సచిన్ టెండూల్కర్‌తో మాట్లాడమని విరాట్ కోహ్లీకి గావస్కర్ ఎందుకు సలహా ఇచ్చారు?
- ఆదేష్ కుమార్ గుప్తా
- బీబీసీ హిందీ స్పోర్ట్స్ జర్నలిస్ట్

ఫొటో సోర్స్, Getty Images
లీడ్స్ టెస్టులో టాస్ గెలిచిన తర్వాత ముందుగా బ్యాటింగ్ చేయాలని కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న నిర్ణయం టీమిండియాను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టేసింది.
ఆకాశం మేఘావృతమై ఉండటం, 17 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవడంతో వాతావరణంలోని తేమ ఇంగ్లండ్ బౌలర్లకు కలిసి వచ్చింది. దీంతో తక్కువ స్కోరుకే భారత్ ను కట్టడి చేశారు.
భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో యాభై ఓవర్లు కూడా ఆడలేకపోయింది. కేవలం 78 పరుగులకే ఆలౌట్ అయింది. రోహిత్ శర్మ 19, అజింక్య రహానే 18 పరుగులు మినహా మిగతా తొమ్మిది మంది ఆటగాళ్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేక పోయారు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి అవుటయ్యారు. టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ చేతిలో కోహ్లీ ఔట్ కావడం ఇది ఏడోసారి.
కోహ్లీ తరచుగా ఒకే విధంగా ఔట్ కావడానికి గమనించిన మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్ కోహ్లీకి ఓ సూచన చేశారు. ఈ విషయమై విరాట్ సచిన్‌కు ఫోన్ చేసి మాట్లాడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
కోహ్లీ చివరగా 2019లో బంగ్లాదేశ్‌తో కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ (136 పరుగులు ) చేశారు.
ఫొటో సోర్స్, Getty Images
విరాట్ కోహ్లీ
మాజీ క్రికెటర్లు ఈ సలహాపై ఏమంటున్నారు?
సచిన్ సలహా తీసుకొమ్మని గావస్కర్ కోహ్లీకి చెప్పడంపై మాజీ క్రికెటర్లు స్పందించారు. ''కొన్నిసార్లు బ్యాట్స్‌మన్ తన బలహీనతను, తప్పును గుర్తించలేరు, కానీ అది ఇతరులకు తెలుస్తుంది'' అని భారత మాజీ ఆల్ రౌండర్, సెలెక్టర్, కోచ్ మదన్ లాల్ వ్యాఖ్యానించారు.
కోహ్లీ సచిన్ నుంచి సలహాలు తీసుకోవచ్చు, కానీ, మైదానంలో ఈ సమస్కకు పరిష్కారాన్ని కనుగొనాల్సింది మళ్లీ కోహ్లీనే అన్నారు మదన్ లాల్.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయాలనే విరాట్ కోహ్లీ నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని మదన్ లాల్ అన్నారు. మొదట బ్యాటింగ్ కి దిగి 250 నుంచి 300 పరుగులు చేసి ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెంచాలని కోహ్లి భావించారు. కానీ అలా జరగలేదు.
టాస్ గెలిచిన తర్వాత జట్లు ముందుగా ఫీల్డింగ్ చేయడానికి ఇష్టపడతాయని లీడ్స్ మైదానంలో టాస్ గణాంకాలు చూస్తే అర్థమవుతుంది.
అండర్సన్ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. ఏ బ్యాట్స్‌మన్ ను అయినా ఔట్ చేయగల సత్తా ఆయనకి ఉంది. అండర్సన్, విరాట్ కోహ్లీకి మధ్య జరుగుతున్న యుద్ధంలో, ఇప్పటి వరకు అండర్సనే గెలిచారు.
ఫొటో సోర్స్, Getty Images
భార్య అనుష్క శర్మ, సచిన్ టెండుల్కర్‌లతో విరాట్ కోహ్లీ
విరాట్ ఏం చేయాలి?
‘‘విరాట్ గురించి ఆందోళన చెందాల్సిన వాటిలో ముఖ్య విషయం ఆయన మనస్తత్వంలో మార్పు. ఆవేశంగా ఉన్నప్పుడు ఎక్కువ పరుగులు చేయలేడు. సెంచరీలు చేసే అలవాటు ఆయనకి ఉంది. ఇప్పటికే కోహ్లీకి ఉన్న గుర్తింపు, ఆయనపై ఒత్తిడిని పెంచుతోంది. ఒత్తిడిలో వేగంగా ఆడటానికి ఆయన ప్రయత్నిస్తాడు. ఇంగ్లండ్‌లో అది సాధ్యం కాదు’’ అని కోహ్లీ ఎదుర్కొంటున్న సమస్యపై భారత మాజీ బ్యాట్స్‌మన్, సెలక్టర్ అశోక్ మల్హోత్రా వ్యాఖ్యానించారు.
