తెలంగాణ: వ్యాక్సీన్ వేసుకున్న విద్యార్థులకే కాలేజీల్లోకి అనుమతి: ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, EPA/BIONTECH
తెలంగాణలోని డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న విద్యార్థులనే తరగతులకు అనుమతించాలని ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక కథనం ప్రచురించింది.
ఈ మేరకు ఆయా యూనివర్సిటీల పరిధిలోని కాలేజీలు, ఇతర విద్యా సంస్థలకు ఆదేశాలు జారీ చేయనున్నారు.
వచ్చే నెల 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో డిగ్రీ, ఇంజనీరింగ్, ఇతర కాలేజీల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు గురువారం యూనివర్సిటీల అధికారులతో ఉన్నత విద్యా మండలి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు.
ముఖ్యంగా హస్టళ్ల నిర్వహణ, కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. ఈ మేరకు ప్రస్తుతం వ్యాక్సిన్లు ఉచితంగా అందుబాటులో ఉన్నందున, విద్యార్థులందరూ తప్పనిసరిగా టీకా వేయించుకోవాలన్న నిబంధన తీసుకురావాలని నిర్ణయించారు.
కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ అయినా తీసుకున్నట్టుగా సర్టిఫికెట్ చూపించిన విద్యార్థులనే కాలేజీల్లోకి అనుమతించాలని స్పష్టం చేశారు.
అవసరమైతే ఆయా కాలేజీల పరిధిలోనే రెండో డోస్ వ్యాక్సిన్ వేసేందుకు చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని అన్ని కాలేజీలకు స్పష్టం చేయాలని యూనివర్సిటీల అధికారులకు ఉన్నత విద్యా మండలి అధికారులు సూచించారని ఆంధ్రజ్యోతి వివరించింది.
ఫొటో సోర్స్, Getty Images
"సర్కారు మారినప్పుడల్లా రాజద్రోహం కేసులా": సుప్రీంకోర్టు
ప్రభుత్వం మారినప్పుడల్లా రాజద్రోహం కేసులు నమోదు చేయడం ఆందోళనకర పరిణామంగా మారిందని గురువారం సుప్రీంకోర్టు అభిప్రాయపడిందని ఈనాడు దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న ఛత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారిని రాజద్రోహం కేసు కింద అరెస్టు చేయకుండా ఊరట కలిగిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది.
ఈ సందర్భంగా జస్టిస్ రమణ వ్యాఖ్యానిస్తూ ''చట్టాన్ని (రూల్ ఆఫ్ లా) పాటిస్తే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నం కావు. ఏదైనా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దానికి అనుకూలంగా వ్యవహరిస్తే తర్వాత (పోలీసులకు) సమస్యలు వస్తాయి.
పోలీసులు అధికార పార్టీ వైపు ఉన్నప్పుడు రాజద్రోహం కేసులు ఉండడం లేదు. ఆ పార్టీ మారగానే రాజద్రోహం కేసులు పెడుతున్నారు. దేశంలో ఇదో కొత్త పోకడ. దీనిని ఆపాల్సి ఉంది'' అని అన్నారని పత్రిక రాసింది.
1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన గుర్జీందర్ పాల్ సింగ్ ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు రాయ్‌పుర్, దుర్గ్, బిలాస్‌పుర్‌ల్లో ఐజీగా పనిచేశారు. ప్రస్తుతం అదనపు డీజీపీ హోదా పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు. కేసుల కారణంగా సస్పెండయ్యారు.
ప్రభుత్వం మారిన అనంతరం అవినీతి నిరోధక శాఖ, ఆర్థిక నేరాల విభాగం సోదాలు జరిపి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టు కేసు నమోదు చేసింది. వివిధ వర్గాల మధ్య విభేదాలు కలిగేలా వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారంటూ రాజద్రోహం కేసు కూడా నమోదయింది.
రాజద్రోహం కేసును కొట్టివేయాలంటూ తొలుత ఆయన హైకోర్టును ఆశ్రయించగా అనుకూలంగా ఉత్తర్వులు రాలేదు.
దాంతో సుప్రీంకోర్టులో అప్పీలు చేయగా రెండు కేసుల్లోనూ నాలుగు వారాల పాటు ఎలాంటి అరెస్టు చేయకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తునకు సహకరించాలని సింగ్‌కు సూచించిందని ఈనాడు వివరించింది.
తిరుమలలో సంప్రదాయ భోజనం
శ్రీవారి భక్తులకు ఉచిత భోజన సదుపాయంతోపాటు సంప్రదాయ భోజనాన్ని కూడా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోందని సాక్షి దిన పత్రిక కథనం ప్రచురించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పదార్థాలతో షడ్రుచులతో కూడిన భోజన వసతి కల్పించనుందని సాక్షి తెలిపింది.
ఇప్పటికే గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన పదార్థాలతో శ్రీవారికి నైవేద్యం సమర్పిస్తున్నారు.
ఇకపై భక్తులకు కూడా ఈ సంప్రదాయ భోజనాన్ని కాస్ట్ టు కాస్ట్ (ఎంత ఖర్చు అయితే అంత) సేల్ విధానంలో అందించాలని అధికారులు నిర్ణయించారు.
గురువారం ప్రయోగాత్మకంగా అన్నమయ్య భవన్లో కొందరికి సంప్రదాయ భోజనం అందించారు. మరో 15 నుంచి 20 రోజుల్లో దీన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
గో ఆధారిత భోజనంలో ఏమేం ఉంటాయి.
