ఇందిరా పార్క్: 'పెళ్లి కాని జంటలకు ప్రవేశం లేదు' అనే నిర్ణయంపై వివాదం, మహిళా సంఘాల ఆగ్రహం
- అబ్బూరి సురేఖ
- బీబీసీ ప్రతినిధి

"ఈ పార్క్‌లోకి పెళ్లయిన జంటలకు మాత్రమే ప్రవేశం." ఇది హైదరాబాద్‌లోని ప్రముఖ పార్కుల్లో ఒకటైన ఇందిరా పార్క్ అధికారులు తాజాగా తీసుకున్న నిర్ణయం.
కేవలం నిర్ణయం తీసుకోవడంతో వదిలేయలేదు. ఏకంగా ప్రధాన ద్వారం వద్ద ఓ బ్యానర్‌ను కూడా తగిలించారు. అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతోంది.
అసలు పార్కులోకి వచ్చే వారిలో పెళ్లయిందెవరికి, పెళ్లి కానిదెవరికి అని నిర్ణయించేదెవరు? టిక్కెట్లు తీసుకునేటప్పుడే అడిగి మరీ టిక్కెట్ ఇస్తారా?
పురుషుల విషయంలో అయితే వారికి వివాహం అయిందా లేదా అని తెలుసుకునేందుకు ఎలాంటి గుర్తులు ఉండవు. అలా తెలుసుకునే అవకాశం ఉన్నది కేవలం మహిళల విషయంలోనే. అంటే, స్త్రీలు తాళిబొట్టు చూపిస్తేనే పార్కులోకి వెళ్లేందుకు అనుమతిస్తారా?
అధికారులు తాము తీసుకున్న ఈ నిర్ణయంతో జనానికి ఏం చెప్పదల్చుకుంటున్నారని ప్రశ్నిస్తున్నాయి మహిళా సంఘాలు.
ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటి?
హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగర వాసులకు ఇందిరాపార్క్ అత్యంత సుపరిచితం. ముఖ్యంగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్, సికింద్రాబాద్ పరిసర ప్రాంత ప్రజలు రోజూ ఉదయం, సాయంత్రం వాకింగ్ కోసం ఈ పార్క్‌కు వస్తుంటారు.
వారాంతాల్లో కుటుంబ సభ్యులతో సహా ఈ పార్కును సందర్శించడం సర్వ సాధారణం. గతంలో ఎన్నో చిత్రాల షూటింగ్‌లకు కూడా ఈ పార్క్ వేదిక.
అదే సమయంలో కొన్ని సార్లు ఈ పార్క్ అసాంఘిక కార్యకలాపాలకు కూడా వేదికవుతోంది. ఈ తాజా నిర్ణయం వెనుక కారణం అదేనంటున్నారు అర్బన్ బయో డైవర్శిటీ పార్క్స్ డిప్యూటీ డైరక్టర్ మురళీధర్.
పార్క్స్ డిప్యూటీ డైరక్టర్ మురళీధర్
“ఇందిరా పార్క్ కు ప్రతి రోజూ పిల్లలు, పెద్దలు, దేశ, విదేశీ పర్యటకులు కూడా వస్తూ ఉంటారు. మేం వచ్చే వారినందర్నీ స్వాగతిస్తాం. ఇక్కడి వచ్చే వాళ్లు కాస్త సభ్యతగా వ్యవహరించాలి. కానీ, కొన్ని సార్లు కొందరు ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. ఇది మిగిలిన పర్యటకులకు చాలా ఇబ్బంది కల్గిస్తోంది. అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఇలాంటి నిర్ణయాన్నే గతంలో సంజీవయ్య పార్క్ విషయంలో తీసుకున్నారు. దాన్ని పూర్తిగా ఇప్పుడు సంజీవయ్య చిల్డ్రన్ పార్క్‌గా మార్చేశారు. ఇక్కడ కూడా ప్రస్తుతం గతంలో సంజీవయ్య పార్క్‌లో నెలకొన్న పరిస్థితే ఉందని గమనించిన పార్క్ మేనేజ్మెంట్ తాత్కాలికంగా ఈ నిర్ణయం తీసుకుంది” అని మురళీధర్ బీబీసీతో అన్నారు.
మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకెళ్లాలా?
పార్క్‌కు వచ్చే వాళ్లు సభ్యతగా వ్యవహరించాలన్నది ఎంత ముఖ్యమో, వచ్చే వారి విషయంలో వివక్ష చూపించకూడదన్నది అంతే ముఖ్యం. మరీ ముఖ్యంగా పార్క్ యాజమాన్యం తీసుకున్న నిర్ణయం కేవలం మహిళల్ని మాత్రమే వేధింపులకు గురి చేసేలా ఉంటే ఎలా?
మహిళలు మెడలో తాళి బొట్టును చూసో లేదా కాలికి ఉన్న మట్టెల్ని చూసో పార్క్ లోకి వెళ్లేందుకు టిక్కెట్ ఇస్తామంటే దాన్ని సభ్యత అంటారా?
