుటుంబ, వ్యాపార వ్యవహారాల కోసం ఏర్పరుచుకున్నారు.
ఆధునిక అంశాలైన ఇన్సూరెన్స్ , అవయవ దానం లాంటి అంశాలపై కొంత మంది ఇస్లాం పండితులు తమ సొంత విశ్లేషణ ద్వారా ముస్లింలు పాటించాల్సిన మార్గాలను సూచిస్తారు.
ఇవి కూడా చదవండి:
- అమెరికా 'సైగన్ పతనం': 1975లో వియత్నాంలో జరిగిందే ఇప్పుడు కాబుల్‌లో పునరావృతం అయ్యిందా?
- ఆంధ్రప్రదేశ్: జీవోలను ఆన్లైన్లో పెట్టొద్దన్న ప్రభుత్వం, తాజా ఉత్తర్వులపై విమర్శలు
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- నీరజ్ చోప్రా: ఒలింపిక్ గోల్డ్ గెలిచిన భారత అథ్లెట్ కెరీర్లో 5 కీలక మలుపులు
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- కరోనా కాలంలో భారత ‘వ్యాక్సిన్ కింగ్’ ఆస్తి 25 శాతం వృద్ధి
- అంబానీ ఇంటి దగ్గర పేలుడు పదార్ధాల కేసు.. ఆ పోలీస్ అధికారి చుట్టూ ఎందుకు తిరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)