అన్నం, కొబ్బరి అన్నం, పులిహోరా, బోండా, వడ, ఉప్మా, ఇడ్లీ, పప్పు, సాంబారు, రసం, పూర్ణాలు, పచ్చడి, పెరుగు, నెయ్యి.. మొత్తంగా 14 రకాల ఆహార పదార్థాలను వడ్డించారు.
దేశీయ ఆవుల ఎరువుతో పండించిన పంటలతో వీటిని తయారు చేశారు. కాలాబాత్ బియ్యంతో ఉప్మా, కులంకార్ బియ్యంతో ఇడ్లీలు తయారు చేశారు. వీటిలో వ్యాధినిరోధకతను పెంపొందించే సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయని పత్రిక రాసింది.
సెప్టెంబర్ 8వ తేదీ వరకు గో ఆధారిత సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసిన తర్వాత టీటీడీ భక్తుల అభిప్రాయాలు, సూచనలు స్వీకరించనుందని సాక్షి వివరించింది.
ఫొటో సోర్స్, AFP
భారత్‌లో యాహూ న్యూస్ మూసివేత
యాహూ భారత్‌లో తమ న్యూస్ సైట్లను మూసివేసినట్లు నమస్తే తెలంగాణ దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది.
ఒకప్పుడు అంటే.. ఒకటి రెండు దశాబ్దాల క్రితం.. యాహూకు ఇండియాలో ఎంతో క్రేజ్ ఉండేది. అప్పుడు యాహూ మెయిల్‌నే ఎక్కువగా ఉపయోగించేవారు.
యాహూ న్యూస్‌నే ఆన్లైన్లో చదివేవారు రీడర్స్. ముఖ్యంగా యాహూ క్రికెట్ న్యూస్‌ను మాత్రం రెగ్యులర్‌గా క్రికెట్ లవర్స్ ఫాలో అయ్యారు.
అలాగే.. ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్, యాహూ న్యూస్ లాంటి వెబ్సైట్లకు ట్రాఫిక్ బాగానే వచ్చేది.
కానీ.. ఎప్పుడైతే గూగుల్.. ఇండియాలో అడుగుపెట్టిందో.. సెర్చ్ ఇంజన్, జీమెయిల్‌ను ప్రారంభించిందో.. అప్పటి నుంచి యాహూకు గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇండియాలో అప్పటి వరకు టాప్‌లో ఉన్న యాహూను గూగుల్ వెనక్కి నెట్టేసిందని నమస్తే తెలంగాణ రాసింది.
నిజానికి.. గూగుల్ సెర్చ్ ఇంజన్ లేనప్పుడు… యాహూ సెర్చ్ ఇంజన్‌నే యూజ్ చేసేవాళ్లం. యాహూ మెయిల్‌నే వాడేవాళ్లం. కానీ.. ఇప్పుడు యాహూ మెయిల్‌ను చాలా తక్కువ మంది వాడుతున్నారు. యాహూలో సెర్చ్ చేసేవాళ్లు కూడా కరువయ్యారు.
అందుకే.. యాహూ.. ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ డౌన్ అవుతూ వచ్చింది. తాజాగా.. ఇండియాలో యాహూ న్యూస్, యాహూ క్రికెట్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్, మేకర్స్ ఇండియా లాంటి సైట్లను షట్‌డౌన్ చేస్తున్నట్టు ప్రకటించిందని పత్రిక తెలిపింది.
అయితే.. ఈ సైట్లను భారత్‌లో షట్‌డౌన్ చేయడం వెనుక వేరే కారణం ఉంది. అదే ఎఫ్‌డీఐ. దాన్నే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటారు.
ప్రస్తుతం ఎఫ్డీఐలో వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం.. ఇండియాలోని డిజిటల్ కంటెంట్ పబ్లిష్, ఆపరేషన్ మీద మీడియా కంపెనీల ఫారెన్ ఓనర్షిప్ లిమిట్‌ను తగ్గించారు.
ఆ లిమిట్ దాటితే.. ఎఫ్‌డీఐ చట్టాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. అందుకే.. యాహూ.. ఇండియాలో తన న్యూస్ సైట్లను అన్నింటినీ.. ఆగస్టు 26, 2021 నుంచి షట్‌డౌన్ చేస్తున్నట్టు ప్రకటించింది.
అయితే.. యాహూ ఈమెయిల్, యాహూ సెర్చ్ మాత్రం యధావిధిగా నడవనున్నాయని నమస్తే తెలంగాణ వివరించింది.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్: కట్టుబట్టలు, ఒక్క సూట్‌కేస్‌తో దేశం వదిలి వెళ్తున్నారు
- హుజూరాబాద్: ఉప ఎన్నికలకు ముందు ప్రభుత్వం భారీ సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం సబబేనా?
- ఓబీసీ బిల్లు: 127వ రాజ్యాంగ సవరణతో ఎవరికి లాభం, కులాలకా, పార్టీలకా?
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు - అభిప్రాయం
- ఏనుగుల ప్రాణాలు తీస్తున్న చర్మం వ్యాపారం, ఆసియాలో పెరుగుతున్న దారుణం
- మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పామాయిల్ మిషన్’ ఏంటి? ఎలా పని చేస్తుంది?
- పాకిస్తాన్లో ప్రధానమంత్రి నివాసాన్ని అద్దెకు ఇవ్వబోతున్నారా, ఇది నిజమేనా?
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
- ఆంధ్రాలో లేటరైట్ ఖనిజం కోసం అనుమతులు తీసుకుని బాక్సైట్ తవ్వేస్తున్నారా? ఇది ఎలా జరుగుతోంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)