‘కోవిడ్ ప్రపంచాన్నంతా వణికించిందిగానీ, నాకొచ్చిన కష్టం ఏ ఆడపిల్లకీ రాకూడదు’
- ఆలమూరు సౌమ్య
- బీబీసీ ప్రతినిధి

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రతీకాత్మక చిత్రం
కోవిడ్ సెకండ్ వేవ్ ఎన్నో జీవితాలను అతలాకుతలం చేసింది. జీవనోపాధి కోల్పోయి రోడ్డున పడిన కుటుంబాలు, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులు, పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఎందరో.
చాలామంది తమ ఆత్మీయులను, స్నేహితులను పోగొట్టుకున్న కథలు చెబుతారు. వీరిలో పలువురు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య డిప్రెషన్.
చివరి చూపు దక్కలేదన్న బాధ, అంతిమ సంస్కారాలు సరిగా జరపలేకపోయామన్న దిగులు, అగమ్యగోచరంగా మారిన భవిష్యత్తు, తీవ్ర ఆర్థిక సమస్యలతో మానసికంగా కుంగిపోయినవారు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథలైపోయిన చిన్న పిల్లల పరిస్థితి మరీ ఘోరం.
పదహారేళ్ల రాజేశ్వరిదీ అదే కథ. హాయిగా, ఆనందంగా సాగిపోతున్న ఆమె జీవితాన్ని కోవిడ్ ఛిన్నాభిన్నం చేసింది. చిన్న వయసులోనే ఆ అమ్మాయికి తల్లిదండ్రులు ఇద్దరినీ దూరం చేసింది.
‘ఓ రాజకుమారిలా పెరిగాను’
అమ్మ, నాన్న, అమ్మమ్మ తప్ప మరో ప్రపంచమే తెలీదంటారు రాజేశ్వరి.
"హాయిగా రాజకుమారిలా పెరిగాను. నాకే కష్టం రానివ్వలేదు. పుట్టిన దగ్గర నుంచీ హైదరాబాద్‌లోనే ఉంటున్నా, ఇక్కడ రూట్లేవీ నాకు తెలీవు. నేనెక్కడికీ ఒంటరిగా వెళ్లాల్సిన అవసరం రాలేదు. దూరం పంపడం ఇష్టం లేక వీధి పక్కనే ఉన్న మామూలు స్కూలో నన్ను వేశారు. అల్లారు ముద్దుగా పెరిగాను" అంటూ రాజేశ్వరి చెప్పుకొచ్చారు.
‘కోవిడ్ లక్షణాలు కనిపించాయి. కానీ..’
ఏప్రిల్ చివర్లో ఒకరోజు రాజేశ్వరి తండ్రి ఏఎస్ కొండబాబుకు జ్వరం మొదలైంది. రోజు తిరగకుండానే ఆమె తల్లి సావిత్రికి కూడా జ్వరం వచ్చింది. కోవిడ్ అని అనుమానం వచ్చినా ఇంట్లోనే మందులు వేసుకుంటూ ఉండిపోయారు.
వారిద్దరి మధ్యే తిరుగుతున్నా రాజేశ్వరికి ఏమీ కాలేదు. ఆమె అమ్మమ్మను వేరే గదిలో ఉంచారు.
వారం రోజులైనా జ్వరం, దగ్గు తగ్గకపోయేసరి కొండబాబు సీటీ స్కాన్ తీయించుకున్నారు. అప్పటికే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు స్కాన్ రిపోర్టులో తేలింది.
"మా నాన్న హార్ట్ పేషెంట్. ఆయన కొంచం టెన్షన్ పడ్డారు. అమ్మ, నాన్నలిద్దరికీ బాగా జ్వరం వచ్చేది. మందులు వేసుకుంటే తగ్గిపోయేది. కోవిడా కాదా అనే డైలమాలో ఉండి పోయి మేం ఆలస్యం చేసేసాం. ఆ వారంలో నాన్న కాస్త లేచి తిరిగేవారుగానీ అమ్మ పూర్తిగా మంచం మీదే ఉన్నారు. దగ్గు బాగా ఉండి ఆమెకు మాట కూడా సరిగా రాలేదు. అన్నం సరిగా తినలేకపోయేవారు. వారం అయ్యేసరికి ఇద్దరికీ సాచ్యురేషన్ బాగా పడిపోయింది. సీటీ స్కాన్‌లో వైరస్ బాగా ఎక్కువగా ఉన్నట్లు కనిపించేసరికి మా ఫ్లాట్‌లో ఉన్న అంకుల్‌కు ఆ రిపోర్టులు చూపిస్తే, ఆయన దెబ్బలాడి వెంటనే ఆస్పత్రికి వెళ్లమన్నారు.