‘‘సచిన్ వద్దకు వెళ్లినా, రవిశాస్త్రి వద్దకు వెళ్లినా, కోహ్లీ తన మనసుని నియంత్రించుకుంటేనే అంతిమంగా ఆడగలుగుతాడు. ఆవేశం, ఉత్సాహంతో ఆడటం వల్ల నష్టం మాత్రమే జరుగుతుంది’’ అని అశోక్ మల్హోత్రా అన్నారు.
‘‘రెండేళ్లుగా కోహ్లీ సెంచరీ చేయలేదు. ఆయన పరుగుల సగటు పడిపోతోంది. ఒకప్పుడు ప్రతి మూడు, నాలుగు మ్యాచులకు సెంచరీ సాధించడం అందరూ చూశారు. స్కోరింగ్ లేని కారణంగా కోహ్లీ పై ఒత్తిడి పెరుగుతోంది’’ అని అశోక్ మల్హోత్రా అన్నారు.
‘‘ఆయన ముందుగా మ్యాచ్ లో కుదురుకోవాలి. మళ్లీ మళ్లీ స్లిప్స్ వద్ద పట్టుబడుతున్న తీరు చూస్తుంటే తన శరీరం నుండి దూరంగా బంతిని ఆడుతున్నట్లు అనిపిస్తుంది. వేగంగా ఆడటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అతని బ్యాట్ శరీరం నుండి దూరంగా వెళుతోంది. అతను కొద్దిసేపు వేచి చూసి ఆడాలి’’ అని కోహ్లీ వైఫల్యాలపై అశోక్ మల్హోత్రా సూచనలు చేశారు.
ఫొటో సోర్స్, Getty Images
సచిన్, గవాస్కర్
బలహీనత కాదా?
విరాట్ సెంచరీలు చేయలేడని ప్రపంచమంతా ఆయన బలహీనతపైనే దృష్టిసారించిందా అనే దానిపై అశోక్ మల్హోత్రా స్పందించారు. ‘‘ప్రపంచం మొత్తం కోహ్లీ బలహీనతనే చూడటం లేదు. ఆయన ఇంగ్లండ్‌లో పరుగులు చేయడం లేదు. ఇంగ్లండ్ వాతావరణానికి బంతి స్వింగ్ అవుతుంటుంది. కాస్త చూసుకుని ఆడాలి. కేవలం బ్యాట్‌తోనే అక్కడ పరుగులు రాబట్టలేరు’’ అని అన్నారు.
సచిన్ టెండుల్కర్‌తో ఫోన్‌లో మాట్లాడాలని సునీల్ గావస్కర్ విరాట్ కోహ్లీకి సరైన సలహా ఇచ్చారని క్రికెట్ విమర్శకుడు అయాజ్ మెమన్ అన్నారు.
‘‘విరాట్ కోహ్లీ ఔట్ అవుతున్నారు. ఒక్కసారి కాదు. అదే తప్పును మళ్లీ మళ్లీ చేస్తున్నాడు. కోహ్లీ ఏకాగ్రత లేదా టెక్నిక్ లో లోపం ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది ఎంతపెద్ద ఆటగాడికైనా జరగొచ్చు. ఉదాహరణకు సచిన్ టెండూల్కర్, ఆస్ట్రేలియాలో ఆఫ్ స్టంప్ బంతులను సరిగా జడ్జ్ చేయలేక విఫలమయ్యేవారు. అదే సిరీస్ చివరి టెస్ట్ మ్యాచ్ లో డ్రైవ్, ఓవర్ కవర్ షాట్స్ ఆడకూడదని భావించారు. దీంతో ఏకంగా డబుల్ సెంచరీ సాధించారు‘‘ అని అయాజ్ మెమన్ అన్నారు.
ఫొటో సోర్స్, Getty Images
విరాట్ కోహ్లీ
కోహ్లీ మార్చుకోవాల్సింది ఏంటి?
విరాట్ కోహ్లీ లాంటి పెద్ద బ్యాట్స్‌మన్ ఒకే శైలిలో మళ్లీ మళ్లీ ఔట్ అవుతుంటే తన శ్రేయోభిలాషిగా భావించే వారితో మాట్లాడాలి. కానీ, ఇంగ్లండ్‌లో కవర్ డ్రైవ్ షాట్లు కొట్టకుండా ఆడొచ్చా?