పురుషులకు ఏ మాత్రం సంబంధం లేని ఈ నిర్ణయం ఎవరిని ఉద్ధేశించి తీసుకున్నట్టు? లేదంటే పార్క్‌కు వచ్చే వాళ్లను ఇకపై వివాహ ధ్రువీకరణ పత్రాన్ని తీసుకురమ్మంటారా?
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందంటున్నాయి మహిళా సంఘాలు.
‘‘నేను ఎన్నో ఏళ్లగా ఇందిరా పార్క్‌లో వాకింగ్‌కి వెళ్తున్నాను. ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు ? పార్క్‌కి ఎవ్వరైనా రావచ్చు . అసలు అధికారుల దృష్టిలో అసభ్యత అంటే ఏంటి? ’’అని ప్రశ్నిస్తున్నారు ప్రముఖ స్త్రీవాద రచయిత కొండవీటి సత్యవతి.
కొండవీటి సత్యవతి
‘‘ఈ విషయంలో వారు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అలా అనుకుంటే పెళ్లయిన జంటలు అసభ్యకరంగా ప్రవర్తించవచ్చా? నాలాంటి చాలా మంది మహిళలు పెళ్లి చిహ్నాలు అంటే సూత్రాలు , గాజులు మెట్టెలు వేసుకోరు , అది నా స్వేచ్ఛ’’ అని సత్యవతి అన్నారు.
అయినా నాకు పెళ్లయిందా లేదా అన్నది నేను వాళ్ళకి ఎందుకు చెప్పాలని ఆమె ప్రశ్నిస్తున్నారు. "అలాగే పార్క్ అన్నది పబ్లిక్ ప్లేస్ అయినప్పుడు , ఆ ప్లేస్‌లో ఎవరు రావాలి లేదా ఎవరు రాకూడదు అన్నది నిర్ణయించడం అంటే అది కచ్చితంగా మోరల్ పోలీసింగ్ చేయడమే" అని ఆమె అభిప్రాయపడ్డారు.
మరో ప్రముఖ రచయిత అపర్ణ కూడా బీబీసీతో ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. “ఇది కచ్చితంగా బలహీన వర్గాల్ని నియంత్రించడమే. సాధారణంగా ప్రభుత్వ పార్కుల్లోకి బలహీన, సాధారణ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా వస్తుంటారు. వీళ్లు వినోదం కోసం ఏ ఐమ్యాక్స్ కో, కాఫీ షాపుకో వెళ్లరు. హైదరాబాద్ వంటి నగరాల్లో అంతకు మించిన స్థాయి ఉన్న వారికి ఎంటర్టైన్మెంట్ జోన్లు వేరుగా ఉంటాయి. అక్కడ వారికి ఎటువంటి ఆంక్షలు ఉండవు. అంటే ఇది కేవలం బలహీన, సాధారణ మధ్యతరగతి ప్రజలపై చూపిస్తున్న వివక్ష” అని ఆమె అన్నారు.
అయితే, పార్క్ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్న వారు కూడా కొందరు ఉన్నారు. కుటుంబ సమేతంగా వచ్చినప్పుడు కొన్ని సందర్భాలలో కొందరి వ్యవహార శైలి చాలా ఇబ్బందికరంగా ఉంటోందని పబ్లిక్ పార్క్ అన్నప్పుడు అందరూ ఇక్కడకు వస్తుంటారన్న విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని ఇందిరా పార్క్‌ను తరచూ సందర్శించే శ్రీనివాస్ బీబీసీతో అన్నారు.
చివరికి, ఈ నిర్ణయం వివాదాస్పదం కావడంతో గురువారం ఉదయం ప్రధాన ద్వారం వద్ద ఉన్న “పెళ్లి కాని జంటలకు ప్రవేశం లేదు” అన్న బ్యానర్‌ను అధికారులు తొలగించారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: కాబుల్ విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఎన్నెన్నో గండాలు
- కాబుల్ విమానాశ్రయం బయట ఏడుగురు అఫ్గాన్ పౌరులు మృతి - బ్రిటన్ రక్షణ శాఖ
- #BeingDalit: హైదరాబాద్- 'ఇల్లు అద్దెకు ఇవ్వడానికి నా కులంతో పనేంటి?'
- అమెరికా: బానిసత్వంలో మగ్గిన నల్ల జాతీయులకు పరిహారమే పరిష్కారమా?
- బ్రిటన్‌లోని భారతీయులు దైవభాష సంస్కృతం ఎందుకు నేర్చుకుంటున్నారు?
- బ్రిటన్, అమెరికాల్లో క్రిస్మస్ను నిషేధించినప్పుడు ఏం జరిగింది
- చైనాలో చర్చిలపై ఉక్కుపాదం... ప్రశ్నార్థకంగా మారిన మత స్వేచ్ఛ
- భారత్ కన్నా పేద దేశమైన చైనా 40 ఏళ్లలో ఎలా ఎదిగింది?
- గూగుల్ సెర్చ్‌లో 'వివక్ష': రూ.136 కోట్లు జరిమానా
- 'దళితుల కోసం ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక పార్టీ'
- బడి చదువులోనే లింగవివక్ష నూరిపోస్తున్న పుస్తకాలు
- ఈ దళిత విద్యార్థి ఎందుకు గుజరాత్ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)