మా నాన్న వైపు బంధువులతో మాకు మొదటి నుంచీ మంచి సంబంధాలు లేవు. రాకపోకలు లేవు. నాకు వాళ్లెవరూ సరిగా తెలీదు. మా నాన్న, వాళ్ల అక్క కొడుకుని తీసుకుని ఆ రాత్రికి రాత్రే ఆస్పత్రికి వెళ్లారు. ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి మాకు ఏ కబురూ రాలేదు.
అదే రోజు అర్థరాత్రి అమ్మ సాచ్యురేషన్ 86కు పడిపోయింది. నాకు కాళ్లు, చేతులు ఆడలేదు. చిన్న పిల్లని, ఏం చేయాలో తెలియలేదు. నాన్నకి ఫోన్ చేస్తే ఎత్తలేదు. తెల్లవార్లూ అమ్మను అలా చూస్తూ, గాబరాపడుతూ ఉండిపోయా. మర్నాడు పొద్దున్న అపార్ట్మెంట్‌లో ఉండేవారి సహాయం తీసుకుని అమ్మను ఆస్పత్రిలో చేర్చాను. నా దగ్గర డబ్బులు లేవు. తన అకౌంట్‌లో కొంత డబ్బు ఉందని అమ్మ చెప్పారు. అది పట్టుకుని వెళ్లాను. మా అపార్ట్మెంటులో ఉండే అంకుల్స్ నాకు చాలా సహాయం చేశారు."
ఫొటో సోర్స్, GETTY IMAGES
కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు
‘నాన్న సమాచారం తెలియలేదు’
రాజేశ్వరి తల్లి సావిత్రిని ఆస్పత్రిలో చేర్చిన మూడు రోజుల్లో ఆమె పరిస్థితి మరింత దిగజారిపోయింది. సాచ్యురేషన్ 70 నుంచి 50కి పడిపోయింది. మరోవైపు ఆస్పత్రిలో చేరిన తండ్రి కొండబాబు విషయాలేవీ తెలియరాలేదు.
"మా నాన్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో మాకు తెలియలేదు. ఫోన్ చేస్తే ఎత్తలేదు. వేరే ఎవరితోనూ కాంటాక్ట్ లేదు. ఫలానా ఆస్పత్రిలో చేరుతున్నానని చెప్పారు. అక్కడకు ఫోన్ చేస్తే అలాంటి పేరున్న వ్యక్తి ఎవరూ మా ఆస్పత్రిలో లేరని చెప్పారు. ఎలాగోలా మా నాన్న బావమరిది ఫోన్ నంబర్ సంపాదించి విషయం కనుక్కుంటే, మా నాన్నను వేరే ఆస్పత్రిలో జాయిన్ చేశారని తెలిసింది. నా దురదృష్టం, నాన్నవైపు వాళ్లెవరూ నాకు తెలీదు. ఆయన గురించి నాకే సమాచారం అందలేదు.
వెంటిలేటర్‌పై అమ్మ..
రాజేశ్వరి తల్లి పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. ఆమెకు వెంటిలేటర్ అవసరం అవుతుందని డాక్టర్లు చెప్పారు.
"అమ్మకు ఆస్పత్రిలో ఏం చికిత్స ఇస్తున్నారో, ఏం చేస్తున్నారో అర్థం కాలేదు. వీడియో కాల్‌లోనైనా ఆమెను చూసే పరిస్థితి లేదు. ఇంటి దగ్గర అమ్మమ్మ బెంగపెట్టేసుకున్నారు. ఆమె ఒకటే ఏడుపు. టెన్షన్ పడుతూనే ఉన్నారు. మధ్యమధ్యలో గుండెల్లో నొప్పి అంటారు. ఇప్పుడు అమ్మమ్మకు కూడా ఏమైనా అయితే నేనెక్కడికి పోవాలి! నాకు మొత్తం మెదడు మొద్దుబారిపోయింది. ఏం జరుగుతోందో, ఏం జరగబోతోందో అర్థం కాలేదు.