‘‘కవర్ డ్రైవ్ ఆడటం వల్ల ఎలాంటి హాని లేదు. కానీ ఏ బంతిని కవర్ డ్రైవ్‌గా మలచాలో గుర్తించడం చాలా ముఖ్యం. ఫామ్ లో లేకపోతే ఒత్తిడిలో కొన్ని సందర్భాల్లో అత్యుత్తమ ఆటగాడు కూడా త్వరగా ఔట్ అవుతారు’’ అని అయాజ్ మెమన్ చెప్పారు.
‘‘కోహ్లీ ఔట్ అవుతున్నట్లే పుజారా, రహానే కూడా వెనుదిరుగుతున్నారు. రోహిత్ శర్మ లాగికొట్టడానికి ప్రయత్నిస్తూ వికెట్ ను కోల్పోతున్నారు. రిషబ్ పంత్ స్లిప్ లేదా గల్లీలో దొరికిపోతున్నారు. కాబట్టి బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, చీఫ్ కోచ్ రవి శాస్త్రి బాధ్యత తీసుకుని జట్టుతో కలిసి పని చేయాలి’’ అన్నారాయన.
‘‘కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ తన తప్పుల నుండి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగకపోతే జట్టు ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. కాబట్టి సునీల్ గావస్కర్ విరాట్ కోహ్లీకి సరైన సలహా ఇచ్చారు’’ అని మెమన్ అన్నారు.
కోహ్లీపై ఒత్తిడికి నిర్దిష్ట కారణం ఉంటుందని అయాజ్ భావించడం లేదు.
‘‘బాగా ఆడాలనే ఒత్తిడి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. నొవాక్ జొకోవిచ్ రియో ఒలింపిక్స్‌కు వెళ్లాడు. కానీ ఓడిపోయి గోల్డెన్ స్లామ్‌ను సాధించలేక పోయాడు. అయినా టెన్నిస్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. కాబట్టి బెస్ట్ ప్లేయర్లపై ఒత్తిడి ఉంటుంది. కానీ ఈ ఒత్తిడిని సానుకూల రూపంలో తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. దీనిని కోహ్లి 2018లోనే చేసి చూపించాడు’’ అని అయాజ్ పేర్కొన్నారు.
‘‘గత రెండేళ్లుగా అతను ఏ ఫార్మాట్‌లోనూ ఒక్క సెంచరీ చేయకపోయినా ఫర్వాలేదు. కానీ, కోహ్లీ ఇబ్బంది పడుతున్నప్పుడు 2014లో లాగా అనిపించడం లేదు. చివరి మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేశాడు. అంటే అతని ఫామ్ మొత్తానికే క్షీణించిందని కాదు. ఎక్కడో అతను ఏకాగ్రత కోల్పోతున్నాడు. కొన్నిసార్లు టెక్నిక్‌లో కొంచెం మెరుగుదల కూడా భారీ తేడాను ఇస్తుంది. దీని కోసమే గావస్కర్ విరాట్‌ను సచిన్‌తో మాట్లాడమని సలహా ఇచ్చి ఉంటారు’’ అని అయాజ్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కాబుల్ నుంచి ఒక భారతీయ మహిళ ఎలా బయటపడింది? - ఏ నిమిషానికి ఏం జరిగింది?
- మినీ స్కర్టుల్లో నిర్భయంగా తిరిగిన కాలం నుంచి బురఖాలో బందీ అయినంతవరకు
- సొరాయా: అఫ్గానిస్తాన్‌లో మహిళల హక్కుల కోసం కృషిచేసిన ఈ రాణి చివరికి ఇటలీ ఎందుకు పారిపోయారు
- ఒకప్పటి ఈ 'తాలిబాన్ కసాయి' ఇప్పుడు 'తాలిబాన్ బుల్డోజర్' ఎలా అయ్యారు?
- ‘మహిళల హక్కుల కోసం పోరాడా.. మగాళ్లకు శత్రువునయ్యా.. పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు’
- ఐఎస్‌లో చేరేందుకు బ్రిటన్ నుంచి సిరియాకు వెళ్ళిన ఓ టీనేజర్ కన్నీటి కథ
- అఫ్గానిస్తాన్: ఐఎస్‌లో చేరి అఫ్గాన్‌లో జైలు పాలైన భారత మహిళ 'నిమిష' ఇప్పుడెక్కడ?
- ఐఎస్ తీవ్రవాదులు దోచుకున్న కళాఖండాలివి
- జాడలేని ఐఎస్ జిహాదీల భార్యలు, పిల్లలు
- తాలిబాన్ల పాలనలో అల్ ఖైదా, ఐఎస్‌లకు అఫ్గానిస్తాన్ అడ్డాగా మారుతుందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)