అమ్మకు వెంటిలేటర్ బెడ్ అవసరం అవుతుందని డాక్టర్లు చెప్పారు. మళ్లీ టెన్షన్ మొదలు. ఎక్కడా వెంటిలేటర్ బెడ్లు ఖాళీ లేవు. నాకు ఎంతోమంది సాయం చేశారు. ఆస్పత్రి బెడ్ కోసం చాలామంది వెతికారు. అప్పటిదాకా కాలు కిందపెట్టకుండా పెరిగిన నేను, ఆ నెల రోజుల్లో రోడ్డున పడిపోయాను. చేతిలో డబ్బుల్లేవు. కానీ ఎంతోమంది డొనేషన్లు ఇచ్చారు. అలా కొంత డబ్బు సమకూరింది. కొన్ని వలంటీర్ సంస్థలు నాకు సహాయం చేశాయి. చివరకు నాన్నను చేర్చిన ఆస్పత్రిలోనే అమ్మకు కూడా బెడ్ దొరికింది. ఒకే ఆస్పత్రిలో అమ్మ, నాన్న వేరు వేరు ఫ్లోర్‌లలో ఉన్నారు. ఆ నెల రోజులు నేను పడ్డ కష్టం, టెన్షన్ ఇంక ఏ ఆడపిల్లకూ రాకూడదు” అంటూ రాజేశ్వరి కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఫొటో సోర్స్, Getty Images
‘నాన్నను మళ్లీ చూడలేదు’
"అమ్మ నాన్నలిద్దరినీ కలుపుదాం అనుకుంటే నాన్నవైపు వాళ్లెవరూ నాకు తెలీదు. కానీ, నాన్నా వాళ్ల బావమరిది దగ్గర నుంచి మాకు కొంత సమాచారం అందుతూ ఉండేది. మా అంకుల్ వాళ్లు, ఆయనతో మాట్లాడి నాన్న సమాచారం తెలుసుకునేవారు.
ఒకరోజు నాన్న చనిపోయారని తెలిసింది. షాక్ అయిపోయాను. అది కూడా నాకు మా మావయ్య ద్వారా తెలిసింది. మా అంకుల్ వాళ్లకి విషయం తెలిసి, మా మావయ్యకు చెప్పారు. నాన్న చనిపోయిన సంగతి నాకు చెప్పడానికి అందరూ భయపడ్డారు. కానీ చెప్పక తప్పదు కదా. ఆ వార్త విని, పిడుగు పడినట్టయింది. ఎంత ఏడ్చానో చెప్పలేను. రోజంతా ఏడుస్తూనే కూర్చున్నాను. ‘ఆస్పత్రికి వెళుతున్నా’ అని చెప్పి వెళ్లిన నాన్న మళ్లీ ఇంటికి రాలేదు. నేను ఆయనను మళ్లీ చూడలేదు.”
‘అమ్మ బాధ చూడలేకపోయాను’
తన భర్త మరణించిన సంగతి సావిత్రికి తెలీదు. రోజూ తన తల్లిని చూడడానికి రాజేశ్వరి ఆస్పత్రికి వెళుతుండేవారు. కానీ, తండ్రి చనిపోయిన విషయం తల్లికి చెప్పలేదు.
“నేను అమ్మను చూడ్డానికి వెళ్లినప్పుడల్లా.. ‘ఇంకెన్నాళ్లమ్మా ఇక్కడుండాలి, నన్ను ఇంటికి తీసుకెళిపో’ అని గోలపెట్టేవారు అమ్మ. నన్ను పొడిచేస్తున్నారు అని బాధపడేవారు. ఒకసారి ఇంటి నుంచే అమ్మతో వీడియో కాల్‌లో మట్లాడినప్పుడు గట్టిగా అరిచారు. వెంటనే ఆస్పత్రి వాళ్లు కాల్ కట్ చేశారు. మర్నాడు ఆస్పత్రికి వచ్చి చూస్తే చేతి నిండా పొడిచేశారు. ఇంత లావైపోయి ఉంది చేయి. చర్మం అంతా గుంజుకుపోయింది. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళిపోమ్మా అని బేలగా అడిగేవారు. ఇంకా రెండు రోజులే, మూడు రోజులే అని ఆమెను మభ్యపెట్టేదాన్ని.
ఆస్పత్రికి వెళ్లి అమ్మను చూడాలంటే నాకు వణుకు వచ్చేది. ‘ఆకలేస్తోందమ్మా, నాకెప్పుడూ ఈ నీళ్లే పోస్తున్నారు. చికెన్ తినాలని ఉందమ్మా’ అనేవారు. నేను అమ్మకు అవేమీ చేయలేకపోయాను. పదహారేళ్లు ఏ కష్టం లేకుండా బతికాను. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది అని ఏడుపొచ్చేసేది. అయినా సరే, అమ్మకు నా బాధ కనబడకుండా జాగ్రత్తపడేదాన్ని. దేవుడికి మొక్కుతూనే ఉన్నాను. నాకింత కష్టమొస్తుందని కలలో కూడా ఎప్పుడూ అనుకోలేదు.
నేను కనీసం పదహారేళ్లయినా సంతోషంగా బతికాను. మా అమ్మ పక్క బెడ్‌లో వాళ్లకు చిన్న చిన్న పిల్లలు. వాళ్లసలు ఏం జీవితం చూశారని. అనాథలైపోయారు. ‘వాళ్లను మూటగట్టుకు తీసుకుపోయారు, నన్నూ తీసుకెళిపోతారు’ అని అమ్మ ఏడ్చేవారు. అమ్మకు ఎలా ధైర్యం చెప్పాలో నాకు అర్థం అయేది కాదు.
నాన్న చనిపోయిన సంగతి అమ్మకు చెప్పలేదు. పక్క గదిలోనే నాన్న ఉన్నారు. కోలుకుంటున్నారు. నువ్వు కూడా త్వరగా కోలుకోవాలని చెప్పారు అని మా అమ్మకు ధైర్యం చెప్పేదాన్ని. మేం బాగానే ఉన్నట్లు ఆవిడ ముందు నటించేవాళ్లం. అమ్మమ్మతో వీడియోలు చేయించుకుని వెళ్లి అమ్మకు చూపించేదాన్ని.”
‘నన్ను ఒంటరిని చేసి వెళిపోయారు’
"ఎక్కువ రోజులు ఆస్పత్రిలో ఉంటే నయమై ఇంటికి తిరిగొస్తారని అందరూ అనేవాళ్లు. అమ్మ ఎలాగైనా ఇంటికి తిరిగొస్తారనే అనుకున్నా. ఇలా నన్ను ఒంటరిని చేసి వెళిపోతారని అస్సలు అనుకోలేదు. దాదాపు నెలన్నర పాటు ఆస్పత్రిలో పోరాటం చేసి అమ్మ చనిపోయారు.
నాన్న చనిపోయారు. ఆ దుఃఖం ఉంది. కనీసం అమ్మ అయినా బతికుంటే నాకు ధైర్యంగా ఉండేది. ఇలా అర్థాంతరంగా ఇద్దరూ నన్ను వదిలేసి వెళిపోయారు. అమ్మ లేకుండా నా జీవితాన్ని ఊహించలేకపోతున్నాను. అమ్మ జీవితమంతా కష్టపడింది. మరణంలో కూడా ఆమెకు కష్టమే మిగిలింది."
ఫొటో సోర్స్, ANI
కరోనా రోగులతో ఒక ఆస్పత్రి (ప్రతీకాత్మక చిత్రం)
అమ్మమ్మకు తీరని కష్టం
రాజేశ్వరి అమ్మమ్మకు ఈ పెద్ద వయసులో తీరని దఃఖం మిగిలింది. కూతురు, అల్లుడు కోవిడ్‌కు బలైపోయారు. మనుమరాలి బాధ్యత ఆమెపై పడింది.
"మా అమ్మమ్మ బాధ చూడలేకపోతున్నాను. నాకన్నా పెద్ద కష్టం మా అమ్మమ్మది. అమ్మమ్మకు మా అమ్మ దగ్గరే చాలా చనువు. ఆమె ఎప్పుడూ అమ్మ దగ్గరే ఉన్నారు. ఈ పెద్ద వయసులో ఈ దుఃఖాన్ని ఆవిడ తట్టుకోలేకపోతున్నారు" అంటూ రాజేశ్వరి విచారం వ్యక్తం చేశారు.
‘భయం పోవట్లేదు’
తల్లిదండ్రులిద్దరూ రోజూ తన కలల్లోకి వస్తుంటారని రాజేశ్వరి చెప్పారు.
"రోజూ ఇద్దరూ కలలోకొస్తారు. మేం పోవలసినవాళ్లం కాదు అంటుంటారు. రోజూ రాత్రి 11.00 గంటలకు ఆస్పత్రి నుంచి ఫోన్ వచ్చేది. ఇప్పటికీ రాత్రి 11.00 అయితే నాకు భయమేస్తుంది. అలాగే, రోజూ మధ్యాహ్నం 2.00 గంటలకు అమ్మను చూడ్డనికి ఆస్పత్రికి వెళ్లేదాన్ని. ఆ రెండు సమయాలు అంటే భయం పోవట్లేదు. రోజూ ఆ సమయాలు సమీపిస్తున్నాయంటే కాళ్లల్లోంచి వణుకు వచ్చేస్తుంది. కావాలని ముసుగు కప్పేసుకుని పడుకుండిపోతాను. అదొక శనిలాగ పట్టేసుకుంది.
కానీ, ఏడుపు రావట్లేదు. మనసు రాయిలాగ అయిపోయింది. నాకిప్పుడూ ఏ ఫీలింగ్స్ లేవు. మొత్తం జీవితం తలకిందులైపోయింది. భవిష్యత్తు ఏమిటో తెలియట్లేదు. ఆర్థికంగా ఎలా గడుస్తుందో తెలీదు. చదువు బుర్రకెక్కట్లేదు. నేను ఇంత చిన్నపిల్లని అవడం వల్లే, నాకేం తెలియక అమ్మ, నాన్నలను పోగొట్టుకున్నాను అనిపిస్తూ ఉంటుంది. అదే నాకు ఏ పాతికేళ్లో ఉంటే, ఏం చేయాలో తెలిసేది. వాళ్లను బతికించుకుని ఉండేదాన్ని.
వారం రోజులు ఆలస్యం చేశాం. ముందే డాక్టరుకు చూపించుకుని ఉంటే మాకు ఇంత కష్టం వచ్చి ఉండేది కాదు. కోవిడ్ ప్రపంచాన్నంతా వణికించిందిగానీ నాకొచ్చిన కష్టం ఏ ఆడపిల్లకీ రాకూడదు" అంటూ ముగించారు రాజేశ్వరి.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007
ఇవి కూడా చదవండి:
- తెలంగాణలోని ఈ గ్రామానికి కోవిడ్‌ను ఎదుర్కొనే శక్తి ఎలా వచ్చింది
- కోవిడ్-19 ఎప్పటికీ అంతం కాకపోవచ్చు, దానితో కలిసి జీవించడం ఎలా?
- వాతావరణ మార్పులు: మానవాళికి ముప్పు పొంచి ఉందన్న ఐపీసీసీ నివేదిక
- కోవిడ్-19: టీకాలను వ్యతిరేకించేవారిని వ్యాక్సినేషన్ కేంద్రాలకు తీసుకురావడం ఎలా
- ‘No Kissing Zone’ గురించి తెలుసా
- కరోనా మహమ్మారి తర్వాత ఆఫీసుల్లో మనం ఆరోగ్యంగా పని చేయగలమా?
- గంగానదిలో తేలుతున్న శవాలు
- కోవిడ్-19: కరోనా ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్నాక గుండె పోటు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్: తాలిబన్లతో పోరాడుతున్న 'అఫ్గాన్ సింహం'
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)